శివసేన స్థాపకుడు బాల థాకరేకు అత్యంత సన్నిహితుడు మనోహర్ జోషీ. 40 ఏళ్లుగా పార్టీలో వున్నాడు. శివసేన తరఫున తొలి ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, లోకసభ స్పీకర్‌గా పని చేశాడు. శివసేన ఆవిర్భవించిన సౌత్ సెంట్రల్ ముంబాయి నియోజకవర్గం నుండి ఎన్నో ఏళ్లుగా ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చాడు. అలాటి జోషీ మొన్న అక్టోబరు 13న శివాజీ పార్కులో శివసేన ఏర్పాటు చేసిన దసరా సభలో మాట్లాడబోతే శివసైనికులు అతన్ని తరిమికొట్టారు. సభాప్రాంగణానికి రాగానే అతనికి వ్యతిరేకంగా చాలామంది నినాదాలు యిచ్చారు. వారిని సముదాయించడానికి సీనియర్ లీడరు లీలాధర్ డాకే ప్రయత్నించినా వినిపించుకోలేదు. గత్యంతరం లేక మనోహర్ వెనక్కి వెళ్లిపోయాడు. ఇదంతా శివసేన అధిపతి ఉద్ధవ్, అతని కుమారుడు ఆదిత్య సమక్షంలోనే జరిగింది. వారు తమ పార్టీ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేయలేదు. దీనికి వెనక్కాల వున్న కారణం – మనోహర్ ఎంపీ టిక్కెట్టు ఆశించడం!
మనోహర్ 2012 వరకు రాజ్యసభ సభ్యుడుగా వున్నాడు. ఆ తర్వాత అతనికి మళ్లీ టిక్కెట్టు యివ్వలేదు. ఈ సారి ముంబయి సౌత్ సెంట్రల్ నియోజకవర్గం ద్వారా లోకసభకు వెళదామని అతను ఆశిస్తున్నాడు. అయితే ఉద్ధవ్ 76 ఏళ్ల యీ వృద్ధనాయకుడికి కాకుండా యువకుడైన రాహుల్ షెవాలే అనే శివసేన కార్పోరేటర్‌కు టిక్కెట్టు యిద్దామని చూస్తున్నాడు. 2009 వరకు ఆ సీటు శివసేన నెగ్గుతూనే వచ్చింది. కానీ ఆ ఎన్నికలలో కాంగ్రెసు పక్షాన ఏక్‌నాథ్ గాయిక్‌వాద్ అనే దళితుడు నెగ్గాడు. శివసేన నుండి విడిగా వెళ్లిన రాజ్ థాకరే శివసేన ఓటర్లను చీల్చడం ఒక కారణం కాగా, ఆ నియోజకవర్గంలో వున్న దళిత ఓటర్లు కాంగ్రెసుకు ఓటేయడం మరో కారణం. అందువలన యీ సారి రాహుల్ని నిలబెడదామని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ మాట మనోహర్‌కి స్పష్టంగా చెప్పటం లేదు. రాహుల్‌ను అభ్యర్థిగా చూపుతూ బ్యానర్లు వెలసినపుడు మనోహర్ ఉద్ధవ్‌ని వెళ్లి సూటిగా అడిగాడు. ఉద్ధవ్ ఎటూ చెప్పకుండా పంపించివేశాడు. మనోహర్ కొడుకు బిల్డర్. అతను శివసేన భవనానికి ఎదురుగా కోహినూర్ టవర్ అని పెద్ద భవంతి కడుతున్నాడు. ''మా వాడు కట్టిన టవర్ పూర్తయేసరికి అందరూ శివసేనా భవన్ అంటే కోహినూర్ టవర్‌కు ఎదురుగా వున్నదేనా? అని అడుగుతారు చూడండి.'' అంటూ మనోహర్ గొప్పలు చెప్పుకున్నాడు. అది విని ఉద్ధవ్ మండిపడ్డాడు. శివసేన వలననే యింతవాడైన మనోహర్ శివసేనను కించపరుస్తున్నాడని, యిక అతనికి బ్రేకులు వేయాలని నిశ్చయించుకున్నాడు. తన తండ్రికి విధేయులైన వారిని తప్పించి, తనకు విధేయులైన వారితో పార్టీని నింపాలని అతని ప్లాను.
ఇది గ్రహించిన మనోహర్ దసరా సమయంలో ఓ పాత్రికేయుడికి యింటర్వ్యూ యిస్తూ ''బాల థాకరేకు శివాజీ పార్కులో స్మారకచిహ్నం కడతానంటే ప్రభుత్వం అనుమతి యివ్వలేదు. ఉద్ధవ్ మిన్నకున్నాడు. బాల థాకరేకు యిటువంటిది జరిగి వుంటే, అంటే ఆయన తన తండ్రి ప్రబోధాంకర్ స్మారకచిహ్నం కడదామని అనుకుని దానికి ప్రభుత్వం అడ్డుపడి వుంటే, దెబ్బకు ప్రభుత్వాన్ని కూల్చిపారేసేవాడు. ఇలా చెప్పి ఉద్ధవ్‌ను తప్పుపడుతున్నానని అనుకోవద్దు. ఒక్కోరి వ్యవహారశైలి ఒక్కోలా వుంటుంది. ఉద్ధవ్‌ది మెతక స్వభావం.'' అన్నాడు. బాల థాకరే దూకుడుతనానికి అసలైన వారసుడు అతని సోదరుడి కుమారుడైన రాజ్ థాకరేనే అనీ, సొంత కొడుకు ఉద్ధవ్ మందకొడి అని శివసైనికులు భావిస్తున్న యీ తరుణంలో యిలాటి వ్యాఖ్యలకు చాలా ప్రాముఖ్యత వుంది. అందుకనే ఉద్ధవ్ తన కార్యకర్తల చేత మనోహర్‌కు పరాభవం జరిపించాడు. దీని తర్వాత మనోహర్ పార్టీలోంచి బయటకు వెళ్లిపోవచ్చు. ఆ నియోజకవర్గంలో ఎంఎన్‌ఎస్ తరఫున టిక్కెట్టు యిస్తానని రాజ్ థాకరే అతనికి ఆఫర్ యివ్వవచ్చు కూడా. దసరా నాడే నలుగురు ముఖ్యమైన శివసేన లీడర్లు ఎంఎన్‌ఎస్‌లోకి దూకారు. ఎవరున్నా, ఎవరు పోయినా శివసేనకు సంబంధించినంత వరకు తన మాటే చెల్లాలన్న పట్టుదలతో వున్నాడు ఉద్ధవ్!
రాజస్థాన్ ఎన్నికల రంగం రాజస్థాన్ ఎన్నికలకు సిద్ధమవుతున్న అశోక్ గెహ్లాట్ మళ్లీ గెలుస్తానన్న ఆశతో వున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం పని చేయదనీ, బిజెపి తనను ఓడించలేదనీ నమ్ముతున్నారు. నమ్ముతూనే ఎందుకైనా మంచిదని యీ మధ్య అనేక ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టి వాటికి విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు. కాంగ్రెసును ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వున్న బిజెపి అవినీతి ఆరోపణల అస్త్రాన్ని చేపట్టింది. ఇప్పటివరకు అశోక్ పరిపాలన బాగాలేదని చెపుతూ వచ్చారు. బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన వసుంధరా రాజె సూరజ్ సంకల్ప్ యాత్ర మొదలుపెట్టి ప్రజల్లో తిరుగుతూ 'రోడ్లు, విద్యుత్ సరఫరా, పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగావకాశాలు బాగా లేవని' ప్రచారం చేశారు. వాటికి స్పందన అంత బాగా లేదు. ప్రజాకర్షక పథకాలను విమర్శించినా ప్రజలు హర్షించరు.
ఏం చేయాలా అని ఆలోచిస్తే తను 22 వేల కోట్ల రూ.ల అవినీతికి పాల్పడినట్లు గత ఎన్నికల సమయంలో (2008) కాంగ్రెసు వారు ప్రచారం చేసిన విషయం, ప్రజలు అది నమ్మిన విషయం గుర్తుకు వచ్చింది. ఈ సారి తామూ అదే చేయాలనుకుని మహారాష్ట్ర బిజెపి లీడరు కిరీట్ సోమయ్యాను పిలిచారు. ఆయన అశోక్ గెహ్‌ాలాట్ స్కాములు చేశారంటూ, కొంతమంది పారిశ్రామికవేత్తల పట్ల వలపక్షం చూపారంటూ అవినీతి ఆరోపణలతో 100 పేజీల బుక్‌లెట్ వేయించి, దానికి తోడుగా ఒక వీడియో తయారుచేసి యిచ్చాడు. వాటికి కాపీలు తీయించి యీ ప్రచారసామగ్రిని 200 రథాలకు ఎత్తించి రెడీగా పెట్టారు. ఈ రథాలెక్కి బిజెపి వారు గ్రామగ్రామాలూ తిరుగుతారట. పైగా ఎన్‌డిఏ హయాంలో తాము ఎంత బాగా పనిచేశామో కూడా చెప్తారట. 'బ్లాక్ పేపర్' అనే ఈ పుస్తకానికి ప్రతిగా అశోక్ 'రైజింగ్ రాజస్థాన్' పేర తన పాలనలో రాజస్థాన్ ఎలా వెలిగిపోయిందో చెప్తూ మరో పుస్తకం వేయించాడు.
– ఎమ్బీయస్ ప్రసాద్