గుర్తును పోలిన గుర్తులు ఉండడం వలన పెద్ద రాజకీయ పార్టీలు ఎన్నికల్లో స్వల్ప తేడాలతో ఉండే సందర్భాలు మనం చాలా సార్లు చూస్తుంటాం. కీలకమైన ఎన్నికల సమరంలో.. పోటాపోటీగా ఉండేప్పుడు.. వ్యక్తి పేరును పోలిన పేరు గలవారిని, గుర్తును పోలిన గుర్తు గలవారిని బరిలోకి ప్రోత్సహించి.. అసలు గుర్తుగల వారి విజయావకాశాలను దెబ్బతీయడానికి ఒక కుట్రపూరిత ప్రచారం జరుగుతుంటుంది. ఇది సహజం.
2019ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో చివరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చి కెఎపాల్ చాలా హడావుడి చేశాడు. ఆయనకు వచ్చిన హెలికాప్టర్ గుర్తు మూడు రెక్కలతో ఫ్యాన్ తరహాలోనే ఉంటుంది. దీంతో నిజానికి జగన్ పార్టీ చాలా కంగారు పడింది. కెఎపాల్ ను చంద్రబాబు ప్రోత్సహించి.. జగన్ ను దెబ్బకొట్టడానికి హెలికాప్టర్ గుర్తుతో బరిలోకి దిగేలా ప్రోత్సహించారనే ప్రచారమూ జరిగింది. అదంతా గత చరిత్ర.
ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ చాలాకాలంగా గుర్తు గురించి పోరాడుతోంది. కారును పోలిన గుర్తుల వలన తమ పార్టీ నష్టపోతున్నదనేది వారి మాట. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో కేవలం కారును పోలిన గుర్తుల వల్లనే ఓడిపోయాం అని అంటోంది. ఈ రకమైన ఫిర్యాదుతో టీఆర్ఎస్ ఏకంగా ఎనిమిది గుర్తులను జాబితాలనుంచి తొలగించాలని, అభ్యర్థులకు కేటాయించకూడదని కోరుతూ ఈసీకి లేఖ రాసింది. అయిదురోజులు గడుస్తున్నా ఈసీ స్పందించకపోవడంతో.. అదే సమయంలో మునుగోడు ఎన్నికలో ఇండిపెండెంట్లకు గుర్తులు కేటాయిస్తారనే భయంతో టీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
కారును పోలిన రోడ్ రోలర్, రోటీ మేకర్ వంటి గుర్తులుంటాయి. అయితే టీఆర్ఎస్ ఫోఓ కెమెరా, టైలరింగ్ మెషిన్, ఓడ, రేడియో, , వంటి అనేక గుర్తులను కూడా తొలగించాలని అంటోంది. గత అనుభవాలను గమనిస్తే.. వెయ్యికి మించి ఈ గుర్తులు గల ఇండిపెండెంట్లకు ఓట్లు వచ్చిన సందర్భాల్లో.. అవన్నీ తమ పార్టీకి రావాల్సిన ఓట్లే అని టీఆర్ఎస్ వాదిస్తోంది. అదే సమయంలో.. బిజెపి కూడా వజ్రం గుర్తు కమలం గుర్తును పోలి ఉంటుందని.. ఆ గుర్తుకు కూడా తమ పార్టీ కి రావాల్సిన ఓట్లన్నీ పడుతున్నాయని మరో వైపునుంచి ఆరోపణలు చేస్తోంది.
ఏది ఏమైనప్పటికీ.. పూర్తిగా ఎన్నికల గుర్తు మీదకు నెట్టేయడం అనేది పలాయనవాదమే అవుతుంది. హెలికాప్టర్ ఎంతగా సతాయించినా జగన్ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేకపోయారు. నిజంగా టీఆర్ఎస్ కు ప్రజాదరణ ఉంటే.. ఈ గుర్తులు ఏమీ చేయవు. ఆ విషయం మళ్లీ నిరూపణ అవుతుంది. అందుకని వ్యర్థారోపణలు మాని.. ఎన్నికలు ఎదుర్కోవాలని పలువురు సజెస్ట్ చేస్తున్నారు.