అయ్యన్నపాత్రుడు వంటి నేత ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయితే అనుకూల మీడియా మాటేమో కానీ మిగిలిన మీడియా సెక్షన్ కి కూడా మేత ఎక్కువగానే దొరుకుతుంది. ఆయన తానే టీడీపీలో సీనియర్ అంటారు.
దుమ్ము దులపడం మొదలెట్టాక అది స్వపక్షమా విపక్షమా అన్నది కూడా అసలు ఆలోచించరు. ఇక పార్టీ పోకడలను చూసి మరీ బతికి బట్టకడుతుందా లేదా అని నిక్కచ్చిగా అధినాయకత్వానికే చెప్పేసి కుండబద్దలు కొట్టేస్తారు.
ఆయనకు ఫైర్ బ్రాండ్ ట్యాగ్ ఉంది. అందుకే ఎంతటి సీనియర్ అయినా చంద్రబాబు ఆయన్ని పక్కన పెట్టి మరీ ఎవరెవరినో వెతుకుతున్నారు. నిజానికి టీడీపీకి పెద్ద గొంతు కావాలంటే అయ్యన్నను మించిన వారు లేరని టీడీపీలో తమ్ముళ్ల మాటగా ఉందిట. ఆయన రీసౌండ్ బాగానే ఉంటుందని, ఉత్తరాంధ్రాలో టీడీపీ ఎటూ కాకుండా పోతున్న వేళ అయ్యన్నకు కిరీటం పెడితే ఆయన చెలరేగిపోతారని అంటున్నారుట.
వైసీపీ మీద అయ్యన్న దూకుడు చేస్తూ ఈ మధ్య యాక్టివ్ కావడం వెనక ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పోస్ట్ టార్గెట్ గా ఉందని అంటున్నారు అందుకే ఆయన డైలీ జగన్ సర్కార్ మీద హాట్ కామెంట్స్ చేస్తూ ఒక రేంజిలో రైజ్ అవుతున్నారని చెబుతున్నారు.
ఇవన్నీ సరే కానీ అయ్యన్న చెడుగుడు వైసీపీకే పరిమితం అయితే ఫరవాలేదు, ఆయన ఒక్కోసారి సొంత పార్టీ మీద కామెంట్స్ చేస్తూంటారు. అలాంటివి జరిగితే కనుక మొత్తం టోటల్ సీన్ రివర్స్ అవుతుందన్నదే టీడీపీ పెద్దల ఆలోచనట. ఏది ఏమైనా ఉన్నానూ నేనున్నాను అంటున్నారు అయ్యన్న. ఆయనకు పదవి ఇచ్చినా, ఇవ్వకపోయినా కూడా బాబుకు ఇరకాటమేనని అంటున్నారు.