ఇక ఎంత మాత్రం అనుమానం లేదు. నందమూరి హరికృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చాలా అంటే చాలా దూరం. ఏనాటి నుంచో ఎన్టీఆర్ కు లోకేష్ కు మధ్య తేడా వుంది. అది అంతర్గతంగా వుంటూ వస్తోంది.
లోకేష్ వుండగా ఎన్టీఆర్కు అక్కడ ఎంత మాత్రం స్థానం వుండదు అన్న విషయంలో అందరికీ క్లారిటీ వుంది. అందుకే ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటూ వచ్చారు. అయినా లోకేష్ మనుషులు ఎన్టీఆర్ ను వదలలేదు. మరింతగా పార్టీకి దూరం చేసే పని చేస్తూనే వచ్చారు.
జగన్ ను ఎన్టీఆర్ కలిసారని, నోవాటెల్ హొటల్ లో మంతనాలు జరిపారని వదంతులు పుట్టించారు. మెలమెల్లగా తెలుగుదేశం శ్రేణుల్లో ఎన్టీఆర్ మన మనిషి కాదు అనే భావన పెరిగేలా చేస్తూనే వచ్చారు.
లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు, అన్నీ మరచి కళ్యాణ్ రామ్ వెళ్లనే వెళ్లారు. కానీ అక్కడ పలకరించిన వారు లేరు. దాంతో ఇక సైలంట్, దూరంగా వుండిపోయారు. ఆ తరువాత నుంచి ఇక ఎవరి దారి వారిది అన్నట్లు వుంది వ్యవహారం. బాలకృష్ణ తన స్వంత అన్న కొడుకులు అయినా అల్లుడి కంటే ఎక్కువ కాదన్నట్లు పక్కన పెట్టారు. అన్ స్టాపబుల్ కార్యక్రమానికి అందరు హీరోలను పిలిచారు కానీ ఎన్టీఆర్ మాత్రం పిలవలేదు. అక్కడే క్లారిటీ వచ్చేసింది ఎన్టీఆర్ అభిమానులకు.
చంద్రబాబు అరెస్ట్ టైమ్ లో అందరూ ఖండన ప్రకటనలు వదిలారు కానీ ఎన్టీఆర్ నుంచి రాలేదు. తెలుగుదేశంలోని కమ్మ సామాజిక వర్గానికి అదే చాలా కోపం తెప్పించింది. ఇక ఎన్టీఆర్ తమ వాడు కాదు అని డిసైడ్ అయిపోయారు. దమ్ము సినిమాలో కానీ, గుంటూరు కారం సినిమాలో కానీ కథలో కొన్ని పాయింట్లు చూస్తే ఎన్టీఆర్- తెలుగుదేశం వ్యవహారాలే గుర్తుకు వస్తాయి.
ఇటీవల గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూ సమయంలో 2024 ఎన్నికల ప్రస్తావన తెచ్చినపుడు కూడా కళ్యాణ్ రామ్ తెలుగుదేశం ప్రస్తావన తేకుండా సమాధానం చెప్పారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటే ఇప్పుడు అంతా మరింత ఓపెన్ చేసేసారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జూనియర్ అభిమానులు పెట్టిన కట్ అవుట్ లు తీసేయమని చెప్పడం ద్వారా తమ తమ దారులు వేరు అని ప్రకటించేసారు.
ఇక నిర్ణయించుకోవాల్సింది ఎన్టీఆర్ అభిమానులే. సినిమాకు ఎన్టీఆర్, పార్టీకి తెలుగుదేశం అంటారో? లేక వేరుగా వెళ్తారో చూడాలి.