బాలయ్య లేటెస్ట్ సినిమా జై సింహా కథ గురించి ఇండస్ట్రీలో చాలా గుసగుసలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాకి ముందుగా కర్ణ అన్న టైటిల్ పెట్టాలనుకున్నారు. కానీ తరువాత జై సింహా అని ఫిక్స్ చేసారు. కర్ణ అన్న టైటిల్ డిస్కషన్ కు రావడానికి కారణం ఆ సినిమా కథే అని ఇండస్ట్రీ సర్కిళ్లలో వినిపిస్తోంది.
ఈ సినిమాలో బాలయ్య భగ్న ప్రేమికుడట. నయనతారను ప్రేమిస్తాడు కానీ పెళ్లి కాదట. ఆమెకు కిక్ శ్యామ్ తో పెళ్లవుతుందట. అయితే ప్రియురాలి కోసం హీరో అడుగు అడుగునా ఆమెకు అండగా వుంటూ రావడం, అందుకోసం ఎవ్వరూ చేయలేని త్యాగాలు చేయడం అన్నది కథ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ త్యాగాల్లో హీరో తను వేరే పెళ్లి చేసుకుంటే పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా వుంటారని వినికిడి. ఇలా అన్ని విధాలా ప్రియురాలి కోసం జీవితం త్యాగం చేసే వీరుడి కథనే జై సింహా అని వినిపిస్తోంది.
దర్శకుడ కేఎస్ రవికుమార్ ఎమోషనల్ కంటెంట్ ను తెరమీద పడించడంలో దిట్ట. మరి బాలయ్య కూడా ఎమోషనల్ సీన్లు విరగదీస్తారు. అలాంటి ఇద్దరు కలిసి ఎమోషనల్ కంటెంట్ కు భారీ స్కోప్ వున్న ఇలాంటి కథను డీల్ చేస్తున్నారంటే, జై సింహా కచ్చితంగా ఫ్యాన్స్ కు సరైన పొంగల్ ట్రీట్ నే అనుకోవాలి.