కెసియార్ విభజనవాది. వేర్పాటువాది. 150 ఏళ్ల పాటు విడిగా ఉన్న తెలుగు వాళ్లు 1956లో ఒక్కటైతే విడగొట్టాలని పట్టుబట్టి, ఉద్యమాలు చేసి 2014కి అది సాధించిన ప్రత్యేకవాది. అలాటిది యిప్పుడు దేశంలోని ప్రజలందరినీ ఐక్యం చేయడానికి బయలుదేరతాననడం ఎంత వింతగా ఉంది? సాటి తెలుగువాళ్లు పనికి రాలేదు. వాళ్లది రాక్షస సంతతి, తెలుగుతల్లి దెయ్యం, దోపిడీదారులు, అహంభావులు, దుర్మార్గులు అంటూ నిందించిన పెద్దమనిషి యీ రోజు కన్నడిగులను, మరాఠీలను, హిందీ భాషీయులను, వీలైతే పంజాబీలను, బెంగాలీలను అందర్నీ కలుపుకుంటానంటూ బయలు దేరితే ఆశ్చర్యంతో కళ్లు తిరగవూ? యాసలో తేడా ఉన్నంత మాత్రాన మాది తెలుగు భాష కాదు, తెలంగాణ భాష అంటూ వేరు కుంపటి పెట్టుకున్న వ్యక్తి దేశంలోని అన్ని భాషలను సమానంగా సమాదరిస్తాడా? ఆ భాషల వారందరికీ సమాన స్థాయిలో తన సరసన చోటిస్తాడా? నమ్మగలమా?
ప్రతీ కథానాయకుడికి, ప్రతి రాజకీయనాయకుడికి ఒక కారెక్టరు ఉంటుంది. హీరో వేషాలు వేసే యాక్టరు, నెగటివ్ కారెక్టరు వేస్తే జనం చూడరు. విలన్‌గా పేరు తెచ్చుకున్నవాడు హీరోగా వేస్తే ఆమోదించరు. కమెడియన్ హీరో కాబోతే పెదవి విరుస్తారు. ప్రేక్షకుడి మనసులో ఒక ముద్ర వేసిన తర్వాత దాన్ని మార్చడం చాలా కష్టం. అలాగే రాజకీయ నాయకులు కూడా. కొందరు కార్మికపక్షం అంటారు, కొందరు సామ్యవాదం అంటారు, కొందరు అభివృద్ధిపథం అంటారు, కొందరు రైతుబాంధవుణ్ని అంటారు, కొందరు భాషావాదం అంటే మరి కొందరు ప్రాంతీయవాదం అంటారు. ఇంకా కొందరు కులవాదం అంటారు. మంద కృష్ణ మాదిగ హఠాత్తుగా ఐటీ ఉద్యోగాలలో ఉద్యోగభద్రత గురించి మాట్లాడితే విస్తుపోతాం, ఆ పేరుతో యింకెవరైనా కొత్తగా వచ్చారా అని.
టిడిపిలో ఉండే రోజుల్లో కెసియార్ తన నాయకుల తరహాలో సమైక్యవాది. తెలుగు ఆత్మగౌరవం, నిండుగ వెలిగే తెలుగు జాతి మనది వగైరా నినాదాలతో ఉపన్యాసాలు యిచ్చిన వ్యక్తే. కానీ చంద్రబాబుపై తిరగబడి బయటకు వచ్చాక వేర్పాటువాది అయ్యారు. రాష్ట్రం సమైక్యంగా ఉన్నంత కాలం తనకు చిన్నాచితకా పదవులు తప్ప తననుకున్న పెద్ద పదవులు రావని తెలుసుకుని, తనకు పెద్దపదవి రావాలంటే రాష్ట్రం చిన్నదవాలని అర్థం చేసుకున్నారు. ఆ దిశగా ఒంటరి పోరాటం చేస్తూ వచ్చారు. 1969లో వేర్పాటు ఉద్యమం వచ్చి విఫలమైన నేపథ్యంలో దీనిపై ఎవరూ ఆశలు పెట్టుకోలేదు. 1969 ఉద్యమసారథి చెన్నారెడ్డికి తర్వాతి రోజుల్లో తనను వేర్పాటువాది అంటే కోపం వచ్చేది. తను ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రాన్ని చీల్చే ప్రయత్నం చేయలేదాయన. ఇవన్నీ చూసిన జనాలకు కెసియార్ నిబద్ధతపై ఆశలు పెట్టుకోలేదు.
అయినా కెసియార్ పట్టు వదలలేదు. ప్రత్యేక వాదం ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేస్తూ, కొన్ని సీట్లు గెలుస్తూ, వాటికి రాజీనామాలు చేయిస్తూ, మళ్లీ పోటీ చేస్తూ, వాటిల్లో కొన్ని పోగొట్టుకుంటూ, ఓ సారి కాంగ్రెసుతో, మరోసారి టిడిపితో పొత్తు పెట్టుకుంటూ, దిల్లీలో లాబీయింగు చేసుకుంటూ, పడుతూలేస్తూ, ఒడిదుడుకులు అనేకం పడి, చివరకు తననుకున్న ప్రత్యేక రాష్ట్రం సాధించారు. తర్వాత కూడా చెన్నారెడ్డిలా విభజనవాదానికి తిలోదకాలివ్వలేదు. తెలంగాణ నినాదాన్ని పక్కన పెట్టలేదు. ఆంధ్ర పదాన్ని రాష్ట్రంలో నిషేధిస్తూనే ఉన్నారు. ఆంధ్రరాష్ట్రంతో నిత్యం తగాదా పడుతూనే ఉన్నారు. వాళ్లకు యివ్వవలసిన బకాయిలు చెల్లించటం లేదు. ఆంధ్రులపై నోరు పారేసుకున్నదానికి క్షమాపణ లేదు. తెలుగు మహాసభలు జరిపితే సాటి తెలుగు సిఎం బాబును ఆహ్వానించలేదు.
ఆంధ్ర పెట్టుబడిదారులతో కలిసి ఊరేగినా, మధ్యతరగతి ఆంధ్రమూలాల వాళ్లలో భయం యింకా నెలకొని ఉంది. తక్కిన సమయాల్లో సంయమనం పాటించినా, రాజకీయ అవసరం వస్తే చాలు, వలస పాలకులు, ఆంధ్రపెత్తనం, విడిపోయినా మాకీ శని తప్పదా? వంటి మాటలు కెసియార్, తెరాస నాయకులు యథేచ్ఛగా వాడుతూనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఆంధ్ర బూచిని చూపించే ఎక్కువ సీట్లు తెచ్చుకున్నారు. అలాటి కన్‌ఫమ్‌డ్ వేర్పాటు వాది యిప్పుడు హఠాత్తుగా జాతీయ స్థాయి సమైక్యత గురించి మాట్లాడితే మింగుడు పడుతుందా? టిడిపి వంటి ప్రాంతీయ పార్టీలోంచి తెరాస వంటి ఉపప్రాంతీయ పార్టీని పుట్టించిన వ్యక్తి తనది యికపై జాతీయపార్టీ అంటే ఒప్పుతుందా? పోనీ ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ పెడుతున్నా అంటే ఏమోలే అనుకోవచ్చు. ఫ్రంట్ లేదు, బ్యాక్ లేదు, ఏకంగా జాతీయ పార్టీయే అంటే ఎలా అర్థం చేసుకోవాలి?
ఫ్రంటు గురించి కెసియార్ ప్రయత్నించక పోలేదు. కానీ అంబ పలకలేదు. ఎందుకంటే ఆయనకు రాష్ట్రంలో కాంగ్రెసు, బిజెపి రెండూ శత్రుపక్షాలే. గతంలో కాంగ్రెసు ఒకటే ఉండేది. అందువలన బిజెపితో కాస్త స్నేహంగానే ఉండేవాడు. ఇప్పుడు బిజెపి తను సొంతంగా ఎదగదలిచాక కాంగ్రెసు కంటె ఎక్కువగా తెరాసతో వైరం పూనింది. ప్రస్తుత పరిస్థితిలో బిజెపియేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ అంటే ఎవరికీ నమ్మకం చిక్కటం లేదు. అందుకని కెసియార్‌తో ఎవరూ కలిసి రాలేదు. పైగా కెసియార్‌లో స్థిరత్వం తక్కువ. గతంలో కాస్సేపు కాంగ్రెసుతో, కాస్సేపు టిడిపితో, మరి కాస్సేపు లెఫ్ట్‌తో విహరించాడు. ఆ తర్వాత బిజెపితోనూ సఖ్యంగా ఉన్నాడు. తన అవసరమే ముఖ్యం తప్ప, ఒక సిద్థాంతానికి కట్టుబడడమనేదే లేదు. అందువలన ఎవరూ నమ్మలేదు. బిహార్ వెళ్లి నీతీశ్‌తో జట్టు కట్టాడు. నీతీశ్ సరేలే అన్నాడు, దిల్లీ వెళ్లి మూడో ఫ్రంట్ లేదు, కాంగ్రెసుతో కూడిన రెండో ఫ్రంట్ మాత్రమే అనేశాడు.
దాంతో యీయనకు కోపం వచ్చి ఏకంగా జాతీయ పార్టీయే అంటున్నాడు. గతంలో ఎన్టీయార్ యిలాగే భారతదేశం పార్టీ అన్నాడు. అది కుదరక నేషనల్ ఫ్రంట్ అన్నాడు. అసాం, హరియాణా అన్నీ తిరిగి వచ్చాడు. ఇవతల స్వరాష్ట్రంలో పార్టీ మునిగిపోయింది. 2 ఎంపీ సీట్లు వచ్చాయి. ఫ్రంట్ అధికారంలోకి వచ్చింది. ఈయన్ని యింటికి వెళ్లి పని చూసుకోమన్నారు. చంద్రబాబు జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతా అంటూ ఫ్రంట్ కన్వీనరు పదవి నెత్తిన వేసుకున్నారు. ఓ పక్క పార్టీ, మరో పక్క ప్రభుత్వం, యింకో పక్క ఫ్రంట్. నేషనల్ మీడియాలో కవరేజి బాగానే వచ్చింది కానీ యివతల స్వరాష్ట్రంలో అధికారం ఊడింది. ఆ దెబ్బకి పదేళ్లపాటు ప్రతిపక్షంలో మగ్గాల్సి వచ్చింది. రాష్ట్రం విడిపోయాక సగం ముక్కకు ముఖ్యమంత్రి అయి, దానితో సరిపెట్టుకోకుండా పదవి చివరిదశలో జాతీయ ప్రతిపక్షాలను పోగేసే పనిలో పడ్డారు. ఇవన్నీ చేస్తూ తనకీ ఓ చంద్రబాబు తగులుతాడేమోనని భయంతో పార్టీ పనిని వేరెవరికి అప్పగించలేదు. చివరకు ప్రభుత్వం పోగొట్టుకోవడమే కాదు, స్థానాల పరంగా పార్టీని అధమస్థాయికి తీసుకెళ్లారు. ఇంకా కోలుకోలేదు. స్థానిక ఎన్నికల్లో కానీ, ఉపయెన్నికల్లో కానీ గెలవలేక పోతున్నారు.
తాజాగా బెంగాల్‌లో ఘనంగా గెలవడంతో మమతా బెనర్జీ జాతీయ స్థాయికి వెళతానంటూ కాస్త హడావుడి చేసి అంతలోనే చప్పబడింది. ఇందరి అనుభవాలు చూసి కూడా కెసియార్ గంతులేస్తున్నారంటే వింతగా ఉంది. అసలాయన ఏకంగా అంతర్జాతీయ స్థాయిలో మాట్లాడతాడు. చైనాతో పోల్చి ఇండియా ఎందుకలా లేదు? అని అడుగుతాడు. చైనా రాజకీయ వ్యవస్థకు, భారతీయ వ్యవస్థకు ఎంతో తేడా ఉందని తెలిసినా దాన్ని విస్మరిస్తాడు. అసలు ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీకి మౌలికంగా ఉన్న వ్యత్యాసం ఆయన కెందుకు తట్టదో నాకు అర్థం కాదు. అసలు ఏ ప్రాంతీయ పార్టీ ఐనా పక్క రాష్ట్రంలో కూడా గెలిచిందా? ద్రవిడ పార్టీలు కర్ణాటకలోకి కానీ, ఆంధ్రలోకి కానీ వెళ్లగలిగాయా? మహారాష్ట్ర మరాఠీలకే అనే నినదించే శివసేన పక్క రాష్ట్రాలకు వెళ్లి వేరే నినాదంతో ఆకట్టుకోగలదా?
ప్రాంతీయ పార్టీలన్నీ ఎంతసేపూ రాష్ట్రం గురించే మాట్లాడతాయి. పొరుగు రాష్ట్రాలతో సరిహద్దు వివాదాలో, జలవివాదాలో ఉంటాయి కాబట్టి మొండిపట్టు పడుతూ, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలంటే ప్రాంతీయ పార్టీలే అవసరమని, జాతీయ పార్టీలైతే పొరుగు రాష్ట్రంలో సీట్ల కోసం రాజీ పడతాయని వాదిస్తాయి. జాతీయ పార్టీలో అన్ని ప్రాంతాల వాళ్లూ ఉంటారు కాబట్టి అన్ని ప్రాంతాలనూ, విభిన్న దృక్పథాల వారినీ సమన్వయం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. అధికారం కూడా ఒక కుటుంబం చేతిలోనో, ఒక ప్రాంతీయలు చేతిలోనో ఉండిపోదు. ప్రాంతీయ పార్టీలైతే వ్యక్తి కేంద్రంగా ఉంటాయి. ఆ వ్యక్తి వారసులకే పదవులు, అవకాశాలూ దక్కుతాయి. ఈ కుటుంబపాలనను ఎదిరించినవాళ్లు పార్టీలోంచి బయటకు పంపేస్తారు. జాతీయ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయంటూ రంగంలోకి దిగిన ప్రాంతీయ పార్టీలు కూడా అదే అవినీతిలో కుత్తుకబంటిన దిగబడ్డాయి.
మనకున్న జాతీయ పార్టీలు కాంగ్రెసు, బిజెపి, లెఫ్ట్. కాంగ్రెసులో తొలి నాళ్లలో అనేకమంది నాయకులు ఉండేవారు. ప్రతీ ప్రాంతం నుంచి బలమైన నాయకుడు ఉండి, వారి మద్దతుతో కేంద్ర నాయకత్వం నడిచేది. ఇందిర బలపడిన కొద్దీ ప్రాంతీయ నాయకులను బలహీనపరుస్తూ అధికారాన్ని కేంద్రీకృతం చేసింది. తన కొడుకులను వారసులుగా తెచ్చింది. రాజీవ్ మరణానంతరం కాంగ్రెసు ఇందిర కుటుంబానికి చెందని వారి నాయకత్వంలోకి వెళ్లింది. కానీ వారు తమలో తాము కలహించుకుని, కొందరు సోనియాను నాయకురాలిగా తెచ్చుకున్నారు. ఆమె భిన్నవర్గాలను కలుపుకుంటూ పోయి 2004లో కాంగ్రెసు నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి పదేళ్లపాటు నిలపగలిగింది. కానీ వారసుడిగా రాహుల్‌ను తెచ్చే ప్రయత్నంలో పార్టీని సర్వనాశనం చేసుకుంది. ఇప్పటికీ పార్టీపై తన కుటుంబం పట్టు పోకూడదని తాపత్రయ పడుతోంది.
ఇంత జరిగినా కాంగ్రెసు జాతీయ పార్టీయే. ఎందుకంటే సోనియా, రాహుల్ సర్వం తమ కనుసన్నల్లో నడపలేరు. బలంగా ఉన్న ప్రాంతీయ నాయకులు తమ స్వశక్తితో ఎన్నికలు గెలుస్తున్నారు. అధిష్టానం మాటలను పెడచెవిన పెడుతున్నారు. తాజా ఉదాహరణ అశోక్ గెహ్లోత్! ఇక బిజెపికి వస్తే అది దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమౌతూ వస్తున్నా, జాతీయ విధానం, సమిష్టి నాయకత్వం ఉన్న పార్టీగా ఎదిగింది. ప్రస్తుతం మోదీ-షాల కనుసన్నల్లో పార్టీ నడుస్తూ వేరెవరికీ నోరెత్తే పరిస్థితి ఏర్పడినా యిది కొద్దికాలంలో మారవచ్చు. దేశంలోని కొన్ని ప్రాంతాల పట్ల బిజెపి పక్షపాతం చూపించవచ్చు కానీ యితర ప్రాంతాలను వదులుకోవడానికి అది సిద్ధంగా లేదు.
లెఫ్ట్ విషయానికి వస్తే అది క్రమంగా క్షీణిస్తూ ఒకటి రెండు రాష్ట్రాలకే పరిమితమైనా, దాని విధానమైతే జాతీయ విధానమే. రాష్ట్రానికో విధానం ప్రకటించలేదు. కానీ ప్రాంతీయ పార్టీ అయితే పక్క రాష్ట్రం ఏమై పోయినా నాకేం, నా రాష్ట్రం బాగు నేను చూసుకుంటా అనే విధానమే దానిది. జాతీయ పార్టీలు నిష్పక్షపాతంగా ఉండలేక పోవడం చేతనే ప్రాంతీయ పార్టీలు పుట్టుకుని వచ్చి, స్థానికులను ఆకట్టుకున్నాయి. తెరాస కూడా అలాటిదే. దానికి స్వరాష్ట్రం అంటూ లేకపోతే పోట్లాడి, ఉప ప్రాంతీయ వేదికపై స్వరాష్ట్రం తెచ్చుకుంది. ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు విస్తరిస్తానంటే ఎలా సాధ్యం? 543 లోకసభ సీట్లుంటే దానిలో తొమ్మిదంటే తొమ్మిది మంది తెరాస వాళ్లు. 2శాతం కూడా లేరు. ఇంత చిన్న పార్టీకి పేరు మార్చినంత మాత్రాన జాతీయస్థాయి వచ్చేస్తుందా?
అనేక ప్రాంతీయ పార్టీల్లాగానే తెరాస కూడా కుటుంబపాలనలో కూరుకుపోయింది. కెసియార్‌కు డెలిగేషన్ అంటే తెలియదు. పార్టీ, ప్రభుత్వం అన్నిట్లోనూ ఆయన మాటే చెల్లుతుంది. ఇతరులతో సంప్రదించడు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కూడా అందుబాటులో ఉండడు. ఎవరికి ఎందుకు ఎపాయింట్‌మెంట్ యిస్తాడో, యివ్వడో ఎవరికీ తెలియదు. ప్రజాస్వామ్యం అంటే అస్సలు నమ్మకం లేదు. వ్యక్తిగత రాగద్వేషాలతో ఎలా వ్యవహరిస్తాడో ఈటల విషయంలోనే చూశాం. నిరసనలు తెలిపినా సహించని రకం. వాస్తు నమ్మకాలతో సెక్రటేరియట్‌కు వెళ్లకపోగా ఉన్నదాన్ని కూల్పించి, మరోటి కట్టిస్తున్న ఛాందసుడు. జాతీయవాది కావాలంటే విశాలదృక్పథం, ఉదారవాదం, పలురకాల వ్యక్తులతో సంయమనం పాటించే ఓర్పు అన్నీ ఉండాలి. ఈయనది పాతకాలపు జమీందారు తరహా. తెలంగాణ అనే చిన్న గూటిలో అధికారం చలాయించుకుంటూ, అందర్నీ అదిలిస్తూ, బెదిరిస్తూ గడిపేస్తున్నాడు. ఇలాగే గడిపేయకుండా యిప్పుడీ జాతీయ పార్టీ దేనికి?
పొరుగున ఉన్న కర్ణాటకలోని యీయన వెళ్లగలడా? జెడిఎస్ కుమారస్వామి ఏమన్నాడు? పొత్తు ఉండదన్నాడు. ప్రాంతీయ పార్టీల ఫ్రంట్ అంటే వచ్చి చేరేవాడేమో, కానీ నీకు పోటీగా వేరే పార్టీ అంటే వచ్చి ఎందుకు చేరతాడు? అసలు వాళ్ల పార్టీయే కర్ణాటక అంతా లేదు. మాకు బలం లేని చోట మీరు పోటీ చేసి, ఒకటో రెండో స్థానాలు గెలిస్తే మాకు మద్దతివ్వండి అంటాడు. కర్ణాటకలో నీటి ప్రాజెక్టులకు అభ్యంతరం తెలిపే తెలంగాణకు చెందిన బిఆర్‌ఎస్‌కు కాలూనే చోటుంటుందా? మహారాష్ట్రతోనూ నీటి తగాదాలున్నాయి. అక్కడా యిదే చిక్కు. పైగా అక్కడ యిప్పటికే పార్టీలు ఎక్కువ. శివసేనయే చీలి రెండైంది. తెలంగాణ నుంచి వలస వెళ్లి అక్కడ స్థిరపడిన వాళ్లున్న చోట మనం గెలిచేస్తాం అనుకోవడానికి లేదు. స్థానికంగా పైకి రావడానికి వాళ్లంతా మరాఠీ నేర్చేసుకుని, శివసేనలో సభ్యులుగా వెలుగొందు తూండవచ్చు.
హైదరాబాదులోని ఆంధ్రమూలాల నాయకులందరూ తెలంగాణ ఏర్పడగానే తెరాసలోకి దూకేయలేదా? వాళ్లూ అంతే. ఇన్నాళ్లూ మహారాష్ట్రీయులతో కలిసి ఉండి, యిప్పుడు హఠాత్తుగా మేం తెలుగువాళ్లం అనే ఐడెంటిటీ చాటుకుంటే వాళ్లు దూరం పెడతారు. అసలే బయటివాళ్లంటే మహారాష్ట్ర మధ్యతరగది వాళ్లకు మంట. ఇప్పటికీ అది సెన్సిటివ్ యిస్యూనే. శివసేన చీలిన తర్వాత యిరు వర్గాల మధ్య ఘర్షణలతో మరాఠీవాదం వెర్రితలలు వేసినా ఆశ్చర్యం లేదు. ఇప్పటిదాకా నార్త్ వచ్చిన వాళ్లనే కొడుతూ వచ్చారు. ఇకపై బిఆర్ఎస్ అంటూ హంగామా చేస్తే తెలుగువారికి వడ్డనలు ప్రారంభమౌతాయి. అసలు శివసేన రూపు దిద్దుకున్నదే ఉడిపి హోటళ్లపై, తమిళ ఉద్యోగులపై, మలయాళీ హాకర్లపై దాడులతో! తెలుగువారికి పెద్దగా గుర్తింపు లేకపోవడంతో అప్పుడు బతికిపోయారు. ఇప్పుడు ఆ బాకీ తీర్చేయవచ్చు.
ఇక ఆంధ్రలో అయితే బిఆర్‌ఎస్ గతి చెప్పనే అక్కరలేదు. వాళ్లని బండబూతులు తిట్టి, యిప్పుడు వాటేసుకుంటానంటే మెచ్చుతారా? అమరావతి స్తూపం మీద యీయన పేరు వేసినందుకే బాధపడ్డాం. ఆ ప్రాజెక్టుకే శని పట్టింది. ఆంధ్రకు యివ్వాల్సిన బాకీలు తొక్కి పెడుతున్నాడు. ప్రతీదీ పేచీయే. కేంద్రం దాకా వెళ్లి తేల్చుకోవలసినదే. ఇలాటి మనిషంటే నాకు అభిమానం, ఆయన పార్టీలో చేరి యీ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తా అంటూ ప్రజలు ముందుకు వస్తారా? నాయకులు వస్తారా? పాత టిడిపి సంబంధాల వలన కెసియార్ కొంతమందిని టిడిపి నుంచి గుంజుకోవచ్చనే భయంతో టిడిపి బిఆర్‌ఎస్‌ను విమర్శిస్తోందని, బిఆర్‌ఎస్ ఆంధ్ర రాజకీయాల్లోకి వస్తే ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలుస్తుందనే లెక్కతో వైసిపి పెద్దగా విమర్శించటం లేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
టిడిపిలో భవిష్యత్తు లేదని అనిపిస్తే ద్వితీయశ్రేణి టిడిపి నాయకులు బిజెపిలోకి వెళ్లవచ్చు తప్ప బిఆర్‌ఎక్‌లోకి ఎందుకు చేరతారు? ఏం చెప్పి కెసియార్ వాళ్లను ఆకర్షిస్తాడు? ఆంధ్రలో ఉన్న తెలంగాణ వాళ్లను పార్టీలోకి తీసుకుంటాడా? అసలు ఆంధ్రలో ఉన్న తెలంగాణ వాళ్లు వేలల్లో అయినా ఉంటారా? ఇక తమిళనాడులో బిఆర్‌ఎస్‌కు చోటుందా? దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలు పాతుకుపోయాయి. కులాల పరంగా యిప్పటికే బోల్డు పార్టీలు. అందులో ఒక కులపార్టీ బిఆర్‌ఎస్‌లో విలీనమైంది. ఆ కులంతో పడని తక్కిన కులాల పార్టీలు దూరమౌతాయన్నమాట. ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ఓటర్లు అడుగుతారు – ఏదైనా పరిశ్రమ ముందుకు వస్తే దాన్ని తెలంగాణకు తీసుకెళతావా? మా రాష్ట్రానికి యిప్పిస్తావా? అని. ఇలా ఎన్నిరకాలుగా ఆలోచించినా బిఆర్‌ఎస్‌కు భవిష్యత్తు కనిపించదు.
కానీ కెసియార్ గొప్పగా చెప్పుకుంటున్నాడు, ‘నేను తెరాస పెట్టినపుడు నోరు చప్పరించినవారు తర్వాత నాలుక కరుచుకునే పరిస్థితిని తీసుకుని వచ్చాను. ఇప్పుడు జాతీయ పార్టీ పెడుతున్నపుడు పెదవి విరిచినవారు, తర్వాతి రోజుల్లో ముక్కు మీద వేలేసుకుంటారు చూడండి.’ అని. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అసాధారణప్రజ్ఞ ఉన్నవాణ్ననే ఆత్మవిశ్వాసం ఆయనలో పెల్లుబుకుతోంది. ఉన్నదున్నట్లు చెప్పాలంటే కాంగ్రెసు వేసిన తప్పుడు లెక్క వలననే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది తప్ప, కెసియార్ వలన కాదు. కెసియార్ కారణంగా వేడి పుట్టినమాట వాస్తవమే. కానీ కెసియార్ తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తాడని, ఆంధ్ర చేజారినా, తెలంగాణలో కాంగ్రెసు ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని కాంగ్రెసులోని తెరాస కోవర్టులు సోనియా గాంధీని మోసం చేశారు కాబట్టే ఆమె రాష్ట్రాన్ని విభజించింది. నిర్ణయం వెలువడ్డాక కెసియార్ తన నిజస్వరూపం చూపించాడు.
అంత చేసినా 2014 ఎన్నికలలో తెరాసకు మరీ గొప్పగా సీట్లేమీ రాలేదు. ఫిరాయింపులతో తన పార్టీని బలపరుచుకున్నాడు. ఇప్పుడు తనే జాతీయపార్టీ అయితే ఎవర్ని ఏమార్చగలడు? ఎక్కణ్నుంచి ఏం సాధించగలడు? నక్కకు పోగాలము దాపురించినపుడు నగరంవైపు పరిగెడుతుందని హిందీ సామెత. ప్రాంతీయ నాయకుడికి ఉన్నది ఊడగొట్టుకునే ఘడియ వచ్చినపుడు దిల్లీ వైపు పరిగెడతాడని యీ తరం సామెత. బిజెపి తెలంగాణపై దృష్టి సారించి, నిరంతర దాడులతో కెసియార్‌కు దడ పుట్టిస్తోంది. దాంతో చికాకు పుట్టి, కెసియార్ మోదీపై ఆగ్రహంతో జాతీయ పార్టీ అంటున్నాడు. జ్యోతిష్కులు చెప్పిన మాట ప్రకారం వెళుతున్నాడని కూడా అంటున్నారు. బిజెపి వ్యతిరేక జాతీయ పార్టీ పేరుతో మోదీకి ఆగ్రహం పెంచితే ఏం జరుగుతుందో చంద్రబాబు నడిగితే చెప్తారు. ఉన్నదీ దాచుకున్నదీ రెండూ పోయి, మళ్లీ మోదీ కటాక్షవీక్షణానికి ఆయన తిప్పలు పడుతున్నాడు. ఈయన వెళ్లి ఆయన సరసన చేరతాడేమో చూడాలి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2022)