ఎమ్బీయస్‌ : ఎయిర్‌పోర్టుకు ఎన్టీయార్‌ పేరు – 3

మామూలుగానే కేంద్రం అధికారం చలాయిస్తుంది. ఆంధ్ర, తెలంగాణల విషయంలో అది పదిరెట్లయింది. ఇప్పుడు ఏడ్చి మొత్తుకుంటున్నా అధికారుల, ఉద్యోగుల పంపిణీయే పూర్తి చేయడం లేదు కదా. ఏం చేయగలుగుతున్నారు? ఋణమాఫీకి కేంద్రం అజమాయిషీలోని ఆర్‌బిఐ…

మామూలుగానే కేంద్రం అధికారం చలాయిస్తుంది. ఆంధ్ర, తెలంగాణల విషయంలో అది పదిరెట్లయింది. ఇప్పుడు ఏడ్చి మొత్తుకుంటున్నా అధికారుల, ఉద్యోగుల పంపిణీయే పూర్తి చేయడం లేదు కదా. ఏం చేయగలుగుతున్నారు? ఋణమాఫీకి కేంద్రం అజమాయిషీలోని ఆర్‌బిఐ సహకరించిందా?  కేంద్రాన్ని గట్టిగా ఏమైనా అంటే యివ్వాల్సిన నిధులు కూడా బిగబడుతుందేమోనని భయం. ఇటు చూస్తే ప్రజలకు ఎడాపెడా ప్రకటనలు, హామీలు యిచ్చేస్తున్నారు. డబ్బులేవీ అంటే కేంద్రం యిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ఇలాటి పరిస్థితుల్లో కేంద్రంతో పేచీ పెట్టుకోగలదా? పార్లమెంటులో చర్చ తర్వాత పేరు వెనక్కి తీసుకున్నా అది కేంద్రం ఔదార్యం అనుకోవాలి తప్ప, మన ప్రజ్ఞ అనుకోవడానికి లేదు. అంతలా మన పిలక పట్టుకెళ్లి వాళ్ల చేతిలో పెట్టాం.

ఇక మూడో అంశం – ఈ పేరు మార్పు యిప్పుడే ఎందుకు తలపెట్టారు? అన్నది. కేంద్రంలో మా మాట చెల్లుతుంది అని బాబు తెలంగాణ ప్రజలకు చూపించు కోవడానికా? అంత పలుకుబడే వుంటే రిజర్వ్‌ బ్యాంకు చేత వ్యవసాయ ఋణాలు రీషెడ్యూలింగ్‌ చేయించాల్సింది, రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెప్పించుకోవాల్సింది, వెనకబడిన ప్రాంతాలకు ప్యాకేజి తెప్పించుకోవాల్సింది. 5 నెలలైనా వాటికి అతీగతీ లేదు. హుదూద్‌ తుపాను నష్టం అంచనా వేయడానికి కేంద్రబృందాన్ని త్వరగా తెప్పించాల్సింది. యుపిఏ హయాంలో వచ్చినంత స్పీడులోనే యిప్పుడూ వచ్చారు. ఇన్నాళ్లగా ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఏ పేరూ లేదు. రాజీవ్‌ గాంధీ పేరు పెట్టినా దాన్ని కుదించి 'ఆర్‌జిఐ..' అని రాస్తారు, జనసామాన్యం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అనే అంటారు. ఇప్పుడు అర్జంటుగా ఎన్టీయార్‌ పేరు పెట్టాల్సిన ఎమర్జన్సీ లేదు, పెట్టడం వలన ఎన్టీయార్‌కు ఒరిగిందీ లేదు. ఆంధ్రలో అన్నిటికీ ఎన్టీయార్‌ పేరే పెట్టేస్తున్నారు. ఇప్పటికే ఆ స్వర్గవాసికి మొహం మొత్తేసి వుంటుంది. తన పేరు బదులు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు పేరో, శ్రీనాథుడి పేరో, వీరబ్రహ్మేంద్రస్వామి పేరో పెడితే ఎక్కువ సంతోషిస్తాడేమో. 

ఈ పేరు పెట్టడంలో టైమింగ్‌ తప్పింది. కేంద్రమంత్రిగా వున్న అశోకగజపతిరాజు గారికి హఠాత్తుగా ఎన్టీయార్‌పై ప్రేమ పుట్టిందనుకోవడానికీ లేదు. 1996లో ఎన్టీయార్‌పై తిరుగుబాటు చేసిన పెద్దమనుషుల్లో యీయన ఒకడు. 'నాయకుడు సిమ్మం(సింహానికి ఆయన తెలుగు అది)లా గర్జించాలి.' అంటూ చంద్రబాబును కీర్తిస్తూ ప్రసంగించినది యీయనే. ఒళ్లుమండిన ఎన్టీయార్‌ ఎవరు సింహమో చూపడానికి తన పార్టీకి సింహం గుర్తునే పెట్టుకున్నారు. సింహగర్జన పేర సభలు ప్లాన్‌ చేసుకున్నారు. ఎన్టీయార్‌ను గద్దె దింపిన రాజుగారికి యిన్నాళ్లకు ఢిల్లీలో ఓ చిన్న సింహాసనం దొరకగానే గిల్లికజ్జాలు పెట్టుకోవడానికి యీ పని చేసినట్లయింది. ఇప్పుడు ఎన్టీయార్‌ గుణగణాలను చర్చకు పెట్టినట్లయింది. 

సరే దీనికి పరిష్కారం ఏమిటి? నాకు తోచిన తమాషా ఐడియా ఏమిటంటే – డొమెస్టిక్‌ టెర్మినల్‌కు ఎన్‌.టి.ఆర్‌. అనే పేరుకి తెరాస ఒప్పుకోవాలి. ఆ తర్వాత ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్లపై ఎన్‌(నవ) టి (తెలంగాణ) ఆర్‌ (రాష్ట్ర) టెర్మినల్‌కు స్వాగతం అని బోర్డులు పెట్టేయాలి. అప్పుడు యిద్దరి లక్ష్యమూ నెరవేరుతుంది. కలకత్తాలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమెరికన్‌ కాన్సలేట్‌ వున్న రోడ్డుకి హో చి మిన్‌ (అమెరికన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న వియత్నాం విప్లవనాయకుడు)పేరు పెట్టింది. అమెరికన్లకు తలకొట్టేసినట్లయింది. వాళ్ల ఆఫీసు రోడ్డు మొగలో వుంది. రెండు వీధుల్లోకి సింహద్వారాలున్నాయి. హోచిమిన్‌ రోడ్డు ద్వారం మూసేసి, మరో ద్వారం తెరిచి యీ రోడ్డు అడ్రసు వాడసాగారు. పై ఐడియా కంటె బెటర్‌ ఐడియా కూడా నా దగ్గర వుంది. ఎలాగూ రెండు టెర్మినల్స్‌ వున్నాయి. చెన్నయ్‌లో రెండు టెర్మినల్స్‌లో ఇంటర్నేషనల్‌ దానికి ప్రాంతీయ నాయకుడైన అణ్నా పేరు, డొమెస్టిక్‌ దానికి జాతీయస్థాయిలో కూడా రాజకీయాలు నడిపిన కామరాజ్‌ పేరు పెట్టారు. ఈ విపర్యం ఎందుకంటే తమిళనాడులో అణ్నా వారసులు అధికారులు చలాయిస్తూ, కేంద్రాన్ని శాసిస్తూ వచ్చారు, కామరాజ్‌ వారసులు అడుగున పడి వున్నారు. 

ఇక్కడ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జాతీయ టెర్మినల్‌కు ఎన్టీయార్‌ పేరు పెట్టారు కాబట్టి అంతకంటె పై స్థాయిలో వున్న అంతర్జాతీయ టెర్మినల్‌కు రాజీవ్‌ పేరు ఎత్తేసి పివి గారి పేరు పెడితే సరి. ఆంధ్ర బిడ్డ కంటె తెలంగాణ బిడ్డదే పై చేయి అని గర్వంగా అనుకోవచ్చు. అలా పేర్లు పెట్టడంలో ఔచిత్యం వుంది. పివి మాజీ ప్రధాని, ఎన్టీయార్‌ మాజీ ముఖ్యమంత్రి.  ఓ పేరు పోయినంత మాత్రాన రాజీవ్‌ స్మృతికి నష్టం ఏమీ లేదు. ఔటర్‌ రింగ్‌రోడ్డుకి అతని పేరే వుంది. రాజీవ్‌ రహదారి కూడా వుంది. ఇంకా లెక్కపెట్టలేనన్ని వున్నాయి. అయినా  అభ్యంతర పెట్టడానికి సోనియాకు, రాహుల్‌కు యిప్పుడు వాయిస్‌ వుందా?ఈ ప్రతిపాదన వలన తెరాసకు నష్టం ఏమీ లేదు. ఫిరాయింపులతో బాటు కాంగ్రెసును యీ విషయంలో కూడా ఉడికించినట్లు వుంటుంది. ఈ ప్రపోజల్‌ వెళ్లాలే గానీ నెహ్రూ వారసుల గుర్తులు తుడిపేసే పనిలో వున్న మోదీ సర్కారు చంకలు గుద్దుకుంటూ అమలు చేస్తుంది. ఒక్కటే చిక్కుంది –  పివి హయాంలో బాబ్రీ మసీదు కూలింది కాబట్టి ఆయన పేరు పెడితే మజ్లిస్‌ మండిపడుతుంది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు స్థలాలు ఒకప్పుడు వక్ఫ్‌ భూములు కాబట్టి ఎవరో ముస్లిం గురువు పేరు పెట్టాలని వాళ్ల డిమాండ్‌. మజ్లిస్‌ భయంతో తెరాస పివి పేరుపై జంకితే మోదీక్కూడా మండుతుంది. మరిన్ని పేర్లు మార్పించగలడు, వాటిలో చంద్రబాబు పేరు కూడా వుండవచ్చు జాగ్రత్త! 

ఎన్టీయార్‌ బతికున్నంతకాలం కేంద్రం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రానికైతే ఏలుకోవడానికి కొంత ప్రాంతం అంటూ వుంది. కేంద్రానికి ఏముంది? రాష్ట్రం సత్యం, కేంద్రం మిథ్య – అనేవారు. ఏవో విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి శాఖలు తమ వద్ద పెట్టుకుని తక్కిన అధికారాలన్నీ కేంద్రం రాష్ట్రాలకు బదిలీ చేయాలని వాదించేవారు. అదే కేంద్రం ఆర్టికల్‌ 3ను వినియోగించి తన మరణానంతరం తన తెలుగురాష్ట్రాన్ని ముక్కలు చేసిందని వింటే ఆయన హృదయం ముక్కలయ్యేది. తన అధికారాలను దుర్వినియోగం చేసి యిరు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలను తన చేతిలోనే పెట్టుకుని, వాటిపై పెత్తనం చలాయిస్తోందని తెలిస్తే మరీ బాధపడేవారు. కానీ ఆయన పేరు విషయంలో అదే కేంద్రం యిప్పుడు అక్కరకు వచ్చింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు డొమెస్టిక్‌ టెర్మినల్‌కు పేరు విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏ తీర్మానం చేసినా పట్టించుకోకుండా 'లేదు, పేరు మార్పు జరిగిపోయింది. తీసేసే ప్రసక్తే లేదు' అని అరుణ్‌ జైట్లీ కరాఖండీగా పార్లమెంటులో చెప్పేశారు. తెరాస, కాంగ్రెసు సభ్యులు గోల చేసినా ఖాతరు చేయలేదు. అదేమంటే కేంద్రానికి వున్న అధికారాలు వుపయోగించాం అన్నారు!- (సమాప్తం) 

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2