ఎమ్బీయస్‌: అరమోడ్పు కనుల అటల్‌జీ కనుమూత

మహానుభావుడు అటల్‌ బిహారీ వాజపేయి వెళ్లిపోయారు. తొమ్మిదేళ్లగా అనారోగ్యంతో బాధపడుతూ తనెవరో తనకే తెలియని స్థితిలో జీవించి ఉండడం దుర్భరం. హుందాగా బతికిన ఆ మనిషి ఆ దశ రాకుండా దర్జాగా వెళ్లిపోయి ఉంటే…

మహానుభావుడు అటల్‌ బిహారీ వాజపేయి వెళ్లిపోయారు. తొమ్మిదేళ్లగా అనారోగ్యంతో బాధపడుతూ తనెవరో తనకే తెలియని స్థితిలో జీవించి ఉండడం దుర్భరం. హుందాగా బతికిన ఆ మనిషి ఆ దశ రాకుండా దర్జాగా వెళ్లిపోయి ఉంటే బాగుండేది. కానీ ఏం చేస్తాం? పుట్టుక లాగ చావు కూడా మన చేతిలో లేదు.

2014 నాటికి ఆయన మనస్థిమితం సరిగ్గా ఉండి ఉంటే బిజెపి మళ్లీ వచ్చినందుకు సంతోషించేవారో, తన ఆప్తమిత్రులు ఆడ్వాణీ, మురళీమనోహర్‌ జోషీలను పక్కకు నెట్టేసినందుకు బాధపడేవారో తెలియదు. ఏది ఏమైనా చురుగ్గా ఉన్నంత కాలం ఆయన పెద్దమనిషిగానే ప్రవర్తించారు. రాజకీయ ప్రత్యర్థుల నుంచి కూడా మన్ననల నందారు.

ఆయన సిద్ధాంతాలతో, రాజకీయాలతో విభేదించవచ్చు, ఆయన పాలనపై విమర్శలు చేయవచ్చు. కానీ ఆయనను మాత్రం వ్యక్తిగతంగా ఏమనడానికి నోరు రాదు. ఆయన సరసుడు, కళాభిజ్ఞుడు, పండితుడు, కవి, గొప్ప వక్త, కలుపుగోరు వ్యక్తి, ఎదుటివాళ్లను గౌరవించి విలువ నిచ్చే వ్యక్తి. 

నెహ్రూ యుగం నుంచి రాజకీయాల్లో నలుగుతూ, పిన్నవయస్సులోనే పెద్దల అభినందనలు అందుకున్న వాజపేయి ఆరెస్సెస్‌ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే సమన్వయవాదిగా పేరు తెచ్చుకున్నాడు. విశ్వనాథ వారిని దేశం పట్టని కవి అన్నారు. అలాగే వాజపేయి జనసంఘ్‌ పార్టీ పట్టనంత ప్రతిభావంతుడు. అప్పట్లో అది చిన్న పార్టీ, చాలా రాష్ట్రాలలో ఉనికి లేని పార్టీ. ఏ కాంగ్రెసులోకో వెళ్లి వుంటే వాజపేయికి ఎన్నో ఉన్నతపదవులు ఎప్పుడో వచ్చేవి. కానీ తన పార్టీనే నమ్ముకున్నాడు.

జనసంఘ్‌, జనతా పార్టీలో విలీనమైంది, విడిగా వచ్చి భారతీయ జనతా పార్టీ అయింది. ఎన్నో ఉత్థానపతనాలు చూసింది. 'అటల్‌' చలించకుండా కడదాకా దానిలోనే ఉన్నాడు. 'రైట్‌ మ్యాన్‌ యిన్‌ రాంగ్‌ పార్టీ' (అపసవ్యమైన పార్టీలో సవ్యమైన వ్యక్తి) అని విశ్లేషకులు, యితర పార్టీ నాయకులు వాపోయినా ఆయన అలా అనలేదు, అనుకోలేదు, పార్టీ కంటె గొప్పవాణ్నని తలచలేదు. ఇలాటి వ్యాఖ్యలను నవ్వేసి తోసిపుచ్చేశాడు. పార్టీతోనే మునిగాడు, తేలాడు.

ఆరెస్సెస్‌, జనసంఘ్‌, బిజెపిల కరడుగట్టిన వాదాలంటే మండిపడేవాళ్లు సైతం వాజపేయిని ఉదారవాదిగా గుర్తిస్తారు, గౌరవిస్తారు. 'ఆయన మాకు ఒక తొడుగు' (మాస్క్‌) అన్నాడు గోవిందాచార్య ఒకసారి. ముఖమల్‌ గ్లవ్స్‌లో యినుప పిడికిలి దాగి ఉన్నట్లు, వాజపేయి నవ్వు ముఖం మరుగున ఆరెస్సెస్‌ ప్రతినిథి ఆడ్వాణీ కాఠిన్యం ఉండేది. వాజపేయి-ఆడ్వాణీ స్నేహం చాలా విచిత్రమైంది. అనేక పోలికలు, అనేక తేడాలు ఉన్నాయి.

జనతా పార్టీ టైములో ఒకసారి చరణ్‌ సింగ్‌తో, మరోసారి మొరార్జీతో చేతులు కలుపుతూ జనసంఘ్‌ను పటిష్టపరుస్తూ వచ్చినది ఆడ్వాణీయే. పార్టీ యిద్దరు ఎంపీలకు కుదించుకు పోయినప్పుడు రథయాత్ర ద్వారా పార్టీలో జీవసత్త్వాలు నింపినది ఆడ్వాణీదే. కానీ బిజెపికి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాగానే ఆడ్వాణీ తను పక్కకు తప్పుకుని వాజపేయికే ఛాన్సిచ్చాడు. ఒకసారి కాదు, మూడు సార్లు! పేరుకు వాజపేయి ప్రధానిగా ఉన్నా చక్రం తిప్పింది ఆడ్వాణీదే. ఆ విషయంలో వాజపేయికి ఫిర్యాదు లేదు. 

వీళ్లిద్దరిలో ఒకరి గురించి రాస్తే మరొకరి గురించి రాసి తీరాల్సిందే. ''అర్ధరథుడు ఆడ్వాణీ'' పేర సీరియల్‌ మొదలుపెట్టి, ఆడ్వాణీ బాల్యం కవర్‌ చేసిన తర్వాత, వాజపేయిది కలిపితేనే పరిపూర్ణంగా ఉంటుందని పించింది వాజపేయి ఆత్మకథ తెలుగులో ఉండాలి. వెతికితే దొరకలేదు. సీరియల్‌ ఆపేశాను. ఇప్పుడు పునర్ముద్రణ వేస్తారేమో, మళ్లీ మొదలు పెట్టాలి.

వాజపేయి హయాంలో ఆడ్వాణీని టఫ్‌మ్యాన్‌గా, కరడు కట్టిన హిందూత్వవాదిగా చూశారు. తర్వాతి రోజుల్లో ఆయన జిన్నా గురించి వున్న మాటే చెప్పినా జీర్ణం చేసుకోలేకపోయారు. మోదీ వచ్చేటప్పటికి ఆడ్వాణీ ఉదారవాదిగా కనిపించడం మొదలుపెట్టాడు. వాజపేయి-ఆడ్వాణీ ద్వయంలో డవ్‌-హాక్‌ కాంబినేషన్‌ చక్కగా అమిరింది. వాళ్లిద్దరూ కలిసి చక్కటి సంకీర్ణ ప్రభుత్వం నడిపారు. తక్కిన భాగస్వాములను మన్నించారు, గౌరవించారు. ప్రస్తుత ఎన్‌డిఏలో మోదీ-అమిత్‌ యిద్దరిగా కనిపించినా ఒక్కరే. మోదీ హాకిష్‌ కావడంతో భాగస్వాములు సణుగుతున్నారు.

నిజానికి ఎన్‌డిఏ ఏర్పడడానికి కారణం వాజపేయి. బిజెపిని కాంగ్రెసేతర పార్టీలన్నీ అంటరానిదానిగానే చూశారు. పొత్తు కలిపినది శివసేన, అకాలీ దళ్‌ వంటి ప్రాంతీయ, మతపరమైన పార్టీలు మాత్రమే. బిజెపికి  అగ్రవర్ణ, హిందూత్వ పార్టీగా ముద్ర ఉండడంతో దానితో పొత్తు కలిపితే బిసిలు, ఎస్సీలు, మైనారిటీలు దూరమై పోతాయని తక్కిన పార్టీల భయం.

1995లో యుపిలో మాయావతి, బిజెపితో కలిసి ప్రభుత్వం 4 నెలలకు మించి సాగలేదు. సొంతంగా ప్రభుత్వం చేసేటంత బలం లేక, కూటమికి ఎవర్నీ ఆకర్షించే శక్తి లేక వాజపేయి ప్రధానిగా 13 రోజుల ప్రభుత్వం నడిపి చతికిల పడిన బిజెపికి రెండేళ్ల తర్వాత వాజపేయి అనే తొడుగే అక్కరకు వచ్చింది. కొన్ని పార్టీలు ఎన్‌డిఏ పతాకం కింద ఒక్కటయ్యాయి. ఆడ్వాణీ పేరు చెపితే వాళ్లు దగ్గరకు వచ్చేవారే కారు. తమ యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలను కాంగ్రెసు కుటిలోపాయాలతో పడగొడుతూ రావడంతో విసిగి, బిజెపి కేంద్రిత ఎన్‌డిఏ ప్రభుత్వంలో చేరడానికి అవి ఒప్పుకున్నాయి. బిజెపిని తమ రాష్ట్రంలో వేలూననివ్వని ద్రవిడ పార్టీలు, తృణమూల్‌ సైతం దానిలో చేరడానికి కారణం వాజపేయి నాయకత్వమే.

దాన్ని 13 నెలలలో మరో సారి కాంగ్రెసు పడగొట్టడంతో దేశప్రజలకు కూడా వాజపేయిపై సానుభూతి పెరిగింది. 1999 ఎన్నికలలో ఐదేళ్ల పాలనాధికారం కట్టబెట్టారు. వాజపేయి హయాంలో ఎన్‌డిఏ పాలన మరీ అంత గొప్పగా సాగలేదు. ఆ విషయం వాజపేయికి తెలుసు. అందుకే ఆడ్వాణీ క్యాంప్‌ 'ఇండియా షైనింగ్‌' (భారత్‌ వెలిగిపోతోంది) నినాదాన్ని ఎన్నికల ప్రచారంలో వాడదామన్నపుడు ఆయన అభ్యంతర పెట్టాడు. కానీ ఆడ్వాణీ మాటే చెల్లింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వ్యూహం దెబ్బ తింది. బిజెపి పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది.

ఆరెస్సెస్‌ది స్వదేశీ నినాదం. అయినా పివి మార్కు ఆర్థిక సంస్కరణలనే వాజపేయి  కొనసాగించారు. వాటివలన కొంత మంచి, ఎక్కువ చెడు జరిగింది. స్వర్ణ చతుర్భుజి వంటి అనేక గొప్ప పథకాలు ఆయన హయాంలోనే తయారయ్యాయి. ఎంతైనా పరిపాలనాదక్షుడని మరీ కితాబులు యివ్వడానికి కుదరదు. ఇస్తే ఐదేళ్లలోనే ప్రజలు తిరస్కరించేందుకు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పవలసి వస్తుంది. 

ఆయన గొప్ప పార్లమెంటేరియన్‌. పార్లమెంటులోను, బయటా ఆయన అరమోడ్పు కనులతో యిచ్చిన ప్రసంగాలు, చదివిన కవితలు పదికాలాల పాటు నిలుస్తాయి. గొప్ప ప్రజాస్వామిక వాది. పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ అధికారాలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకోలేదు. తన పార్టీ వాళ్లనే కాదు, భాగస్వామ్య పక్షాల వారిని కూడా అందరినీ వాళ్ల వాళ్ల తరహాలో పని చేయనిచ్చాడు. ప్రత్యర్థులపై కక్ష సాధించలేదు. మాట తొణకలేదు. అందువలన ఆయన సంకీర్ణం నుంచి బయటకు వెళ్లినవాళ్లు తమ రాజకీయ అవసరాల కోసం వెళ్లారు కానీ ఆయన తమతో సరిగ్గా వ్యవహరించలేదనే ఫిర్యాదుతో వెళ్లలేదు. ఆయన వివాదంలోకి వెళ్లడు. తన మీద తనే జోకులు వేసుకోగలడు.

''నేను అవివాహితుణ్నే కానీ, బ్రహ్మచారిని కాను'' అని చమత్కరించేవాడట. వాజపేయి అనగానే నాకు ఎప్పుడూ ఒక జోకు గుర్తుకు వస్తుంది – జనతా పార్టీ అంత:కలహాలతో కొట్టుమిట్టు లాడుతూ ఉండేది. జనతా పార్టీ ఆవిర్భావానికి, విజయానికి కారకుడైన జయప్రకాశ్‌ నారాయణ్‌ను యిది బాధించేది. ఒకసారి వాజపేయి ఆయనను చూడడానికి వెళితే 'హాల్‌ కైసా హై?' అని అడిగారాయన. విదేశాంగ మంత్రిగా ఉన్న వాజపేయి వెంటనే 'విదేశ్‌ కా హాల్‌ అచ్ఛా హై, స్వదేశ్‌ కా హాల్‌ మత్‌ పూఛియే' అన్నాడు. వాస్తవ పరిస్థితిని ఎంత చమత్కారంగా, ఎంత రమ్యంగా చెప్పాడో చూడండి. 

స్టేట్స్‌మన్‌ అనే వర్ణనకు అర్హుడైన ఉదారవాది, సౌమ్యుడు, పెద్దమనిషి, రసజ్ఞుడు వాజపేయికి యిదే నా నివాళి. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఆగస్టు 2018)
[email protected]