రాజధానిగా విశాఖ అనుకూతలు, ప్రతికూలతలు

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడి మూడు నెలలు పూర్తవుతోంది. అయినా, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. ఎక్కడ రాజధాని నిర్మితమవుతుందనే విషయమే ఎవరికీ అర్థం కావడంలేదు. రాయలసీమలో రాజధాని వుండాలనే వాదన ఒకటి.. విజయవాడ…

13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం ఏర్పడి మూడు నెలలు పూర్తవుతోంది. అయినా, ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. ఎక్కడ రాజధాని నిర్మితమవుతుందనే విషయమే ఎవరికీ అర్థం కావడంలేదు. రాయలసీమలో రాజధాని వుండాలనే వాదన ఒకటి.. విజయవాడ  గుంటూరు మధ్యనే రాజధాని ఇంకో వాదన.. అవేవీ కాదు ప్రకాశం జిల్లా దోనకొండ అని మరో ప్రతిపాదన.. ఇవన్నీ కావు, ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో హైద్రాబాద్‌తో సమానంగా కాకపోయినా, ఆ స్థాయిలో అభివృద్ధి చెందిన నగరం విశాఖ అయితే కొంత మేలు.. అనే వాదన కూడా వుందిపడు. కానీ, రాజకీయ నిర్ణయాలే కదా, రాజధానిని నిర్ణయించేది. అందుకనే రాజధాని ఎక్కడన్నదానిపై ఇంకా ఓ స్పష్టత రావడంలేదు. స్పస్టత వచ్చే అవకాశమూ భవిష్యత్తులో కన్పించడంలేదేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

రాజధానిగా విశాఖకు వున్న ప్రతికూలతలేమిటి.?

ఇంతకీ, హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయిలో విశాఖపట్నం అభివృద్ధి చెందింది.. అన్న వాదనలో నిజమెంత.? అన్న విషయానికి వస్తే.. ఎంతో కొంత ఆ మాటలో వాస్తవం వుంది కూడా. రాజధానికి విశాఖలో సానుకూలతలు ఏక్కువే వున్నా, ప్రతికూలతలూ లేకపోలేదు. ప్రతికూలతల విషయానికొస్తే, రాయలసీమకు చాలా దూరంలో వుంది విశాఖ. అందుకే విశాఖలో రాజధాని ఏర్పాటును రాయలసీమ ప్రాంతంలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్కడి బలమైన సమాజిక వర్గం ఒకటి విశాఖ రాజధాని ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాయలసీమతోపాటు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచీ విశాఖలో రాజధాని పట్ల వ్యతిరేకత వస్తోంది. ఈ వ్యతిరేకతలో సామాజిక వర్గ సమీకరణాలూ కీలక పాత్ర పోషిస్తున్నాయన్న వాదన లేకపోలేదు. రాజధానిగా విశాఖ.. అన్న వాదనను ఇదే అన్నిటికన్నా పెద్ద ప్రతికూలత.

అనుకూలతల విషయానికొస్తే…

విశాఖపట్నం అభివృద్ధి చెందిన నగరం. రైలు, రోడ్డు, జల రవాణా విషయంలో 13 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ జిల్లాకీ లేని ప్రత్యేకతలు విశాఖకు వున్నాయి. జిల్లా కేంద్రమైన విశాఖ నగరం పరిధి చాలా ఎక్కువ. మూడు జిల్లాల్ని కవర్ చేసేలా విశాఖ మహానగర పాలక సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు దాదాపుగా విశాఖ నగరంలో కలగలిసిపోయాయా.? అనేంతలా అభివృద్ధి విస్తరిస్తోంది గత కొంతకాలంగా. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలే కాకుండా, విశాఖ జిల్లాతో తూర్పుగోదావరి జిల్లాలోనివారికీ ప్రత్యేకమైన అనుబంధం వుంది. అందుకే శివరామకృష్ణన్ కమిటీ కూడా విశాఖ జోన్‌లోకి ఈ నాలుగు జిల్లాల్నీ చేర్చింది. కాస్త దృష్టిపెడితే రెండు మూడేళ్లలోనే హైద్రాబాద్‌ని తలదన్నేలా విశాఖ మహానగరం రూపు రేఖలు మారిపోయే అవకాశం వుంది. కొత్త రాజధానికి అవసరమయ్యే ఖర్చులో సగం ఖర్చు చేస్తే, దేశంలోనే అత్యున్నత నగరంగా విశాఖను తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నది నిపుణుల అభిప్రాయం.

విశాఖ భిన్న సంస్కృతుతులకు నెలవు

వాస్తవానికి హైద్రాబాద్‌తో సమానంగా విశాఖ భిన్న సంస్కృతుతులకు నెలవు. స్టీల్ ప్లాంట్, షిప్‌యార్డ్ కారణంగా.. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు విశాఖలో దశాబ్దాలుగా స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంతో విశాఖ భిన్న సంస్కృతులకు నిలయంగా విలసిల్లుతోందనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్‌లోని మిగతా ప్రాంతాలతో పోల్చితే ఉత్తరాంధ్రలో ఓ విభిన్నమైన సంస్కృతి కన్పిస్తుంటుంది. అక్కడివారిలో కలుపుగోలుతనం కాస్తంత ఎక్కువే. అదే సమయంలో బేషజాలు చాలా తక్కువ. పాశ్చాత్య పోకడల ప్రభావం హైద్రాబాద్ మీద ఎలా వుందో, ఆ స్థాయిలోనే విశాఖపైనా ఆ ట్రెండ్ ప్రభావం చూపుతోంది. అయితే, కుల సమీకరణాల గొడవ విశాఖ జిల్లాలోనే కాదు, ఉత్తరాంధ్రలోనూ ఎక్కడా కన్పించదు. రాజధాని విషయంలో ఇది అత్యంత కీలకమైన అంశమని ఆయా రాజకీయ పార్టీలూ అంగీకరించాల్సిందే. ఆ మాటకొస్తే, రాజధాని విషయమై ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడ్తున్నారు.

కంప్లీట్ కనెక్టివిటీ..

రోడ్డు, రైలు మార్గాలు, విమానయానం.. నౌకాయానం.. ఇలా అన్నిటికీ విశాఖ అత్యంత అనుకూలమైన ప్రాంతం. హైద్రాబాద్ తర్వాత ఆ స్థాయి విమానాశ్రయం ఉమ్మడి తెలుగు రాష్ర్టంలో విశాఖపట్నం మాత్రమే. ప్రత్యేక రైల్వే జోన్ రావాలన్న డిమాండ్ విశాఖలో ఎప్పటినుంచో వుంది. దాన్ని పరిశీలిస్తామని కేంద్రం విభజన చట్టంలో పేర్కొంది కూడా. విశాఖ నగరంలోకి వున్న లైన్‌తోపాటు, విశాఖ నగరంతో సంబంధం లేకుండా వెళ్ళే మరో రైల్వే లైన్ కూడా విశాఖకు రవాణా పరంగా ఎంతో ప్రత్యేకతను కలిగిస్తుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మొత్తం ఎక్స్‌ప్రెస్ హైవే వుంది. అసలు ఈ హైవే మొదట అభివృద్ధి చెందింది విశాఖ జిల్లాలోనే కావడం విశేషం. కోల్‌కతా  చెన్నయ్ ప్రధాన రహదారికి మధ్యలో విశాఖ వుంది. విశాఖ పోర్ట్‌లోకి ఇంపోర్ట్ అయ్యేవన్నీ విశాఖ నుంచి రోడ్డు మార్గంలోనో, రైలు మార్గంలోనో వివిధ ప్రాంతాలకు తరలివెళ్తుంటాయి. విశాఖలో విమానాశ్రయం వున్నా, అది నేవీ పర్యవేక్షణలో వుంది. అదొక్కటీ చిన్న ప్రతికూలత. అయితే గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే నిర్మించాలనే ఆలోచన కేంద్రం చేస్తుండడంతో ఆ లోటు కూడా విశాఖకు లేనట్టే.

అత్యద్భుతమైన పర్యాటక ప్రాంతం

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలన్నీ పర్యాటకం మీదనే ఎక్కువ ఫోకస్ పెడ్తున్న దరిమిలా.. విశాఖ పర్యాటకుల పాలిట స్వర్గధామం అన్న విషయాన్ని విస్మరించకూడదు. పొడవైన సముద్ర తీరం దాంతోపాటుగా అత్యద్భుతమైన అరకు ప్రాంతం.. అత్యంత అరుదైన ఎర్రమట్టి దిబ్బలు.. ఇంకా చాలా చాలానే వున్నాయి. ఇవన్నీ ఎపడో విశాఖను పర్యాటక రాజధానిగా మార్చేశాయి. సినీ పరిశ్రమకు అత్యంత అనువైన ప్రాంతంగా విశాఖ చాలాకాలం క్రితమే వార్తలోె్లకక్కిన దరిమిలా.. పాలకులే ఆ దిశగా సినీ పరిశ్రమను ప్రోత్సహించాల్సి వుందిప్పుడు.

ఇలా చెపకుంటూ పోతే సవాలక్ష అనుకూలతు విశాఖకు వున్నాయి రాజధాని విషయమై. ప్రతికూలతలు అనేవి ఎక్కడైనా వుంటాయి గనుక, అవి తక్కువగా వుండేలా.. అనుకూలతలు ఎక్కువగా వుండేలా పాలకుల ఆలోచనలు సాగితే, విశాఖకు రాజధాని గౌరవం దక్కుతుంది. తద్వారా కొత్త రాష్ట్రానికి ఆర్థిక భారమూ తగ్గుతుంది. కానీ, ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. ఎలాగూ బహుళ రాజధాని అన్న వాదన తెరపైకి వస్తోంది గనుక, వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు రాజధాని భాగం కల్గించి, అలాగే రాయలసీమకూ ఆ తరహా బహుమతిని ఇవ్వగలిగితే.. సీమాంధ్ర స్వర్ణాంధ్రగా మారడానికి మార్గం సుగమమవుతుంది. పాలకుల ఆలోచనలు ఆ దిశగా పరుగులు పెట్టాలని ఆశిద్దాం.

 సింధు