శ్రియ బార్సిలోనా (స్పెయిన్)లో కాపురం పెట్టిన సంగతి తెలిసిందే. రష్యా బాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కుశ్చేవ్ ను ఇండియాలో పెళ్లాడిన ఈ బ్యూటీ, స్పెయిన్ లో సెటిలైంది. ప్రస్తుతం ఆ దేశాన్ని కరోనా వణికిస్తోంది. ఈ సందర్భంగా తనకు ఎదురైన కరోనా అనుభవాన్ని మీడియాతో పంచుకుంది శ్రియ.
“ఆండ్రీకి హఠాత్తుగా పొడి దగ్గు, జ్వరం వచ్చింది. మేం వెంటనే బార్సిలోనాలో హాస్పిటల్ కు వెళ్లాం. అక్కడి డాక్టర్లు మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు కానీ హాస్పిటల్ కు మాత్రం రావొద్దని ప్రాధేయపడ్డారు. ఒకవేళ వైరస్ లేకపోయినా, హాస్పిటల్ లో ఉంటే కరోనా సోకే ప్రమాదముందని చెప్పారు. దీంతో మేం మళ్లీ ఇంటికి వెళ్లిపోయి సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నాం. ఇంట్లోనే ఆండ్రీ ట్రీట్ మెంట్ తీసుకున్నాడు. మేం వేర్వేరు గదుల్లో ఉంటూ సెల్ఫ్ డిస్టెన్స్ పాటించాం. అదృష్టవశాత్తూ ఆండ్రీ ఇప్పుడు బాగున్నాడు.”
తమ వెడ్డింగ్ యానివర్సరీని ఈసారి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నామని, కానీ కరోనా రావడంతో తమ ప్లాన్స్ అన్నీ రద్దయిపోయాయని చెప్పుకొచ్చింది శ్రియ. చివరికి తాము టేబుల్ రిజర్వ్ చేసుకున్న రెస్టారెంట్ కూడా మూసేశారని బాధపడింది.
“నిజానికి మా వివాహ వార్షికోత్సవాన్ని ప్లాన్ చేసుకున్నాం. మార్చి 13న రెస్టారెంట్ లో రిజర్వేషన్ చేసుకున్నాం. మేం వెళ్లేసరికి రెస్టారెంట్ మూసేసి ఉంది. విషయం ఎంత సీరియస్ గా ఉందో అప్పుడే మాకు అర్థమైంది. స్పెయిన్ మాత్రం లాక్ డౌన్ అయింది. ఇక ఆరోజు నుంచి మొత్తం మారిపోయింది. ఆంక్షలు వచ్చేశాయి. ఇంట్లోంచి ఒకరు మాత్రమే బయటకు రావాలని, అది కూడా అత్యవసరం అయితేనే రావాలని పోలీసులు కండిషన్ పెట్టారు. నేను, ఆండ్రీ ఒకే కుటుంబమని, భార్యాభర్తలమని పోలీసులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆండ్రీ వైట్, నేను బ్రౌన్ కాబట్టి. అలా మా ఇద్దర్నీ వదిలేశారు.”
ప్రస్తుతం శ్రియ-ఆండ్రీ బార్సిలోనాలో వాళ్ల ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పట్లో వాళ్లు ఇండియా వచ్చే ఛాన్స్ లేదు. ఇండియాను, తన తల్లిదండ్రుల్ని చాలా మిస్ అవుతున్నానని అంటోంది ఈ బ్యూటీ.