సద్దాం హుస్సేన్ పాలించే రోజుల్లో అతని బాత్ పార్టీ సభ్యులు, సహాయకులుగా వున్న అధికారులు, సైనికాధికారులు అతని పతనం తర్వాత దిక్కు తోచకుండా అయిపోయారు. వారిలో కొందరు కొత్త ప్రభుత్వంలోని నాయకులకు లంచాలు మేపి, శిక్ష పడకుండా చూసుకున్నారు. వాళ్లని స్థానికంగా ఆలీబాబాలు అంటారు. వీళ్లు బాగ్దాద్‌లోని పాత బస్తీలలో చిన్న చిన్న దుకాణాలు నడుపుకుంటూ, బాత్ పార్టీకి మంచి రోజులు రావాలని కోరుకుంటూ గడుపుతూ వుంటారు. సద్దాం చేతిలో హింసకు గురైన షియాలు, కుర్దు జాతీయులు యీ ఆలీబాబాలపై పగబట్టి వున్నారు. దొరికితే వాళ్లను నాశనం చేయాలని చూస్తూ వుంటారు. 2003 యుద్ధం తర్వాత సద్దాం సైన్యం దిక్కు తోచకుండా పోతుందని, అంతర్ధానం అయిపోతుందని అమెరికా అంచనా వేసింది. కానీ వాళ్లు నియమించిన ప్రభుత్వాలు పక్షపాత ధోరణిలో వ్యవహరించి సున్నీ ముస్లిములను కాక సాధారణ ప్రజలనూ దూరం చేసుకున్నాయి. 8 ఏళ్లగా పాలిస్తున్న ప్రధాని నౌరీ మాలికి తన కాబినెట్‌ను విధేయులతో నింపివేశాడు. సామర్థ్యం వుందా లేదా అని చూడలేదు. ఆర్మీ చీఫ్‌లను పార్లమెంటుతో సంప్రదించి మరీ నియమించాలని రాజ్యాంగం చెపుతోంది. మాలికి అదేమీ పట్టించుకోకుండా తన కిష్టం వచ్చినవాళ్లను నియమించాడు. ఈ నియంతృత్వ పోకడలతో, అవినీతికరమైన, అసమర్థ పాలనతో అంతర్యుద్ధం వచ్చేట్లా చేశాడు. ప్రభుత్వం బలహీనపడడంతో ఇరాక్‌లోని వివిధ జాతులు తమలో తాము కలహించుకుంటున్నాయి.
వారిలో అందరికంటె బలంగా వున్నది ఆలీబాబాలు, బాత్ పార్టీ అభిమానులు. 'సద్దాం బతికి వున్నపుడు అంతా పద్ధతిగా, శాంతిగా వుండేది కదా, అతని మరణంతోనే యిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి' అని తటస్థులు కూడా అనుకోవడంతో వారి బలం పెరుగుతోంది. ఇప్పుడు యీ ఆలీబాబాలకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అగ్నికి వాయువులా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ఉత్తర, పశ్చిమప్రాంతాలలో కల్లోలం సృష్టించారు. మోసుల్, దియాలా, రూఠా గెలిచిన తర్వాత సింజార్ పర్వతాల్లో 40 వేలమంది మైనారిటీలను చుట్టుముట్టారు. అంతేకాదు టైగ్రిస్ నదిపై వున్న అతి పెద్ద డ్యామ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తలచుకుంటే దాన్ని పగలకొట్టి బాగ్దాద్‌ను ముంచెత్తగలరు. ఇరాక్‌లో పోరు సలుపుతున్న యిరు వర్గాలకు పొరుగున వున్న దేశాలు సహాయపడుతున్నాయి. సిరియా బాత్ పార్టీకి సమర్థన తెలిపింది. జోర్డాన్ జులై 23, 24 తేదీల్లో బాత్ పార్టీ కార్యకర్తలకు, సున్నీ గిరిజన నాయకులకు మధ్య ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో మాలికి ప్రభుత్వాన్ని కూలదోయమని ప్రపంచ దేశాలకు పిలుపు నిచ్చారు. ఈ ప్రకటనను ఇరాన్, ఇరాక్ ప్రభుత్వాలు ఖండించాయి. ఇస్లామిక్ స్టేట్ దౌర్జన్యాలు తెలిసినవారు ఆలీబాబాలకు వాళ్లకు మధ్య బాంధవ్యం ఎంత త్వరగా చెడిపోతే అంత మంచిదనుకుంటున్నారు. వారితో కంటె కుర్దులతో, సున్నీ, షియా తీవ్రవాదులతో ఆలీబాబాలు చర్చలు జరిపి రాజీ పడడం మంచిదని వారి అభిప్రాయం.
-ఎమ్బీయస్ ప్రసాద్