తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్లినపుడు జగన్ డిక్లరేషన్ పుస్తకంలో సంతకం పెడతాడా, లేదా అన్నది హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా యీ స్థాయిలో వివాదం ఎందుకు రాలేదు, యిప్పుడెందుకు వస్తోంది అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు వేరు, యిప్పటివి వేరు.
ఇప్పుడు ఆంధ్రలో ప్రతిపక్షాలు డెస్పరేట్‌గా వున్నాయి. ఏ గడ్డిపోచ దొరికినా అది బ్రహ్మాస్త్రమేమోనని టెస్ట్ చేసుకుంటున్నాయి. ‘నియమాల ప్రకారం రేపు జగన్ సంతకం పెట్టాల్సిందే, లేకపోతే గుడికి అపచారం, హిందువులకు మనోవైక్లబ్యం కలుగుతాయి, మేం చూస్తూ కూర్చోం’ అని బిజెపి, టిడిపి హెచ్చరిస్తున్నాయి.
గతంలో టిడిపి హయాంలో జగన్‌ను సంతకం పెట్టమన్నపుడు, ‘ఇప్పటిదాకా అనేకసార్లు వచ్చాను, మా నాయన కూడా వచ్చాడు. అప్పుడెప్పుడూ అడగనిది, వేరెవరినీ అడగనిది నన్ను మాత్రమే ఎందుకడుగుతున్నారు? ఎందుకీ వివక్షత?’ అని లాజిక్ లాగి పెట్టలేదు. అలాటిది రేపు మాత్రం యీ హెచ్చరికలకు లొంగి సంతకమెందుకు పెడతాడు? అని కొందరంటున్నారు.
‘మా నాయకుడికి వెంకటేశ్వరుడిపై నమ్మకం వుందని అనేకసార్లు రుజువైంది. కాలినడకన మెట్లెక్కి వచ్చాడంటేనే అర్థమౌతోంది కదా ఎంత భక్తో, యిక అలాటప్పుడు సంతకాలు, రిజిస్టర్లు ఎందుకు, మీరు యాగీ చేయడం కాకపోతే’ – అని వైసిపి నాయకుల వాదన.
టిడిపి మొదటినుంచి జగన్‌ను మూడు రకాలుగా యిరకాటంలో పెడదామని చూస్తోంది. ఒకటి, ఫ్యాక్షనిజం, గూండాయిజం రక్తంలోనే, పుట్టిన ప్రాంతంలోనే ఉన్నాయి. రెండు, అవినీతిపరుడు, అధికారంలోకి రాకుండానే లక్ష కోట్లు తినేశాడు, వస్తే యింకెన్ని లక్షల కోట్లు తినేస్తాడో. మూడు, క్రైస్తవుడు, హిందూద్వేషి, అంతా తనవాళ్లకే చేసుకుంటాడు,
హిందూ దేవాలయాలను కూల్చి, క్రైస్తవుల చర్చిలకు స్థలాలిచ్చి క్రైస్తవవ్యాప్తికి కృషి చేయడమే అతని జీవితలక్ష్యం. ఈ వాదాలను నమ్మినవాళ్లు నమ్మారు, నమ్మనివాళ్లు నమ్మలేదు. 2014లో నమ్మినవాళ్లు ఆరు లక్షల మంది ఎక్కువ వుండడంతో వైసిపికి టిడిపి కంటె 35 సీట్లు తక్కువ వచ్చాయి. 2019 వచ్చేసరికి నమ్మనివాళ్లు 34 లక్షల మంది ఎక్కువ వుండడంతో వైసిపికి టిడిపి కంటె 128 సీట్లు ఎక్కువ వచ్చాయి.
దాంతో టిడిపికి బెంగ పట్టుకుంది. ఎన్నికల తర్వాతైనా జగన్‌ను యీ అంశాలపై యిరికిద్దామని తెగ ప్రయత్నిస్తోంది. కానీ జగన్ 15 నెలల పాలనలో శాంతిభద్రతలకు విఘాతం కలిగి, గూండాయిజం పెరిగిన దాఖలాలు ఏమీ కనబడలేదు. రాయలసీమ రౌడీలు రాష్ట్రమంతా వీరవిహారం చేసేస్తారనుకుంటే అలా ఏమీ జరగలేదు. ఇక వైసిపి అవినీతిపై టిడిపి ఆరోపణలు చేస్తోంది తప్ప ఆధారాలేవీ చూపటం లేదు. తమపై వస్తున్న అవినీతి ఆరోపణలను తట్టుకోవడానికే సమయం చాలటం లేదు. ఇసుక పాలసీ నిర్ధారించడంలో ఆలస్యం జరగడంతో దానిలో కుంభకోణం అన్నారు. ఇప్పుడది వదిలేశారు.
అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి కాబట్టి వాటిలో అవినీతి ఆరోపణలు వచ్చే అవకాశం చాలా వుంది. అయినా పెద్దగా ఎక్కడా ఆరోపణలు వినబడటం లేదు. వైసిపి పాలసీలపై వందలాది పిల్స్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) వేసే టిడిపి కార్యకర్తలు అవినీతిలో ఏ మాత్రం అవకాశం దొరికినా వదిలిపెడతారా? వైసిపి పాలనలో అవినీతి జరగటం లేదని నేనేమీ సర్టిఫికెట్టు యివ్వటం లేదు. ఆధారాలు దొరికే స్థాయిలో జరగటం లేదేమోనని అనుమానం. రేపేదైనా బయటపడితే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఈ పరిస్థితుల్లో టిడిపికి మిగిలిన ఏకైక అస్త్రం క్రైస్తవం. జగన్ వచ్చిన దగ్గర్నుంచి క్రైస్తవవ్యాప్తి విపరీతంగా జరిగిపోతోందని హోరెత్తించేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టినా అది బైబిలు చదివించడానికే అనేశారు.
నిజానికి జగన్ అధికారంలో రాగానే క్రైస్తవులలో అత్యుత్సాహం పెల్లుబికి మతప్రచారం ఉధృతం చేసి వుండవచ్చు. క్రైస్తవులు మతవ్యాప్తికై కొత్తకొత్త పుంతలు తొక్కడం శతాబ్దాలుగా వుంది. ఇక తిరుపతిలో, టిటిడిలో కూడా, అన్యమతప్రచారమనేది 30 ఏళ్లగా వింటున్నాను. ఇవన్నీ ముఖ్యమంత్రుల ఖాతాలో జమ వేయాలంటే, బాబు ఖాతాలో కూడా చాలానే జమ పడతాయి. చర్చిల సంఖ్య, మసీదుల సంఖ్య పెరగడం, పురాతన దేవాలయాలు శిథిలాలయాలుగా మారడమనేది ఆయా మతస్తుల ఉత్సాహ, నిరాసక్తతలపై ఆధారపడి వుంటుంది.
మతాన్ని కాపాడుకోవాలసిన బాధ్యత ఆ మతస్తులదే. ఇతర మతస్తులు ఆక్రమిస్తూ వుంటే అడ్డుకోవలసినది కూడా వారే. మన బాధ్యత మనం చేయకుండా ప్రభుత్వాధిపతులపై తోసేయడం తగదు. గత నెల్లాళ్లగా మా యింటి పరిసరాల్లో వున్న మసీదు నుంచి అజాన్ (పిలుపు) మరీ గట్టిగా వినబడుతోంది. ఇబ్బంది పడితే మేమే వెళ్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి తప్ప ముఖ్యమంత్రి ముస్లిము కాబట్టి అలా చేస్తున్నారు అని టీవీలోకి వచ్చి మాట్లాడితే ఎలా? మా విషయంలో అయితే కెసియార్ పరమ ఛాందసుడైన హిందువు. మరి ఈ అజాన్ గొడవను ఎవరి ఖాతాలో వేయాలి? అయ్యప్ప భజనలు, వినాయకచవితి ఊరేగింపులు జరిగినప్పుడు యితర మతస్తులు కెసియార్ హిందువు కాబట్టే వీళ్లు సౌండు పెంచేశారు అనగలరా?
కానీ జగన్ విషయంలో ప్రతిపక్షాలకు యీ సాకు బాగా దొరికింది. క్రైస్తవులు ఎక్కడ ఏ ఆగడం చేసినా, వెంటనే జగనే చేయిస్తున్నాడు అని అనసాగారు. అంతేకాదు, హిందూ దేవాలయాల విషయంలో ఏ అపచారం జరిగినా, ఏ అకృత్యం జరిగినా జగన్‌నే దోషిగా నిలబెడుతున్నారు. అంతర్వేది ఆలయరథం సంగతి తీసుకుంటే ‘అక్కడ నిర్మానుష్యంగా వుంటుంది. చీకటి పడేసరికి కొందరు ఆకతాయి మూకలు చేరి గంజాయి తాగుతున్నారు. వాళ్లలో ఎవరో ఒకరు నిప్పు పెట్టి వుండవచ్చు.’ అని కొందరంటున్నారు. నిజం కావచ్చు, కాకపోవచ్చు. నిజమైతే ఆలయనిర్వాహకులను తప్పు పట్టాలి. ధర్మకర్తల మండలిని, పాత గుడిని కాపాడుకోవలసిన భక్తులను నిలదీయాలి. వీళ్లందరితో బాటు వైకేరియస్ లయబిలిటీ కింద ప్రభుత్వ యంత్రాంగాన్నీ జవాబు చెప్పమనాలి.
చంద్రబాబు హయాంలో కూడా యిలాటి సంఘటనలు జరిగాయి. రాష్ట్రంలో వేలాది గుళ్లు వున్నాయి. భక్తులు హెచ్చుసంఖ్యలో వెళ్లక, ఊళ్లోవాళ్లు పట్టించుకోక, నిర్లక్ష్యానికి గురయ్యాయి. మతం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్లు వీటిని కాపాడుకునేందుకు నడుం బిగించాలి. లేకపోతే రేపు జగన్ దిగిపోయి, యోగి ఆదిత్యనాథ్ వంటి వాడు ముఖ్యమంత్రిగా వచ్చినా యీ ఆగడాలు ఆగవు. అది మర్చిపోయి, హిందువుల మనోభావాలు దెబ్బ తీయడానికి జగనే యివన్నీ తన పార్టీ కార్యకర్తల చేత చేయిస్తున్నాడు అనడం అర్థరహితం. ఆల్ సెడ్ అండ్ డన్, జగన్ రాజకీయపక్షి.
అన్ని వర్గాల ఓట్ల కోసం ప్రయత్నించే మనిషి. తను క్రైస్తవుడన్న సంగతి తెలిసినా హెచ్చు సంఖ్యలో హిందువులు ఓట్లేసి గెలిపించారన్న సంగతీ అతనికి తెలుసు. పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బతీసి బావుకునేదేముంది? రాజకీయంగా చెఱుపు చేస్తుందంటే ఏ నాయకుడైనా అలా చేస్తాడా? ఒకలా చెప్పాలంటే అతనికి రాజకీయంగా చెఱుపు చేయాలనే ఉద్దేశం వున్నవాళ్లే అలా చేసే అవకాశం వుందనాలి.
హిందువుగా పుట్టినవాడు పూజలు చేసే సమయంలో బూట్లు తీయకపోయినా, పంచె కట్టుకోకపోయినా, దాన్ని సినిమా షూటింగుగా మార్చేసినా చెల్లిపోతోంది. అదే మరో మతం వాడు చేస్తే మాత్రం గుచ్చిగుచ్చి చూస్తున్నారు, ఎత్తి చూపుతున్నారు. హైందవుడి పాలనలో గుళ్లలో అకృత్యాలు జరిగినా, క్షుద్రపూజలు జరిగినా, ఆభరణాలు మాయమైనా, రోడ్ల విస్తరణలో విచక్షణారహితంగా వందలాది గుళ్లు కూల్చేసినా ఫర్వాలేదు కానీ, హైందవేతరుడు అధికారానికి వస్తే మాత్రం హైందవాలయాలకు రక్షణ లేదనేలా వాతావరణాన్ని చిత్రీకరిస్తున్నారు. అంతర్వేది ఘటనలో కానీ, మరోదానిలో కానీ ప్రభుత్వం ఏ చర్యా తీసుకోకపోతే అప్పుడు నిందించవచ్చు. తక్షణం విచారణకు ఆదేశించిన తర్వాత కూడా యిలాటి ఆరోపణలు రావడం దురదృష్టం.
ఇక తిరుపతి విషయానికి వస్తే, ప్రతి ప్రార్థనాలయానికీ కొన్ని నియమాలుంటాయి. చర్చికి వెళితే నిశ్శబ్దం పాటించాలి. మసీదుకో, గురుద్వారాకో వెళితే తల కప్పుకోవాలి యిలా. మనం నమ్మినా నమ్మకపోయినా వాటిని పాటించాలి. లేకపోతే వెళ్లనే కూడదు. 1975లో నేను సౌత్ టూరుకి వెళ్లినపుడు, త్రివేండ్రంలోని పద్మనాభస్వామి కోవెలలో చొక్కా యిప్పాలి, లుంగీ కట్టాలి అన్నారు. మా బస్సులో వున్న ఒక టూరిస్టు, హిందూయే, చొక్కా యిప్పను, లోపలకి రాను అని బస్సులోనే కూర్చున్నాడు. దైవభక్తికి, చొక్కాకు సంబంధం ఏముందని ఆలయనిర్వాహకులతో వాదించలేం కదా. అది వారి పురాతన సంప్రదాయమట. తిరుపతి విషయంలో అన్యమతస్తులు ప్రవేశించదలచుకుంటే యీ దేవుడిపై విశ్వాసం వుందని డిక్లరేషన్ యివ్వాలి అనే నియమం 1990లో పెట్టారు. ఎందుకలా పెట్టాల్సి వచ్చిందో తెలియదు.
పెట్టేటప్పుడు అమలు చేయడానికి వీలుంటుందో లేదో చూసుకోవాలి కదా. ఫలానా మతం వాడని మొహం మీద రాసి వుండదు. 90ల నాటికే తిరుపతిలో రోజుకి వేలాది మంది భక్తులు వస్తూండేవారు, వారిని వరుసలో పంపిస్తూ అజమాయిషీ చేయడం సిబ్బందికి కష్టంగా వుండేది. అలాటప్పుడు మతపరంగా విడగొట్టి, సంతకాలు తీసుకోవడం సాధ్యమయ్యే పనా? ఇది ఆలోచించకుండా ఆ రూలు పెట్టారు. అప్పణ్నుంచి యిప్పటిదాకా ఎంతమంది దగ్గర్నుంచి సంతకాలు తీసుకున్నారో బయటపెడితే బాగుంటుంది. ఎందుకంటే సంతకాలు తీసుకోని ప్రముఖుల సంగతే బయటకు వస్తోంది కానీ పెట్టినవారి సంగతి తెలియటం లేదు.
తిరుపతి గుడి వ్యవహారమే వేరు. పూరీ జగన్నాథాలయంలో పూజారులు చాలా ఛాందసంగా వుంటారు. ప్రధాని పదవిలో వున్న ఇందిరా గాంధీని అడ్డుకున్నారు – నువ్వు పార్శీని పెళ్లి చేసుకున్నావు, రావడానికి వీల్లేదని. కానీ తిరుపతి గుడి నిర్వాహకులు చాలా డైనమిక్. అర్హత వున్నవారిని, లేనివారినీ కూడా పూర్ణకుంభంతో ఆహ్వానించేస్తూ వుంటారు. టాటా వంటి వంటివారు వస్తే భూరివిరాళాలు యిస్తారు కదాని వారిని డిక్లరేషన్ యిమ్మనరు. బౌద్ధులైన శ్రీలంక అధ్యక్షులు, ప్రధానులు వస్తే ఎదురేగి స్వాగతం పలుకుతారు తప్ప అడగరు. సోనియా గాంధీ వస్తే ఆవిడెవరో తెలిసినా, డిక్లరేషన్ సంగతి సూచించను కూడా సూచించరు. అంబానీలు వస్తే శఠారి వాళ్ల గెస్ట్‌హౌస్‌కే వచ్చేస్తుంది.
అసలు టిటిడి బోర్డే రాజకీయజీవులతో నడుస్తుంది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో వుంటే వాళ్లకు కావలసినవారితో బోర్డు నిండుతుంది. ఈ వెసులుబాటు వల్లనో ఏమో, వచ్చిన వివిధ మతస్తులు కూడా తిరుపతి దేవస్థానానికి దానాలు చేసి దాని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు సమకూరుస్తున్నారు. పూరీకి యీ సౌలభ్యం లేదు.
తిరుపతి గుడి నిర్వాహకులకు వచ్చిన ప్రతివారి మతాన్ని చెక్ చేసి డిక్లరేషన్ యిమ్మనమని అడిగేందుకు వీలు పడకపోవచ్చు. కానీ వచ్చినవారికి నీతి వుండాలి కదా. వాటికన్ వెళ్లినపుడు అక్కడంతా చూడనిచ్చారు, తిరగనిచ్చారు కానీ ఒక మూలనున్న ప్రార్థనాస్థలానికి కేథలిక్ అయితేనే వెళ్లి కూర్చోవచ్చని చెప్పారు. నేను కేథలిక్కో కాదో వాళ్లు పరీక్షించలేదు. పరీక్షించలేరు కూడా. అయినా నాకు తెలుసు కదా, అందుకే లోపలకి వెళ్లలేదు.
విదురుడి గురించి ఒక కథ చెప్తారు. ధృతరాష్ట్రుడు నిద్ర పట్టకపోతే అర్ధరాత్రయినా అతన్ని పిలిపించి మంచి విషయాలేమైనా చెప్పమనేవాట్ట. అప్పుడు కూడా ‘మహారాజా’ అని సంబోధిస్తూ నిలబడి వుంటే ధృతరాష్ట్రుడు అడిగాడట – ‘నువ్వు నా సోదరుడివి, నా ఎదురుగా నిలబడనక్కర లేదు. రాజసభలో అయితే అందరిముందు మర్యాద పాటించడానికి నిలబడతావు. ఇప్పుడు ఎవరూ లేరు. నాకా, కళ్లు కనబడవు. మరింకెందుకు నిలబడడం?’ అని. దానికి విదురుడు ‘నాకు కళ్లు కనబడతాయి కదా’ అన్నాట్ట. మనమేమిటో మనకు తెలుసు కదా. ఎవరు గమనించినా గమనించకపోయినా, అడిగినా అడగకపోయినా ఆత్మారాముడు కన్నేసి వుంచాడు కదా. వాడికి జవాబు చెప్పుకోవాలిగా.
ఈ డిక్లరేషన్ ఆప్షనల్ అని వైసిపి నాయకులు కొందరు వాదిస్తున్నారు. అబ్బే కాదు, అని 2009 నాటి జీఓ చూపిస్తున్నారు బిజెపి వారు. 2014లో మరో జీవో వుంది, దానిలో ఇస్తే యివ్వవచ్చు, లేకపోతే లేదు అని వుంది వీరంటున్నారు. 2014లో యిచ్చిన జీవోలో ముఖకవళికల బట్టి దేవస్థాన నిర్వాహకులు అన్యమతస్తులను కనిపెట్టాలి అనే వుంది తప్ప, ఆప్షనల్ అని లేదు అని బిజెపి వాదన. అసలీ 2014 జీవో కూడా ఎందుకిచ్చారో తెలియటం లేదు. ముఖకవళికల బట్టి శ్వేతజాతీయులనో, నల్లజాతీయులనో, లేదా చైనీయుల వంటి గోధుమరంగు చర్మం వారినో గుర్తించగలరంతే. భారతీయులను, మన పక్కనున్న దేశాల వారిని మొహం చూసి చెప్పగలమా? తెల్లతోలు వాళ్ల విషయంలో కూడా వాళ్లు ఏ ఇస్కాన్ ద్వారానో హిందువులుగా మారారేమో మనకేం తెలుస్తుంది?
ఏది ఏమైనా అమలు చేయలేని రూలు పెట్టడం దేనికి? అంతకంటె విశ్వాసం లేనివారు రాకూడదు అని ఒక్క బోర్డు పెట్టేస్తే సరిపోతుంది కదా. నిజానికి తిరుమల గుడి ప్రవేశం మామూలు విషయం కాదు. విశ్వాసమో, బలమైన కారణమో వుంటే తప్ప కష్టపడి అంతదాకా రారు. కానీ నియమం అంటూ వున్నాక దాన్ని పాటించవలసినదే. పాటించడానికి అసాధ్యమైన రూలిది అనుకుంటే దాన్ని ఎత్తేయాలి. కొందరికి ఒకలా, మరి కొందరికి యింకోలా వర్తింపచేయకూడదు. వివాదాలు రేపడానికి యీ రూలును వాడుకునేందుకు అవకాశం యివ్వకూడదు.
కొన్ని షాపుల్లో చెప్పులిప్పి లోపలకి రమ్మంటారు. విప్పి వెళతామా లేదా! ఎందుకు, ఏమిటి అని ప్రశ్నలు వేయం కదా. ఆ పద్ధతి నచ్చకపోతే పక్కషాపుకి వెళతామంతే. స్వాగతం అని బోర్డు రాశావు, బయట కుర్రాణ్ని పెట్టి దారిన పోతున్న నన్ను ఆహ్వానించావు. వచ్చినదాకా వుండి యీ రూలేమిటి, అంటే కుదరదు. మనలో చాలామంది ఇంట్లోకి వస్తూన్నవారిని షూ విప్పేసి రమ్మనమని అంటాం. రారమ్మని భోజనానికి పిలిచి, యిదేం రూలు అని అతిథులు అడగకూడదు. దేవస్థానం ఆహ్వానంపై ముఖ్యమంత్రి వెళుతున్నారు కాబట్టి యీ నియమం ఆయనకు వర్తించదు అని వాదించేవారు యీ విషయం గుర్తు పెట్టుకోవాలి. ఆహ్వానంపై వచ్చినా రూలు రూలే. అది మారదు.
‘గతంలో వచ్చినప్పుడు అడగలేదు, యిప్పుడెందుకు అడుగుతున్నారు, తక్కినవారిని అడగలేదు, నన్నే అడిగారు, యిది వివక్షత’ అనే వాదన ఎవరు చేసినా చెల్లదు. హెల్మెట్ లేకుండా ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు పట్టుబడిన ప్రతీవాడూ చేసే వాదనే యిది. అయితే అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ చేసిన రాజకీయంగా పనికి వచ్చింది కానీ ధర్మమైనదైతే కాదు. అధికారంలోకి వచ్చాక తిరుపతి దర్శించినపుడూ పెట్టకపోవడమూ ధర్మం కాదు.
ఇప్పుడు వివాదం వచ్చిన తర్వాతైనా సంతకం పెట్టి, తను నియమాలకు కట్టుబడతానని చూపుకోవాలి. లేకపోతే అది అధర్మమే. అలా సంతకం పెట్టడం చేత తాను క్రైస్తవుడినని ప్రజలకు తెలిసిపోతుందన్న భయమేమీ లేదు. ఎందుకంటే యావన్మంది ప్రజలకూ అది తెలుసు. వైయస్ రాజశేఖర రెడ్డి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలో జరిగినపుడు అప్పటిదాకా తెలియని జనాలెవరైనా వుంటే వారికీ తేటతెల్లంగా తెలిసిపోయింది.
ఎవరో కొందరికి తప్ప ముఖ్యమంత్రి మతం ఏమిటని, కులం ఏమిటనే పట్టింపు వుండదు. పట్టింపు వున్నవాళ్లు ఏమీ చేయలేరు కూడా. ముఖ్యమంత్రి స్థానంలో వుండి నియమాలు ఉల్లంఘించడం క్షమార్హం కాదు. పైగా జగన్ వంటి ముఖ్యమంత్రికి అస్సలు కాదు. ఎందుకంటే నియమాలకు విరుద్ధంగా కట్టిన అక్రమ కట్టడమిది అంటూ రూ. 9 కోట్ల విలువైన ప్రజావేదికను కూల్పించేసిన జగన్ యిప్పుడు నియమాలకు వ్యతిరేకంగా తనే ప్రవర్తిస్తే ప్రజలకు ఏ రకమైన సందేశం యిచ్చినట్లు? సంతకం పెట్టడం వలన రాజకీయ ప్రతికక్షులకు లొంగినట్లు అని అనుకోకుండా, తనే రిజిస్టర్ అడిగి సంతకం పెట్టడం చేత గతంలో చేసిన పొరపాట్లను సవరించుకున్నట్లవుతుంది.
అమలు చేయలేని నియమం అజాగళస్తనం లాటిదే అని గుర్తించి, దాన్ని వెంటనే రద్దు చేయడం ఉత్తమోత్తమం. ఎందుకంటే ఆహార్యం విషయం బయటకు తెలుస్తుంది కానీ విశ్వాసమనేది స్కానింగ్ చేసినా కనబడేది కాదు. వచ్చినవాడు నాస్తికుడై వుండవచ్చు, ఆస్తికుడే అయినా వెంకటేశ్వరుడి గురించి తెలిసి వుండకపోవచ్చు, ఏదో దేవుడట, చూద్దాం (మనం ఉత్తరభారతం వెళ్లినపుడు అలాటి గుళ్లకు చాలా వెళతాం) అని వచ్చి వుండవచ్చు, నమ్మకం యింకా కుదిరి వుండకపోవచ్చు, గతంలో పెట్టుకున్న మొక్కులు తీరక నమ్మకం సడలి వుండవచ్చు, శిల్పాలేమైనా వున్నాయేమో చూదామనే కుతూహలంతో వచ్చి వుండవచ్చు, తనకు ఆసక్తి లేకపోయినా వృద్ధమాతాపితరులను తీసుకుని వచ్చి వుండవచ్చు, భార్య పోరు పడలేక తోడుగా వచ్చి వుండవచ్చు.
పూరీ జగన్నాథుడి మాట ఎలా వున్నా, తిరుపతి దేవుడు విదేశీ, అన్యమత భక్తులను కూడా ఆకర్షిస్తూనే వున్నాడు. ఈ నియమం ఒకటి ఎప్పటికీ యిబ్బందికరంగానే వుండబోతోంది. రేప్పొద్దున్న ట్రంపో, పుతినో వచ్చి దర్శనం చేసుకుంటానంటే, రిజిస్టరు ముందు పెడితే బాగుండదని అధికారులు మానేస్తే ‘అదిగో సాటి క్రైస్తవులు కదాని జగన్ వాళ్లకి వెసులుబాటు యిప్పించాడు.’ అని యాగీ చేసే వాతావరణం రాష్ట్రంలో వుంది.
ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాగైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్న బిజెపికి యిదే ఆయుధంగా మారబోతోంది. కర్ణాటకలో హిందూ ముఖ్యమంత్రులు ఉన్నపుడే వాళ్లు యిలాటి ఉపాయాలతో అధికారంలోకి వచ్చారు. ఆంధ్రలో క్రైస్తవ ముఖ్యమంత్రి వున్నపుడు యిక చెలరేగిపోరా?
– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)
[email protected]