బంగారు వ్యాపారానికి ముంబయ్ తర్వాత ప్రొద్దుటూరు పేరు పొందింది. అందుకే వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి పసిడి పురి అనే పేరు వచ్చింది. ఎన్నికల ముంగిట ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి సొంత ప్రభుత్వ చర్యలు షాక్ ఇచ్చాయి. ప్రొద్దుటూరులో బంగారు వ్యాపారాలపై పోలీసుల సోదాలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ఈ చర్యలు రాజకీయంగా తనకు నష్టం తెస్తాయనే భయం రాచమల్లులో కనిపిస్తోంది. దీంతో ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు మద్దతుగా ఆయన నిరసనకు దిగారు.
ప్రొద్దుటూరులో వ్యాపార సముదాయాలపై సోదాలు మానుకోవాలని, ఎన్నికల కోడ్ రాకుండానే ఎందుకిలా చేస్తున్నారని ఆయన వాపోయారు. కుమార్తె పెళ్లికి బంగారు కొనుగోలు చేయడానికి నెల్లూరు నుంచి వచ్చిన ఒక కుటుంబం నుంచి పోలీసులు ఏకంగా రూ.14లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే మరో ఇద్దరి నుంచి రూ.5లక్షలు, రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ పరిణామం ప్రొద్దుటూరు వ్యాపారుల్లో ఆందోళనకు కారణమైంది. దీంతో వ్యాపారులంతా ఎన్నికలు ముగిసే వరకూ దుకాణాలు మూసేస్తామని ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. ప్రొద్దుటూరు వ్యాపారుల్లో చోటు చేసుకున్న ఆందోళన తనకు రాజకీయంగా దెబ్బ తీస్తోందని రాచమల్లు ప్రసాద్‌రెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. ఆయనే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అవతారం ఎత్తారు.
దయచేసి ప్రొద్దుటూరు వ్యాపారులపై దాడులు మానుకోవాలని సీఎం వైఎస్ జగన్ మొదలుకుని, కడప ఎంపీ, ఎస్పీలకు ఆయన మొరపెట్టుకోవడం ఆసక్తికర పరిణామం. నిన్నమొన్నటి వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా దర్బార్ ప్రదర్శించిన రాచమల్లు.. ఆదేశించడం పక్కన పెట్టి, వినమ్రంగా విజ్ఞప్తి చేసుకోవాల్సిన దయనీయ స్థితి ఏర్పడింది. ముఖ్యంగా బంగారు వ్యాపార సముదాయాలు ఉన్న ప్రాంతంలో పోలీసుల గస్తీ ఏంటని ఆయన ప్రశ్నించారు.
అంతిమంగా తనకు ప్రజలే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజలు, వ్యాపారుల రక్షణ కోసం తాను నిరసనకు దిగాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు.
మరోవైపు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే రాచమల్లు వైఖరిపై విరుచుకుపడ్డారు. కుమార్తె పెళ్లి కోసం బంగారు కొనుగోలు చేయడానికి వచ్చిన కుటుంబం నుంచి రూ.14 లక్షలను స్వాధీనం చేసుకోవడంపై ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వ పాలనలో సామాన్యులు బతకలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ, నిరసనకు దిగడం ఏంటని ఆయన నిలదీశారు. రాచమల్లు డ్రామాలు పక్కన పెట్టి, వ్యాపారులపై దాడులను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు.