తెలుగు సినిమాల కలెక్షన్లను నమ్మడం ఎప్పుడో మానేశారు జనం. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకోవడానికి తప్ప ఈ నంబర్లు ఎవ్వరికీ పనికిరావు. రానురాను పరిస్థితి ఎలా మారిందంటే, ఓపెనింగ్ డే వసూళ్లు, ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు అంటూ పోస్టర్లు రిలీజ్ చేస్తుంటే, సామాన్య ప్రేక్షకుడు నవ్వుకుంటున్నాడు. మేకర్స్ అత్యుత్సాహం చూసి తనలోతాను జాలి పడుతున్నాడు.
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ బరిలో ఇలాంటి చేతివాటం ఓ రేంజ్ లో జరిగింది. ఎంతలా అంటే ఒకప్పుడు ఒరిజినల్ వసూళ్లకు, మేనేజ్ చేసే నంబర్ కు మధ్య 20-30శాతం వ్యత్యాసం ఉండేది. వచ్చిన ఎమౌంట్ కు ఓ 30 శాతం కలిపి చెప్పేవారు. ఈసారి ఏకంగా 50-60 శాతం కలిపేస్తున్నారు.
మొన్నటికిమొన్న ఓ సినిమా నిర్మాత, తన పెద్ద సినిమా కోసం వసూళ్లను అమాంతం పెంచేశాడు. దాదాపు ఆర్ఆర్ఆర్ కు దగ్గరగా ఉంటామంటూ రిలీజ్ కు ముందు ప్రకటించుకున్న ఆ నిర్మాత, సినిమా రిలీజైన తర్వాత తన మాయాజాలం ప్రదర్శించాడు. రోజుకో పోస్టర్ రిలీజ్ చేసి అనుకున్న టార్గెట్ కు 'పోస్టర్ల'తో దగ్గరయ్యాడు.
సినిమా వసూళ్లను నిజాయితీగా చెప్పే సోషల్ మీడియా హ్యాండిల్స్ కొన్ని ఉన్నాయి. అవి చెప్పే లెక్కలకు, నిర్మాతలు వేసే పోస్టర్లకు మధ్య ఓ 20శాతం వ్యత్యాసం ఉండేది. సంక్రాంతి సినిమాల విషయంలో మాత్రం ఈ లెక్క తప్పింది. కంటికి కనిపిస్తున్న నంబర్లకు, మేకర్స్ నుంచి వస్తున్న పోస్టర్లకు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తోంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఓవైపు కళ్లముందు థియేటర్లు ఖాళీగా కనిపిస్తాయి, మరుసటి రోజు భారీ వసూళ్లతో పోస్టర్ కనిపిస్తుంది. బుక్ మై షోలో టికెట్లన్నీ ఖాళీగా ఉన్నట్టు ఆకుపచ్చ రంగులో వెబ్ సైట్ దర్శనమిస్తుంది. మరుసటి రోజు నిర్మాత రిలీజ్ చేసే పోస్టర్ మాత్రం ఘనంగా ఉంటోంది. ఓవర్సీస్ వసూళ్లను కూడా లోకల్ కలెక్షన్లలో మిక్స్ చేసి నంబర్లు పెంచేయడం బాధాకరం. ఏమాత్రం మొహమాటపడకుండా, పశ్చాత్తాపం లేకుండా ఖాళీ థియేటర్లతో సినిమాను రన్ చేస్తున్నారు కొంతమంది.
ఈసారి సంక్రాంతి సినిమాల విషయంలో దాదాపు ప్రతి సెంటర్ లో కలెక్షన్ ఏజెంట్లను మేనేజ్ చేశారు. స్వతంత్రంగా సినిమాల్ని రిలీజ్ చేసే ఎగ్జిబిటర్లను కూడా ఈసారి మేనేజ్ చేయడం విశేషం. దీంతో ఎవరి ఇష్టారాజ్యానికి వాళ్లు నంబర్లు పెంచేసుకున్నారు. సాధారణంగా ఓ హీరో లేదా స్టార్ దర్శకుడితో సినిమా చేద్దామనుకున్నప్పుడు, అతడి గత చిత్రాల కలెక్షన్లను ప్రామాణికంగా తీసుకుంటారు. ఇప్పుడా పద్ధతి ఫాలో అయ్యే పరిస్థితి లేదు.
ఏపీ,నైజాంలో మారుమూల ఉండే సింగిల్ స్క్రీన్స్ కు కూడా ఇద్దరు ముగ్గురు ఏజెంట్స్ ఉంటారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు వీళ్లు అసలైన కలెక్షన్లు పంపిస్తారు. అయితే అలాంటివి దాదాపు 600 థియేటర్లు ఇప్పుడు కొంతమంది టాలీవుడ్ పెద్ద మనుషుల చేతికి వెళ్లిపోవడంతో.. ఏజెంట్ స్థాయి నుంచే 'నొక్కుడు' మొదలైంది. దీంతో అసలైన కలెక్షన్ ఎంతనేది నిర్మాతకు తప్ప మరో వ్యక్తికి తెలిసే అవకాశం లేకుండా పోయింది.
వాస్తవంగా చూసుకుంటే, కొంతమంది హీరోలు ఈ వసూళ్ల లెక్కలు పట్టించుకోరు. కాలం మారింది. సినిమా హిట్టయినా, ఫ్లాప్ అయినా వాళ్ల మార్కెట్ వాళ్లకుంది. కాబట్టి తమ రెమ్యూనరేషన్లకు, కలెక్షన్లు కొలమానం కాదు. ఎటొచ్చి కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు ఈ ఫేక్ ప్రాపగాండకు మూలకారకులు.
ఈ ఫేక్ కలెక్షన్ల సంస్కృతి ఎప్పుడు మొదలైందో చెప్పలేం కానీ, ఈ సంక్రాంతి బాక్సాఫీస్ సాక్షిగా ఈ పాడు సంస్కృతి పీక్ స్టేజ్ కు చేరిందనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే, కొన్నాళ్లకు టాలీవుడ్ మొత్తం ఫేక్ లెక్కల మీద నడవాల్సిందే. లోగుట్టు పెరుమాళ్లకెరుక.