ఏ హీరోకీ, ఆ మాటకొస్తే ఇంకెవరికీ రాకూడని కష్టమొచ్చింది తమిళ హీరో ధనుష్‌కి. వెండితెరపై విలక్షణ కథల్ని ఎంచుకునే ధనుష్‌కే ఇలాంటి విలక్షణమైన కష్టం ఎందుకు వచ్చిందట.? ఏమోగానీ, ఈ కష్టం నుంచి గట్టెక్కడం మనోడికి అంత వీజీ కాదేమో అన్పిస్తోంది. నిజమే మరి, ప్రస్తుతానికి వ్యవహారం 'పుట్టుమచ్చలదాకా' వచ్చింది.
కదిరీశన్ అనే వ్యక్తి, ధనుష్ తన కుమారుడేనంటూ భార్యతో కలిసి కోర్టును ఆశ్రయించడంతో వివాదం తెరపైకొచ్చింది. ధనుష్ తమ బిడ్డే అనడానికి తగిన ఆధారాల్ని కదిరీశన్ దంపతులు కోర్టుకి అందజేశారు. అదే సమయంలో, ధనుష్ తండ్రి కస్తూరి రాజా కూడా, ధనుష్ తన బిడ్డే అని వాదిస్తూ, కొన్ని సాక్ష్యాల్ని ఇప్పటికే న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళారు. అయినాసరే, పుట్టుమచ్చల సాక్షిగా ధనుష్ తమ బిడ్డేనన్నది కదిరీశన్ దంపతుల వాదన. దాంతో, న్యాయస్థానం 'పుట్టుమచ్చల పరిశీలన' కోసం ధనుష్ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు జారీ చేసింది. చేసేది లేక, ధనుష్ న్యాయస్థానం యెదుట హాజరయ్యాడు.
ఇంతకీ, ధనుష్ పుట్టుమచ్చల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చిందా.? అసలాయన కస్తూరి రాజా తనయుడా.? లేదంటే కదిరీశన్ తనయుడా.? తమిళ సినీ పరిశ్రమలో అందర్నీ ఉత్కంఠకు గురిచేస్తోందిప్పుడు ఈ అంశం. సినీ రంగంలో అతి తక్కువ కాలంలోనే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు ధనుష్. బాలీవుడ్‌లోనూ నటించేశాడు. అన్నట్టు, ధనుష్ – సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
మామూలుగా అయితే ఇది చాలా చిన్న కేసు. కస్తూరి రాజా, తన వద్దనున్న ఆధారాలతో ఈ కేసుని ఎప్పుడో క్లోజ్ చేయించేయొచ్చు. కానీ, కేసు ఇన్నాళ్ళు నలుగుతోందంటే.. ఎక్కడో వ్యవహారం తేడాగా అన్పిస్తోంది కదూ.! ఆ తేడా ఏంటన్నది న్యాయస్థానమే తేల్చాలి. ప్రస్తుతానికి పుట్టుమచ్చలు.. ఆ తర్వాత డీఎన్‌ఏ టెస్ట్ వరకూ వెళుతుందేమో వేచి చూడాల్సిందే.