ఆంధ్ర ప్రభుత్వం అమితాబ్ బచ్చన్‌ను హెల్త్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిందట. ఆయన చ్యవన్‌ప్రాశకు వాటికీ అంబాసిడర్‌గా వున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో కూడా ఓపిక చేసుకుని తిరుగుతున్నానంటే చ్యవన్‌ప్రాశ లాటివి తినడం వల్లనే అని చెప్పినట్లు వుంటుంది. కానీ శరీరమంతా అనారోగ్యాల పుట్ట అయిన అమితాబ్‌ను ఆరోగ్యానికి ప్రతీకగా చూపడం ఏమిటి తమాషా కాకపోతే! ఒక్క మాటలో చెప్పాలంటే సానియా మీర్జాలో ఎంత తెలంగాణతనం వుందో, అమితాబ్‌లో అంత ఆరోగ్యం వుంది! 'కూలీ' సినిమా యాక్సిడెంటు జరిగినపుడు బయటకు వచ్చిన ఆయన వ్యాధుల జాబితా చూసి అందరూ దడుచుకుని ప్రార్థనలు మొదలుపెట్టారు.
ఆ తర్వాత బతికి బట్టకట్టాక కూడా సవాలక్ష రోగాలతో ఆయన నెట్టుకుని వస్తున్నాడు. రాజీవ్ గాంధీ బలవంతంపై రాజకీయాల్లోకి దిగవలసి వచ్చింది. ఎన్నికల ప్రచారానికి గ్రామీణ ప్రాంతాల్లో తిరిగేటప్పుడు నానా అవస్థా పడేవాడు. అసలే ఆస్త్మా, అక్కడి దుమ్ము పడేది కాదు. సినిమాల్లో మొదట్లో ఫైట్స్ చేసేవాడు కానీ తర్వాత తర్వాత మాయమంత్రాలతో మ్యాజిక్కులు చేసినట్లు పాత్రలు రాయించుకుని ''తుఫాన్'' వంటి సినిమాల్లో వేశాడు. అవి గాలికి కొట్టుకుపోవడంతో కారెక్టరు యాక్టరుగా మారిపోయాడు.
సినిమాలు మానేసి వున్న కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకుందామని అనుకుంటూన్న సమయంలో ఎబిసిఎల్‌లో భారీ నష్టాలు వచ్చి మళ్లీ వేషాలు వేయవలసి వచ్చింది. ఇటీవలే చెప్పుకున్నాడు – 'కెబిసి ప్రారంభానికి ముందు తనకు టిబి సోకిందని'. గొప్ప నటుడు కాబట్టి, అద్భుతమైన వాయిస్ వుంది కాబట్టి, కొద్దిపాటి శారీరకపు కదలికలతోనే డాన్సు చేసినట్లు భ్రమింపచేయగలడు కాబట్టి యింకా డిమాండులో వున్నాడు. అంతమాత్రానికి అతన్ని పరిపూర్ణ ఆరోగ్యానికి నమూనాగా చూపించడం ఆశ్చర్యకరం. హిందీ వాళ్లే కావాలనుకుంటే కండల వీరుడు సల్మాన్ ఖాన్నో, అక్షయ్ కుమార్ వంటి వాళ్లయితే యువతకు యిన్‌స్పయిరింగ్‌గా వుండేది.
అమితాబ్‌ను ఏదో దానికి ప్రతీకగా చూపించాలంటే ఆత్మస్థయిర్యానికి ఉదాహరణగా చూపాలి. మృత్యుముఖంలోకి వెళ్లి వచ్చినా, అప్పులపాలై దెబ్బ తినిపోయినా నీరు కారిపోకుండా మళ్లీ ఆత్మబలంతో పుంజుకున్న విషయాన్ని హైలైట్ చేయాలి. ఏది చెప్పినా ఆయన వాయిస్‌లో చెపితేనే అందం. ఆయనకు తెలుగు రాదాయె! వాయిస్ డబ్ చేస్తే ఆ కాడికి అమితాబ్ ఎందుకు?
పోనీ ఆయనే తెలుగును హిందీ లిపిలో రాసుకుని చదువుతాడనుకుంటే 'ళ' వంటి అక్షరాల దగ్గర దొరికిపోతాడు. ''మీ కళ్లు కాపాడుకోండి'' అనవలసిన చోట కల్లు అన్నాడంటే అర్థమే మారిపోతుంది. అదే కాకుండా మనకు రెండు చలు, రెండు జలు వున్నాయి. తెలుగేతరులు సరిగ్గా పలకలేరు. అమితాబ్‌ను బదులు ఏ ప్రభాస్‌నో, గోపీచంద్‌నో పెట్టుకుంటే అర్థవంతంగా వుండేది.
ఎమ్బీయస్ ప్రసాద్