మోహన : సొంత కేసుతో ఘాటు సంకేతం

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement సొంత కేసుతో ఘాటు సంకేతం  1976-77లో నేను హైదరాబాదులో అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌కి స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నాను. పట్టణ భూపరిమితి చట్టం అమలులోకి…

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా 

సొంత కేసుతో ఘాటు సంకేతం 

1976-77లో నేను హైదరాబాదులో అర్బన్‌ లాండ్‌ సీలింగ్‌కి స్పెషల్‌ ఆఫీసర్‌గా ఉన్నాను. పట్టణ భూపరిమితి చట్టం అమలులోకి తెచ్చాక ప్రజలందరూ కొద్దికొద్దిగా డిక్లరేషన్స్‌ యివ్వసాగారు. మా నాన్నగారు, వాళ్ల స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలో కొన్న 2 వేల గజాల స్థలం కూడా యీ 'అదనపు' నిర్వచనంలోకి వస్తోందని చెప్పి 'అదనంగా వున్నది మీరు తీసేసుకోండి' అని ప్రభుత్వానికి డిక్లరేషన్‌ యిచ్చారు. ఆ స్థలం యజమానుల్లో నా పేరు కూడా వుంది.

అది నా స్వంత కేసు కదా, నేను చూస్తే బాగుండదని ఆ ఫైలుని వేరే ఆఫీసరుకి అప్పచెప్పాను. ఆయన రికార్డులన్నీ తణిఖీ చేసి 'అసలు ఆ భూమి సర్కారు వాళ్ల భూమండి. దాన్ని వాళ్లు తమదనుకోవడం ఏమిటి? కొంత మేం వుంచుకుంటాం. అదనంగా వున్నది మీరు తీసేసుకోండి అని ప్రభుత్వానికి కోరుతూ డిక్లేర్‌ చేయడమేమిటి?' అన్నాడు విస్తుపోతూ. 'ఇది మీది కానే కాదు, సర్కారు భూమి, మీ డిక్లరేషన్‌ అనవసరం' అని మా అందరి పేరా (స్థలం 'స్వంతదారుల్లో' నా పేరు కూడా వుందిగా) ఉత్తరం రాసి పట్టుకువచ్చాడు!

అంటే న్యాయకోవిదులైన మా నాన్నగారు కొన్నది ప్రభుత్వభూమా? మరి నేనేం చేయాలి?

అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావుగారు ఏం చేసి వున్నారు? 

xxxxxx

శరీరంలో ఆపాదమస్తకం బాగుండాలి. శిరస్సులోనే ప్రధానభాగాలన్నీ వున్నాయి. దిశానిర్దేశం చేసే మెదడు, అనుకున్న చోటుకి సరిగ్గా వెళుతున్నామో లేదో గమనించుకునే కళ్లు – అన్నీ అక్కడే వున్నాయి. అలాగే శరీరభారాన్ని మోయగల పాదాలు కూడా చాలా ముఖ్యం. పాదాలు బలంగా వుంటేనే ముందుకో, వెనక్కో ఎటు కావాలంటే అటు వెళ్లగలం. ప్రభుత్వ/ప్రయివేటు సంస్థకైనా, ప్రభుత్వయంత్రాంగాని కైనా యీ సూత్రం వర్తిస్తుంది. ప్రాథమిక స్థాయిలో, గ్రాస్‌ రూట్స్‌ లెవెల్లో పనిచేసే వారిని దృఢపరిస్తేనే వ్యవస్థ పటిష్టమౌతుంది. 

ఒక గ్రామంలో వున్న పౌరుడికి ప్రభుత్వం అంటే ఆ వూరి మునసబు, కరణం. వాళ్లు ఎలా వున్నారో, ఎలా వ్యవహరించారో దాన్ని బట్టి వాడు ప్రభుత్వం బాగోగులు అంచనా వేస్తాడు. వాళ్లు అసమర్థులైతే, అవినీతిపరులైతే 'ఈ ప్రభుత్వాలన్నీ యింతేరా' అనేస్తాడు. ఒక్క దెబ్బతో రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వంలో యావన్మంది నాయకులూ, అధికారుల మీదా ఓ స్టాంపు కొట్టేసినట్టే ! గ్రామస్థాయిలో అందే సమాచారం మీదనే, నడిచే వ్యవహారం మీదనే దేశ ఆర్థిక వ్యవస్థంతా ఆధారపడుతుంది. ఈ విషయంలో దేవరపాడు కరణంగారు చెప్పిన మాట నాకు ఎప్పటికీ చెవుల్లో మోగుతూనే వుంటుంది. దాని గురించి చెప్పేముందు గ్రామస్థాయిలో జరిగే పనుల గురించి, నా అనుభవాలను రంగరించి చెప్తాను.

మాది ఐయేయస్‌ ఎకాడమీలో 1968 బ్యాచ్‌. ఏడాది ట్రెయినింగ్‌ తర్వాత పదిమందిని ఆంధ్రా క్యాడర్‌కు వేశారు. అందులో నలుగురం తెలుగువాళ్లం, ఉత్తరప్రదేశ్‌ నుండి యిద్దరు, కేరళ, నాగాలాండ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌లనుండి తలా ఒకరు. అందరికీ కలిపి ముందరగా హైదరాబాదులో వేశారు. ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డిగారిని, గవర్నరుగారిని కలిశాం. సెక్రటేరియట్‌లో ఎటాచ్‌మెంట్‌ అని వేరే వేరే డిపార్టుమెంట్లలో తర్ఫీదు యిచ్చారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్లను ఒక్కో జిల్లాకు వేశారు. ఐయేయస్‌కు వెళ్లడానికి ముందు నేను స్టేటుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో బందరు బ్రాంచ్‌లో ఆఫీసరుగా పనిచేసేవాణ్ని. యాదృచ్ఛికంగా ఐయేయస్‌ అయిన తర్వాత మళ్లీ అక్కడే పోస్ట్‌ చేశారు. అక్కడ సి.యస్‌.శాస్త్రిగారు కలెక్టర్‌. జులై 1969 నుండి ఫిబ్రవరి 1971 వరకు అసిస్టెంట్‌ కలక్టర్‌ (అండర్‌ ట్రెయినింగ్‌) హోదాలో అక్కడే వున్నాను.

గ్రామాలలో యిచ్చే తర్ఫీదు తక్కిన రాష్ట్రాలలో ఆర్నెల్లు, మహా అయితే ఏడాది. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఏడాదిన్నర యిస్తారు. గ్రామాధికారులంటే కరణం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, తాసిల్దారు, బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌.. యిలా వుండేవారు. డెవలప్‌మెంట్‌ ప్రాసెస్‌లో అప్పట్లో ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెద్ద పాత్రే వుండేది కాదు. సర్పంచ్‌, కమిటీ ప్రెసిడెంట్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ – వీళ్లే సూత్రధారులు అన్నిటికీ. ఈ పంచాయితీరాజ్‌ వ్యవస్థలో జిల్లా కలక్టరుకు మంచి భూమిక వుండేది. అటు అధికారులకు, యిటు ప్రజలచే ఎన్నుకోబడిన అనధికార వ్యక్తులకు మధ్య మంచి తూకం సాధించి, ఎవరి పాత్ర వాళ్లు పోషించగలిగే అవకాశాన్ని కలిగించింది ఆ వ్యవస్థ. 

నేను పామర్రు అనే ఊళ్లో ఒక నెలరోజులు కరణంగా చేశాను. నాలుగువేల ఎకరాల మాగాణి వున్న వూరది. అక్కడ సంజీవరావు అనే కరణం ఒకాయన ఉండేవారు. అంటే గ్రామస్థాయిలో చేయాల్సిన పనులు ఏమిటి? తరుచుగా జరిగే పనులేమిటి? సామాన్యంగా జరగకపోయేవేమిటి? ఇవన్నీ  కక్షుణ్ణంగా అన్నీ నేర్పించాడు. గ్రామంలో ఎటువంటి వనరులున్నాయి, ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి జరిగింది, ఇంకా ఎంత జరగడానికి ఆవకాశం వుంది, అది జరగలాంటే ఏమి చేయాలి, పేదరికం, వెనకబడినతనం, వాటికి తగ్గించే మార్గాలేమిటి? – వీటిపై విలేజ్‌ ఎకానమీ రిపోర్టు అని  రాయించేవారు. తర్వాతి థలో అదే పామర్రు ఫిర్ఖాలో పది, పన్నెండు ఊర్లు సైకిల్‌పై తిరుగుతూ రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తూ అక్కడి కరణాలు చేసే పనిమీద తనిఖీ చేసేవాణ్ని. దాని తర్వాతి థ తాసిల్దారు. అంటే రెవిన్యూ ఇన్‌స్పెక్టరు చేస్తున్న పనిమీద తనిఖీ. 

ఇలా ఆర్థిక, నిర్వహణాపరమైన వ్యవహారాలు నేర్పుతూనే మరో పక్క న్యాయపరమైన అంశాలలో కూడా తర్ఫీదు యిచ్చేవారు. వెళ్లగానే కొన్ని మెజిస్టీరియల్‌ అధికారాలు యిస్తారు. కేసులు, ముఖ్యంగా క్రిమినల్‌ కేసులు వినడం, తీర్పులివ్వడం. మొదట్లో థర్డ్‌ క్లాస్‌ మేజస్ట్ట్రేటు పవర్స్‌ అని యిస్తారు. కొంతకాలం గడిచాక సెకండ్‌ క్లాస్‌ మేజస్ట్రేట్‌ పవర్స్‌. అదికూడా బాగా చేశామని జిల్లా జడ్జీగారిచేత అనిపించుకుంటే అప్పుడు ఆయన ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రీటు పవర్స్‌కి అర్హుడని సర్టిఫికెట్టు యిస్తారు. ఏదైనా ఒక డివిజన్‌కి సబ్‌ కలక్టర్‌ యిండిపెండెంట్‌ చార్జిగా వెళ్లేలోపున యీ ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రీటు పవర్స్‌ మనకి వచ్చేయాలి. నాకు వచ్చేశాయి.

ఆ తర్వాత ఒక ఆర్నెల్లపాటు స్వతంత్రంగా బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసరుగా వేసారు. బ్లాక్‌ అంటే అన్నీ వున్న ఒక చిన్న ప్రభుత్వంలాటిది. వ్యవసాయం, పశుపోషణం, పాడి, మత్స్యపరిశ్రమ, విద్య, వైద్యం, ప్రాథమిక విద్య, రోడ్లు, భవనాలు, స్కూళ్లు – అన్ని శాఖల వాళ్లూ ఆ బ్లాక్‌ స్థాయిలో వుండేవాళ్లు. అన్ని రకాల పనులు చేయించడానికి ఒకవైపు వనరులు వుండేవి, ఇంకోవైపు ఆ ఆధికారాలు వుండేవి. వీటితోపాటు మనకంటె భిన్నదృక్పథమున్న సమితి ప్రెసిడెంట్‌తో  సర్దుకుపోవడం ఎలా అన్నది కూడా నేర్చుకోవాలి. స్థూలంగా యిదీ గ్రామీణాభివృద్ధి వ్యవస్థ. 

xxxxxxx

వ్యవసాయ పన్ను వసూళ్లు ఆడిట్‌ చేయడానికి జమాబందీ పేరుతో అధికారులు వచ్చి రికార్డులు ఎలా వున్నాయో చెక్‌ చేసేవారు. ఒక్కోప్పుడు ఏదైనా లాండ్‌ రెవెన్యూ కలక్షన్‌ తక్కువ పడి అది రికార్డుల్లో నమోదవుతుందనుకుంటే కొందరు మునసబులు జేబుల్లోంచి తీసి పెట్టేసేవారు, ఊరి పరువు పోతుందని! బకాయిలు ఆలస్యంగా కడితే  వాటిమీద వడ్డీ వసూలు చేయాలి. ఆ వడ్డీ ఎంత వసూలైందో నెంబరు 17 అనే రిజిస్టర్‌లో నోట్‌ చేయాలి. బకాయిలు లేకుండా మునసబు చూసుకునేవారు కాబట్టి, దానిపై వడ్డీ ప్రసక్తి రాదు కాబట్టి ఈ 17 రిజిస్టర్‌ సాధారణంగా ఎవరూ మేన్‌టేన్‌ చేసేవారు కాదు. 

దేవరంపాడు అనే వూళ్లో కరణం, కరణాల యూనియన్‌లో చురుగ్గా వుండేవాడు. జమాబందీకి వచ్చినపుడు అతనికి బుద్ధి చెప్పాలనుకున్నారు ఏలినవారు. అతను చాలా పెర్‌ఫెక్టుగా పనిచేసేవాడు. తప్పెక్కడా దొరకలేదు. వెతికి వెతికి చివరికి నెంబరు 17 రిజిస్టర్‌ మేన్‌టేన్‌ చేయలేదని చెప్పి అతనికి 5 రూ.ల ఫైన్‌ వేశారు. అప్పట్లో రాష్ట్రమంతా కలిపి లాండ్‌ రెవన్యూ 11 కోట్ల రూ.లుండేది. ఇక దానిలో ఒక గ్రామంలో ఎంత వసూలు అయివుండాలి? పైగా బకాయిలే లేని గ్రామాల్లో అదొకటి. బకాయిలపై వడ్డీ వసూళ్ల రిజిస్టర్‌ మేన్‌టేన్‌ చేయలేదని 5 రూపాయల జరిమానాయా !? అప్పట్లో కరణం జీతం 60 రూ.లో, 70 రూ.లో వుండేదని గుర్తు. 

దాంతో ఆ కరణం గారి కడుపు మండిపోయింది. తలగుడ్డ తలకు చుట్టుకుని వంగి నమస్కరించి, చేతులు కట్టుకుని, ''ఏలినవారు సెలవిస్తే రెండు ముక్కలు చెప్తాను…'' అని మొదలుపెట్టి అతి వ్యంగ్యంగా చెప్పాడు – ''అయ్యా, తమరు ఏం చేసినా, ఏం చెప్పినా మేం చెప్పిన కాకుల లెక్క బట్టే కదండీ మీ గణాంకాలన్నీ ఆధారపడేవి ! మేం ఒకవేళ ఊరిలో 69 కాకులున్నాయి అని అంటే పాపం మీరు అన్నే రాసుకుంటారు. కాదండోయ్‌ పొరపాటైంది 669 వున్నాయ్‌ అంటే అన్నే రాసుకుంటారు. అబ్బే మేం లెక్కపెట్టినపుడు మూడువందలే వున్నాయని మీరు నిలదీస్తే,  మిగతావి చుట్టపుచూపుగా పక్కూరికి వెళ్లాయని విన్నవించుకుంటాం. మూడు వందలు కాదు తొమ్మిది వందలున్నాయని మీరు హుంకరించారనుకోండి – ఓ కాకి చచ్చిపోతే పరామర్శకు పక్కూరి కాకులు వచ్చాయని చెప్పి మిమ్మల్ని శాంతింపజేస్తాం. 

''ఏం చెప్పినా, ధర్మమూర్తులు మీరు, వింటారు. అవతల రాచకార్యాలు చక్కబెట్ట వలసినవారు, యిక్కడే కాపురం పెట్టి కాకుల జననమరణ చిఠ్ఠా ఆవర్జాలు రాస్తూ కూర్చోలేరు కదా! ఏ పథకం రచించాలన్నా, ఏ ప్రణాళిక రూపొందించాలన్నా మేమే కదా పునాది ! '' 

ఆక్రోశానికి వెటకారం పూసి చెప్పినా నిజమే చెప్పాడనిపించింది నాకు. అందుకే యిన్నేళ్లయినా గుర్తుండిపోయింది. ప్రాథమిక స్థాయిలో పనిచేసేవారిని విస్మరించి, బలహీనపరచి మనం ఏమీ సాధించలేం. వారిని కలుపుకుని పోవలసినదే! 

xxxxxx

1976లో  కేంద్రప్రభుత్వం  పట్టణ భూపరిమితి చట్టం తెచ్చింది. దాని ప్రకారం హైదరాబాదు పరిధిలో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణం కంటె ఎక్కువగా వున్న స్థలం ఎవరైనా కలిగి వుంటే వాళ్లు వెయ్యి చ.మీ.లు మాత్రం తాము వుంచుకుని అదనంగా వున్నది ప్రభుత్వానికి అప్పగించేయాలి. మామూలుగా ప్రజలందరికీ ఓ ధీమా. ప్రభుత్వంలో అసలు రికార్డులు సరిగ్గా ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్లు మనల్ని ఎలా పట్టుకోగలరు? అంతగా పట్టుకుంటే అప్పుడే చూద్దాంలే, ఎవర్నో పట్టుకుని ఏదో మేనేజ్‌ చేద్దాం అన్న ధైర్యంతో వుంటారు. అందునా యిలా అదనపు భూమి వున్నవారు సంఘంలో పెద్ద స్థాయిలో వున్నవారే! రాజకీయనాయకులు, సినిమా తారలు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు.. వీళ్లు ఎప్పుడు దిగి రావాలి?

అలా కాకుండా తమంతట తామే యిచ్చేస్తే మర్యాదగా వుంటుంది అన్న సంకేతాన్ని ప్రజల్లో పంపడానికి, యీ విషయమై ప్రభుత్వం పట్టుదలతో వుంది అనే సంగతిని తన యంత్రాంగానికి తెలపడానికి ముఖ్యమంత్రి జలగం వెంగళరావుగారు ఆయన వద్దనున్న అదనపు భూమి – ఒక ఎకరం – ప్రభుత్వానికి అప్పగించేశారు. అదీ అందరి కంటె ముందుగా! 

ఆ విధంగా ఉన్నతస్థాయి నుండి ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ సంగతి తెలియగానే ఎంత సంచలనం రేగి వుంటుందో మీరూహించగలరు. ఎవరైనా మినహాయింపులకోసం రావాలంటే ముఖ్యమంత్రిగారే అల్టిమేట్‌. 

ఆయన వద్దకు వచ్చి ''నాకు అర ఎకరం పోయిందండీ,..'' అని మొదలుపెడితే ''నాకు ఎకరం పోయింది.. నన్నేం చేయమంటావ్‌?'' అనవచ్చు. 

xxxxxx

నా విషయంలో మా ఆఫీసరు చెప్పిన తర్వాత నేనూ రికార్డులు తెప్పించి చూశా. అతను చెప్పినది కరక్టే. అది ప్రభుత్వ భూమే. మా నాన్నగారే కాదు, ఎంతో ఉన్నత స్థానాలలో వున్న ఆయన స్నేహితులు కూడా సరిగ్గా చూసుకోలేదు. మోసపోయారు. ఏం చేస్తాం? అలాగే ఆర్డర్‌ యిచ్చాను – ఆ భూమి వాళ్లది కానే కాదని! 

''ఒక పెద్ద లాయరు, జడ్జిగా పనిచేసినాయనకు ఇటువంటి చట్టపరమైన విషయాలు అన్నీ తెలిసే వుంటాయని అనుకుంటాం. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా తెలిసి వుంటుంది. కానీ ఎక్కడో పొరబాటు జరిగి వుంటుంది. ఇది ప్రభుత్వ భూమి అని తేలింది కాబట్టి యీ డిక్లరేషన్‌ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఈ విషయంలో చేసేది యిక ఏమీ లేదు.'' అని. 

మా నాన్నగార్ని ఆయనతో బాటు భూమి పోగొట్టుకున్న వాళ్ల స్నేహితులు ఆటపట్టించారు. ''చూడవయ్యా, మనవాడు అక్కడ వుండడం వలన ఒరిగిన లాభం చూడు. మనం కొన్న భూమి మనది కాదని ఫైల్లో రాయడమే కాదు, కందా భీమశంకరంగారనే ప్రఖ్యాత న్యాయవాది, న్యాయమూర్తి ఆయన సాటి, తోటి మిత్రులు అందరూ కలిసి ముందూ వెనకా చూసుకోకుండా గోతిలో పడ్డారు. ఎవడి చేతిలోనో దారుణంగా దగాపడ్డారు అని చాటి చెప్పాడు.'' అని. మా నాన్నగారు ఏమీ అనలేదు. నవ్వేసి ఊరుకున్నారు. 

ఇలా వేళాకోళం చేశారే కానీ నన్ను అభినందించారు – 'భలేవాడివయ్యా, తండ్రికి తగ్గ కొడుకువి' అని. ముఖ్యంగా కె.ఎస్‌.రావు గారనే మొదటి బ్యాచ్‌ (1948) ఐయేయస్‌ ఆఫీసర్‌ !

నేను ఆ విధంగా కాక వేరే ఏ విధంగానూ చేసి వుండేవాణ్ని కాను. ఉండగలిగేవాణ్ని కాను. కానీ అదేదో పెద్ద ఘనకార్యంలా ప్రజల్లో వ్యాప్తికి వచ్చింది. దానివలన ప్రజలందరికీ ఓ సందేశం ఘాటుగా వెళ్లిపోయింది. 'ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో పని చేస్తోంది. మనం కూడా వాళ్లు చెప్పినట్టు చేయకపోతే ఊరుకోరు' అని. అంతిమంగా మంచి జరిగింది.

అందుకే అంటాను – అత్యున్నతస్థాయిలో వున్న వాడు దిశానిర్దేశం చేయాలి. ప్రాథమికస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయగలిగే శక్తిని యివ్వవలసినది కూడా అత్యున్నత స్థానంలో వున్నవాడే. 

మీ సూచనలు [email protected] కి ఈమెయిల్‌ చేయండి.

excerpted from the forthcoming book Mohana Makarandam
print version distributed by Navodaya, e-version by kinige.com

please click here for audio version