షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ

డిసెంబరు ఆఖరివారంలో యీ కాలమ్‌లో 'షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ' అనే శీర్షిక కింద కేంద్ర హోం మంత్రి షిండేపై ఆయన శాఖలో పనిచేసి, యిటీవల బిజెపిలో చేరిన హోం సెక్రటరీ రాజ్‌…

డిసెంబరు ఆఖరివారంలో యీ కాలమ్‌లో 'షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ' అనే శీర్షిక కింద కేంద్ర హోం మంత్రి షిండేపై ఆయన శాఖలో పనిచేసి, యిటీవల బిజెపిలో చేరిన హోం సెక్రటరీ రాజ్‌ కుమార్‌ సింగ్‌ చేసిన ఆరోపణల గురించి రాయడం జరిగింది. అప్పుడు షిండే నిర్ణయాలు తప్పుల తడకలనీ, చిన్న చిన్న విషయాలలో కూడా జోక్యం చేసుకుంటాడని, ఢిల్లీలో పోలీసు స్టేషన్లలో నియామకాల దగ్గర్నుంచి వేలు పెడతాడని రాజ్‌ కుమార్‌ అన్నాడు. దానిపై షిండేను వివరణ కోరగా 'నిజానికి సింగ్‌ పనితీరు నాకు నచ్చక చాలాసార్లు చివాట్లు పెట్టాను.' అన్నాడు షిండే. ఒక టీవీ ఛానెల్‌ సింగ్‌ను పట్టుకుని షిండే అన్నదానిపై వ్యాఖ్యానించమంటే యిక సింగ్‌ విరుచుకు పడి మరిన్ని ఆరోపణలు చేశాడు. వాటిలో ముఖ్యమైనది – ఐపియల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ స్కాండల్‌లో ముంబాయికి చెందిన ఒక వ్యాపారస్తుడిని పట్టుకున్నారు. అతను దావూద్‌ ఇబ్రహీంకు అనుచరుడని అనుమానం వుంది. ఢిల్లీ పోలీసు అతన్ని విచారించబోతూ వుంటే షిండే అడ్డుకున్నాడు. సింగ్‌ ఆ వ్యాపారస్తుడి పేరు చెప్పలేదు కానీ అదే పార్టీకి చెందిన సుబ్రహ్మణ్యస్వామి అతని పేరు షహీద్‌ ఉస్మాన్‌ బల్వా అనీ, అతను 2 జి స్కామ్‌లో నిందితుడనీ, శరద్‌ పవార్‌కు సన్నిహితుడనీ ట్వీట్‌ చేశాడు. శరద్‌ పవార్‌ ప్రధాని అయితే సంతోషిస్తానని షిండే యీ మధ్యే అన్న విషయం అందరికీ వెంటనే గుర్తుకు వచ్చింది. 

ఢిల్లీ పోలీసు స్టేషన్లలో ఎస్‌ఎచ్‌ఓలు నియామకాలలో షిండే కలగజేసుకునేవాడన్న తన ఆరోపణపై అడగ్గా 'షిండే మహారాష్ట్ర నుండి కొంతమంది నమ్మకస్తులను తెప్పించుకుని తన యింట్లో పెట్టుకుని వారి ద్వారా ఢిల్లీ పోస్టింగుల గురించి ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా పని చేసిన నీరజ్‌ కుమార్‌ ద్వారా మేనేజ్‌ చేశాడు. నీరజే నాకు యీ విషయం చెప్పాడు. షిండేనుండి వచ్చిన సిఫార్సు చీటీలను భద్రపరిచి తనకు చూపించాడు. ఏదైనా గొడవ వస్తే సాక్ష్యంగా పనికి వస్తుందని కూడా అన్నాడు.' అని సింగ్‌ చెప్పాడు. షహీద్‌ విచారణను కూడా ఈ నీరజ్‌ కుమార్‌ ద్వారానే షిండే అడ్డుకున్నాడని కూడా చెప్పాడు. ఇది విన్నాక పాత్రికేయులు నీరజ్‌ కుమార్‌ వెంట పడ్డారు. అతను ఎవరికీ యింటర్వ్యూలు యివ్వలేదు. ఎందుకంటే షిండే చెప్తే మాత్రం నువ్వెలా చేశావ్‌ అని అడుగుతారు కదా! దావూద్‌ ఇబ్రహీంను అరెస్టు చేయడానికి అమెరికన్‌ గూఢచారి ఏజన్సీ ఎఫ్‌బిఐ భారతదేశానికి సహాయం చేయడానికి ఒప్పుకుంది అని షిండే గతంలో ప్రకటన చేశారు. ఇది శుద్ధ అబద్ధం అంటాడు సింగ్‌. ఎఫ్‌బిఐకు ఆ శక్తి కానీ, అధికారంగానీ లేనే లేదంటాడు.

సింగ్‌ ఆరోపణల గురించి అడిగితే షిండే సన్నిహితులు – 'పదవీ విరమణ తర్వాత మళ్లీ పోస్టింగు కావాలని సింగ్‌ అడిగాడు. నిజానికి ఇప్పటిదాకా హోం సెక్రటరీగా పనిచేసిన అందరికీ యిలాటి సౌకర్యం కల్పించారు. అదే ఆశతో రిటైర్‌ అయిన ఆర్నెల్ల దాకా అతను పోలీసు ఎస్కార్ట్‌, సెక్యూరిటీ వుంచుకున్నాడు. డిసెంబరు దాకా ప్రభుత్వ బంగళాలో కూడా వున్నాడు. అయితే అతన్ని మళ్లీ పోస్టింగ్‌ యివ్వలేదు. ఆ అక్కసుతో యితను యిలా మాట్లాడుతున్నాడు. నిర్భయ కేసు సమయంలో యితను ఢిల్లీ పోలీసులు అతి త్వరగా నిందితులను పట్టుకున్నారంటూ కితాబు యిచ్చాడు. ప్రజలందరూ ఢిల్లీ పోలీసులపై కోపం వున్న తరుణంలో అలా మాట్లాడడం తెలివితక్కువ పని. అతన్ని తొలగించాలని ఒత్తిడి వచ్చినా షిండే కాపాడాడు. దానికి యిదా ఫలితం?' అన్నారు. ఆ విషయం ఎలా వున్నా సింగ్‌కు నిజాయితీపరుడిగా చాలా పేరుంది. 1990లో ఆడ్వాణీ రథయాత్రను అడ్డుకోవాలని లాలూ యాదవ్‌ నిశ్చయించినపుడు అప్పట్లో డిస్ట్రిక్టు మాజిస్ట్రేట్‌గా వున్న సింగ్‌నే పంపారు. అతను ధైర్యంగా, చిత్తశుద్ధితో తన కర్తవ్యం నిర్వర్తించాడని గమనించిన ఆడ్వాణీ కొన్నేళ్ల తర్వాత తను కేంద్ర హోం మంత్రి అయినపుడు అతన్ని తన శాఖలోనే జాయింటు సెక్రటరీగా వేసుకున్నాడు! 

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 

[email protected]