ఈ నెలలోనే శ్రీలంకకు అధ్యక్షుడిగా ఎన్నికైన గోటబయ రాజపక్ష మూడు రోజుల పర్యటనపై భారత్‌కు వచ్చి వెళ్లాడు. చైనాకు వెళ్లకుండా యిక్కడకు రావడం మనను బుజ్జగించే ప్రయత్నమే తప్ప, రాజపక్ష కుటుంబమంతా చైనా పక్షపాతులే. ఆ సంగతి తెలిసి అతను అధికారంలోకి రాకూడదని భారత్ ప్రయత్నించి 2015లో సఫలీకృతమైంది కానీ యీ సారి విఫలమైంది.
భారత్ తనకు వ్యతిరేకమని గోటబయ అన్నగారైన మహీంద రాజపక్ష పలుమార్లు చెప్పాడు. 2010లో అధికారానికి వచ్చినపుడు గత ప్రభుత్వం శ్రీలంకలో ఉన్న భారతీయ దౌత్యాధికారులు యిళ్లు కట్టుకోవడానికి అంటూ మన దేశానికి యిచ్చిన స్థలాన్ని వెనక్కి తీసేసుకుని చైనాకు యిచ్చాడు. అక్కడ చైనా హోటల్, కమ్మర్షియల్ కాంప్లెక్సు కట్టేసింది! 2015లో అతను అధికారంలోకి రాకుండా చేయడానికి భారతదేశపు గూఢచారి విభాగం 'రా' ప్రయత్నించిందని రాజపక్ష ఆరోపణ. దానిని పరిశీలకులు కూడా నమ్ముతారు. ఇలాటి భారత వ్యతిరేకికి యింత పాప్యులారిటీ ఎందుకు?
మహీంద రాజపక్షను తన హయాంలో తన కుటుంబసభ్యులతో పార్టీని, ప్రభుత్వాన్ని నింపేశాడు. చైనాతో కలిసి భారీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. అయితే దశాబ్దాల పాటు శ్రీలంకను వేధించిన ఎల్‌టిటిఇని అతని పాలనలో పూర్తిగా మట్టుపెట్టడం జరిగింది. అది సింహళీయులను మెప్పించి, వాళ్లకు ఆరాధ్యుణ్నిగా చేసింది. ఈ సారి ఎన్నికలలో కూడా ఆ ఓటు బ్యాంకే అతని తమ్ముడు గోటబయను గద్దెకెక్కించింది.
శ్రీలంకలో అధ్యక్షుడు అంటే ప్రతి ఐదేళ్ల కోసారి ఎన్నికయ్యే నియంత! రాజ్యాంగం వాళ్లకు అన్ని అధికారాలు కట్టబెట్టింది. వాటిని ఉపయోగించి గోటబయ తన అన్నగారు మహీందను ప్రధానమంత్రిగా నియమించాడు. అంతేకాదు, తన బంధువులందరినీ పదవుల్లో నియమించేశాడు. ఇలాటి నియంతలను లంక ప్రజలు మళ్లీ ఎందుకు ఎన్నుకున్నారో అర్థం చేసుకోవాలంటే కాస్త నేపథ్యం తెలుసుకోవాలి. 2015 ఫిబ్రవరిలో రాజపక్ష ఓడిపోయి, మైత్రీపాల అధ్యక్షుడై మన దేశానికి వచ్చినపుడు అప్పటిదాకా జరిగిన శ్రీలంక రాజకీయ పరిణామాల గురించి 5 భాగాల వ్యాసం రాశాను. లింకు యిస్తున్నాను. వీలైతే చదవండి.
2015లో జరిగినదేమిటంటే గడ్డిపోచల్లా విడివిడిగా పడి వున్న ప్రతిపక్షాలు వెంటిగా ఏర్పడి మహీంద రాజపక్ష అనే మత్తగజాన్ని బంధించాయి. వారిని అలా సంఘటితం చేసిన వ్యక్తి రాజపక్ష పార్టీకే చెందిన చంద్రికా కుమారతుంగ! రాజపక్ష వేలితో అతని కన్నునే పొడవాలనే ప్రణాళికతో అతని పార్టీలోనే అతనికి కుడిభుజంగా, అతని కాబినెట్లో ఆరోగ్యమంత్రిగా వున్న మైత్రీపాలను దువ్వింది. రాజపక్ష, మైత్రీపాల, అతని వెనుక వున్న చంద్రిక అందరూ ఎస్ఎల్ఎఫ్ పార్టీకి చెందినవారే. రాజపక్ష యిన్నాళ్లూ పార్టీని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. చంద్రిక, మైత్రీపాల కలిసి పార్టీని రెండుగా చీల్చారు. మైత్రీపాలకు మద్దతు పలకమని చంద్రిక తనకు బద్ధశత్రువుగా వున్న యుఎన్‌పి నాయకుడు రణిల్ విక్రమసింఘేను కూడా అర్థించింది. దాంతో ప్రతిపక్షాలన్నీ కలిసి న్యూ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎన్‌డిఎఫ్) ఏర్పరచారు. ఈ కూటమిలో రైటిస్టు భావాలున్న యుఎన్‌పి, మార్క్సిస్ట్ భావాలు కల జెవిపి, బౌద్ధ సన్యాసులు నడిపే జెఎచ్‌యు, రెండు ముస్లిము పార్టీలు, తమిళ నేషనల్ ఎలయన్స్ – లాటి భిన్న దక్పథాలున్న పార్టీలున్నాయి.
ఇంతమంది కలిసినా రాజపక్షపై విన్నింగ్ మార్జిన్ 3.7% మాత్రమే (81.5% పోలింగు జరగగా మైత్రీపాలకు 51.28%కు వచ్చి 12 ఎలక్టొరల్ జిల్లాలలో నెగ్గగా రాగా, రాజపక్షకు 47.58% వచ్చి 10 జిల్లాలలో నెగ్గాడు) అంటే రాజపక్ష ఎంత బలంగా పాతుకుపోయాడో చూడండి. అతని కూటమిలో సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, లంక సమ సమాజ పార్టీ, నేషనల్ ఫ్రీడమ్ ఫ్రంట్, నేషనల్ యూనియన్ ఆఫ్ వర్కర్స్, అప్ కంట్రీ పీపుల్స్ ఫ్రంట్ యిలా అనేకానేక పార్టీలున్నాయి. బోధుబలసేన మద్దతు ఎలాగూ వుంది. మైత్రీపాల 2015 జనవరి 9 న అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన వెనువెంటనే యుఎన్‌పికి చెందిన రణిల్ విక్రమ్‌సింఘేను ప్రధానమంత్రిగా చేశాడు.
మైత్రీపాల, విక్రమసింఘే యిద్దరూ మన మద్దతుదారులే కాబట్టి హమ్మయ్య అనుకుంది భారత్. కానీ ఆ సంకీర్ణ ప్రభుత్వం సరిగ్గా సాగలేదు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికలైన ఏడు నెలలకే 2015 ఆగస్టులో పార్లమెంటు ఎన్నికలు జరిగి విక్రమసింఘే పార్టీకి 106 సీట్లు వచ్చాయి. ఇతర ప్రతిపక్షాలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పరచి రాజ్యం చేయడం మొదలుపెట్టారు. అయితే రాజపక్ష హయాంలో చేసిన అప్పులు తీర్చడం వారికి గగనమై పోయింది. దాంతో చైనా కంపెనీ ఋణంతో తీసుకున్న మగంపురా మహీంద రాజపక్ష పోర్టును నిర్వహించలేక 2017లో ఆ కంపెనీకే 99 ఏళ్ల లీజుకి యిచ్చేశారు.
2017లో ఆ దేశపు ఆర్థిక ప్రగతి రేటు 3.1%. ఇది 16 ఏళ్లలో కనిష్టం. ప్రజలు అసంతృప్తి చెందసాగారు. దానివలన రాజపక్ష పార్టీ 2018 ప్రాంతీయ ఎన్నికలలో ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా దక్షిణ ప్రాంతాల్లో! గ్రామీణ ప్రాంతాల్లో! దిగువ మధ్యతరగతి ఓటర్లలో! ఇది మైత్రీపాలను ప్రభావితం చేసింది. విక్రమసింఘేతో అంటకాగడం కంటె రాజపక్షవైపు ఫిరాయిస్తే మంచిదనుకున్నాడు. అతని ప్రోద్బలంతో 2018 అక్టోబరులో ఓ కుట్ర పన్ని విక్రమసింఘేను ప్రధాని పదవి నుండి తొలగించాడు.
దీనికి అతను చెప్పిన కారణం ఏమిటంటే – సెంట్రల్ బ్యాంక్ బాండ్ అమ్మకాలలో జరిగిన 65 మిలియన్ డాలర్ల స్కాముకి విక్రమసింఘేదే పొరబాటు అన్నాడు. దీనికి తోడు 'రా' సహాయంతో కాబినెట్ మంత్రుల్లో ఒకడు తనను చంపడానికి కుట్ర చేశాడని, కానీ దానిపై విచారణ జరగకుండా విక్రమసింఘే అడ్డుపడ్డాడని కూడా అన్నాడు. ఈ సాకుతో అతన్ని తీసేసి, అక్టోబరు 26న రాజపక్షను ప్రధానిగా నియమించాడు. విక్రమసింఘే అది చట్టవిరుద్ధమని వాదిస్తూ పదవికి రాజీనామా చేయడానికి నిరాకరించాడు. పార్లమెంటు, సుప్రీం కోర్టు అతనికి మద్దతుగా నిలవడంతో యింకేం చేయలేక రాజపక్ష రెండు నెలల తర్వాత వెనక్కి తగ్గాడు. కానీ దీనివలన అధికార పార్టీలోని లుకలుకలు బాహాటంగా అందరికీ తెలిశాయి. దీనితో ప్రభుత్వ నిల్వలు 1 బిలియన్ అమెరికన్ డాలర్ల మేరకు తరిగిపోయాయి. శ్రీలంక రూపాయి విలువ తరిగింది. జపాన్, అమెరికా తామిచ్చే ఎయిడ్‌ను నిలిపివేశాయి.
దీని తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈస్టర్ సందర్భాన బట్టిలోవలోని చర్చిలో ముస్లిము తీవ్రవాదులు బాంబులు పెట్టి సుమారు 300 మందిని చంపివేయడంతో అధికార కూటమి పరువు పోయింది. ఈ దాడి గురించి భారత ప్రభుత్వం ముందస్తుగా సమాచారం అందించినా ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని బయటకు వచ్చింది. ఈ దాడులకు వ్యతిరేకంగా యితర ప్రాంతాల్లో అల్లర్లు జరిగినప్పుడు ప్రభుత్వం వాటిని అదుపు చేయలేకపోయింది. ఉగ్రవాదులతో సంబంధం ఉందంటూ సింహళ తీవ్రవాద సంస్థలు ఆరోపించడంతో 9 మంది మంత్రులు, యిద్దరు గవర్నర్లు రాజీనామాలు చేయవలసి వచ్చింది. ప్రపంచమంతా ముస్లిమ్ఫోబియా వ్యాపిస్తోంది. ఈస్టర్ దాడుల తర్వాత సాధారణ శ్రీలంక పౌరుడు 'ముస్లిములకు బుద్ధి చెప్పే రాజపక్ష వంటి మొండిఘటం ఉండి ఉంటే యిలా జరిగేది కాదని సింహళ ప్రజలు అనుకోవడంతో రాజపక్ష పునరాగమనం సుగమమైంది.
కూటమి పాలనలో కరువు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పన్నుల భారం యివన్నీ ప్రజలను విసిగించాయి. పెద్ద ప్రాజెక్టులను చేపట్టడం, ఫారిన్ యిన్వెస్ట్మెంట్లకై వెంపర్లాడడం పట్ల చూపిన శ్రద్ధ ప్రభుత్వం సాధారణ ప్రజల నిత్యసమస్యలను తీర్చడంలో కనబరచలేదు. పైగా కూటమిలో అంతఃకలహాలు దాని పనితీరును దారుణంగా దెబ్బ తీశాయి. నిజానికి విక్రమసింఘే ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా అధ్యక్షుడి అపరిమత అధికారాలకు కత్తెర వేసింది. (ఇప్పుడు గోటబయ ఆ సవరణకు సవరణ తెస్తున్నాడు) తూర్పు, ఉత్తర ప్రాంతాల్లోని తమిళ ప్రాంతాలలో ఉద్రిక్తతను తగ్గించి, ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చింది. మిలటరీ అధీనంలో ఉన్న ప్రాంతాలను పౌరులకు అప్పగించింది. న్యాయవ్యవస్థ స్వేచ్ఛగా మెలగేట్లా చూసింది. సమాచార హక్కు, మానవహక్కులు వంటివి పునరుద్ధరింప బడ్డాయి. అందుకే అక్కడ ఆ పార్టీకి ఓట్లు బాగా పడ్డాయి. అయితే ముస్లిము తీవ్రవాదుల దుశ్చర్య యీ సంస్కరణలను దారుణంగా దెబ్బ తీసింది.
2016లో రాజపక్ష ఓ పాత పార్టీని స్వాధీనం చేసుకుని దానికి శ్రీలంక పొదుజన పెరమున (పీపుల్స్ ఫ్రంట్ అని అర్థం) అని పేరు పెట్టి తన అనుచరులందరినీ దానిలో చేర్పించాడు. ఇప్పుడు దాని ద్వారానే తన తమ్ముడు గోటబయను అధ్యక్ష అభ్యర్థిగా నిలబెట్టాడు. లెఫ్టినెంట్ కల్నల్ నందసేన గోటబయ రాజపక్ష 70 ఏళ్లవాడు. కాలేజీ చదువు తర్వాత కుటుంబమంతా రాజకీయాల్లో మునిగి తేలుతున్నా తను మాత్రం 1971లో సైన్యంలో చేరాడు. అనేక అంతర్యుద్ధాలలో పాల్గొన్నాడు. సైన్యం నుంచి ముందుగానే 1998లో బయటకు వచ్చేసి, అమెరికాకు వలస వెళ్లి ఐటీ రంగంలో చేరాడు. అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. అన్నగారు మహీంద 2005లో అధ్యక్షుడైనప్పుడు తిరిగి వచ్చాడు. అతను 2015 వరకు పాలించినప్పుడు రక్షణ శాఖామాత్యుడిగా పనిచేశాడు. తమిళ పులులను, వారి నాయకుడు ప్రభాకరన్‌ను సంహరించడంలో ప్రధాన పాత్ర అతనిదే. యుద్ధానంతరం అనేక అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు చేపట్టాడు. అన్నగారి ఓటమితో పదవి వదులుకున్నాడు. ఇప్పుడు తొలిసారిగా ఎన్నికలలో పోటీ చేశాడు.
శ్రీలంకలో సింహళులు, క్రైస్తవులు కలిసి 70% ఉంటారు. రాజపక్ష సోదరులు సింహళ బౌద్ధ జాతీయవాదాన్ని ఎగదోశారు. దానికి తోడు దేశరక్షణ, దేశ ఆర్థికవ్యవస్థను మెరుగుపరచడం వంటి వాగ్దానాలు చేశారు. నవంబరులో ఎన్నికలు జరిగాయి. విక్రమసింఘే తను వెనక్కాల ఉండి, యుఎన్‌పి అభ్యర్థిగా సజిత్ ప్రేమదాసను నిలబెట్టారు. అతనికి గ్లామర్ లేదు. చివరకు ఆ పార్టీకి బలమున్న కొలంబో, కాండీలలో సైతం ఓట్లు పోగొట్టుకున్నాడు. గోటబయకు 52% ఓట్లు రాగా, సజిత్‌కు 42% ఓట్లు వచ్చాయి. సింహళులు అధికంగా ఉండే దక్షిణ, పశ్చిమ, మధ్య ప్రాంతాలలో గోటబయకు మెజారిటీ వచ్చింది. తమిళులు, ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో సజిత్‌కు మెజారిటీ వచ్చింది.
ఈ ఎన్నికలలో కూడా రాజపక్ష తిరిగి రాకుండా ఉండడానికి మన దేశం కృషి చేసి ఉంటుంది. ఎందుకంటే అతను వస్తే చైనా చేతిలోకి శ్రీలంక వెళ్లిపోయి, మన దేశభద్రతకు ప్రమాదం కలుగుతుంది. కానీ మనం సమర్థించినవాళ్లు చేతకానివాళ్లు కావడంతో, వాళ్లలో వాళ్లు కలహించడంతో, మన పథకం విఫలమై రాజపక్షలు అధికారంలోకి వచ్చేశారు. గోటబయ నెగ్గగానే మన విదేశాంగ మంత్రి శ్రీలంకకు వెళ్లి స్నేహహస్తం చాచి, మన దేశానికి ఆహ్వానించారు. ఇక్కడకు వచ్చాక 3 వేల కోట్ల రూ.ల ఆర్థికసాయం ప్రకటించారు. ఇన్నీ తీసుకున్న తర్వాత కూడా వాళ్లు చైనావైపు మొగ్గడం తథ్యం.
తమ నియంతృత్వపు ధోరణి ఏ మాత్రం మారలేదని వాళ్లు బాహాటంగా చూపించుకుంటున్నారు. ప్రస్తుత పార్లమెంటులో వాళ్లకు మెజారిటీ లేదు. దాని పదవీకాలం యింకా 10 నెలలుంది. దాన్ని రద్దు చేసి, గాలి తమకు అనుకూలంగా ఉండగానే సాధ్యమైనంత త్వరలో ఎన్నికలు నిర్వహించాలని రాజపక్షల వ్యూహం. మామూలుగా అయితే ఆర్నెల్ల ముందుగా అంటే 2020 మార్చికి రద్దు చేయవచ్చు. ఇంకా అంతకంటె ముందుగానే రద్దు చేయడానికి, విక్రమసింఘే కుదించిన అధికారాలను మళ్లీ తెచ్చేసుకుందామని, తన చిత్తం వచ్చినట్లు పాలించాలని గోటబయ చూస్తున్నాడు. దానికి పార్లమెంటు అడ్డుపడకుండా డిసెంబరు 3న దాని సమావేశాన్ని జనవరి దాకా వాయిదా వేశాడు. ముందుముందు యింకా ఎన్ని చిత్రాలు జరుగుతాయో చూడాలి. ఏం జరిగినా మన దేశానికి మేలు చేసేవి కావని మాత్రం గ్రహించవచ్చు.
ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2019)
[email protected]