అమిత్ మాటల్లో రాజకీయ ప్రయోజనమేనా? చిత్తశుద్ధి ఉందా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలనే డిమాండ్‌తో ఆ ప్రాంతానికి చెందిన రైతులు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న పోరాటానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన మద్దతు తెలిపారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం…

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలనే డిమాండ్‌తో ఆ ప్రాంతానికి చెందిన రైతులు సుదీర్ఘకాలంగా సాగిస్తున్న పోరాటానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టమైన మద్దతు తెలిపారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఈ పోరాటానికి పూర్తి మద్దతు తెలియజేయాల్సిందే అని దిశానిర్దేశం చేశారు. అమరావతి రైతులు ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా’ అనే టైటిల్ తో అమరావతి ప్రాంతం నుంచి తిరుమల వరకు సాగిస్తున్న పాదయాత్రలో భారతీయ జనతా పార్టీ శ్రేణులు కూడా పాల్గొనాల్సిందే అని అమిత్ షా తెగేసి చెప్పారు.

భారతీయ జనతా పార్టీ అమరావతికి మద్దతుగానే ఉందన్న విషయం అమిత్ షా ప్రకటనతో స్పష్టం అయిపోయింది. అయితే ఇది ఆయన చిత్తశుద్ధితో చేసిన ప్రకటనేనా? లేదా, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఇలాంటి వైఖరిని కనబరచడం ద్వారా రాజకీయ మైలేజీ సాధించవచ్చుననే వ్యూహంతో చేసినదా అనే సందేహం పలువురిలో కలుగుతోంది.

అమరావతి రైతులకు కాస్త ఆత్మస్థైర్యం ఇచ్చే ఈ మాటలు ఆయన నిజాయితీతో చెప్పినవే అయితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ కమలదళం కీలకనేత మాటలు ఒక పట్టాన నమ్మడానికి వీలు లేదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గతంలో కూడా ఎన్నో హామీల విషయంలో వారు సులువుగా ప్లేటు ఫిరాయించారు. మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ నిర్ణయం గురించి పార్లమెంటులో చర్చ జరిగినప్పుడు- రాజధాని అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది మాత్రమే అని కేంద్రం చెప్పేసింది. 

జగన్ రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నప్పటికీ తాము జోక్యం చేసుకోమని సంకేతాలు ఇచ్చారు. ఇప్పుడు అమిత్ షా మాటలు అర్థం మరోరకంగా ఉంది. అందుకే ఇది రాజకీయం కోసం అన్నారా? చిత్తశుద్ధితో అన్నారా? అనే అనుమానం కలుగుతోంది.

బద్వేలు ఉపఎన్నికల్లో సాధించిన ఫలితంతో అమిత్ షాలో ఏపీ రాజకీయాలకు సంబంధించి కొత్త ఆశలు చిగురించినట్టే కనిపిస్తోంది. ఏపీకి చేసిన ద్రోహం వలన ఎప్పటికీ ఈ రాష్ట్రంలో తమకు ఠికానా ఉండదని తెలిసిన కమలనాథులకు- ఒక అసెంబ్లీ స్థానంలో 20000 పైచిలుకు ఓట్లు సాధించడం అనేది అపూర్వమైన సంగతి. దానిని చూసి మురిసిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఎజెండాతో జరిగే పోరాటాలకు అండగా నిలిచి జగన్ సర్కార్ మీద విమర్శలు గుప్పిస్తూ ఉంటే తమ బలం పెరుగుతూ ఉంటుందని ఆయన అనుకోని ఉండవచ్చు. 

కానీ బద్వేలులో దక్కిన ఓట్లు పూర్తిగా తమ పార్టీ సొంతం కాదనే సత్యాన్ని ఆయన గ్రహించాలి. తెలుగుదేశం లేకపోవడం వల్ల మాత్రమే కాదు గాని అక్కడ పోటీ చేసిన అభ్యర్థికి ఉన్న మంచి పేరు, క్రెడిబిలిటీకి కూడా ఓట్లు వచ్చాయి అని తెలుసుకోవాలి. దానినిబట్టి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీకి భవిష్య కార్యాచరణను ప్లాన్ చేస్తే బాగుంటుంది.