ఎమ్బీయస్: కాళీమాతకు నైవేద్యం

తృణమూల్ కాంగ్రెసు ఎంపీ మహువా మొయిత్రా జులై నెలలో ‘‘నా భావనలో కాళి మాంసభక్షిణి, మద్యాన్ని స్వీకరిస్తుంది. మీ యిష్టదేవతను మీకిష్టం వచ్చినట్లు ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవీదేవతలకు మద్యం నైవేద్యంగా యివ్వవచ్చు, మరి…

తృణమూల్ కాంగ్రెసు ఎంపీ మహువా మొయిత్రా జులై నెలలో ‘‘నా భావనలో కాళి మాంసభక్షిణి, మద్యాన్ని స్వీకరిస్తుంది. మీ యిష్టదేవతను మీకిష్టం వచ్చినట్లు ఊహించుకోవచ్చు. కొన్ని చోట్ల దేవీదేవతలకు మద్యం నైవేద్యంగా యివ్వవచ్చు, మరి కొన్ని చోట్ల అది నిషిద్ధం.’’ అన్నారు. వెంటనే పెద్ద వివాదం చెలరేగింది. బిజెపి వాళ్లు ఆమెను తిట్టిపోస్తూ, ఆమెను మందలించనందుకు మమతా బెనర్జీపై కూడా దుమ్మెత్తిపోశారు. మహువా స్టేటుమెంటు కారణంగా బిజెపికి రాజకీయలబ్ధి లభిస్తుందేమోనన్న భయంతో తృణమూల్ పార్టీ నాయకుడు సౌగతా రాయ్ ‘‘మహువా ప్రకటనను పార్టీ ఆమోదించడం లేదు.’’ అని ప్రకటించి చేతులు దులుపుకోవలసి వచ్చింది.   

ఇదంతా చూస్తే నాకు నవ్వు వచ్చింది. మహువా చెప్పినదానిలో ఏ మాత్రం పొరపాటు లేదని కాళీ భక్తులైన బెంగాలీలందరికీ తెలుసు. దసరాకు వేసే దుర్గా మండపం తీరు వేరేలా ఉంటుంది. ఆవిడ ప్రసన్నంగా, శుబ్భరంగా ఒంటినిండా బట్టలు వేసుకుని సంతానంతో సహా కొలువుతీరి ఉంటుంది. దీపావళికి వేసే కాళీ మండపాల్లో కాళి నల్లగా, భీకరరూపంతో, దాదాపు దిగంబరంగా, శివుణ్ని కాళ్లతో తొక్కుతూ భయాన్ని కొలుపుతూ ఉంటుంది. కాళి స్వరూపస్వభావాలు తెలిసినా హిందూత్వవాదులు, బిజెపి వాళ్లు చేసే యాగీకి దడిసి, ఆమె చెప్పినది కరెక్టే అని తృణమూల్ వాళ్లు బహిరంగంగా చెప్పలేకపోతున్నారు.

ఇప్పుడు హిందూత్వవాదం ఏ దశకు చేరందంటే వాళ్లు ఒక మూస తయారుచేసి హిందూ దేవుళ్లందరినీ దానిలో పోత పోసేస్తున్నారు. దానికి భిన్నంగా ఉండడానికి వీల్లేదంతే. పురాణాల్లో ఏముందో, తరతరాలుగా పూజావిధానాలు ఎలా ఉన్నాయో అవన్నీ చర్చించడానికి కుదరదు. దేవుళ్లు శాకాహారులే అని వాళ్లు తీర్మానిస్తే మనం జీహుజూర్ అనాల్సిందే. సాక్షాత్తూ దేవుడు దిగి వచ్చి ‘బాబూ నేను నాన్‌వెజ్ తింటాను’ అని చెప్పినా ‘ఠాఠ్, నీ మొహం’ అనేట్టున్నారు. ప్రతీదానికీ ఒన్ నేషన్.. కింద లాక్కుని వచ్చేస్తున్నారు. మేం యిలా అనుకుంటాం కాబట్టి, మీరూ అలా అనుకోవలసినదే, యింకోలా ఉండడానికి వీల్లేదు అంటున్నారు.

చూస్తూండగానే హిందూమతంలో కొత్తకొత్త పద్ధతులు వచ్చేస్తున్నాయి. నా చిన్నప్పుడు వినాయకుడి నిమజ్జనానికి యాత్రలు లేవు. ఎవరి విగ్రహాన్ని వాళ్లు బావిలోనో, కాలువలోనో, నదిలోనో నిమజ్జనం చేసుకునేవారంతే! మహారాష్ట్ర సంప్రదాయాన్ని హైదరాబాదుకి తీసుకుని వచ్చారు. ఇప్పుడది ప్రతీ ఏడాదీ నిమజ్జన వేళ పెద్ద వివాదాస్పదమైన ఆచారంగా మారిపోయింది. మా చిన్నపుడు శ్రీరామనవమి అంటే రాములవారి పెళ్లి, పందిళ్లు. ఇప్పుడు ప్రతిరాష్ట్రంలో ఆ పేరు చెప్పి ఊరేగింపులు మొదలెట్టారు. గతంలో హనుమజ్జయంతి అంటే యింట్లో పూజ మాత్రమే. ఇప్పుడు శోభాయాత్ర అంటూ ఊళ్లో ట్రాఫిక్ ఆపేస్తున్నారు. ఇదివరకు హోలీ హైదరాబాదులో తప్ప ఎక్కడా ఉండేది కాదు. ఇప్పుడు అది పెద్ద పండుగ. రక్షాబంధన్ పెద్ద మార్కెటింగ్ వ్యవహారంగా మారి, అది కట్టకపోతే అన్నాచెల్లి బంధం ఉట్టిదే అనే స్థాయికి తెచ్చారు. అలాగే ధన్‌తేరాస్‌ను అక్షయతృతీయగా మార్కెట్ చేసి, నెత్తిమీద రుద్దారు. పోనుపోను కడవా చౌథ్ కూడా రుద్దేస్తారు. కడవా చౌథ్ జరపని మహిళ హిందూ స్త్రీయే కాదని ఓ బిజెపి నాయకుడు ఎప్పుడో సెలవిచ్చాడు. ఆ లెక్కన తెలుగు వనితలెవరూ హిందువులు కారు.

నిజానికి హిందూమతం కానీ, భారతదేశం కానీ వైవిధ్యభరితమైనది, అన్ని రకాల ఆలోచనావిధానాలనూ తనలో యిముడ్చుకునేది. ఇప్పుడు వీళ్లు ఆ స్వరూపాన్నే మార్చేస్తున్నారు.  గమనించి చూస్తే ఒక్కో దేవతకు ఒక్కో రకమైన పూజావిధానం ఉంటుంది. అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు, అయ్యవారికి అభిషేకం చేస్తారు. విష్ణ్వాలయంలో ప్రసాదాలు పెడతారు, శివాలయంలో తీర్థంతో సరిపెడతారు. తరచి చూస్తే ఒకే దేవుడి ఒక్కో రూపానికి, ఒక్కో అవతారానికి ఒక్కో రకమైన పూజ ఉంటుంది. ధ్యానమూర్తి ఐన శివుడికి ఒక రకమైన పూజ చేస్తారు. వీరభద్రుడికి పూజ వేరేలా ఉంటుంది. శివుడు రుద్ర తాండవమూ చేయగలడు, ఆనంద తాండవమూ చేయగలడు. అశుతోషుడిగా (సులభంగా తృప్తి పడేవాడు) ఉండగలడు, అఘోరాగానూ కాగలడు. వెండికొండపైనా ఉంటాడు, శ్మశానంలో భూతగణాల మధ్యా ఉంటాడు. అమ్మవారూ అంతే. గౌరీదేవికి ఒక విధమైన పూజ, దుర్గాదేవికి మరొకటి, కాళీకి యింకొకటి. రూపం బట్టి ఆ యా తరహా పూజానైవేద్యాలుంటాయి. పూజావిధానమూ వేరే! అయ్యప్ప దీక్ష లాటిది వెంకటేశ్వరస్వామి విషయంలో లేదు కదా!

ఈ దేవీదేవతలందరూ, యీ రూపాలన్నీ మనకు కావాలి. దేశానికి సైనికులూ కావాలి, ఆధ్యాత్మిక గురువులూ కావాలి. అలాగే దేవుళ్లు అవసరాన్ని బట్టి ఆ యా రూపాన్ని ధరిస్తారు. విష్ణువు ఉగ్రనారసింహావతారం ధరించి, దుష్టసంహారం చేసి, ఆపై శాంతించి లక్ష్మీనారసింహుడై భక్తులను అనుగ్రహించాడు. క్షత్రియసంహారం చేద్దామనుకున్నప్పుడు శాంతమూర్తిగా రాలేదు, మహోగ్రమూర్తి పరశురాముడిగా అవతరించాడు. వామనావతారంలో బుడిబుడి అడుగుల బ్రహ్మచారిగా వచ్చి, బలిని అణచడానికి త్రివిక్రమరూపం ధరించాడు. ధరించిన రూపానికి అనుగుణంగా వారి ఆహారవిహారా లుంటాయి. ఏ రూపంలో మనం కొలుస్తున్నామో దానికి అనుగుణంగా మంత్రాల తీరు ఉంటుంది.

ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోకుండా ప్రతీ దేవుణ్నీ వెజిటేరియన్‌గానో, శాంతమూర్తిగానో చేయడం అవివేకం. అసలు శాకాహారానికి, భక్తిభావానికి లింకేమిటో నాకు అర్థం కాదు. శాకాహారులందరూ సన్మార్గులనీ, మాంసాహారులందరూ దుర్మార్గులని ఏ పురాణంలోనూ రాయలేదు. ప్రపంచంలో 80 శాతం మంది మాంసాహారులే. వాళ్లంతా దుర్మార్గులనగలమా? ఇది ఆలోచించకుండా శాకాహారులు తాము పుణ్యాత్ములమంటూ పోజు కొడుతూంటారు. దశాబ్దాల పాటు నాన్ వెజిటేరియన్‌గా ఉంటూ వచ్చి యీ మధ్యే వెజిటేరియన్ అయినవాణ్ని పట్టలేం. ‘నేను నీచు ముట్టనండి. పక్కా వెజిటేరియన్‌ అయిపోయాను. మా యింట్లో పూజలూ అవీ ఎక్కువండి.’ అని డప్పేసుకుంటారు. శాకాహారంలో  అంత విశిష్టతే ఉంటే, తొలి నుంచీ శాకాహారిగా ఉన్నవాడు నీకంటె గొప్పవాడన్నమాట. శాకాహార జంతువులు నీ కంటె గొప్పవన్నమాట! అది ఒప్పుకో.

ప్రాచీనకాలంలో యిలాటి భావన లేదు. ఋషులు కూడా మాంసభక్షణ చేశారు. ‘వాతాపి జీర్ణం’ కథలో అగస్త్యుడు పొట్టేలు మాంసం తిన్నాడు కదా. భక్త శిరియాళుడి కథ చూడండి. శివుడు జంగమ వేషంలో వచ్చి చిన్న పిల్లవాడి మాంసం వడ్డించమంటాడు. జంగముడు నరమాంసం తినడమేమిటని శిరియాళుడు ఆశ్చర్యపడడు. తన కొడుకు మాంసం వడ్డిస్తాడు. ఇప్పటికీ గ్రామదేవతలందరికీ జంతుబలులు తప్పనిసరి. హైదరాబాదులోని పెద్దమ్మ గుడిలో పోతును కోసి బలిస్తారు. మనం దేవుడికి నివేదించేది నైవేద్యం. దేవుడు ఆరగించగా మిగిలినది మనకు ప్రసాదం. దేవత మాంసం ముద్ద ముట్టనిదైతే ఆవిడకు కోడినో, మేకనో, గొఱ్ఱెనో అర్పించడం దేనికి? మాంసాహారం తిన్నంత మాత్రాన వాళ్లు దేవీదేవతులు కాకుండా పోరు. చరిత్రలో, పాత కథల్లో కూడా కాళికి నరబలులు యిచ్చేవారని చదివాం. కలకత్తా కాళీఘాట్‌లో యిప్పటికీ ప్రతీ రోజూ జంతుబలి ఉంది.

ఇక మద్యం గురించి చెప్పబోయేముందు శివుడు శ్మశానవాసిగా ఉండే రూపంలో భంగు సేవిస్తాడనే విషయం కూడా మనం గమనించాలి. హోలీ పండగలో భంగు తీసుకునేవారు శివుడి పేరుతోనే సేవిస్తారు. మా చిన్నప్పుడు త్రినాథ వ్రతము అనేది ఒకటి ఆచరించేవారు. ఇప్పుడుందో లేదో తెలియదు. జాతర్లలో, తిరుణాళ్లలో అమ్మడానికి ఆ వ్రతవిధాన పుస్తకాలను పబ్లిషరు మా ప్రెస్‌లో అచ్చు వేయించేవాడు. కాపీలు లక్షల్లో అమ్ముడుపోయేవి కాబట్టి, అది పాప్యులరే అనుకోవాలి. బ్రహ్మ, విష్ణు, శివుడు ముగ్గుర్నీ కొలిచే వ్రతమది. పూజాసామగ్రిలో తమలపాకుతో పాటు గంజాయి ఆకు కూడా ఉండేది. బహుశా శివుడికి ప్రతీక ఏమో!

ఉజ్జయినిలో మహాకాలుడి గుళ్లో శ్మశానం నుంచి అప్పుడే తెచ్చిన బూడిదతో భస్మాభిషేకం చేస్తారు. లయకారుడు, మృత్యువుని శాసించే శివుని రూపం కాబట్టి అక్కడి పూజ అలా ఉంటుంది. ఉజ్జయినిలోనే కాలభైరవాలయంలో మద్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. కాశీలోని కాలభైరవాలయంలో కూడా ఆ సంప్రదాయం ఉంది. కాపాలికులు మద్యాన్ని శివుడికి నివేదించి, దాన్నే తీర్థంగా సేవిస్తారు. ఆ దేవుడికి అది ప్రీతిదాయకం అని తరతరాల నమ్మకం. కాదనడానికి మనం ఎవరం? కాలభైరవ రూపంలోని శివుడు మద్యప్రియుడు అని అంటే చావగొట్టేస్తాం, నువ్వు హిందూద్రోహివి అంటే ఎలా చచ్చేది? మహువా చెప్పినట్లు మనం యిష్టదైవానికి ఒక రూపాన్ని, ఒక అభిరుచిని ఆపాదించుకుంటాం. మంగళగిరి నరసింహస్వామికి పానకం సమర్పిస్తాం, సాయిబాబాకు పేలాలు సమర్పిస్తాం, శివలింగానికి చెంబెడు నీళ్లతో సరిపెడతాం. దేవుణ్ని లేదా దేవతను మాంసాహారిగా భావించుకుంటే అదే సమర్పిస్తాం. దీనిపై రగడ అనవసరం.

ప్రస్తుత వివాదం కాళి గురించి కాబట్టి కాళిని అర్చించే విధానం గురించి, తంత్రం, వామాచారం గురించి నేను సేకరించిన సమాచారం మీతో పంచుకుంటున్నాను. వామాచారం గురించి ఎందుకంటే కాళి వామాచారంలో ప్రధాన దేవత. మంత్రతంత్రాలు అనే మాట విన్నా వాటి అర్థం సరిగ్గా తెలియనివారి కోసం జమ్మలమడక మాధవరాయ శర్మగారు ‘‘విజ్ఞాన సర్వస్వము నాలుగో భాగం – దర్శనములు-మతములు’’ (తెలుగు యూనివర్శిటీ వారి 1992 ప్రచురణ) కోసం రాసిన వ్యాసం నుంచి సమాచారం యిస్తున్నాను.  వేదాలలో నిర్దిష్టమైన జ్ఞానరీతులకు క్రియా పద్ధతి (ప్రయోగపద్ధతి)ని తంత్రమంటారు. వీటి సంఖ్య సరిగ్గా తెలియదు కానీ మేరు తంత్రం 108 తంత్రాలను పేర్కొంది. వీటిలో కొన్ని వేదానుకూలమని, శాక్త తంత్రాలు వంటి కొన్ని కాదని తోస్తుంది. శాక్త తంత్రాలలోని సప్తవిధానాలైన ఆచారాల్లో ఒకటైన వామాచారం పూజాపద్ధతి వైదికంగా ఉండదు. తంత్రాలు మూడు రకాలు. 1. దేవ (లేదా బ్రాహ్మణ) తంత్రాలు 2. బౌద్ధ తంత్రాలు 3. జైన తంత్రాలు. బ్రాహ్మణ తంత్రాలు మూడు రకాలు. పాంచరాత్రం వంటి వైష్ణవాగమాలు, శైవ తంత్రాలు (వీటిలో కాపాలికం కూడా ఉంది), శాక్త (శక్తికి సంబంధించిన) తంత్రాలు.

ప్రస్తుతాంశం కాళి కాబట్టి శాక్త తంత్రాల గురించే రాస్తున్నాను. శాక్త పూజారీతి రహస్యం. సంప్రదాయం బట్టే తెలుసుకోవాలి. ఇవి మూడు రకాలు. సాత్వికం (వీటిని తంత్రం అంటారు), రాజసం (యామలము అంటారు), తామసం (డామరము అంటారు).  దీక్ష పొందిన శిష్యులు గురువుల వద్ద వీటిని నేర్చుకోగలరు. ఈ దీక్షల్ని ఆణవదీక్ష, శాక్తదీక్ష, శాంభవదీక్ష అనే మూడు వర్గాల్లో విభజించారు. శాక్తమతంలో మూడు (పశు, వీర, దివ్య) భావాలు, ఏడు ఆచారాలు ఉన్నాయి. అవి వేదాచారం, వైష్ణవాచారం, శైవాచారం, దక్షిణాచారం, వామాచారం, సిద్ధాంతాచారం, కౌలాచారం. వీటిలో కౌలాచారం అతి నిగూఢం. దీనిలో పంచ మకారాలను ఉపయోగిస్తారు. అవి మద్యం, మాంసం, మత్స్యం, ముద్ర (అటుకులు, గోధుమలు, సెనగలు అని అర్థం), మైథునం. శ్యామా రహస్యము అనే గ్రంథంలో దీనికి ప్రమాణముంది. శ్యామా అంటే నల్లనిది అని అర్థం. అది కాళీమాతకు మరో పేరు. కాళిదాసు రాసిన శ్యామలా దండకాన్ని ‘‘మహాకవి కాళిదాసు’’లో పెట్టారు. జనసంఘ్ స్థాపించిన శ్యామా ప్రసాద్ ముఖర్జీకి ఆవిడ పేరే పెట్టారు. జనసంఘ్ లేదా బిజెపి నాయకులకు శ్యామా అనే పేరు అలవాటు లేక ఆయన పేరును శ్యామ్ (కృష్ణుడని అర్థం) ప్రసాద్ ముఖర్జీగా తన పుస్తకాల్లో రాస్తూంటారు.

నేను పైన చెప్పిన పుస్తకంలోనే కృష్ణమూర్తి అనే ఆయన రాసిన వ్యాసం ప్రకారం మద్యమాంస సేవనం చాలా శుభకరమైనదని యీ మతభావన. వాటిని సేవించి, ఖపుష్పము (రజస్వలయైన స్త్రీ యొక్క రజస్సు)తో కులస్త్రీని పూజించడం, వామమతస్థులైన పరాశక్తిని ఆరాధించడం యీ మార్గ ముఖ్యలక్షణాలు. వామమార్గావలంబకుడు మద్యమాంసాదులతో దేవిని పూజించి సంతృప్తి పరచే పద్ధతి ‘కులార్ణవం’లో వివరించబడింది. దాని ప్రకారం సుర శక్తిస్వరూపం, మాంసం శివస్వరూపం. ఏ కులస్త్రీ ఐనా సాక్షాత్తూ కాళికా స్వరూపం.

ఇటువంటి పూజలందుకునే కాళీమాత సాత్వికరూపం కలది కాదు. ఆమె పుట్టుకే భీకరం. శివపురాణం ప్రకారం దక్షయజ్ఞం తర్వాత పరమశివుడు రుద్రతాండవం చేసి తన జటాజూటంలోంచి ఒక జటను పీకి నేలపై కొట్టినపుడు వీరభద్రుడు ఉద్భవించాడు. మరో జట లోంచి మహాకాళి ఉద్భవించింది. ఆమె యజ్ఞధ్వంసానికి వెళ్లినపుడు తోడుగా వెళ్లిన రూపాలు – కాళి, కాత్యాయని, ఈశాని, చాముండ, ముండమర్దిని, భద్రకాళి, భద్ర, త్వరిత, వైష్ణవి. మార్కండేయ పురాణం ప్రకారం చండముండులను సంహరించడానికి వచ్చిన చండికకు కోపం వచ్చి ముఖం నల్లబడింది. ఆ ముఖంలోంచి నల్లటి రంగులో కాళి చేతిలో కత్తి ధరించి, పులిచర్మం ధరించి ఉద్భవించింది. రాక్షస సేనలతో పాటు తర్వాత శుంభనిశుంభులను కూడా చంపింది. రాక్షసులను చంపుతూ చంపుతూ ఆమె యావత్తు విశ్వాన్నీ నాశనం చేయబోయింది. విష్ణువు వచ్చి ఆపబోయి, భంగపడి తప్పుకున్నాడు.

ఆమెను ఆపడానికి శివుడికి తోచిన ఏకైక మార్గం, ఆమె దారికి అడ్డుగా పడుక్కోవడం. (రాస్తా రోకోకు ఆద్యుడు ఆదిశంకరుడు అనుకోవాలి). తన భర్తను తొక్కాక తను హద్దు మీరి ప్రవర్తిస్తోందని కాళికి తోచింది.  రక్తసిక్తమైన నాలుకను బయటకు వేలాడేసి ఒగరుస్తూ ఆగిపోయింది. కాళి శివుణ్ని నేల మీద పడేసి తొక్కుతున్న విగ్రహాలు, బొమ్మల్లో ఆమె కుడి పాదం ముందుకు ఉంటే భక్తుడు దక్షిణాచారాన్ని అనుసరిస్తున్నాడని, ఎడమపాదం ముందుకు ఉంటే భక్తుడు వామాచారాన్ని పాటిస్తున్నాడని అర్థమట. పూర్తి నల్లగా ఉంటే కాళి, కాస్త నీలం రంగు కలిసి ఉంటే తార.

ఎలా చూసినా కాళిది ఉగ్రరూపం. వడ, పాయసంతో తృప్తి పడే రకం కాదు. ఆమెకు మద్యమాంసాలు యిష్టమైతే అలాగే కానీయండి. మీ స్టాండర్డయిజేషన్ పైత్యంతో ఆవిడ రూపాన్ని, స్వభావాన్ని మార్చేయకండి. ఏ దేవతను అలాగే ఉంచండి. ఇష్టం లేకపోతే మరో దేవతను కొలవండి కానీ ప్రాచీన సత్యాలను తారుమారు చేయకండి. (కాళీ మాత, మహువా)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2022)

[email protected]