మచిలీపట్నం సభలో పవన్ కళ్యాణ్ పెద్దన్న పాత్ర పోషించాలని కాపులకు పిలుపునిచ్చారు. దాని భావమేమిటో నాకు సరిగ్గా అర్థం కాక మీతో నా ఆలోచనలు పంచుకుంటున్నాను. ఎవరైనా సహేతుకంగా చెప్పగలిగితే సంతోషిస్తాను. పెద్దన్న అనేది పాశ్చాత్యులు పెత్తనం చలాయించే బిగ్ బ్రదర్ అనే అర్థంలో వాడతారు. మంచి ఆర్గనైజర్ అయి వుండి, తన కంటె తక్కువ స్థాయిలో ఉన్నవారిని అదిలించి, నోరెత్త నీయకుండా చేసే స్వభావాన్ని బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ అంటూంటారు. తూర్పు యూరోప్ దేశాలను రష్యా తన చెప్పుచేతల్లో ఉంచుకునే రోజుల్లో యీ వర్ణన ఎక్కువగా వినేవాణ్ని. ప్రస్తుతం అమెరికాపై అప్పుడప్పుడు యీ పదప్రయోగం చేస్తూంటారు. పవన్ కళ్యాణ్ కాపులను ఆ విధంగా తయారవ్వమని చెప్పారని నేననుకోవటం లేదు. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో వ్యక్తిగతంగా కాపులు పెత్తనం చలాయిస్తూ ఉండవచ్చేమో కానీ, రాష్ట్ర రాజకీయాల పరంగా వాళ్లు పెత్తనం చేసే స్థితికి రాలేదని, ఆ స్థితి కోసం వారు ఎదురు చూస్తున్నారనీ అందరికీ తెలుసు.
ఇక మన తెలుగు పలుకుబడి ప్రకారం అంటే పెద్దన్నయ్య అంటే బాధ్యత, త్యాగం, ఔదార్యం, సర్దుబాటు గుర్తుకు వస్తాయి. దానితో పాటు ఆయన మాటను అందరూ శాసనంగా మన్నించటం కూడా సహజమనే అర్థం వస్తుంది. అన్నదమ్ముల్లో పెద్దవాడు అనగానే తమ్ముళ్ల కోసం స్వసుఖాన్ని వదులుకుని, వాళ్ల బాగు కోసం తపించే వ్యక్తి అనే అందరూ అనుకుంటారు. మంచీచెడూ అన్నీ తెలిసి ఉండి, తక్కిన వాళ్లకు మార్గనిర్దేశనం చేస్తూ, నిస్వార్థంగా కుటుంబశ్రేయస్సు కోసం శ్రమించే వ్యక్తి పెద్దన్న అని సమాజం భావన. అతనికి సర్దుకునే గుణాన్ని చిన్నప్పటి నుంచి యింట్లో అలవాటు చేస్తారు. మూడేళ్ల తమ్ముడుంటే, ఐదేళ్ల కుర్రవాడికి కూడా ‘తమ్ముడు చిన్నవాడు కదమ్మా, నీ బొమ్మ వాడికియ్యి, కాస్సేపు ఆడుకుంటాడు’ అని తలిదండ్రులు చెప్తారు. దానికి బదులుగా తమ్ముడికి ‘అన్నయ్య చెప్పిన మాట వినాలి, దణ్ణం పెట్టాలి’ అని నేర్పుతారు. పెద్దయినా యిదే తంతు. మాట వినడమనేది గ్యారంటీ ఉండదు. వాడికి నచ్చితేనే మాట వింటాడు. లేకపోతే మొహం చాటేస్తాడు. ఏతావతా చిన్నవాడికి దక్కేది బొమ్మలు, సౌకర్యాలు. పెద్దవాడికి దక్కేది దండాలు, పెద్దయ్యాక శుభాశుభాల్లో ఒక జత పంచెల చాపు.
కాలం గడిచి చిన్నవాడు ఎక్కువ సంపాదిస్తున్నా, పెద్దవాడుండగా చిన్నవాడు ఖర్చు పెట్టడం సమంజసం కాదనే భావన మనలో ప్రబలంగా ఉంది. కుటుంబ సభ్యులందరూ కలిసి చేయవలసిన శుభ లేదా అశుభ కార్యక్రమాల ఖర్చులో సింహభాగం పెద్దవాడి మీద పడుతుంది. తమ్ముళ్లతో, చెల్లెళ్లతో ఏమిటర్రా యీ పక్షపాతం అని అతను వాపోతే ‘అమ్మానాన్నకు మొదటి సంతానంగా పుట్టి వారి ప్రేమను, అభిమానాన్ని పూర్తిగా పొందావు. నిన్ను గారంగా పెంచారు. మా దగ్గరకు వచ్చేసరికి నీరసించి, సరిగ్గా ముద్దూముచ్చటా జరపలేదు. ఆనాడు నువ్వు పొందిన ప్రేమకు యిది మూల్యం అనుకో’ అంటారు వాళ్లు. మర్యాదలు, సంప్రదాయాలు పాటించవలసిన భారం కూడా పెద్దన్న మీదే పడుతుంది. లేకపోతే ఊళ్లో వాళ్లు తప్పు పట్టేది అతన్నే. చిన్నవాళ్లకు తెలియకపోయినా పెద్దవాడు చెప్పద్దా? అంటారు. ఆ ‘చిన్న’వాళ్లకు షష్టిపూర్తి అయినా యింకా చిన్నవాళ్లగానే లెక్క.
అన్నిటి కంటె ఘోరం మేజర్లయిన చిన్నవాళ్లు తప్పు చేసినా సమాజం పెద్దవాణ్ని తప్పు పడుతుంది. ‘పెద్దవాడై ఉండి మంచీసెబ్బరా చెప్పవద్దా?’ అంటారు. ‘నేను చెప్పినా వినరయ్యా, చెప్పినపుడు ఔనని కాదని ఏమీ చెప్పరు. అదే మనకిచ్చే మర్యాద, ఎదిరించి మాట్లాడలేదు సంతోషం అనుకుని ఊరుకోవాలి.’ అని పెద్దవాడు చెప్పుకోలేడు. వేరెవరో కాదు, చిరంజీవి గారికే యీ గోడు తప్పటం లేదు. పవన్ కళ్యాణ్ అరుదుగా, నాగబాబు తరచుగా ఏదో ఒక యిబ్బందికరమైన మాట అంటారు. తక్కినవాళ్లు చిరంజీవి గారు ఏం చేస్తున్నారు? అంటూ కామెంట్లు పెడుతారు. ఏదో చిన్నపుడైతే ‘అదేమిట్రా’ అనవచ్చేమో కానీ, తమ్ముళ్లకు యింత వయసు వచ్చాక ఏమంటారు? తనవరకు తాను మాట తూలరు. కానీ తమ్ముళ్ల పరంగా మాట పడుతూంటారు.
ఈ కర్మం చాలనట్లు ఆయన్ను తెలుగు సినిమా యిండస్ట్రీకి కూడా పెద్దన్నగా, పెద్దదిక్కుగా చేద్దామని చూస్తారు కొందరు. ఇండస్ట్రీలో గొడవలు పరిష్కరించకుండా ఏం చేస్తున్నాడు? అని ప్రశ్నలు సంధిస్తారు. కుటుంబం అంటే తమ్ముళ్లు, చెల్లెళ్ల బాధ్యత ఎలాగూ తప్పదు. ఇక యిండస్ట్రీ తమ్ముళ్ల భారం కూడా నెత్తిన వేసుకోవాలా అనుకుని, ఆయన నేను పరిశ్రమకు ముద్దుబిడ్డనే కానీ, పెద్దదిక్కును కాదు, పెద్దన్నను కాదు బాబోయ్ అంటున్నారు. ఎందుకంటే దీనిలో త్యాగమూ, బాధ్యతే తప్ప అధికారమూ, ఆహ్లాదమూ ఏమీ లేదు.
అలంకారప్రాయమైన యీ పెద్దన్నయ్య పాత్రను పోషించమని కాపులను పవన్ అడగడం ఏమంత ధర్మం అనిపిస్తుంది నాకు. ఇంట్లో అయితే ఎలాగూ తప్పదు, సమాజంలో అయితే కొద్దికాలమైనా అధికారం, పెత్తనం చలాయించి, పెదరాయుడు లేదా పెద్ద నాయుడు అనిపించుకుని, కొంతకాలం పోయాక అనుభవించింది చాల్లే, తక్కివాళ్లను కూడా ఆ అనుభవం దక్కాలని అనుకున్నపుడు, తను సర్దుకుని, సలహాదారుగా మిగలవచ్చు. మరి కాపులకు కావలసినవన్నీ, రావలసినవన్నీ దక్కేసి యిక మనకు చాల్లే అనుకునే దశ వచ్చేసిందా? కాపులకు ఏమీ దక్కలేదని నేననటం లేదు. వాళ్లు ముఖ్యమైన శాఖలకు మంత్రులుగా, ఉప ముఖ్యమంత్రులుగా చేశారు. కీలకమైన పదవులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ రాలేదు, విడిపోయాకా రాలేదు. ఆ బాధ మాత్రం వారిలో కొందరికి ఉంది. రెడ్లు, కమ్మలు సరేసరి, జనాభాలో తక్కువ శాతం ఉన్న వెలమ, వైశ్య, బ్రాహ్మణ కులాల వారికి సైతం దక్కిన ఆ పదవి మనకు మాత్రం ఎందుకు దక్కకపోవాలి అనే వ్యథ ఉంది.
ఆ పదవేదో వచ్చి ఓ రెండేళ్లో, మూడేళ్లో పాలించాక పోన్లే బిసిలకు కూడా యిద్దామనుకుని త్యాగాలు చేయవచ్చు. కానీ ఆ పదవి రాలేదు. రావడానికి త్యాగం చేయమంటున్నారు పవన్. తను కాపుబిడ్డ కాబట్టి, కాపు ముఖ్యమంత్రి కావాలంటే తక్కిన కాపులు ఔదార్యం చూపి, సర్దుకుని మిగతా కులాలకు అవకాశాలివ్వాలని పవన్ విజ్ఞప్తి. పోన్లే, మనవాడికి ముఖ్యమంత్రి పదవి వస్తోందంటే యీసారికి టిక్కెట్ల పంపిణిలో, కాబినెట్ కూర్పులో దేని గురించి పట్టుబట్టకుండా సర్దుకుపోదామని కాపులు అనుకున్నా, పవన్‌కు సిఎం ఛాన్సు ఉందన్న గ్యారంటీ ఏముంది? ఈసారి టిడిపితో పొత్తు తప్పదని పవన్ యించుమించు చెప్పేశారు. దానికి కారణం స్థానిక బిజెపి వాళ్లే నన్ను టిడిపి కౌగిలిలోకి నెట్టారని అన్నారు. ఓకే, మంచిదే. టిడిపి-జనసేన కూటమి ఏర్పడుతోంది, సంతోషం. మర్యాదపూర్వకమైన ఏర్పాటు ఉంటేనే పొత్తు అని పవన్ గతంలో చెప్పారు. అంటే ఆయనకు ముఖ్యమంత్రి పదవి ఖరారైందని అనుకోవాలా?
పవన్ ఒక్కరికే ముఖ్యమంత్రి పదవి, తక్కిన కాపులకు ముఖ్యపదవులు రావు, చిల్లర వాటితో సర్దుకోవాలి అని ఒప్పందమైతే పోనీ దానిలో కూడా మేలు చూడవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక కాపుబిడ్డ ముఖ్యమంత్రి కావడానికి యింతకంటె మార్గం లేదు అని సర్ది చెప్పుకోవచ్చు. ఇదీ ఒప్పందం అని బహిరంగ ప్రకటన వచ్చినపుడు యీ పెద్దన్న పాత్ర పిలుపులో ఔచిత్యం కనబడుతుంది. అలాటి ప్రకటనే వెలువడితే ఆ కూటమి వైసిపికి గట్టి పోటీయే యిస్తుంది. పవన్ అభిమానులు, కాపులలో చాలామందికి ఉత్సాహం తన్నుకొస్తుంది. రాజకీయ రాగద్వేషాలు పక్కన పెట్టి పోన్లే మనవాడికీ ఓ ఛాన్సిద్దాం అనుకుని ఓటేసే స్కోపుంది. బాబు వెనక్కాల ఉన్న కమ్మల్లో కొందరు మాత్రం మొహం చిట్లించినా, వైసిపిని దింపాలంటే యిదొక్కటే దారి, డ్రైవింగ్ సీట్లో ఎవరు కూర్చొన్నా స్టీరింగు మన చేతిలోనే ఉంటుందిగా అని సర్దిచెప్పుకుని ఓటేయవచ్చు. కానీ పవన్‌కు ఏ ఆఫర్ యిస్తున్నారో బాబు యిప్పటిదాకా చెప్పలేదు. వారి అనుకూల మీడియాకు లీకులు కూడా యివ్వటం లేదు. ఒకవేళ ఆయన పవన్ ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ఒప్పుకుని ఉండకపోతే మాత్రం, పవన్ కాపు సోదరులకు యిచ్చిన పిలుపుకి అర్థం లేకుండా పోతుంది.
ఇప్పటిదాకా కాపులు తాము పెద్దన్న హోదాలో ఉన్నామని అనుకోవటం లేదు. మేం వెనకబడి ఉన్నాం, మాకు బిసి హోదా కావాలి, అని వాళ్లలో కొంతమంది అడుగుతున్నారు. మా ‘జాతి’ అన్ని విధాలా అన్యాయమై పోతోందని, రిజర్వేషన్లు యిచ్చి తీరాలని ముద్రగడ అంటారు. రిజర్వేషన్ల డిమాండ్ సహేతుకమని పవన్ అభిప్రాయం కూడా. రిజర్వేషన్లు యివ్వను అని చెప్పిన జగన్‌కు ఓట్లెందుకు వేశారు? అని మచిలీపట్నం కాపులను పవన్ మందలించారు. పేదలు, ధనికులు అన్ని కులాల్లోనూ ఉన్నారు. మా వాళ్లలో పేదలు ఎక్కువమంది ఉన్నారు. కష్టపడతాం కానీ దానికి తగిన సుఖం మాకు దక్కదు అని కాపు నాయకుల అభిప్రాయం. తక్కినవాటి మాట అలా ఉంచి, రాజ్యాధికారం మాకు లేదు. సంఖ్యాబలం ఉన్నా రాజకీయాల్లో మాకు ప్రాముఖ్యత లేదు. ఉన్నవాడు త్యాగం చేయాలా? లేనివాడు చేయాలా? ఇన్నాళ్లూ రాజ్యం చేసిన రెడ్లు, కమ్మలు త్యాగాలు చేసి మమ్మల్ని ముఖ్యమంత్రి చేయాలి తప్ప కాపులెందుకు చేసి మళ్లీ వాళ్లను గద్దె కెక్కించాలి?
కాంగ్రెసు హయాంలో రెడ్లు చాలాకాలం పాలించినా, వేరే ఏ కులం వాడికైనా ఛాన్సు వచ్చే అవకాశం ఉండేది. కానీ కాంగ్రెసు బతికే సూచనలు లేవు కనుచూపు మేరలో లేవు. ఏ కులానికీ కట్టుబడని బిజెపికి ఆంధ్రలో అస్తిత్వం లేదు. ప్రాంతీయ పార్టీలైన టిడిపి ఉన్నంతకాలం కమ్మలు, వైసిపి ఉన్నంతకాలం రెడ్లు (జగన్‌ను క్రైస్తవుడైనా రెడ్డి ముద్రే వేశారు కాబట్టి) పాలిస్తారు. కాపు నాయకుడు అధినేతగా ఉన్న ప్రాంతీయ పార్టీ జనసేన సొంతంగా అధికారంలోకి వచ్చే సూచనలు ప్రస్తుతానికి లేవు కాబట్టి టిడిపి లేదా వైసిపి ద్వారానే కాపు ముఖ్యమంత్రి కావాలి. వైసిపి నాది ఒంటరి పోరు అంటోంది కాబట్టి అటు వెళ్లే ఛాన్సు లేదు. పొత్తు పెట్టుకుందాం అంటూ టిడిపి ప్రేమలేఖలు రాసింది కాబట్టి చేస్తేగీస్తే టిడిపియే కాపు (ప్రస్తుతానికి పవన్) ను ముఖ్యమంత్రి చేయాలి.
నిజానికి పెద్దన్నగా వ్యవహరించ వలసినది ఎవరైనా ఉన్నారా అంటే బాబు ఒకరే. 14 ఏళ్లు సిఎంగా చేశారు. ఏ తెలుగు నాయకుడికీ ఆ రికార్డు లేదు. ఆయనే చెప్పుకున్నట్లు ముఖ్యమంత్రి అనేది ఆయన చూడని పదవి కాదు. ఉమ్మడి రాష్ట్రానికే 9 ఏళ్లు చేశారు. పవన్ కాపులకు చేసిన పెద్దన్న ప్రసంగాన్ని ఆయన తనకు అన్వయించుకుని, త్యాగం చేసి టిడిపి అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రి చేస్తా అంటే టిడిపి విజయావకాశాలు కచ్చితంగా పెరుగుతాయి. ఇప్పుడు పార్టీ రాష్ట్రాధ్యక్షుడిగా బిసికి అవకాశం యిచ్చాంగా, అదే చాలు అనుకుంటే లాభం లేదు. బాబు ఉండగా టిడిపి పార్టీలో మరొకరు మాట చెల్లుతుందని అనుకోవడం భ్రమ. మూలవిరాట్టు ఆయనే, తక్కినవారందరూ ఉత్సవ విగ్రహాలే. ముఖ్యమంత్రి అంటే కనీసం హోదా ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం జరిగే మర్యాదలుంటాయి. బిసిల కిస్తే వైసిపిపై దెబ్బ కొట్టినట్లే ఉంటుంది. 2019లో కాపుల రిజర్వేషన్ ప్రకటించి, బాబు అటు కాపుల, యిటు బిసిల మద్దతు పోగొట్టుకుని అధికారాన్ని వైసిపికి ధారాదత్తం చేశారు. పవన్ బిజెపితో ఊరేగే కాలంలో బాబు బిసి ముఖ్యమంత్రి ప్రకటన చేసి ఉంటే బిసిలందరూ మొత్తంగా టిడిపి పక్షానికి వచ్చేసేవారు.
కానీ ఆయన అలా చేయలేదు. మళ్లీ సిఎం కావాలనే కాంక్ష పోలేదు. భార్యకు అవమానం జరిగిందంటూ ఆరోపించి దానికి విరుగుడుగా మళ్లీ సిఎంగా అసెంబ్లీలో అడుగు పెడతానని భీష్మప్రతిజ్ఞ చేశారు. పరువు పోతే పరువునష్టం దావా వేయవచ్చు. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వంశీని వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామని ప్రకటించవచ్చు. అంతేకానీ, తను మళ్లీ సిఎం అయితే భార్యపై పడిన మచ్చ మాసిపోతుందని ఎలా అనుకున్నారో తెలియదు. తాను నిరాధారంగా మాట్లాడానంటూ వంశీ క్షమాపణ చెప్పినపుడే ఆ మచ్చ పోయింది. కానీ సిఎం పదవిపై తన కాంక్షను వెలిబుచ్చడానికి దాన్ని బాబు ఉపయోగించు కున్నారు. పెద్దన్నలా త్యాగం చేసి, ఆ పదవి తనకిమ్మని పవన్ ఆయనను బహిరంగంగా అడగలేదు.
ఇక లోకేశ్ విషయానికి వస్తే, పాదయాత్రల ద్వారా నిలదొక్కుకుంటున్నట్లు కనబడుతోంది. రాజుల కాలంలో పట్టాభిషేకానికి ముందు యువరాజు దేశాటన చేసేవాడట. ట్విట్టర్లో చురుగ్గా ఉండడం అంటే అంతఃపురంలో ఉండి ఆదేశాలిచ్చినట్లే. ప్రజల మధ్య తిరిగినప్పుడు అప్రయత్నంగానే అనేక అంశాలపై ఎడ్యుకేట్ అవుతారు. వైయస్ సుదీర్ఘ పాదయాత్ర చేసినది కాంగ్రెసులో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి. అప్పట్లో కాంగ్రెసులో చాలామంది ముఖ్యమంత్రి పదవి ఆశావహు లుండేవారు. వారిలో కొందరు అధిష్టానాని కిష్టులుండేవారు. పాదయాత్ర ద్వారా వైయస్ తన ప్రజామోదాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుని అధిష్టానం తనను చచ్చినట్లు గుర్తించేలా చేసుకున్నారు. కాంగ్రెసు నెగ్గగానే యితన్ని ముఖ్యమంత్రి చేయక తప్పదురా అనిపించుకున్నారు. ప్రస్తుతం లోకేశ్ కూడా టిడిపిలో అదే పని చేస్తున్నారు. తండ్రి తనకు ముఖ్యమంత్రి పదవి యిచ్చేట్టు లేరు. వచ్చేసారి కూడా తనే సిఎం అని శపథం పట్టడంతో లోకేశ్ హతాశుడై పాదయాత్ర మొదలుపెట్టారు.
పాదయాత్రలో ఎడాపెడా హామీలిస్తున్నారు, నియోజకవర్గాల్లో అభ్యర్థులెవరో ప్రకటిస్తూ తనకంటూ విధేయులను తయారు చేసుకుంటున్నారు. వారసత్వం ద్వారా వచ్చిన నాయకత్వం కాదు నాది, స్వతహాగానే నాయకుణ్ని, టిడిపిలో బాబు తర్వాత అధినాయకుణ్ని నేనే అని పార్టీలో, ప్రజల్లో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. 2024లో బాబు సిఎంగా ఏడాది, రెండేళ్లు చేసి, వయోభారం అంటూ పక్కకు తప్పుకుని లోకేశ్‌కు పదవి అప్పగించినా, లోకేశ్‌ను మొదటి నుంచి ఉపముఖ్యమంత్రిగా పెట్టుకుని కీలకశాఖలు అప్పగించినా జనం కళ్లెగరేయకుండా ముందే గ్రౌండ్ తయారు చేసుకున్నారు లోకేశ్. ఆయన పాదయాత్ర మొదలు పెట్టినపుడు మీడియా కవరేజి బాగానే వచ్చింది. తర్వాత ఎందుకోగానీ టిడిపి అనుకూల మీడియాలో కూడా బాగా తగ్గిపోయింది. ఇంతలో బాబు పాదయాత్ర మొదలుపెట్టారు. మీడియా ఎటెన్షనంతా అటు వెళ్లిపోయింది. లోకేశ్‌ను బొత్తిగా పట్టించుకోవడం మానేశారు.
ఇలా అయితే నేనెప్పుడు ఎదిగేను? అని లోకేశ్ పేచీ పెట్టారో, లేక బాబుకే యిది భావ్యం కాదని తోచిందో ఆయన విరమించుకున్నారు. లోకేశ్ అభ్యర్థులను ప్రకటించినా బాబు కిమ్మనటం లేదు. టిడిపిలో వేరే ఏ నాయకుడూ యీ సాహసం చేయలేడు. అందువలన పార్టీలో బాబు తర్వాత అంతటివాడు లోకేశే అని రూఢి అయిపోయింది. 2024లో టిడిపి ప్రభుత్వం ఏర్పడినా దానిలోనూ యీ వరసే ఉంటుంది అని బాహాటంగా తెలియ చెప్పినట్లుంది. టిడిపి-జనసేన మిశ్రమ ప్రభుత్వం ఏర్పడినా, యిది మారుతుందాన్న సందేహం వస్తోంది. ఇలా చూస్తే పవన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా హుళక్కేనా అనిపించదూ? గాడ్ ఫర్బిడ్… అదే జరిగితే, పెద్దన్నలా త్యాగం చేసే మొదటి కాపు పవనే అవుతారేమో! ముఖ్యమంత్రిగా లేక, ఉపముఖ్యమంత్రి పదవీ రాక, వైసిపి తరహా అరడజను ఉపముఖ్యమంత్రుల్లో ఒకరిగా మిగిలితే త్యాగం కాక మరేమిటి?
ఈ విషయంపై సమీప భవిష్యత్తులో స్పష్టత వస్తుంది. ఈలోగా పవన్ కాపుల కిచ్చిన సలహా గురించి చర్చించుకుంటే, ఆయన ‘మీకు సంఖ్యాబలం ఉంది కాబట్టి పెద్దన్న పాత్ర వహించండి, బిసిలను, దళితులను దగ్గరకు తీసుకోండి, అక్కున చేర్చుకోండి, కమ్మలతో, రెడ్లతో, క్షత్రియులతో గొడవ పడాల్సిన అవసరం లేదు.’ అని హితవు చెప్పారు. హిందూ ముస్లిములకు గాంధీ గారిచ్చిన సలహాలా ఉందిది. ఎందుకిదంతా? రాష్ట్రంలో యిప్పుడేమైనా కులకలహాలు జరుగుతున్నాయా? ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటున్నారా? సమాజం ఎప్పటి లాగానే నడిచిపోతోంది. జనాలు ఎవరితో అవసరం ఉంటే వారితో సఖ్యంగా ఉంటున్నారు. అవసరం లేకపోతే ఊరుకుంటున్నారు. అడ్డు వస్తే పేచీ పెట్టుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినపుడే టిక్కెట్ల కోసం, గెలుపు కోసం కొన్నాళ్లు కులరాజకీయాలు నడుస్తాయి. తర్వాత ఎప్పటి లాగానే బండి నడుస్తుంది.
పవన్ యిప్పుడీ సలహా యివ్వడానికి కారణం, రాజకీయంగా తనకు యిబ్బంది వస్తుందనే భయం. కాపులకు ఒక్కో జిల్లాలో ఒక్కో కులం వారు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. జిల్లాను బట్టి కమ్మలు, గవరలు, రెడ్లు, క్షత్రియులు, దళితులు.. యిలా ఉన్నారు. ‘ఒక కాపు ముఖ్యమంత్రి అయితే కాపుల సందడి పెరిగి పోతుందనే భయంతో వాళ్లు మనల్ని గెలవ నీయకుండా చేస్తారేమో, యిప్పణ్నుంచి సఖ్యంగా ఉండండి. మీ ఏటిట్యూడ్ మార్చుకోండి’ అని పవన్ చెప్తున్నారు. ఓట్ల గురించి కాకపోయినా సఖ్యంగా ఉండడం ఎప్పుడూ మంచిదే. ఇక్కడ ప్రశ్నేమిటంటే వీళ్లు మార్చుకున్నంత మాత్రాన అవతలివాళ్లు మారతారా? అని. ఓ సినిమాలో లవ్ లెటర్స్ రాసిన కుర్రాణ్ని మందలిస్తూ ప్రిన్సిపాల్ అంటాడు – ‘ఏరా నీకు అక్క చెల్లెళ్లు లేరూ?’ అని. ‘ఉన్నారు సార్. కానీ వాళ్లకూ లెటర్స్ వస్తున్నాయి. మేం రాయడం మానేస్తే అవతలివాళ్లు మానేస్తారా?’ అని లాజిక్ లాగుతాడు ఆ స్టూడెంటు. పెద్దన్న అంటే నాయకత్వం, గౌరవం పొందడం అనే అర్థంలో తీసుకుందామంటే అవతలి వాళ్లు వీళ్లకా గౌరవం కట్టపెట్టాలి కదా. వీళ్లంతట వీళ్లే వెళ్లి అడగలేరుగా.
కాపులకున్న మరో ముఖ్యసమస్య – ఐక్యతాలేమి. దానికి కారణం పవనే చెప్పారు సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత తక్కువ అని. మరి దానికి విరుగుడేమిటి? సంఖ్య తగ్గించుకోలేరు కదా. నిజానికి కాపుల్లో తెగలు ఎక్కువ. అందరం ఒక్కటే అని రాజకీయాల కారణంగా చెప్పుకుంటున్నారు తప్ప, సామాజికపరంగా అలా అనుకోరు. పెళ్లిళ్లు చేసుకోరు. ఎవరికి వారే గొప్ప అనుకుంటారు. ఇంకో మాట కూడా ఉంది, స్వభావరీత్యా కూడా కాపులు కలిసికట్టుగా ఉండి ఒకరికొకరు సాయపడరు అని. ఈ మాట ప్రతీవాళ్లూ వాళ్ల కులం గురించి చెప్పుకుంటారు. ‘ఫలానా కులస్తులైతే ఒకడు బాగుపడితే తనవాళ్లను పదిమందిని బాగుపరుస్తాడు. మా వాళ్లున్నారు చూశారూ, ఒకడు పైకొస్తే పక్కవాడు ఓర్చలేడు. కాలు పట్టుకుని కిందకు లాగేద్దామని చూస్తారు. అంతా పీతల వ్యవహారం. అందుకే యిలా ఏడుస్తున్నాం.’ అంటారు. జాతిపరంగా తెలుగువాళ్లు తమిళుల గురించి, తమిళులు మలయాళీల గురించి, వాళ్లు పంజాబీల గురించి, వాళ్లు గుజరాతీల గురించి… యిలాగే చెప్తారు. నేను గమనించిం దేమిటంటే కులాభిమానంతో సాటి కులస్తులకు సాయపడే లక్షణం వ్యక్తిగతం. కొందరు చేస్తారు, కొందరు చేయరు. జనరలైజ్ చేయలేం.
కాపుల్లో ఐక్యత లేకపోవడం చేతనే తనకు ఓట్లు పడటం లేదని పవన్ అనుకుంటే అది పొరపాటు ఆలోచన. ఆయన రాజకీయాలను సీరియస్‌గా తీసుకుంటున్నాడని, అధికారాన్ని, అవకాశాన్ని యింకోళ్లకి అప్పగించేయడని తన చేతల ద్వారా నమ్మకం కల్గించినపుడు కాపులు, సినీ అభిమానులే కాదు, ఉన్న యిద్దరితో విసిగి, మూడో ప్రత్యామ్నాయం కోసం వెతుకుతున్న తటస్థులు కూడా ఓట్లేస్తారు. కుటుంబంలో పెద్దన్న అంటే బాధ్యత తలకెత్తుకుని, ఓర్పు ప్రదర్శిస్తూ, అందర్నీ కలుపుకుని పోతూ, గౌరవాన్ని సంపాదించు కునేవాడని మన సమాజంలో అనుకుంటాం. పవన్ ఉద్దేశమే అదే అయితే ఆయన కాపులకు యిచ్చిన సలహాను తనకు అన్వయింప చేసుకుని, ఆచరించి చూపించాలి. బాధ్యత తీసుకుంటా, ముస్లిములను గుండెల్లో పెట్టుకుంటా అని ఎప్పుడో బహిరంగ సభల్లో ప్రసంగించి వెళ్లిపోతే సరిపోదు. క్షేత్రస్థాయిలో నివసిస్తూ, అందరికీ అందుబాటులో ఉంటూ, తన పార్టీని ఊరూరా విస్తరింప చేసి, యితర కులస్తులకు కూడా పెద్ద పీట వేసి, వారి మాటలు కూడా వింటూ, చర్చలు జరుపుతూ, మేధావులను సంప్రదిస్తూ, పార్టీ అధికార ప్రతినిథులకు తర్ఫీదు యిస్తూ… యిలా ఎన్నో చేయాలి. అప్పుడు ఆటోమెటిక్‌గా ఆయనపై గౌరవం పెరుగుతుంది. అది ఓట్లగా మారుతుందా లేదా అన్నది అనేక యితర విషయాలపై ఆధారపడుతుంది. కానీ పార్టీకి ఒక చక్కని యిమేజి ఐతే ఏర్పడుతుంది కదా!
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)