ఒకే అంశం, ఒకే మతం.. వేర్వేరు దేశాలు, వేర్వేరు వ్యవస్థలు! ఎంత తేడా! లౌకిక భావనలు కలిగి ఉన్న దేశంలో ఒక మతాచారం పట్ల పట్టు, మత రాజ్యమైన మరో దేశంలో స్వేచ్ఛా నినాదం! ఇలా పరస్పరం విరుద్ధమైన భావనలు వ్యక్తం అవుతున్నాయి ఇస్లామిక్ యువతులు, స్త్రీలు ధరించే *హిజాబ్* విషయంలో! గత కొన్నాళ్ల నుంచి ఇదో వివాదంగా వార్తల్లో నిలుస్తూ ఉంది. కర్ణాటకలో ఈ వివాదం రేగింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి ఏర్పడిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కర్ణాటకలో మతంతో ముడిన పడిన అంశాలపై రకరకాల నిర్ణయాలను తీసుకుంటూ ఉంది.
ఈ క్రమంలో విద్యాలయాల్లో ముస్లిం యువతులు హిజాబ్ లను ధరించి హాజరు కావడాన్నిప్రభుత్వం నిషేధించింది. అయితే ఈ నిర్ణయంపై ఇస్లాం మతస్తుల నుంచి, ఆ మతంలోని యువతులు-మహిళల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఆక్షేపణలు వ్యక్తం అయ్యాయి. హిజాబ్ ధరించకూడదని ప్రభుత్వం ఎలా చెబుతుందంటూ వారు ప్రశ్నించారు. ఈ అంశం కోర్టును చేరింది. ముందుగా సుప్రీం కోర్టుకు ఈ అంశం చేరింది. అయితే కర్ణాటక హైకోర్టులో ఈ అంశంపై ఏదో ఒకటి తేలిన తర్వాతే తమ వద్దకు రావాలని సుప్రీం కోర్టు అప్పట్లో స్పష్టం చేసింది. ఏతావాతా.. ధర్మాసనాలు కూడా హిజాబ్ ను విద్యాలయాల్లోకి ప్రవేశింపజేయడం రైటా, రాంగా సూటిగా చెప్పలేకపోయింది.
ఇతర మతాచారాలకు లేని అభ్యంతరం హిజాబ్ లకే ఎందుకు అనే ప్రశ్న కూడా ఈ వ్యవహారంలో ఉత్పన్నం అయ్యింది. అయ్యప్ప మాల వేసిన హిందూ అబ్బాయిలు నల్లదుస్తుల్లోనే స్కూళ్లకు హాజరవుతూ ఉంటారు. ఇక సిక్కు పిల్లలు తలపాగాలతో స్కూళ్లకు వెళతారు. వాటికి లేని అభ్యంతరం ముస్లిం యువతుల హిజాబ్ కే ఎందుకు? నిషేధం అంటే అన్నింటినా వేయాలనే వాదన గట్టిగానే వినిపిస్తోంది.
అయితే ప్రభుత్వం మాత్రం హిజాబ్ కు మాత్రమే అభ్యంతరం అంటోంది. అదేమంటే విద్యాలయాలు అంటోంది! స్కూల్ తో సంబంధం లేని చోట ప్రభుత్వానికి అభ్యంతరం లేదట. స్కూళ్లకు మాత్రం హిజాబ్ తో రాకూడదని ప్రభుత్వం అంటోంది. ఈ అంశం ఎటూ తేలడం లేదు కానీ, ఇంతలో ఇస్లామిక్ రాజ్యం నుంచి మాత్రం హిజాబ్ పై వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రత్యేకించి వాటిని ధరించే ముస్లిం మహిళలే అభ్యంతరం చెబుతున్నారు.
యువతులు, మహిళలు హిజాబ్ ను తప్పనిసరిగా ధరించాలనే నియమం ఉన్న దేశాల్లో ఒకటి ఇరాన్. ఇక్కడ మహిళలు ఈ నియమం పట్ల అభ్యంతరం చెబుతూ ఉన్నారు. హిజాబ్ ను తప్పనిసరిగా ధరించాలని అనడం సరికాదని నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై ప్రభుత్వాలు, అక్కడి మత సంస్థలు ఉక్కుపాదం మోపుతున్నాయి. హిజాబ్ నుంచి ముస్లిం స్త్రీలకు స్వేచ్ఛ లేదని అవి స్పష్టం చేస్తున్నాయి. ఆందోళనలు చేస్తున్న వారిపై దాడులు జరిగాయి.
ఒకే అంశం గురించి ఇలా వేర్వేరు దేశాల్లోని ఒకే మతస్తుల నుంచి విభిన్న స్పందన వ్యక్తం అవుతోంది. ఒక చోట ఏమో వారిని హిజాబ్ లో బంధించాల్సిందే అంటూ అక్కడి ప్రభుత్వం వాదిస్తోంది. మరో చోట మాత్రం స్కూళ్లలోకి వాటికి ప్రవేశం లేదని ప్రభుత్వం అంటోంది. అయితే ఇక్కడ మహిళలు తమకు హిజాబ్ కావాల్సిందే అని అది తమ సొంతం అని వాదిస్తున్నారు. మొత్తానికి ఇలా ముస్లిం మహిళలే రెండు దేశాల్లో ప్రత్యేక వాణీతో స్పందిస్తూ ఉండటం గమనార్హం.