శారదా స్కామ్‌లో అరెస్టయి ప్రెసిడెన్సీ జైలులో వున్న తృణమూల్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కునాల్ ఘోష్ ఆత్మహత్యా ప్రయత్నం చేసి సిబిఐను హడలగొట్టాడు. తనను ఆసుపత్రికి తరలించగానే డాక్టర్లతో 'నేను 50 అల్‌ప్రజోలామ్ మాత్రలు మింగేశా' అని చెప్పాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు 20 కంటె ఎక్కువ మింగి వుండడని తేల్చారు. ఆత్మహత్య చేసుకుంటానని సిబిఐను చాలాకాలంగా బెదిరిస్తున్నాడు కాబట్టి ఏదో ఒకటి చేయాలని చేసిన చేష్టే తప్ప నిజంగా చచ్చిపోదామన్న కోరిక లేదన్నమాట అని తేలింది. ఆ బెదిరింపు వెనక్కాల కథేమిటంటే – తను అరెస్టయ్యాక అతను సాటి రాజకీయనాయకులపై ఆరోపణలు చేస్తూ సిబిఐకు లేఖ రాసి వారిపై చర్య తీసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఆర్నెల్లయినా సిబిఐ కదలకపోవడంతో యీ డ్రామా ఆడాడు. అతను చెప్పిన పేర్లలో – మమతా బెనర్జీకి సన్నిహితుడైన ముకుల్ రాయ్, జౌళి మంత్రి శ్యామాపాద ముఖర్జీ, రవాణా మంత్రి మదన్ మిత్రా, పార్టీ ఎంపీ సృంజయ్ బోస్ వున్నారు.
కునాల్ చేసిన హడావుడితో సిబిఐ ఏదో ఒకటి చేస్తుందని గ్రహించిన మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లి రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఆడ్వాణీలను కలిసింది. బిజెపి అధికారంలోకి వచ్చాక రాజధానికి ఆమె తొలి పర్యటన యిది. ఇదంతా సిబిఐ విచారణ ఆపడానికే అని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌధురీ ఆరోపించాడు. ఈ పర్యటన తర్వాత ఒక సీనియర్ తృణమూల్ నాయకుడు, రాష్ట్ర బిజెపి నాయకుడితో కలకత్తాలోని గెస్ట్‌హౌస్‌లో కలిశాడు. ఏదో ఒకటి చేసినట్లు కనబడాలి కనక సిబిఐ మమతా రాజనాథ్‌ను కలిసిన రోజునే లేఖలో వున్నవాళ్లందరికీ నోటీసులు పంపింది. అంతే అర్జంటుగా వాళ్లకు అనారోగ్యాలు వచ్చేశాయి. శారదా గ్రూపు రకరకాలుగా తృణమూల్ నాయకులకు మేలు చేసింది. మమతా బెనర్జీ వేసిన పెయింటింగ్స్‌ను కోట్ల రూపాయలకు కొంది, శ్యామాపాద ముఖర్జీ సిమెంటు ఫ్యాక్టరీని మార్కెట్ విలువ కంటె ఎంతో ఎక్కువ పెట్టి కొంది. అందుకే శారదా స్కాము విచారణ సరిగ్గా సాగకుండా తృణమూల్ ప్రభుత్వం శతథా ప్రయత్నిస్తోంది.
శారదా స్కాము బెంగాల్‌కే పరిమితం కాలేదు. ఒడిశా, అసాం, త్రిపురలకు కూడా వ్యాపించింది. ఆ రాష్ట్రప్రభుత్వాలన్నీ సిబిఐకు సహకరిస్తున్నాయి. ఒడిశాలోని అధికార పార్టీ బిజెడికి చెందిన నాయకులు, బిజెపి నాయకులు కలిసి మొత్తం 12 మందిని సిబిఐ అరెస్టు చేసింది. అసాంలో మాజీ ముఖ్యమంత్రిని పిలిపించి ప్రశ్నించారు. అసామీ గాయకుడు సదానంద్ గొగొయ్ అరెస్టయ్యాడు. అరెస్టు చేస్తారన్న భయంతో మాజీ డిజిపి ఆత్మహత్య చేసుకున్నాడు. బెంగాల్‌లో సిబిఐకు అలాటి సహకారం లభించలేదు. బెంగాల్ పోలీసు కొన్ని సాక్ష్యాలు నాశనం చేశారని కూడా సిబిఐకు సందేహం. ఇప్పుడు స్పీడు పెంచారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్, సెబిల సమాచారం ఆధారంగా బెంగాల్ మాజీ డిజిపి రజత్ మజుందార్‌ను, సధీర్ అగర్వాల్ అనే వ్యాపారవేత్తను అరెస్టు చేశారు.
ఎమ్బీయస్ ప్రసాద్