17ఏ పై సుప్రీం కోర్టు తీర్పు వచ్చింది. ఇది అంతిమ తీర్పు కాదు. అది యిచ్చేది విస్తృత ధర్మాసనం మాత్రమే. తీర్పిచ్చిన న్యాయమూర్తులు ఒక విషయంలో విభేదించడం చేత, బేసి సంఖ్య ఉన్న బెంచ్‌కి దీన్ని రిఫర్ చేస్తారు. ఆ బెంచ్ ఏం చెపితే అదే ఫైనల్ అవుతుంది. ఇప్పుడు తీర్పులు చెప్పిన న్యాయమూర్తులిద్దరూ 17ఏ వర్తింపు అనే ఒక విషయంలో మాత్రమే విభేదించారు. ఆపరేటివ్ పార్ట్‌లో యిద్దరూ ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిఐడిని తప్పు పట్టలేదు. కేసు క్వాష్ చేయలేదు. అనుమతి అక్కర్లేదు కాబట్టి కేసు కొట్టేసే ప్రసక్తి లేదని బేలా అభిప్రాయ పడితే, అనుమతి అవసరమే కానీ అది తీసుకోనంత మాత్రాన కేసు కొట్టేయ నక్కరలేదని, సిఐడి వారి విచారణ ఆపనక్కరలేదనీ అనిరుధ్ అభిప్రాయ పడ్డారు. కావాలంటే అనుమతి యిప్పుడైనా కోరవచ్చు అని జోడించారు కూడా.
ఏతావతా తేలిందేమిటి? బాబు కోరినట్లు ఆయనపై కేసు హుష్‌కాకీ కాలేదు. ఆయన తరఫున ఎంతమంది హేమాహేమీ న్యాయవాదులు వాదించినా ఫలితం లేకపోయింది. కేసు నడిచి తీరాల్సిందే అన్నారు యిద్దరు న్యాయమూర్తులూ! త్రిసభ్య బెంచి వేసిన పక్షంలో మూడో ఆయన వచ్చి గవర్నరు అనుమతి లేదు కాబట్టి కేసు కూడా కొట్టేయాల్సిందే అన్నా 2:1 ఫార్ములా ప్రకారం వీళ్లిద్దరి మాటా చెల్లుతుంది. అలా కాకుండా ఐదుగురు సభ్యులున్న బెంచి ఏర్పాటు చేస్తే దానిలో ముగ్గురు న్యాయమూర్తులు కేసు కొట్టాయాల్సిందే అంటే అప్పుడీ 3:2 ప్రకారం యీ యిద్దరి మాట మైనారిటీ అవుతుంది. ముగ్గురిది వేస్తారో, అయిదుగురిది వేస్తారో చూడాలి. ఐదుగురిది అయితే బాబు క్వాష్ గురించి ఆశ పెట్టుకోవచ్చు. ముగ్గురిది అయితే ఆ ఆశకు తిలోదకాలే!
స్కిల్ స్కామ్ విషయంలో బాబు కానీ, ఆయన లాయర్లు కానీ కేసులో న్యాయాన్యాయాల గురించి కానీ, నేరం జరిగిందా లేదా అన్న దానిపై గురించి కానీ కోర్టులో మాట్లాడలేదు. ఎంతసేపూ 17ఏ కింద అనుమతి తీసుకోలేదు అన్న పాయింటు చుట్టూనే కథ తిప్పారు. బయట సభల్లో బాబు ‘నాపై అన్యాయపు కేసు పెట్టారు, నేను నిప్పులాటి వాణ్ని, చిన్నమెత్తు తప్పు కూడా చేయలేదు’ అని చెప్పుకున్నారు కానీ కోర్టులో అలాటి వాదన చేయలేదు. ఈ కేసు రాజకీయ దురుద్దేశాలతో పెట్టారు అని మాత్రమే లాయర్లు మధ్యమధ్యలో అంటూ వచ్చారు. అలా దేని గురించైనా అనవచ్చు. కేసులో దమ్ము లేదు అని అనాలంటే విచారణ పూర్తి కావాలి. సిఐడి విచారణ పూర్తి చేయలేదు. ‘ప్రస్తుతానికి ప్రాథమిక ఆధారాలున్నాయి, బాబు సహకరిస్తే తప్ప అన్ని వివరాలూ తెలియవు, ఆయన సహకరించటం లేదు, మాకు కస్టడీకి యివ్వండి’ అంటోంది. ఆ ఆధారాలు పరిశీలించి, యిది నడపదగిన కేసే అని సిఐడి కోర్టు అభిప్రాయపడి, సిఐడిని గోఎహెడ్ అంది. సిఐడి విచారణ పూర్తయి, పూర్తి కేసు పెట్టినప్పుడే అది అక్రమమో, సక్రమమో కోర్టులు తేలుస్తాయి. అప్పటిదాకా ఎవరి వెర్షన్ వాళ్లు చెప్పుకుంటూ ఉండవచ్చు.
బాబు కథను అక్కడిదాకా కూడా రానీయ దలచుకోలేదు. ‘చంద్రబాబు గారా!? ఆయన మీద కేసా!? హన్నన్న, ఎంత పని జరిగింది, తక్షణం క్వాష్ చేసేయండి’ అని కోర్టు అంటుంది అనుకున్నారు. గవర్నరు అనుమతి అన్న ఒక్క సాంకేతిక అంశం పట్టుకుని దాని మీదే వేళ్లాడారు. ఆ అంశం చూపించి, సాంతం కేసు కొట్టేయించుకుని, అప్పుడు కానీ జైల్లోంచి బయటకు రాకూడదనుకున్నారు. అందుకే నెలన్నరకు పైగా జైల్లో కూర్చున్నారు. అదంతా వ్యర్థమైంది. ఇంకా నయం! 50 రోజులు దాటాకైనా ఆయనకు జ్ఞానోదయం కలిగి, బెయిలు అడిగారు. లేకపోతే యిప్పటికీ జైల్లోనే ఉండేవారు. పోలీసులు అరెస్టు చేయగానే, ఛాతీలో నొప్పి, కడుపులో నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరడం, ఒకటి రెండు రోజుల్లో బెయిలు తెప్పించుకోవడం రాజకీయ నాయకులందరూ చేసే పనే! కానీ బాబు పంతానికి పోయారు. అలా చేస్తే అచ్చన్నాయుడికీ, చంద్రబాబు నాయుడికీ తేడా ఏముందని జనాలు అనుకుంటారని భావించారు.
అప్పటికీ సిద్ధార్థ లూథ్రా వగైరాలు చెప్పారట – యీ 17 ఏ పట్టుకుని వేళ్లాడడం రిస్కండీ, ఒక్కో హైకోర్టు దాన్ని ఒక్కోలా అప్లయి చేస్తోంది. కచ్చితంగా క్వాష్ చేస్తారన్న నమ్మకాలేమీ లేవు అని. కానీ బాబు ఒప్పుకోలేదట, తక్కినవాళ్ల సంగతి వేరు, నా సంగతి వేరు, నా విషయంలో యీ సాంకేతిక కారణం చూపిస్తే చాలు, కేసు పేపర్లు తీసి దగ్గరున్న కిటికీలోంచి బయటకు పారేస్తారు చూడండి అనే ధోరణిలో మాట్లాడారట. ఎప్పుడో పాతిన విత్తనాలు మొక్కలై, కాయలు చేతికి అంది వస్తాయన్న ఆత్మవిశ్వాసం ఆయనది. భారీ ఫీజులు భరించడానికి ఆయన సిద్ధమైనప్పుడు లాయర్లకేం పోయింది? మీ దగ్గర చమురు ఉన్నంతకాలం ఎంతకాలమైనా వాదిస్తాం, మేజిస్ట్రేటు కోర్టు దగ్గర్నుంచి సుప్రీం కోర్టుదాకా యిదే పాట వినిపిస్తూ పోతాం అని ఒప్పుకున్నారు. ఒకరికి నలుగురు చేరారు. అంతమంది కట్టకట్టుకుని వాదించినా న్యాయమూర్తులను యింప్రెస్ చేయలేక పోయారు. క్వాష్ చేయించలేక పోయారు, బాబుపై విచారణ ఆపించ లేకపోయారు.
వీళ్ల వాదనల సందర్భంగా బేలా త్రివేది గారు చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, ఆవిడ భావం స్పష్టంగా తెలుస్తూనే వచ్చింది. ఇలా అనుమతి లేదంటూ కేసులు కొట్టి పారేస్తూ ఉంటే అవినీతిని నిరోధించడం అసాధ్యం అనే అభిప్రాయంలో ఉన్నట్లు తోచింది. ఇక అనిరుధ్ బోస్ గారి సంగతి తెలియలేదు. చివరకి తేల్చారు కానీ దానిలో కూడా ఒక విషయంలో నాకు కన్‌ఫ్యూజన్ తోచింది. అనుమతి తీసుకోవాలి కానీ తీసుకోకపోయినా కేసు కొట్టేయను, విచారణ ఆపను అన్నారు సరే, ఆ అనుమతి యిప్పుడైనా తీసుకోవచ్చు అన్నారు. ఇక్కడే నాకో ప్రశ్న వస్తోంది. సిఐడి వారు గవర్నరుని అనుమతి అడుగుతారు సరే, ఆయన యిస్తే సరేసరి, కేసు విచారణ జరుపుకుంటూ పోతారు. ఇవ్వలేదనుకోండి, అప్పుడేం చేయాల్ట? అప్పటిదాకా చేసిన విచారణను అటకెక్కించాలా? కేసు మూసేయాలా? 17ఏ వర్తించే వాళ్లందరినీ కేసులోంచి తప్పించి, తక్కినవాళ్లపై కేసు నడపాలా? అలా అయితే తక్కిన నిందితులందరూ ‘ఆయన చెప్తేనే చేశామండీ’ అంటూ తప్పించిన వాళ్లపైకి కేసు తోసేయరా!?
అనుమతి తర్వాత తీసుకోవడం అనేది ఆఫీసు వ్యవహారాల్లో జరుగుతూంటుంది. పోస్ట్ ఫ్యాక్టో అంటారు. జరిగిపోయింది కాబట్టి యీసారికి ఒప్పుకుంటున్నాంలే, మళ్లీ యిలా చేయకు అని మందలించి వదిలేస్తారు. ఇప్పుడు బాబును అరెస్టు చేశారు, కస్టడీలో పెట్టారు, ఆయన నోరు విప్పి బెయిలు అడిగేదాకా జైల్లోనో ఉంచారు. అనుమతి తీసుకోలేదు, అక్రమంగా అరెస్టు చేశారు అని తీర్పు వస్తే అప్పుడు బాధితుడికి రెమెడీ ఏమిటి? సంబంధిత సిఐడి అధికారికి డిమోషన్ యిస్తారా? శిక్ష వేస్తారా? డబ్బు కట్టిస్తారా? దానివలన అనవసరంగా జైల్లో ఉండవలసి వచ్చిన వ్యక్తికి ఒరిగేదేముంది? ఆయనకు పరిహారంగా ప్రభుత్వం చేత డబ్బేమైనా యిప్పిస్తారా? నాకు డబ్బెందుకు, సిఐడికి చీఫ్ చేతనో, ఆయనకు పైనున్న హోం మంత్రి చేతనో, యింకా పైనున్న ముఖ్యమంత్రి చేతనో క్షమాపణ చెప్పించండి అని బాధితుడు డిమాండ్ చేస్తే..?
అనిరుధ్ బోస్ గారు చెప్పిన ‘ఇప్పటికైనా అనుమతి తీసుకోవచ్చు’ అనేది నాకు వింతగా తోస్తోంది. తీసుకుంటే అంతా సెట్‌రైట్ అయిపోతుందా? మా చిన్నపుడు సైకిల్ తొక్కుతూ ఎవరినైనా గుద్దేస్తే ‘బెల్లయినా కొట్టకుండా గుద్దేసేవేమిటయ్యా?’ అని గద్దించేవారు. అందుచేత నాకు సైకిలు నేర్పించిన వాడు ‘రద్దీలో పోతూ ఉండగా బెల్లు కొడుతూనే ఉండు, ఎవర్నయినా గుద్దేసినా ఫర్వాలేదు’ అని బోధించాడు. బెల్లు కొట్టకుండా గుద్దితే అఫెన్స్ అవుతుందనే భయంతో ఒక్కోప్పుడు గుద్దేసిన తర్వాత బెల్లు కొట్టేవాళ్లం. అప్పుడు అవతలివాడు శాంతించేవాడు. అలా యిప్పుడు అనుమతి తీసుకుంటే చంద్రబాబు శాంతిస్తారా? త్రిసభ్య బెంచ్‌లో రాబోయే న్యాయమూర్తి యింకెలాటి వ్యాఖ్యానం చేస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా యిది తేలడానికి కనీసం రెండు నెలలు పడుతుందేమో! ఈ తీర్పుకే నెలల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చింది. దీని మీద తీర్పు వచ్చాకనే తక్కిన కేసుల విషయం తేలుస్తామంటూ వాయిదాలు వేస్తూ పోయారు న్యాయమూర్తులు. ఇప్పుడు చూస్తే యిలా త్రిశంకు స్థితిలో వేళ్లాడదీశారు. కొత్తగా వచ్చినాయన మొత్తమంతా కేసు చదవాలి, ఒక్కో హైకోర్టులో ఒక్కో రకమైన వ్యాఖ్యానం చెప్తున్నారట కదా, అవన్నీ చదవాలి అంటూ సమయం తీసుకుంటే కేసు సాగుతుంది. అప్పటిదాకా చంద్రబాబు నెత్తిపై కేసు కత్తి వేళ్లాడుతూనే ఉంటుంది.
ఎన్నికలు నాలుగు నెలల్లో జరుగుతాయో, అంతకు ముందే జరుగుతాయో ఎవరూ చెప్పలేకున్నారు. చూడబోతే ఎన్నికలకు వెళ్లే సమయానికి బాబు నెత్తి మీద నుంచి కత్తి తీసేట్లు కనబడటం లేదు. ఇదే బాబుకి నచ్చనిది. జగన్ నెత్తిపై కేసులున్నాయి, అతను బెయిలు మీద తిరుగుతున్నాడు, నేను అలాటివాణ్ని కాను అని చెప్పుకోవడం బాబు లక్ష్యం. కానీ కోర్టుల ధర్మమాని యిద్దర్నీ ఒకే కాటాలో చెరో పళ్లెంలో పడ్డారు. ఇద్దరూ బెయిలు పక్షులే, కేసులు రుజువైతే జెయిలుకి వెళ్లవలసిన వారే అనే స్థితిలోకి బాబు నెట్టబడ్డారు. దీనిలో కేసు క్వాష్ అయిపోయి వుంటే, దీన్ని చూపించి తక్కిన కేసులన్నీ టపటపా క్వాష్ చేయించుకునేవారు. అది జరగక పోవడం బాబుకి మైనస్. ఇది ప్రస్తుత పరిస్థితి. విస్తృత ధర్మాసనం క్వాష్ చేయవచ్చు అని తీర్పు నిస్తే, యిది తాత్కాలిక సెట్‌బ్యాక్ మాత్రమే అనాలి.
ఇలాటి పరిస్థితి ముందే ఊహించి కాబోలు బేలా త్రివేదికి వ్యతిరేకంగా తెలుగులో కొందరు వీడియోలు చేశారు. ఆవిడ మోదీ ప్రాపకం వలన పైకి వచ్చిన వ్యక్తి అని, ఆవిడకు వ్యతిరేకంగా ఇంగ్లీషు పత్రికలలో కూడా వ్యాసం వచ్చిందని ఆ వీడియోలో ఉంది. ఎవరేమనుకున్నా ఏం లాభం? వాళ్లు ఆ హోదాలో ఉన్నపుడు వాళ్ల మాట చెల్లుతుంది. సిద్ధార్థ లూథ్రా వగైరాలు కూడా వాదనల సందర్భంగా బేలా గారు చేసిన వ్యాఖ్యల ద్వారా ఆమె మూడ్ గమనించి బాబును హెచ్చరించి ఉంటారు. ‘అవతలి ఆయన మాట ఎలా వున్నా, యీవిడ 17ఏ వర్తించదనే చెప్పేస్తుంది, ఇద్దరూ చెరోలా చెపితే ముగ్గురు సభ్యుల బెంచ్‌కు వెళుతుంది. ఈ లోగా కేసు క్వాష్ కావడం కల్ల. మరి ఆలోచించుకోండి.’ అని దానితోనే బాబు యిక లాభం లేదని అనారోగ్య కారణాలు చూపించి బెయిలు అడిగారు.
నిజానికి అచ్చెన్నాయుడు అరెస్టయినప్పుడే యీయన పార్టీ అధ్యక్షుడిగా 17ఏ గురించి వివాదం లేవనెత్తి, సిద్ధార్థ లూథ్రా చేతనే ఉంటే వాదింప చేసి ఉంటే, యీ పాటికి దానిపై క్లారిటీ వచ్చేసి, ఆ దిశగా పోరాడాలా లేదా అని మొదటే నిర్ణయించుకునే వారు. తన దాకా వస్తే కానీ ఆ అస్త్రాన్ని బయటకు తీయకపోవడం, సిద్ధార్థ వంటి ఖరీదైన లాయర్లను పెట్టుకోక పోవడం వలన 50 రోజులకు పైగా జైల్లో గడపాల్సి వచ్చింది. దాని వలన పార్టీకి చాలా డ్యామేజి జరిగింది. తను బయట ఉండకపోతే పార్టీ నిస్తేజం అయిపోతుందని ఆయన ఊహించి ఉండరు. కొడుకు రంగం విడిచి లాబీయింగు పేరుతో హస్తినలో విడిది చేస్తాడని అనుకుని ఉండరు. తక్కిన నాయకులందరూ కలుగుల్లోకి దూరిపోతారనే ఆలోచన కూడా వచ్చి ఉండదు. కానీ అవన్నీ జరిగాయి. దాంతో ఆయన అనారోగ్య అస్త్రం బయటకు తీశారు.
ఈ 17 ఏ తీర్పు గురించి ఎదురు చూస్తూ బాబు జైల్లోనే ఉండి పోయి ఉంటే, వైసిపిలో టిక్కెట్లు దొరకని వాళ్లు ఏం చేసేవారా అన్న ఆలోచన వస్తోంది. ఇప్పటికే కొందరు జనసేనలోకి వెళుతున్నారు. బాబు లోపల ఉండి వుంటే అందరూ అటే పోయేవారేమో! ఎందుకంటే టిడిపికి అనుభవం వుంది, మాకు పోరాట పటిమ ఉంది అని పవన్ చెప్తూ వచ్చారు. జగన్‌తో పోరాడడానికి పవనే సరైనవాడు అనుకునే పరిస్థితి వచ్చింది. బాబు జైల్లోంచి బయటకు వచ్చి ఆ కోణంలో తన పార్టీని కూడా ఆకర్షవంతం చేశారు. ఆయన వచ్చి ఉండకపోతే చేరేవారు కాదేమో! ఆ పార్టీలో చేరేవారందరూ ఆయన్ను చూసే చేరుతున్నారు తప్ప తక్కిన ఎవర్నీ చూసి కాదనే విషయంలో సందేహం లేదు. వైసిపిలోకి వెళ్లేవాళ్లు జగన్‌నే చూస్తారు, సజ్జలను చూసి కాదు. కానీ 40 ఏళ్ల వయసున్న టిడిపిలో ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా బలంగా ఉండి ఉంటే బాగుండేది. బాబు యీ లోపాన్ని త్వరలో సవరిస్తారని ఆశిద్దాం.
ఆయన ఎప్పుడూ తన జబ్బులు బయటపెట్టుకోలేదు. అధినేత ఆరోగ్యం చర్చకు రావచ్చునా? అనే వ్యాసంలో యివన్నీ నేను రాశాను. జైలు నుంచి బయటకు వస్తూనే ఆయన తన ఆరోగ్యం ఎంత దృఢంగా ఉందో నిరూపించుకున్నారు. రాజమండ్రి నుంచి విజయవాడకు చేసిన రోడ్డు ప్రయాణం దగ్గర్నుంచి యిప్పటివరకు విశ్రాంతి ఎరగకుండా పని చేస్తూనే ఉన్నారు. అనేక రకాల కార్యకలాపాల్లో మునిగి తేలుతూ, తనకు యిప్పట్లో ఢోకా ఏమీ లేదని చూపుకుంటున్నారు. కేటరాక్ట్ అంటారా, అదో పెద్ద విషయం కాదు. 60లు దాటాక ఎవరికైనా వచ్చేదే! కానీ దాన్నీ, మరో కొన్నిటిని కలిపి భూతద్దంలో చూపించి, 24 గంటలూ యాంబులెన్స్ పక్కన లేకపోతే అంతే సంగతులు అనే సర్టిఫికెట్టు పుట్టించి, బెయిలు తెచ్చుకున్నారు.
ఇలా తెచ్చుకోవడానికి ముందు ఆయన మనసు ఎంత క్షోభించి ఉంటుందో! ‘తమ్ముళ్లూ నేను మీకంటె యూత్‌ఫుల్’ అని అనడానికి యికపై వీలు ఉండదు కదా అని మథన పడి ఉంటారు. ఆయన జైలుపాలయినప్పుడు అయినవాళ్లూ, కానివాళ్లూ అందరూ పదేపదే 73 ఏళ్ల వృద్ధుడని ప్రస్తావిస్తూ ఉంటే చికాకు పడి ఉంటారు. అలాటిది తనే తన జబ్బుల జాబితాను పబ్లిక్ డొమైన్‌లోకి వదలడం ఎంత బాధాకరం! అరెస్టయిన మర్నాడే ఛాతీ నొప్పి అని ఉంటే వెంటనే బెయిలు వచ్చేసేది. తనపై కేసు క్వాష్ అయి తీరుతుంది అనే గుడ్డి నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతో ఆయన 52 రోజుల పాటు కృష్ణజన్మస్థానంలో ఉండిపోయారు. తన కుటుంబసభ్యులకు, పార్టీ సహచరులకు వేదన కలిగించారు. ఎప్పటికీ జైల్లోనే ఉండిపోతారేమోనని బెంగపడి, ఖేదపడిన కొందరి మరణాలకు కారకులయ్యారు.
ఈ కథలో నీతి ఏమిటంటే – ఆత్మవిశ్వాసం అన్ని వేళలా పనికి రాదు, ఆప్తమిత్రులు అన్ని చోట్లా ఆదుకోలేరు – ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో. అందరూ న్యాయమూర్తులూ ఒక్కలాటి వారే ఉండరు. ఎవరికి వారే దిగి వచ్చామనుకుంటారు. ఇంకొకరు చెప్తే వినడమేమిటి అనుకుంటారు. అసలు న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసినదే అలాటి లైన్స్‌పైన! స్వతంత్రంగా ఆలోచించండి, స్వేచ్ఛగా వ్యవహరించండి. ప్రలోభాలకు లొంగకండి, పక్షపాతాలు చూపకండి అని. ఫలానా హైకోర్టు యీ తరహాలో తీర్పు యిచ్చింది, మీరూ అదే చేయండి అంటే యీ జజ్ గారు వినరు. ‘వాడంతటి వాడు వాడు, నా అంతటి వాడు నేడు’ అనుకుని, అదే చట్టానికి తనదైన వ్యాఖ్యానం చేస్తారు. సామాన్యులు కోర్టులకు వెళ్లడానికి భయపడతారు. న్యాయం మన పక్షాన ఉన్నా న్యాయమూర్తికి ఎలా తోస్తుందో తెలియదు కదా, ఏళ్ల తరబడి వాటి చుట్టూ తిరుగుతూ శ్వేతగజాల్లాటి లాయర్లను మేపే బదులు ప్రతికక్షితో రాజీ పడి వచ్చిన మేరకు పుచ్చుకుంటే మేలు కదా అనుకుంటారు.
బాబు విషయానికి వస్తే ఆలస్యంగానైనా యిది ఆయనకు గుర్తుకు వచ్చింది. నా మీద కేసు పెట్టే సాహసం ఎవరికి ఉంది? అనే అహాన్ని విడిచిపెట్టి, సాధారణ నిందితులందరి లాగానే అభియోగాలు ఎదుర్కుంటూ, బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు పొందుతూ, బయట హాయిగా తిరుగుతూ, సంక్రాంతి సంబరాల దగ్గర్నుంచి, రాజకీయ సమాలోచనల దాకా అన్నీ చేసుకుంటున్నారు. టిడిపిని రక్షించే భారాన్ని పవన్ భుజాల మీద నుంచి తన భుజాలపైకి మార్చుకున్నారు. దీనివలన పవన్‌కు ఊరట లభించింది. బాబు అనుయాయులలో ధైర్యం వచ్చింది. పార్టీ బతికింది. శుభం.
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2024)