ఈటల రాజేందర్ పై పగ, కోపం, ప్రతీకారంతో రగిలిపోతున్న కేసీఆర్.. కేవలం ఆయన్ని టార్గెట్ చేసేందుకే ఇప్పుడు రెండు ఎమ్మెల్సీ సీట్లను ఖర్చు చేశారు. ఈరోజు ప్రకటించిన 6 సీట్లలో రెండు సీట్లు కేవలం ఈటలను దృష్టిలో ఉంచుకునే ఎంపిక చేశారు. కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం.
నంబర్-1 పాడి కౌశిక్ రెడ్డి..
కౌశిక్ రెడ్డి ఎవరు, టీఆర్ఎస్ తో ఆయనకున్న సంబంధం ఏంటి, ఆయన పార్టీలోకి వచ్చి ఎన్ని రోజులైందనే విషయం అందరికీ తెలిసిందే. కేవలం హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈటల రాజేందర్ ని దెబ్బ కొట్టడానికి, కాంగ్రెస్ కి ఉన్న ఓటుబ్యాంకుని టీఆర్ఎస్ వైపు తిప్పుకోడానికి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఎరవేసి మరీ గులాబీ కండువా కప్పారు కేసీఆర్.
ఎన్నికలకు ముందే ఆ ముచ్చట తీరిపోవాల్సి ఉంది. కానీ కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో మండలికి పంపేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై అడ్డుపడ్డారు. సామాజిక సేవకుడిగా కౌశిక్ రెడ్డిని మండలికి నామినేట్ చేయడం కుదరదని తేల్చిచెప్పారు.
దీంతో అవకాశం కోసం ఎదురు చూసిన కేసీఆర్, హుజూరాబాద్ ఫలితం తేడా కొట్టినా.. ఇచ్చిన మాట కోసం కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యేందుకు ఎంపిక చేశారు. కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీ దక్కిందంటే దానికి కారణం ఈటల రాజేందర్ మాత్రమే.
నెంబర్ 2 బండ ప్రకాష్..
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు. ఆయన ముదిరాజ్ మహా సభ రాష్ట్ర అధ్యక్షుడు కూడా. ఆ సామాజిక వర్గంలో ఆయనకు బాగా పట్టుంది. అయితే అదే సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్ నిన్నమొన్నటి వరకూ టీఆర్ఎస్ లో హవా చూపించారు. ఇప్పుడాయన్ని పక్కకు తప్పించారు కాబట్టి, ముదిరాజ్ లలో మరో నాయకుడికి పట్టం కట్టాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే సదరు సామాజిక వర్గం ఓట్లన్నీ బీజేపీకి వెళ్లే ప్రమాదం ఉంది.
అందుకే మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నా కూడా బండ ప్రకాష్ ని ఎంపీ పదవి నుంచి దింపేస్తున్నారు కేసీఆర్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి కేబినెట్ లో బెర్త్ ఖరారు చేయబోతున్నారు. కేవలం ఈటలకు ప్రత్యమ్నాయం కోసమే ఎంపీగా ఉన్న బండ ప్రకాష్ కి హడావిడిగా ఎమ్మెల్సీ ప్రకటించారు. ఇది కూడా రివేంజ్ డ్రామాలో భాగమే.
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఖాయంగా గెలుచుకోబోతున్న ఆరు సీట్లలో రెండు ఇలా ప్రతీకారానికి ఖర్చయ్యాయి. ఇక మిగిలిన 4 సీట్లను కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ కలెక్టర్ వెంకటరామిరెడ్డికి కేటాయించారు కేసీఆర్.