ఎమ్బీయస్‌: ఐసిస్‌ మహిళా కార్యకర్త

యాస్మిన్‌ మొహమ్మద్‌ జాహీద్‌ అనే 29 ఏళ్ల యువతి ఐసిస్‌తో సంబంధం వున్నందుకు చార్జిషీటు చేయబడుతున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర కెక్కబోతోంది. గత ఏడాది మే ప్రాంతంలో కేరళలోని కాసరగోడ్‌, పాలక్కాడు జిల్లాల…

యాస్మిన్‌ మొహమ్మద్‌ జాహీద్‌ అనే 29 ఏళ్ల యువతి ఐసిస్‌తో సంబంధం వున్నందుకు చార్జిషీటు చేయబడుతున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర కెక్కబోతోంది. గత ఏడాది మే ప్రాంతంలో కేరళలోని కాసరగోడ్‌, పాలక్కాడు జిల్లాల నుంచి కొన్ని కుటుంబాలకు చెందిన 22 మంది ముస్లిములు మాయమై పోయారు. వారిలో ఒకరైన అబ్దుల్‌ రషీద్‌ రెండవ భార్య యీమె. బిహార్‌కు చెందిన యీమె కాసరగోడ్‌లో జరిగిన పీస్‌ ఇంటర్నేషనల్‌ స్కూలులో ఇంగ్లీషు టీచరుగా పని చేసే రోజుల్లో రషీద్‌ను కలిసింది. అతనా స్కూలులో సైన్సు టీచరుగా పనిచేస్తూ పిఆర్‌ఓగా  కూడా వుండేవాడు. అప్పుడు మాయమైన వారిలో 13గ్గురు మగవాళ్లు, ఆరుగురు ఆడవాళ్లు, ముగ్గురు పిల్లలు వున్నారు. ఈమె కూడా వాళ్లతో పాటు వెళ్లాల్సిందే. కానీ ట్రావెల్‌ డాక్యుమెంట్సు తయారు కాకపోవడంతో వెళ్లలేకపోయింది. జులైలో రషీద్‌ యీమెను అఫ్గనిస్తాన్‌కు రప్పించుకోవడానికి ఏర్పాట్లు చేశాడు. న్యూఢిల్లీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో కాబూలుకు విమానం ఎక్కబోతూ వుండగా కేరళ పోలీసు యీమెను అరెస్టు చేసి విచారణ జరిపింది. ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ) కూడా రంగంలోకి దిగి చాలా విషయాలు కూపీ లాగింది. దాంతో చాలా విషయాలు బయటపడ్డాయి. 

వీళ్లందరినీ ఐసిస్‌కు చెందిన లెవాంత్‌ విలాయాహ్‌ ఖోరసాన్‌ అనే విభాగంలో చేర్చి వారిని దేశం బయటకు తరలించిన సూత్రధారి రషీదే అని యాస్మిన్‌ ధృవీకరించింది. అతను తన మతస్తులను ప్రవచనాల పేర పోగు చేసి ఎలా బ్రెయిన్‌వాష్‌ చేస్తున్నాడో, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఎలా తర్ఫీదు యిస్తున్నాడో, వారిని జిహాదీలుగా ఎలా మారుస్తున్నాడో వివరంగా చెప్పింది. మాయమైన కుటుంబాలన్నీ బెంగుళూరు, హైదరాబాదు, ముంబయి ఎయిర్‌పోర్టుల ద్వారా కువాయిత్‌, దుబాయి, మస్కట్‌, అబు ధాబీలు చేరాయట. అక్కణ్నుంచి ఇరాన్‌ ద్వారా జులై మొదటివారంలో అఫ్గనిస్తాన్‌లోని ఐసిస్‌ ఆధిపత్యం వున్న ప్రాంతానికి చేరాయట. వీరిలో కొందరు కేరళలోని తమ కుటుంబసభ్యులతో మాట్లాడారట. వాళ్లు వెనక్కి వచ్చేయమని అడిగితే 'ఇక్కడ శాంతంగా, పరిశుద్ధమైన ముస్లిము జీవనం సాగిస్తున్నాం, వెనక్కి రాము. అలా అని సిరియా వెళ్లం కూడా.' అని చెప్పారట. 

ఈమె బిహార్‌లోని సీతామఢి జిల్లాలోని మురావుల్‌ గ్రామానికి చెందినది. ఢిల్లీలో చదువుకుంది. ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రవీణురాలు. కంప్యూటర్‌ నిపుణురాలు కూడా. ఈమెకు తన కజిన్‌, పొరుగున వున్న హుమయూన్‌పూర్‌ గ్రామవాసి అయిన సయీద్‌ అహ్మద్‌ హుస్సేన్‌తో పెళ్లయింది. కానీ ఏడాది తర్వాత విడాకులు తీసుకున్నారు. ఐదేళ్ల కొడుకు వున్నాడు. ఆమె తండ్రి జహీద్‌, యిద్దరు సోదరులు ఇమ్రాన్‌, కాసిల్‌ సౌదీ అరేబియాలో టైలర్లుగా పనిచేస్తున్నారు. వాళ్లను చూడడానికి అప్పుడప్పుడు సౌదీ వెళ్లి వస్తూ వుంటుంది. సొంత గ్రామంలో ఆమెకు 25 గదుల యిల్లు వుంది కానీ అక్కడ ఎవరూ వుండటం లేదు. ఈమె ఢిల్లీ, ఆలీగఢ్‌, హైదరాబాదులో (ఉగ్రవాదులకు హైదరాబాద్‌ టచ్‌ లేకపోతే ఎలా?) వుంటూ వచ్చింది. గత మేలో సొంత వూరికి వెళ్లి కొడుక్కి పాస్‌పోర్టు తయారు చేయించుకుంది. ఇటీవలి కాలంలో ఆమెకు మతంపై వ్యామోహం పెరిగింది. కేరళకు వెళ్లి పీస్‌ ఇంటర్నేషనల్‌లో చేరింది. అక్కడే రషీద్‌తో పరిచయం ఏర్పడింది. మే నెలలో అతన్ని ఫోన్‌ ద్వారా నిఖా చేసుకుంది. ఇద్దరు ఐయస్‌ ఆపరేటర్లలో ఒకరు ఆమె సంరక్షకుడిగా, మరొకరు సాక్షిగా వ్యవహరించారు.  

రషీద్‌, అతని మొదటి భార్య ఆయీషాలకు బ్రిటన్‌లోని ఒక జంట చాలా సహాయపడుతోంది. వాళ్లు కొత్తగా ఇస్లాంలోకి మారారు. ఐసిస్‌ ప్రచారాన్ని వాళ్లు టెలిగ్రాం అనే మెసేజింగ్‌ యాప్‌ ద్వారా నిర్వహిస్తున్నారు. రషీద్‌ ఆ యాప్‌ ద్వారానే యాస్మిన్‌కు ఐసిస్‌ తాలూకు వీడియోలు, మెసేజిలు పంపుతున్నాడు. యాస్మిన్‌తో పెళ్లయ్యాక ఆయీషా ఎటిఎం కార్డు ఆమెకు పంపి ఆ ఖాతా ద్వారా రూ. 5 లక్షలు చేరేట్లు చూశాడు. ఆ డబ్బుతో యాస్మిన్‌ విమానం టిక్కెట్లు, 620 డాలర్లు కొంది, వీసా ఖర్చులు చెల్లించింది. ఆఖరి నిమిషంలో పట్టుబడింది. 22 మంది పారిపోవడానికి సహకరించింది కాబట్టి యిప్పుడు ఐసిస్‌ సంబంధిత కేసులు రెండిటి విషయంలో ఆమెపై కేసు మోపి విచారించడానికి ఎన్‌ఐఏ కేంద్ర హోం శాఖ అనుమతి కోరింది. అది రావడంతో జనవరి చివరి వారంలో కేరళలోని కోచిలో యాస్మిన్‌పై, రషీద్‌పై ఐపిసి 120బి, 125 సెక్షన్ల కింద యుఏపిఏ 38,39, 40 సెక్షన్ల కింద కేసు పెట్టింది. ఆమె యిప్పటికే 180 రోజులు జుడిషియల్‌ కస్టడీలో వుంది కాబట్టి యీ కేసు వేయకపోతే బెయిలుపై బయటకు వచ్చేసేది. ఇంకా కొంత సమాచారం సేకరించాక ఎన్‌ఐఏ సప్లిమెంటరీ చార్జిషీటు వేస్తామంది. అష్ఫాఖ్‌ మజీద్‌, అతని భార్యను ఐసిస్‌లో చేరడానికి ప్రోత్సహించిన అర్షీద్‌ ఖురేషీపై కూడా కేసు పెట్టడానికి అనుమతి కోరింది. ఈ అర్షీద్‌, జకీర్‌ నాయక్‌కు చెందిన ఇస్లామిక్‌ రిసెర్చి ఫౌండేషన్‌లో ఉద్యోగి. ఇప్పటికే ఆ ఫౌండేషన్‌ పేరు చాలా మంది ఐఎస్‌ ఆపరేటివ్స్‌ నోట వినబడింది. దానికి విదేశీ నిధులు రాకుండా హోం మంత్రిత్వశాఖ నిషేధించింది.

యాస్మిన్‌ వంటి చదువుకున్న యువతి యింత ప్రమాదకరమైన మహిళలకు వ్యతిరేకంగా వుండే ఐసిస్‌ సానుభూతిపరురాలిగా మారడం వింత గొలిపితే అంత కంటె వింతగా తోచేది, అనేక మంది పాశ్చాత్య మహిళలు కూడా జిహాదిస్టులుగా మారడం! కేరన్‌ ఐషా హేమిడాన్‌ అనే యువతి ఫిలిప్పీన్స్‌లో నివసిస్తూ అనేక మంది భారతీయ యువతను ఐసిస్‌ సానుభూతిపరులుగా మారుస్తోంది. వారిని ఐసిస్‌ పోరాడే ప్రాంతాలకు పంపిస్తోంది. కితం ఏడాది జయపూర్‌లో పట్టుబడిన మొహమ్మద్‌ సిరాజుద్దీన్‌ అనే ఐయస్‌ ఆపరేటర్‌ కేరన్‌ ఒక వాట్సప్‌ గ్రూపు నడుపుతోందని, ఆమె విదేశాల్లో వారిని కూడా మారుస్తోందనీ చెప్పాడు. అమెరికాలోని కెంటుకీలో 55 ఏళ్ల మేరీ కాస్టెల్లీ అనే మహిళ సోషల్‌ మీడియా ద్వారా ఐసిస్‌ అనుకూల ప్రచారం చేస్తోందని గమనించి  ఆమెను సెప్టెంబరు నెలలో అరెస్టు చేశారు. ఇంచుమించు అదే సమయంలో ఫ్రెంచ్‌ పోలీసు పారిస్‌లోని లయాన్‌ రైల్వే స్టేషన్‌ పేల్చడానికి కుట్ర పన్నిన నలుగురు పాశ్చాత్య మహిళలను అరెస్టు చేశారు. అబూ ముహమ్మద్‌ అల్‌ అద్నానీ అనే ఐసిస్‌ లీడరును చంపినందుకు ప్రతీకారంగా వాళ్లు యీ దాడిని ప్లాన్‌ చేశారు. వారిలో ఐనెస్‌ మదానీ అనే 19 ఏళ్ల అమ్మాయి కూడా వుంది. ఇలా మహిళలను రాడికలైజ్‌ చేయడం లష్కరే తొయిబా విషయంలో జరగలేదు. ఇప్పుడు ఐసిస్‌ విషయంలో జరుగుతోంది. అదీ ప్రమాదం. 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2017)

[email protected]