డాలస్ సభలో నిన్న ఉదయం 4.30 ప్రాంతంలో (అక్కడ ఆగస్టు 17 సాయంత్రం) నేను జగన్ మీద రాసిన 300 పేజీల పుస్తకం ఆయన చేతుల మీదుగా విడుదలైంది. పుస్తకం పేరు ''జగన్ ప్రస్థానంలో ఓ దశాబ్ది (2009-2019) ఓ సామాన్యుడి దృక్కోణం.'' నేనే కాదు, పబ్లిషరు కూడా ఆ సభలో లేరు. అందువలన ఫోటోలో నా గురించి వెతకవద్దు.
పుస్తకం తయారీ వెనుక ఓ కథ ఉంది. దాదాపు 20 రోజుల క్రితం గ్రేట్ ఆంధ్రా పబ్లిషర్, ఎడిటర్ వెంకట్ ఫోను చేసి ''జగన్ ఆగస్టు 17న డాలస్‌లో సభలో పాల్గొంటున్నారు. మీరు గత పదేళ్లగా ఆయన మీద అనేక వ్యాసాలు రాశారు కదా, అవన్నీ సంకలనం చేసి పుస్తకరూపంలో తెచ్చి ఆ సభలో ఆయన చేత ఆవిష్కరింప చేద్దాం.'' అని ప్రతిపాదించారు. చెప్పొద్దూ, నేనంత ఎక్సయిట్ కాలేదు. జగన్ సిఎం అయ్యాక 'ఒక విజేత జీవితగాథ' టైపు చాలా పుస్తకాలు మార్కెట్లోకి వచ్చిపడతాయి. జగన్ అభిమానులకు అవి నచ్చుతాయి. నా విమర్శనాత్మక వ్యాసాలు వాళ్లకు రుచించకపోవచ్చు. ఇక జగనంటే పడని వాళ్లు తన మీద పుస్తకం అనగానే అసలు అటువైపు చూడను కూడా చూడరు. నా స్టయిల్ అలవాటు పడినవాళ్లు మాత్రమే పుస్తకాన్ని ఆదరించవచ్చు.
ఈ పదేళ్లలో జగన్ చేసిన తప్పొప్పులను ఘాటుగా చర్చించిన పుస్తకం జగన్ చేతుల మీదుగానే ఆవిష్కరింప చేయడం ఉచితంగా ఉండదేమో! పుస్తకం చదివే తీరిక అతనికి లేకపోవచ్చు, కానీ పక్కవాళ్లెవరైనా చదివి, 'ఇతను మీకు వ్యతిరేకంగా రాశాడండీ' అంటే అతను ఫీలయితే!? నేను ఏం చెప్పినా వెంకట్ వినలేదు. 'ఆ వ్యాసాలను యథాతథంగానే వేద్దాం. ఏమీ ఫర్వాలేదు. జగన్ ఫీలవుతారన్న వర్రీ వద్దు. తక్కిన పుస్తకాలెన్ని ఉన్నా, దీని స్థానం దీనిదే' అని పట్టుబట్టారు. ''కానీ టైము తక్కువగా ఉంది. ఆ పదేళ్లలో ఎనిమిదేళ్ల వ్యాసాలు పాత సాఫ్ట్‌వేర్‌లో ఉన్నాయి. ఇప్పటిదానికి మార్చుకోవాలి. ఈ సబ్జక్టుపై ఉన్న వ్యాసాలు ఏరాలి. నా అంచనా ప్రకారం అవన్నీ వేస్తే 1/8 డెమ్మీ సైజులో 700 పేజీల పుస్తకం అవుతుంది. 300 దాటితే ఎవరూ చదవరు. అందువలన వాటిని ఎడిట్ చేయాలి. వేరే వాళ్లెవరికి యిచ్చినా యింత పని చేపట్టలేరు. నేనే చేయాలి. ఇక్కడ ప్రింటవ్వాలి, అక్కడకు రెండు రోజుల ముందు చేరాలి. గ్యారంటీ ఇవ్వలేను'' అని చెప్పేశాను.
'ప్రయత్నించండి. ఇప్పటిదాకా నేను వెబ్‌సైట్, మ్యాగజైన్ పబ్లిషింగ్‌లో ఉన్నాను కానీ బుక్ పబ్లిషింగ్‌లో తొలి అడుగు. మంచి క్వాలిటీతో ప్రింటు చేద్దామనుకుంటున్నాను.' అన్నారు వెంకట్. ఆయన దృఢనిశ్చయం నన్ను యీ బృహత్కార్యానికి పురికొల్పింది. పని మొదలు పెట్టడానికి ముందే అనుకున్నా – 'పుస్తకం కారెక్టరేమిటో పాఠకులకు చెప్పేయాలి. లేకపోతే పుస్తకం కొన్నవాళ్లు నిరుత్సాహపడతారు' అని. బ్యాక్ కవర్ మ్యాటర్‌గా 'ఇది జగన్‌పై ఆహా, ఓహోల పుస్తకం కాదు. అలా అని 'పాదయాత్ర చూసి పరితాపపడి, 'ఒక్క ఛాన్స్ ప్లీజ్' అనే అభ్యర్థనకు కరిగి ఓట్లేశారని తీర్మానించే పుస్తకమూ కాదు. జగన్ అపూర్వ విజయం వెనకనున్న పదేళ్ల పోరాటాన్ని, ఆ సందర్భంగా సంతరించుకున్న రాజకీయ చతురతను వివరించే ప్రయత్నమిది…. జగన్ ఘర్షణదశను ఎప్పటికప్పుడు నిష్పక్షపాతంగా రికార్డు చేసిన వ్యాససంకలనమిది. ''గ్రేట్ ఆంధ్రా'' వెబ్‌సైట్‌లో వెలువడిన వ్యాఖ్యాకథనాలు ఇప్పుడు పుస్తకరూపంలో మీ చేతుల్లో ఉన్నాయి.' అని రాసుకుని తర్వాత కొన్ని వాక్యాలు మధ్యలో చేర్చాను.
తర్వాత ముందుమాట కూడా ముందే రాసుకున్నా. ముందే చెపుతున్నా…. అనే కాప్షన్‌తో మొదలుపెట్టి 'ఇది జగన్మోహన రెడ్డిని ఆకాశానికి ఎత్తేసే పుస్తకం కాదు, అలా అని పాతాళానికి కుదేసే పుస్తకమూ కాదు. అకడమిక్ పుస్తకమూ కాదు, జీవితచరిత్రా కాదు. నేను జర్నలిస్టును కాను, జగన్‌తో సహా ఏ నాయకుడూ నాకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తెలియరు. తెర వెనుక జరిగే కథనాల గురించి నాకు సమాచారం లేదు. మీలాగే నేనూ పేపర్లు చదివి, టీవీలు చూసి తెలుసుకున్న విషయాలతోనే ఈ 'కబుర్లు' రాయడం జరిగింది. వీటిని వ్యాసాలనడానికి లేదు. జర్నలిస్టు డైరీ అనడానికీ లేదు. ..' అని రాసి పెట్టుకున్నాను. పుస్తకం పూర్తయ్యాక ఇంకొన్ని వాక్యాలు చేర్చాను.
ఇక పుస్తకంలోని మ్యాటర్ గురించి – పైన చెప్పిన టెక్నాలజీ సమస్య ఒకటి మాత్రమే కాదు, ఏరడం చచ్చేటంత పని అయింది. ఈ పదేళ్లలో నేను సీరియల్స్ రాశాను, కథలు, క్రైమ్, సాహిత్యవ్యాసాలు యిలా ఎన్నో రకాలు రాశాను. అవన్నీ పక్కన పెట్టి రాజకీయాలకు సంబంధించినవి చూసినా రమారమి 4 వేల ఎ4 సైజు పేజీలున్నాయి. వాటిలో జాతీయ, అంతర్జాతీయ సమస్యలవి తీసేసి, రాష్ట్ర రాజకీయాలను ఎత్తి పెట్టి పరిశీలించాను. నిజానికి నేను జగన్ కార్యకలాపాలను పీరియాడిక్‌గా రికార్డు చేయలేదు. ఏ అంశం మీదైనా వ్యాఖ్యానించాలని తోచినప్పుడే రాశాను. తెలుగు మీడియా, నా తోటి కాలమిస్టులు విస్తారంగా చర్చించిన విషయాలను వదిలేశాను. వారం, పది రోజుల విశేషాలు. పలువురు నాయకుల గురించి కలిపి రాయడం ఓ వ్యాసంలో జరిగింది. వాటిలోంచి జగన్‌కు సంబంధించినవి మాత్రం తీసుకుంటూ, పేర్చుకుంటూ వచ్చాను. మళ్లీ వాటిలో ముఖ్యమైనవి మాత్రం తీసుకుని తక్కినవి వదిలేసి మొత్తానికి 106 వ్యాసాలతో, 300 పేజీల్లో సరిపెట్టాను.
నాలో రచయితను పాఠకుడు, విమర్శకుడు డామినేట్ చేస్తారు. పదేళ్ల నాటి కబుర్లు పాచి కంపు కొడతాయేమోననే సంకోచంతోనే పనిలోకి దిగాను. ఒక పాఠకుడిగా నాకు తోచినది యిది – ఈ పుస్తకంలో అనేక అంశాల గురించి పూర్తి వివరాలు లభించవు. వైయస్ మరణం తర్వాత 2009 అక్టోబరు నుంచే పుస్తకం ప్రారంభమవుతోంది. 'పువ్వు పుట్టగానే పరిమళించింది', 'విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పొటమరించాయి' లాటి వ్యాఖ్యలు ఏవీ కానరావు. తొలి వ్యాసం 'వైయస్ జగన్ క్యాంప్‌కు వ్యూహం అంటూ వుంటే అది బెడిసి కొట్టిందనే చెప్పుకోవాలి. ఒత్తిడి చేస్తే అధిష్టానం దిగి వస్తుందని వేసిన అంచనా తప్పింది. ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే అధిష్టానం కావాలని దోబూచులాట ఆడలేదు. రోశయ్యను సిఎం చేసింది. రోశయ్య సిఎం అయితే ప్రమాణస్వీకారం చేయనని అన్న మంత్రుల మెడలు వంచి ప్రమాణస్వీకారం చేయించింది. ప్రమాణస్వీకారం ఏమీ అక్కరలేదని చెప్పిన వైయస్ కుటుంబమిత్రుడు వీరప్ప మొయిలీ చేతనే ప్లేటు ఫిరాయింపచేసింది…' అంటూ ప్రారంభమైంది.
మరి యింత నెగటివ్ టచ్‌తో మొదలు పెడితే అసలు పుస్తకం రాయడం దేనికి అనుకోవచ్చు. పుస్తకం పూర్తిగా తయారయ్యాక చదివి చూసుకుంటే తోచేదేమిటంటే – జగన్ పదేళ్ల క్రితమే, అంటే 2009లో ముఖ్యమంత్రి కాగోరాడు. కానీ ఆ కల సాకారం కావడానికి పదేళ్లు పట్టింది. ఈ పదేళ్లూ ఆటుపోట్లమయం. ప్రత్యర్థులు కాకలు తీరిన రాజకీయ యోధులు. కౌటిల్యంలో ధురీణులు. అధికారంలో ఉన్నవారు, వ్యవస్థలను దుర్వినియోగం చేయడానికి జంకని వారు. ఇతనికి ఆవేశం తప్ప అనుభవం లేదు, పట్టుదల తప్ప పట్టువిడుపులు తెలియవు. మాటపై నిలబడాలన్న తపనతో అనేకసార్లు మొండిగా వెళ్లాడు. అది ప్రజలను మెప్పించింది కానీ నాయకులను భయపెట్టింది. అందుకే అనేకసార్లు అనుచరులు వీడి వెళ్లారు. ప్రత్యర్థులు తమ వ్యూహాలతో, ఎత్తులతో యితన్ని అనేకసార్లు చిత్తు చేశారు. తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి వేధించారు.
తండ్రి మరణానంతరం సొంత పార్టీచే త ణీకరించబడి, అవమానింపబడి, ఖైదుపాలు చేయబడినా, ధ తి తరగకుండా, స్థయిర్యం చెదరకుండా గతుకుల బాటపై నడిచి గమ్యం చేరిన కథలో రసవత్తరమైన హ్యూమన్ డ్రామా ఉంది. నేర్చుకోదగిన పాఠాలూ ఉన్నాయి. అతనికన్నీ అవాంతరాలే, అవరోధాలే! అతను ప్రశ్నించడం మొదలుపెట్టగానే వైయస్ స్వేదంతో ఊపిరి పోసుకున్న కేంద్ర ప్రభుత్వమే ఆయనను అవినీతిపరుడిగా ముద్ర వేసి, ఆ మాలిన్యాన్ని యితనికీ పూసింది. ఆశపోతుగా, అహంభావిగా, అవినీతిపరుడిగా, అపాత్రుడిగా, హింసావాదిగా తాము తయారు చేసిన యిమేజిని మీడియా ద్వారా ప్రజల మెదళ్లలో చొప్పించబోయింది. వారికి అండగా ఉన్న మీడియా యితన్ని దోషిగా, చిత్రీకరిస్తూ వచ్చింది.
ఇతను ఎదిరిస్తూ పోయాడు. తొందరపాటుతో కొన్ని పొరబాట్లు చేశాడు. వ్యూహాత్మక తప్పిదాలతో పార్టీ తెలంగాణలో కుంచించుకుపోయింది. పలుమార్లు అనుచరులను నిలుపుకోలేక పోయాడు. ఎవరేమన్నా, ఏమనుకున్నా, తోడు ఎవరున్నా, లేకున్నా బెదరలేదు. 2014లో అధికారానికి అతి దగ్గరగా వచ్చినా ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో మగ్గాడు. ఈ పదేళ్లలో తొలి ఐదేళ్లు కాంగ్రెసు వేధిస్తే, మలి ఐదేళ్లు టిడిపి వేధించింది. నంద్యాల ఉపయెన్నికలో ఓటమి ఓ గొప్ప గుణపాఠం. వీటన్నిటి వలన జగన్‌లో రాజకీయ పరిణతి వచ్చింది. సలహాదారులను పెట్టుకుని తప్పులు దిద్దుకున్నాడు. కనీవిని ఎరుగని విజయాన్ని కైవసం చేసుకున్నాడు. ముఖ్యమంత్రి పదవిని పిత్రార్జితంగా కాక స్వార్జితంగా సంపాదించుకున్నాడు. ఈ ఉత్థానపతనాల కథ నేటి యువతకు స్ఫూర్తిదాయకం.
పాలకుడిగా జగన్ తప్పొప్పులు.. అనేది వేరే సబ్జక్టు. దాని గురించి కొన్నేళ్ల తర్వాత కానీ చర్చించలేము. కానీ పాలకుడయ్యేందుకు చేసిన పోరాటమనేది ఆసక్తిదాయకం. రాముడు వనవాసానికి వెళ్లి, భార్యను పోగొట్టుకుని ఉండకపోతే రామాయణం బోరు కొట్టేది. పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేసి చేసి ఆయుధాలు సమకూర్చుకుని కురుక్షేత్రంలో గెలవడం ఉత్తేజం కలిగించే ఘట్టం. జగన్ ఎదుర్కున్న ప్రతికూల పరిస్థితులు యీ పుస్తకంలో బాగానే కవర్ అయ్యాయి. కాంగ్రెసు నాయకుల గురించి, టిడిపి నాయకుల గురించి వారి రాజకీయపు టెత్తుల గురించి చాలా వ్యాసాలే ఉన్నాయి. వాళ్ల పొరపాట్ల పై కూడా.. జగన్ కు కలిసి వచ్చినవి అవేగా. జగన్ పోరాటాన్ని ఒక సామాన్య పాఠకుడిగా ఆసక్తితో గమనిస్తూ, ఎప్పటికప్పుడు వ్యాఖ్యానిస్తూ పోయాను. వాటిల్లో ఎక్కడా 'ఇతను ఏదో ఒక రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం' అనే జోస్యం లేదు. అవకాశాలు ఎలా ఉన్నాయన్నది చర్చించడం మాత్రమే జరిగింది.
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2019)