ఎమ్బీయస్‌: గుజరాత్‌ ఎన్నికలు – ముస్లిం ఫాక్టర్‌

గుజరాత్‌ ఎన్నికలలో కాంగ్రెసు తన ఎన్నికల స్ట్రాటజీ మార్చింది. 2007, 2012 ఎన్నికలలో కూడా 2002 నాటి గోధ్రా అల్లర్ల గురించే ప్రస్తావిస్తూ వచ్చింది. వాళ్లకు హఠాత్తుగా జ్ఞానోదయమైంది – ముస్లింల గురించి సానుభూతితో…

గుజరాత్‌ ఎన్నికలలో కాంగ్రెసు తన ఎన్నికల స్ట్రాటజీ మార్చింది. 2007, 2012 ఎన్నికలలో కూడా 2002 నాటి గోధ్రా అల్లర్ల గురించే ప్రస్తావిస్తూ వచ్చింది. వాళ్లకు హఠాత్తుగా జ్ఞానోదయమైంది – ముస్లింల గురించి సానుభూతితో మాట్లాడి బావుకుంటున్నది ఏమీ లేదని. గుజరాత్‌ జనాభాలో 9-10% మంది ముస్లిములు. మొదటి నుంచీ గుజరాత్‌లో హిందూ-ముస్లిము జనాభా విడివిడిగానే బతుకుతూ వచ్చేది. గుజరాత్‌ నుంచి ప్రముఖమైన ముస్లిము లీడరు ఒక్కడూ లేడు. అహ్మదాబాద్‌ పాత నగరంలో అప్పుడప్పుడు ఘర్షణలు జరిగేవి. తర్వాత వాళ్లను అణిచి పెట్టడం జరిగింది.

2002 అల్లర్ల తర్వాత ముస్లిము ప్రజల్లో పూర్త్తి అవగాహన వచ్చింది. 'గుజరాత్‌లో ప్రభుత్వం మన వెంట నిలవదు. రాజకీయంగా మనం ఏమీ అడగలేం. తలవంచుకుని బతకాల్సిందే. మన సమాజాన్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. మానవ హక్కులంటూ పోరాడితే ఉన్నది ఊడుతుంది' అని. అందుకే వాళ్లు చట్టవిరుద్ధమైన వ్యాపారాలన్నిటిి లోంచి బయటకు వచ్చేస్తూ విద్యపై ఎక్కువ దృష్టి పెట్టారుట. రాజకీయాల్లో వాళ్ల అనాసక్తి తెలుసుకోవాలంటే గత ఎసెంబ్లీలో యిద్దరే యిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తు పెట్టుకుంటే చాలు. జనాభాలో 10%, అసెంబ్లీ సీట్లలో 0.01%! 

కానీ కాంగ్రెసు యీ విషయాన్ని గుర్తించలేదు. ముస్లిముల పక్షాన పోరాడుతున్నామని కనబడితే వాళ్ల ఓట్లన్నీ గంపగుత్తగా పడతాయని, ఆ పైన దళిత వగైరా ఓట్లతో గెలవవచ్చని అనుకుంటూ వచ్చింది. మోదీని మృత్యుబేహారి అని వర్ణిస్తూ ప్రచారాన్ని చేపట్టింది. దీన్ని మోదీ తనకు అనువుగా మలచుకుని కాంగ్రెసు ముస్లిం పక్షపాతి అని ప్రచారం చేస్తూ హిందూ ఓట్లన్నీ సంఘటితం చేశాడు. గుజరాతీ హిందూ సమాజంలో కులకలహాలు లేవు కానీ కులస్పృహ ఎక్కువ. మనిషి పరిచయం కాగానే కులం ఏమిటని అడుగుతారు. కాంగ్రెసు, బిజెపి కొన్ని కులాలను ఒక్కోసారి చేరదీసి లబ్ధి పొందుతూ వచ్చాయి. కానీ కాంగ్రెసు ముస్లిముల పక్షాన మాట్లాడడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ హిందువులలో అధికశాతం కులంతో ప్రమేయం లేకుండా బిజెపికి ఓటేయసాగారు.

కాంగ్రెసు ఓడిపోతూ వస్తోంది. ముస్లిములు కూడా ఓడిపోయే కాంగ్రెసుకు వేయడం మానేసి, నెగ్గే బిజెపికే వేయసాగారు. పోలింగు బూతుల ప్రకారం విశ్లేషించినప్పుడు తాము ఎవరికి ఓటేశామో తెలిసిపోతుందని, కోరి పాలకపక్షంతో వైరం తెచ్చుకోవడమెందుకని వారి భావన. మతం ఏదైనా వారూ గుజరాతీలే, వ్యాపార స్వభావం కలవారే. పోట్లాట తెచ్చుకుంటే లాభమేమిటని ఒకటికి పదిసార్లు లెక్కలు వేసేవారే. 25 స్థానాల్లో ముస్లిములకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి. వాటిల్లో బిజెపి 17 గెలిచింది. కాంగ్రెసుకు స్థానికంగా పెద్ద నాయకుడు ఉండి, గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తోచినపుడు ఎలా ఓటేసేవారో తెలియదు కానీ ప్రస్తుత ఎన్నికలలో కూడా 27% మంది ముస్లిములు బిజెపికే ఓటేస్తామని అంటున్నారు. కాంగ్రెసుకు వేస్తామన్నవారు 49% మాత్రమే. పాత్రికేయులు వెళ్లి గోధ్రా మర్చిపోయారా? అని అడుగుతూంటే 'అవన్నీ రేపి పెట్టకండి. మా బతుకు మమ్మల్ని బతకనీయండి' అంటున్నారు.

ముస్లిముల యీ ఆలోచనాధోరణి అర్థమయ్యాక కాంగ్రెసు యీ ఎన్నికలలో గోధ్రా మాట, ముస్లిముల కడగండ్ల మాట ఎత్తడం మానేసింది. రాహుల్‌ ఒక్క మసీదుకూ వెళ్లలేదు. అతని పార్టీ హిందూ సమాజం మీదే ఫోకస్‌ పెట్టి దాన్ని కులపరంగా చీల్చి బిజెపి ఓటు బ్యాంకుకు గండి కొడదామని చూస్తోంది. కులాల పేరుతో ముందుకు వచ్చిన ముగ్గురు యువనాయకుల సేవలు వినియోగించుకుంటోంది.

ఇక రాహుల్‌ తనలో హిందూత్వం పొంగి పొర్లుతోందని చెప్పుకోసాగాడు. జన్మతః రాహుల్‌ హిందువు కానేరడు. అతను బ్రాహ్మణ వారసుడే కానీ బ్రాహ్మణుడు కాడు. ఇందిరా గాంధీ జన్మతః బ్రాహ్మణి. పార్శీని పెళ్లి చేసుకోవడం చేత ఆమె మతం మారదు. ఆమె చివరిదాకా హిందూ పూజలూ, యజ్ఞయాగాదులు చేయించుకుంటూనే ఉంది. ఆమె భర్త ఫిరోజ్‌ గాంధీ పార్శీ. వాళ్ల అబ్బాయి రాజీవ్‌ తండ్రి కులాన్ని లెక్కలోకి తీసుకుంటే పార్శీ. అతను అమెరికా వెళ్లినపుడు మీడియాతో తను పార్శీ అనే చెప్పుకున్నాడట. అతని భార్య సోనియా ఇటాలియన్‌ క్రైస్తవురాలు. వారి కుమారుడైన రాహుల్‌ పుట్టుక చేత హిందువు ఎలా అవుతాడు? అయినా నమ్మకం చేత కావచ్చు. 

మనలో చాలామందికి తలితండ్రులు  హిందువులైనా తాము బౌద్ధులమని చెప్పుకుంటారు. కొందరు క్రైస్తవం పుచ్చుకోకపోయినా, ఏదైనా మొక్కు ఫలిస్తే ఏసుక్రీస్తు శిలువ యింట్లో పెట్టుకుంటారు. ఆ మాట కొస్తే సాయిబాబాది ఏ మతం? హిందువుల్లో కోట్లాది మంది సాయి భక్తులు కాలేదా? శ్వేతజాతీయులైన అమెరికన్లు, యూరోపియన్లు పుట్టుకతో క్రైస్తవులైనా యిక్కడి హిందూ దేవాలయాలకు వచ్చి ప్రార్థిస్తూ ఉంటే మనం సంతోషించటం లేదా? రాహుల్‌ తను శివభక్తుణ్నని చెప్పుకుంటే ఎద్దేవా చేయడం ఎందుకు? అంతకుముందు శివాలయాలకు వెళ్లావా? అంటే హిందువుల్లో ఎంతమంది రెగ్యులర్‌గా గుళ్లకు వెళుతున్నాం? పుట్టినరోజుకో, పెళ్లి రోజుకో వెళ్లడమే, అదీ సినిమా హాలుకి వెళ్లబోతూ మధ్యలో ఓ స్టాప్‌. ఇదంతా ఎన్నికల స్టంట్‌ అంటే అనేకమంది హిందూ రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో మసీదులకు, గురుద్వారాలకు, చర్చిలకు కూడా వెళుతూంటారు. ఎన్నికలయ్యాక వెళతారా? ఇవన్నీ పెద్ద విషయాలా? 

ఏ పూచికపుల్ల దొరికినా, దాన్ని బ్రహ్మాస్త్రంగా మారుద్దామని చూసే క్రమంలో ఉచితానుచితాలు మరుస్తున్నారు కాబట్టి వీటిని పెద్ద విషయాల గానే చేసింది బిజెపి. ఆర్థిక దుస్థితి, ప్రజల యిక్కట్ల గురించి కాంగ్రెసు ఎప్పుడైతే గట్టిగా తగులుకుందో చర్చను దారి మళ్లించాలని ప్రయత్నించింది. కాంగ్రెసు ముస్లిముల గురించి మాట్లాడడం మానేసినా, వాళ్లల్లో ముస్లిము లక్షణాలే ఉన్నాయనీ, ముస్లిములనే నెత్తి కెత్తుకుంటారనీ ముద్ర కొట్టడానికి చూసింది. రాహుల్‌ హిందువు కాదని చెప్పడానికి తంటాలు పడింది. సోమనాథ్‌ దేవాలయ పర్యటన సందర్భంగా రాహుల్‌ సంతకం అంటూ చూపినది తప్పని తేలింది. రాహుల్‌ తన పేరు 'రాహుల్‌ గాంధీజీ' అని రాసుకుంటాడా? అహ్మద్‌ పటేల్‌ తన పేరు స్పెల్లింగు తప్పుగా రాసుకుంటాడా? అని కూడా ఆలోచించలేదు. వచ్చినవారిలో ముస్లిములు కూడా ఉన్నారు కదాని రాహుల్‌ వాళ్ల వెంట వచ్చిన వారెవరో వాళ్ల పేర్లు రాసి ఉండవచ్చనుకోవచ్చు. అమిత్‌ షా జైన్‌. వారికి మైనారిటీలుగా ప్రత్యేక గుర్తింపు ఉంది. హిందూ కాదు. అన్యమతస్థుల రిజిస్టర్‌ మేన్‌టేన్‌ చేస్తే అతనూ సంతకం చేయాలి. 

కాంగ్రెస్‌కు మద్దతు యిస్తున్న హార్దిక్‌, అల్పేశ్‌, జిగ్నేశ్‌ పేర్ల మొదటి అక్షరాలతో బిజెపి వారు 'హజ్‌' (ముస్లింల తీర్థయాత్ర) అని తయారుచేశారు. దానికి మసీదు, కాంగ్రెసు గుర్తు ఫోటో చేర్చారు. తమ నాయకుల అసలు పేర్లు, యింటి పేర్లలో తమకు అనుకూలమైనవి తీసుకుని 'రామ్‌' (రూపాణీ, అమిత్‌ షా, మోదీ) అని తయారు చేసి అయోధ్య రామమందిరం, బిజెపి గుర్తు చేర్చారు. 'రామ్‌? హజ్‌? మీకు ఎవరిష్టం?' అంటూ పోస్టర్లు వేశారు. కాంగ్రెసు తరఫున, బిజెపి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఫలానా అని చెప్పుకోలేదు. అయినా కాంగ్రెసు వస్తే అహ్మద్‌ పటేల్‌ 'మియాఁ' (అతని పేరులో లేదు, ముస్లిము అని ఎత్తి చూపడానికి చేర్చారు) యే ముఖ్యమంత్రి అంటూ బిజెపి వారు పోస్టర్లు వేశారు. ఐసిస్‌ సంస్థకు చెందినవాడన్న ఆరోపణలున్న వ్యక్తి పనిచేసిన ఓ సంస్థకు అహ్మద్‌ పటేల్‌ మాజీ చైర్మన్‌గా ఉన్నాడని ముఖ్యమంత్రి లింకు పెట్టబోయాడు. కానీ కుదరలేదు. విజయ్‌ రూపాణి తన ప్రసంగాల్లో కాంగ్రెసు అధికారంలోకి వస్తే 'లతీఫ్‌ రాజ్‌' వస్తుందంటున్నాడు. లతీఫ్‌ అనే ముస్లిం గూండాకు అన్ని పార్టీల అండదండలూ ఉండేవి. ఇప్పుడతను పోయాడు. ఇలా కాంగ్రెసు వస్తే ముస్లిము పాలన వస్తుంది అంటూ హిందూ సమాజాన్ని భయపెట్టడమే పనిగా పెట్టుకుంది బిజెపి. 

రాహుల్‌పై కూడా ముస్లిం ముద్ర వేయడానికి బలమైన ప్రయత్నం జరిగింది. మోతీలాల్‌ నెహ్రూ, జవహర్‌లాల్‌ అందరూ ముస్లిములకు పుట్టినవారే అనే ఆధారంలేని పుకార్లు ఎప్పణ్నుంచో సోషల్‌ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వాటికి కొనసాగింపుగా అన్నట్లు, రాహుల్‌ను బాబరు వారసుడిగా కొందరు బిజెపి నాయకులు అభివర్ణించారు. తన వృత్తి రీత్యా కపిల్‌ సిబ్బల్‌ బాబ్రీ మసీదు కేసు విషయంలో సుప్రీం కోర్టులో చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని, ఏకంగా బాబరుకు రాహుల్‌కు ముడిపెట్టేశారు. కపిల్‌ అభ్యర్థన పార్టీ సభ్యుడిగా చేసినది కాదని చెప్పినా వీరు వినిపించుకోరు. తెలంగాణ బిజెపి నాయకుడైన రఘునందన్‌, ఒక కేసులో ఒవైసీ తరఫున న్యాయవాది. కాంగ్రెసు నాయకుడు జంధ్యాల రవిశంకర్‌ ఒక టిడిపి నాయకుడికి న్యాయవాది. అదేమిటంటే వృత్తి వేరే, రాజకీయాలు వేరే అంటారు. 

బిజెపి తమపై ముస్లిం ముద్ర కొడుతూండడంతో జంకిన కాంగ్రెసు 6గురు ముస్లిములకు టిక్కెట్లిచ్చి సరిపెట్టింది. ఇది గమనించి బిజెపి ముస్లిములలో వ్యాపారవర్గాలైన బోరాలను, షియాలను దువ్వుతోంది. తమను ప్రత్యేక వర్గంగా పరిగణించడం కూడా గుజరాతీ ముస్లిములకు నచ్చడం మానేసింది. తమకు మతపరమైన నాయకులు తప్ప, రాజకీయ నాయకులు లేకపోవడం లోపమని గుర్తించారు. వాళ్లు 2002 అల్లర్లు, తమలో పేదల గురించి మాట్లాడడం మానేసి, మామూలు అంశాలపై మాట్లాడుతున్నారు. నలుగురితో పాటు నారాయణగా బిజెపికే ఓటేయడానికి అవకాశాలున్నాయి. ముమ్మారు తలాక్‌ అంశంపై బిజెపి దృఢవైఖరిని సమర్థించడానికి ముస్లిము మహిళలు బిజెపికి భారీగా ఓటేస్తారనే అంచనాలూ ఉన్నాయి. దభోయ్‌ బిజెపి అభ్యర్థి బహిరంగంగా 'టోపీ, దాడీ వాలాల జనాభా తగ్గాలి' అన్నా, రకరకాలుగా ముస్లిములను దెబ్బలబ్బాయిలుగా నిలబెడుతున్నా వారికి మెజారిటీ ఉన్న స్థానాల్లో బిజెపియే భారీగా గెలిచే అవకాశం ఉంది. ఇదో విచిత్రం!

భారత ముస్లిములనే కాదు, పాకిస్తాన్‌ను కూడా ఎన్నికలలో లాక్కుని వచ్చిన వైనం గురించి ''గుజరాత్‌ ఎన్నికలు – మోదీ ఆరోపణలు''లో చర్చిద్దాం.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌
[email protected]