స్కూలులో ప్రిన్సిపాల్ పన్నెండో తరగతి కుర్రవాణ్ని ఆలస్యంగా వస్తున్నావేం? హోంవర్కు చేయటం లేదేం? అని మందలించింది. అంతే వాడు యింటికి వెళ్లి ఫైనాన్షియర్ అయిన తండ్రి తుపాకీ తెచ్చుకుని వచ్చి స్కూలులో ఆవిణ్ని కాల్చి చంపేశాడు. జనవరి 20 నాటి యీ సంఘటన అమెరికాలో జరగలేదు. హరియాణాలో యమునానగర్‌లో జరిగింది. హరియాణాలో క్రైమ్ రేటు ఎప్పుడూ ఎక్కువే. సామూహిక బలాత్కారాల్లో 2014లో, 2015లో హరియాణాది ప్రథమస్థానం.
లక్ష మంది మహిళలకు 1.9, 1.6 మంది రేప్‌కు గురయ్యారు. 2015లో వరకట్న చావుల్లో రెండో స్థానం. లక్ష జనాభాకు 1.9 మంది. స్త్రీలను వేధించడంలో మూడో స్థానం. 2016 వచ్చేసరికి అన్ని రకాల నేరాల సంఖ్య కలిపి క్రైమ్ రేట్ యింకా పెరిగింది. 2014లో 79,947 కేసులు నమోదైతే, 2015లో 84,466 అయితే 2016కి వచ్చేసరికి 88,527 అయింది. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే లక్ష జనాభాకు 2015లో 310.4 ఉంటే 2016 నాటికి 320.6 అయింది.
కులసంఘర్షణల్లో హరియాణాది దేశంలోనే ప్రథమస్థానం. 2016లో 250 కేసులు నమోదయ్యాయి. పొరుగున ఉన్న పంజాబ్‌లో ఒక్కటి కూడా లేదు. 2016లో 1057 హత్య కేసులు, 260 వరకట్న చావు కేసులు, 996 బలాత్కార కేసులు (వీటిలో 518 మైనర్లపై జరిగినవి), 191 గ్యాంగ్ రేప్ కేసులు, 17 యాసిడ్ ఎటాక్ కేసులు, 3932 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుత బిజెపి ముఖ్యమంత్రి ఖట్టార్ 2014 అక్టోబరులో పదవి చేపట్టారు. మరుసటి నెలలోనే బాబా రాంపాల్ అనే దొంగబాబాను అరెస్టు చేయమని సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే అతన్ని అరెస్టు చేయబోవనివ్వమని అతని అనుచరులు అడ్డు తగిలారు. రెండు వారాల పాటు ఘర్షణ జరిగి, అటుయిటూ 200 మంది గాయపడ్డాక చివరకి సైన్యాన్ని పిలిపించి, అరెస్టు చేయగలిగారు. 2017 ఆగస్టులో బాబా రామ్ రహీమ్‌ను అరెస్టు చేసినపుడు అతని అనుచరులు యుద్ధవాతావరణాన్ని సృష్టించి, 36 మందిని పొట్టన పెట్టుకుంటే హరియాణా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ కూర్చుందని అందరూ గమనించారు.
బాబా బిజెపికి మద్దతుదారు కాబట్టే యిలా జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఇక 2016 ఫిబ్రవరిలో జాట్ల ఆందోళన సందర్భంగా రూ.34,000 కోట్ల ఆస్తి ధ్వంసమైంది. 30 మంది ప్రాణాలు కోల్పోయారు. 9 మంది సామూహిక అత్యాచారానికి గురయ్యారు. ఆ అల్లర్లపై విచారణ జరిపిన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ప్రకాశ్ సింగ్ నివేదిక ఐఏఎస్, ఐపిఎస్‌లతో సహా 90 మంది సివిల్, పోలీసు అధికారులను దోషులుగా పేర్కొంది. అయినా వారిపై చర్యలు లేవు.
తాజాగా 2018 జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా దళిత మైనర్ బాలికలపై జరిగిన 10 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వెళుతున్న కారులోంచి ఒక మహిళను బయటకు గుంజి సామూహిక అత్యాచారం చేశారు. మరో కేసులో కూడా కారులోంచి బయటకు లాగి భర్త, మరిది ఎదుట రేప్ చేశారు. ''పద్మావత్'' సినిమా విడుదల సందర్భంగా కర్ణిసేన వారు స్కూలు పిల్లలున్న స్కూలు బస్సుపై రాళ్ల వర్షం కురిపించారు. అయితా రాబోయే రాజస్థాన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వారిపై చర్య తీసుకోలేదు.
రాష్ట్రంలో హింసాకాండ యీ స్థాయిలో ఉంటే ఖట్టార్ సర్కార్ ఏం చేస్తోందన్న అనుమానం రావచ్చు. 2017 నవంబరు-డిసెంబరులో కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా మహోత్సవం జరిపించింది. స్కూళ్లలో గీతాబోధన క్లాసులు మొదలుపెట్టారు. 4 వేల సంవత్సరాల క్రితం అదృశ్యమైన సరస్వతీ నదిని కనిపెట్టి పూజించడానికై సరస్వతీ హెరిటేజ్ ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైంది. ఇంటర్నేషనల్ సరస్వతీ మహోత్సవ్ అని 2018 జనవరి 18 నుంచి ఐదురోజుల పాటు యజ్ఞం నిర్వహించింది.
అనేకమంది సాధువులు హాజరైన యీ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమాలకై కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. హరియాణాలో యిప్పటికీ ఆడపిల్ల పుట్టగానే చంపివేస్తున్నారు. 1000 మంది మగవారికి 914 మంది ఆడవారు మాత్రమే ఉన్నారు. (జాతీయ సగటు 945) స్త్రీలపై అత్యాచారాలు అత్యంత సహజమైన విషయంగా ఉంది.
బాబాలుగా అవతారమెత్తిన వారు భక్తురాళ్లను అన్ని రకాలుగా దోచుకుంటున్నారు. సరస్వతీ నది ఒక మహిళగా అవతారం ధరించి వస్తే హరియాణా ప్రభుత్వం ఆమెకు రక్షణ కల్పించే స్థితిలో లేదు. ఈ దుస్థితిని చక్కదిద్దకుండా హరియాణా ప్రభుత్వం సరస్వతీ నది అన్వేషణ, గీతా ఉత్సవం అంటూ కోట్లాది రూ.ల ప్రజాధనాన్ని వ్యయం చేయడం ఏ విధంగా సమంజసం?
– ఎమ్బీయస్ ప్రసాద్
[email protected]