మొన్న జరిగిన ఉపయెన్నికలలో కర్ణాటకలో ఫలితాలకు బిజెపి బాధపడకపోయినా, ముఖ్యమంత్రి బొమ్మాయ్ మాత్రం బాధపడి వుంటారు. ఎన్నికలు జరిగిన రెండిటిలో సిందగి స్థానాన్ని బిజెపి జెడిఎస్ నుంచి గెలుచుకుంది. హంగల్ స్థానాన్ని కాంగ్రెసుకు పోగొట్టుకుంది. అందువలన బాలన్స్ అయిందని పార్టీ అనుకోవచ్చు. కానీ పోయిన హంగల్ నియోజకవర్గం బొమ్మాయ్ సొంత జిల్లా హవేరీలో వుంది. ముఖ్యమంత్రి కాగానే వచ్చిన ఎన్నికలో తన సొంత జిల్లాలో ఓడిపోతే బాగుండదు కదా! ‘ఈయన యెడియూరప్పంత సమర్థుడు కాడు’ అనుకుంటే ప్రమాదం కదా!
నిజానికి యెడియూరప్ప నీడలోంచి బిజెపి బయట పడలేక పోతోంది. బిజెపి ప్రభావం చాలాకాలం పాటు మలనాడు (హాసన్, కొడగు, శివమొగ్గ, చిక్‌మగళూరు) ప్రాంతంలోను, కోస్తా (దక్షిణ కన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ) ప్రాంతంలోను మాత్రమే వుండేది. యెడియూరప్ప వచ్చి కాంగ్రెసుతో కినిసి వున్న లింగాయత్ కులస్తుల ఓట్లను కలిపాడు. అప్పటి నుంచి బిజెపి విజయపథం పట్టింది. ఇప్పటికీ లింగాయతుల మద్దతు అతనికే వుంది. వాళ్లను చూపించే అతను పార్టీని బెల్లించి అన్నీ తీసుకున్నాడు. ఎన్ని అవినీతి ఆరోపణలున్నా పార్టీ అతన్ని భరించింది అందుకే! చివరకు వయసు పేరు చెప్పి అతన్ని దిగిపోమన్నప్పుడు కూడా సవాలక్ష షరతులు పెట్టి తను చెప్పిన బొమ్మాయ్‌కే పదవి దక్కేట్లు చేశాడు. అతనికి యివ్వకపోతే తన కొడుక్కే యిమ్మనమంటాడేమోనని భయపడిన బిజెపి సరేనంది కానీ క్రమేపీ అతని ప్రాభవాన్ని తగ్గిద్దామని చూస్తోంది.
యెడియూరప్ప శిష్యుడైన సిఎం ఉదాసి మరణంతో హంగల్‌లో ఉపయెన్నిక అవసరం పడింది. ఉదాసి కుటుంబసభ్యులకే యిస్తే, యెడియూరప్పను పట్టుకోలేమని అనుకుని బొమ్మాయ్ సలహాతో ‘వేరే ఎవరి పేరైనా చెప్పు’ అని యెడియూరప్పతో అంది పార్టీ. అతను చెప్పిన సజ్జనార్‌కే యిచ్చింది. ఉపయెన్నికే కదాని అనుకోకుండా ముఖ్యమంత్రి, యితర మంత్రులు, యెడియూరప్ప, అతని కొడుకు విజయేంద్ర, అందరూ ప్రచారం చేశారు. ఇంత చేసినా అక్కడ కాంగ్రెసు అభ్యర్థి శ్రీనివాస్ మనే బిజెపి అభ్యర్థి ఎస్ ఎస్ సజ్జనార్‌పై 7వేల ఓట్ల తేడాతో నెగ్గాడు. ‘కోవిడ్ సమయంలో అతను చేసిన కృషిని మెచ్చి, ఓటర్లు విజయాన్ని కట్టబెట్టారు’ అని బొమ్మాయ్ హుందాగా ప్రకటించాడు. యెడియూరప్ప దిగిపోయి, బొమ్మాయ్ అధికారంలోకి వచ్చినపుడు హిందూత్వ రాజకీయాలు తగ్గుముఖం పడతాయని కర్ణాటక ప్రజలు అనుకున్నారు. కానీ అలా జరగకపోవడంతో నియోజకవర్గంలోని ముస్లిములు, ఒబిసిలు, దళితులు కలిసి బిజెపిని ఓడించారని విశ్లేషకులు అంటున్నారు.
ఇక సిందగి నియోజకవర్గానికి వస్తే అది జెడిఎస్ సిట్టింగు సీటు. జెడిఎస్ యిటీవల కాంతిహీనంగా మారడం చూసి చాలాకాలంగా స్తబ్ధంగా వున్న కుమారస్వామి అక్టోబరు నెలలో పెద్ద కసరత్తే చేశాడు. బెంగుళూరుకు 30 కిమీల దూరంలో వున్న తన కొబ్బరితోటలో వందలాది కార్యకర్తలను సమావేశ పరిచి ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించాడు. 224 మంది సభ్యులున్న అసెంబ్లీలో జెడియు వాళ్లు కనీసం 123 మంది ఉండాలన్నే లక్ష్యాన్ని స్ఫురింపచేసేట్లు ‘మిషన్ 123’ పేర 30 అంశాల కార్యక్రమాన్ని రూపొందించి, పార్టీలో లోపాలోపాలను చర్చించారు. 2022 జనవరిలో ప్రస్తుత ఎమ్మెల్యేల పనితీరును సమీక్షించి, అవసరమైతే కొత్తవారిని తీసుకు రావాలని నిశ్చయించారు. ‘పంచరత్న యోజనె’ పేరుతో మానిఫెస్టో రూపొందించారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, యువత, మహిళ అనే అయిదు రంగాలకు ప్రతీ ఏటా తలా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామని దానిలో వాగ్దానం చేశారు.
‘దేశమంతా ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయన్నదానికి ఆంధ్రలో వైసిపి, తమిళనాడులో డిఎంకె, బెంగాల్‌లో తృణమూల్ నిదర్శనం. మా పార్టీని ఓల్డ్ మైసూరు ప్రాంతం దాటి సుదూర తీరాలకు విస్తరింప చేయాలని అనుకుంటున్నాం. ఇన్నాళ్లూ గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టి పెట్టాం. ఇప్పుడు అర్బన్ నియోజకవర్గాలలోని బడుగు, బలహీన, దళిత, మైనారిటీ వర్గాలపై చూపు సారించి వారి ఓట్లూ ఆకర్షిస్తాం. 2023లో 30 మంది మహిళలకు టిక్కెట్లిస్తాం.’ అని కుమారస్వామి చెప్పుకున్నాడు. తన కొడుకు నిఖిల్, తన అన్నగారు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్ అధికారం కోసం కాట్లాడుకుంటున్నారన్న ప్రచారాన్ని ఖండించడానికి వారిద్దరినీ యూత్ కాన్ఫరెన్స్‌కు రప్పించి, కలిసి పనిచేస్తామని ప్రతిన చేయించాడు. ఇదంతా చూసి జెడిఎస్ ఏదో ఊడపొడుస్తుందేమో ననుకుంటే దీని వెంటనే వచ్చిన ఉపయెన్నికలలో తుస్సుమంది. హంగల్‌లో వారి అభ్యర్థి నియాజ్ షేక్‌కు 927 ఓట్లు వచ్చాయి. సిందగిలో అభ్యర్థి నాజియా అంగాడీకి 4 వేల ఓట్లు వచ్చాయంతే! డిపాజిట్లు గల్లంతు!
బలం క్షీణిస్తున్న జెడిఎస్‌ను దెబ్బ కొట్టి, ఆ సీటు కైవసం చేసుకోవడానికి కాంగ్రెసు పెద్ద ప్లానే వేసింది. కాంగ్రెసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది, వ్యాపారస్తుడు డికె శివకుమార్‌ది రెండు క్యాంపులు నడుస్తున్నాయి. సోషలిస్టు సిద్ధాంతాలతోనే ఓటర్లను ఆకట్టుకోవాలనే మాస్ లీడరు సిద్ధరామయ్య. డబ్బుతో ఫిరాయింపులు ప్రోత్సహించైనా అధికారాన్ని పొందాలనే సిద్ధాంతం శివకుమార్‌ది. అతనిపై అనేక ఆర్థికనేరాల కేసులున్నాయి. తన ఎత్తులకు పైయెత్తులు వేస్తూంటాడు కాబట్టి బిజెపికి అతనంటే ఒళ్లు మంట. అనేక రకాల దాడులు చేయిస్తూ వుంటుంది. సిద్ధరామయ్యవి ధనరాజకీయాలు కాదు, అవినీతికి దూరం. కాంగ్రెసు హై కమాండ్ బిజెపిని ఎదుర్కోవడానికి డికెయే తగినవాడని భావించి 2020 జులైలో రాష్ట్ర అధ్యక్షుడిగా చేసింది. వీళ్లిద్దరూ కాకుండా జి పరమేశ్వర, కెఎచ్ మునియప్ప గ్రూపుగా మారి దళితుణ్ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండు చేస్తున్నారు.
పార్టీని ఎలా బలోపేతం చేయాలాన్న విషయంపై డికెకు, సిద్ధరామయ్య వేర్వేరు అభిప్రాయాలున్నాయి. ‘పార్టీ విడిచి వెళ్లినవాళ్లు ద్రోహులు. వాళ్లను పార్టీలోకి చేర్చుకోకూడదు’ అంటాడు సిద్ధ. ‘అలాటివి పెట్టుకోకూడదు, వాళ్లని మళ్లీ పార్టీలోకి తీసుకుందాం. వాళ్లతో పాటు యితర పార్టీల నుంచి కూడా కొందర్ని లాక్కుని వద్దాం’ అంటాడు డికె. యూత్ కాంగ్రెసు యూనిట్‌కు ఎవర్ని అధ్యక్షుడిగా పెట్టాలాన్న విషయంపై యిరు వర్గాలు ఆర్నెల్లపాటు కొట్లాడుకున్నాయి. అన్నాళ్లు ఓపిక పట్టిన అధిష్టానం చివరకు జులైలో రాజీ కుదిర్చి ఒకర్ని నియమించింది. ఇటీవల కులపరమైన జనగణన చేయాలని డిమాండు చేయాలా వద్దా అన్న విషయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. లింగాయతులు, వొక్కళిగలు జనాభాలో తమ నిష్పత్తి యింత వుంది అని చెప్పి రాజకీయంగా లాభపడుతున్నారు. గతంలో సిద్ధరామయ్య హయాంలో రాష్ట్రస్థాయిలో కులపరంగా లెక్కించడం మొదలుపెట్టేసరికి, అంత లేరని తెలిసింది. ఆ రిపోర్టు లీకవుతూనే ఆ రెండు కులాల వాళ్లూ ఆందోళన చేయడంతో సర్వే రిపోర్టును తొక్కి పెట్టేశారు.
ఇప్పుడు కేంద్రంలో బిజెపి కులగణన చేయనంటోంది. అదే లింగాయతులకు, వొక్కళిగలకు కావాలి. ‘అబ్బే చేసి తీరాల్సిందే అని రాష్ట్ర కాంగ్రెసు పట్టుబడితే ఆ కులాలవారికి మనపై కోపం వస్తుంది. 2018లో లాగానే మనకు ఓట్లెయ్యరు.’ అని కాంగ్రెసులోని లింగాయత్ నాయకులు అంటున్నారు. తక్కిన కులాలకు చెందిన సిద్ధ వంటి నాయకులు ‘లింగాయతులు ఎటూ బిజెపికే వేస్తున్నారు. దీని గురించి పోరాడితే తక్కిన కులాల వాళ్లు మన చెంత చేరతారు’ అంటున్నారు. కురుబ కులస్తుడైన సిద్ధ అహిందా (బిసి, మైనారిటీలు, దళితులు) ఓటు బ్యాంకే మనను అధికారంలోకి తెస్తుంది అని నమ్ముతాడు. ‘బిజెపి యీ ఓట్లను చీల్చడంతోనే కాంగ్రెసు బలహీనపడింది. ఇప్పుడు వాళ్లను సంఘటితం చేస్తే విజయం మనదే’ అంటాడు సిద్ధ. ఇవన్నీ ఎందుకు, డిఫెక్షన్స్ అడ్డదారిలో వెళ్లిపోతే హాయి కదా అంటాడు డికె. ఓల్డ్ మైసూరు ప్రాంతంలోని వొక్కళిగలు యిన్నాళ్లూ జెడిఎస్‌తో ఉన్నారు. అదిప్పుడు డీలా పడింది కాబట్టి ఆ పార్టీ నాయకులు కొందర్ని మనవైపు ఫిరాయింప చేసుకుంటే, వొక్కళిగలు మనవైపు వచ్చేస్తారు. బిజెపికి లింగాయతులు వుంటే, మనకు వొక్కళిగలు వుంటారు అని వాదిస్తున్నాడు డికె. ఆ విధంగా మైసూరు, తుమకూరు, కోలారు, బెంగుళూరులోని జెడిఎస్ నాయకులపై వల పన్నాడు.
తన పాలసీని అమలు చేయడానికి సిందగిలో జెడిఎస్ నాయకుడు అశోక్ మనగులిని ఎన్నికల ముందు కాంగ్రెసులో చేర్చుకుని టిక్కెట్టిచ్చాడు. ఆ విధంగా జెడిఎస్ ఓట్లు కొల్లగొట్టి దాన్ని మూడో స్థానానికి నెట్టేయగలిగాడు కానీ అంతిమంగా బిజెపి అభ్యర్థి రమేశ్ భుసునూర్ చేతిలో తన అభ్యర్థిని 31 వేల ఓట్ల తేడాతో ఓటమిని తప్పించలేక పోయాడు. ఏది ఏమైనా ఈ ఉపయెన్నికలలో రెండు చోట్లా కలిపి బిజెపికి 52శాతం ఓట్లు వస్తే కాంగ్రెసుకు 45శాతం వచ్చాయి. అంటే కాంగ్రెసు పరిస్థితి మరీ అంత చేటుగా లేదన్నమాట. జెడిఎస్ బలం యింకా క్షీణిస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ కాంగ్రెసుకే పడవచ్చని, బిజెపి హెచ్చెరుకగా వుండాలి. (ఫోటో – 1. బొమ్మాయ్, యెడి 2. సిద్ధ, డికె 3. కుమారస్వామి)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2021)