ఈ ఏడాది బజెట్‌లో నాకు నచ్చని అంశాల్లో బాగా నడుస్తున్న ఎల్‌ఐసి షేర్లను ప్రైవేటీకరణ చేయడమొకటని యిదివరకే రాశాను. ఇప్పుడు కారణాలు రాస్తాను. ట్రస్టుగా నడపబడే ఎల్‌ఐసి విషయంలో వేలు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఉందా లేదా అన్న విషయంపై న్యాయనిపుణులు ఎలాగూ కోర్టుకి వెళతారు. అసలు అమ్మే అవసరం ఎందుకు వచ్చింది, మోదీ చేస్తున్నది సవ్యమైన పనేనా? ఇలాగైతే దేశంలో బీమా పరిస్థితి ఏమిటి? సామాన్యుల భవిష్యత్తు సంగతేమిటి అనేవి మనం చర్చిద్దాం.
ఎల్‌ఐసిని ప్రైవేటు పరం చేయడమంటే చక్రాన్ని వెనక్కి తిప్పినట్లే లెక్క. అసలు ఎల్‌ఐసి ఆవిర్భవించినదే ప్రైవేటు బీమా సంస్థల వైఫల్యం వలన! అప్పట్లో ధనిక వ్యాపార కుటుంబాలు తమ సంస్థలకు పెట్టుబడుల కోసం బ్యాంకులను, బీమా కంపెనీలను నిర్వహిస్తూ ప్రజల నుంచి అతి తక్కువ రేట్లకు పొదుపు చేసిన సొమ్మును తీసుకునేవారు. దాన్ని తమ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టి మంచి లాభాలు ఆర్జించేవారు. 1953లో బీమా వ్యాపారంలో రూ.12 కోట్లు పెట్టుబడి పెట్టిన వీరు మూడేళ్లలో రూ.318 కోట్లు సంపాదించారు.
సామాన్యుడికి ఓ పట్టాన బ్యాంకు ఋణం లభించేది కాదు. బ్యాంకుల జాతీయకరణ చేసిన తర్వాతనే వారికి బ్యాంకుల ఋణాలు అందుబాటులోకి వచ్చాయి. డిపాజిట్ల వడ్డీ రేట్లు పెరిగాయి. బ్యాంకింగ్ సేవలు విస్తరించాయి. బ్యాంకుల జాతీయకరణ కంటె 13 ఏళ్లకు ముందే బీమా వ్యాపారం జాతీయం చేయవలసిన అవసరం ఎందుకు పడిందంటే కొన్ని కంపెనీలు ప్రజలను మోసం చేశాయి, కొందరు మోసగాళ్లు కంపెనీలను మోసం చేసి ముంచేశారు. భార్య పేర బీమా చేయించడం, బొంబాయిలో ఎత్తయిన బిల్డింగుల పైకి తీసుకెళ్లి ఊరు చూపిస్తా అంటూ కిందకు తోసేయడం, ప్రమాదవశాత్తూ చనిపోయిందని బీమా క్లెయిమ్ చేయడం, యిలా కంపెనీలను దోచారు. ఇక కంపెనీలు కూడా బీమా కంపెనీల నిధులను తమ కంపెనీలకు దారి మళ్లించసాగాయి. ఇలా 25 కంపెనీలు చేశాయి.
దాల్మియా గ్రూపు వారి భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారులను రూ. 2 కోట్ల మేరకు దగా చేసింది. బొంబాయిలో రూ. 30 లక్షల గవర్నమెంటు సెక్యూరిటీలు గల్లంతయ్యాయి. ప్రజలకు చావు గురించి ఆలోచించడమే భయం. నీ మరణానంతరం నీ కుటుంబం కోసం బీమా చెయ్యి అంటే జనాలు వినడానికే యిష్టపడేవారు కారు. అందువన బీమా వ్యాపారం పెద్దగా జరిగేది కాదు. దాంతో కిట్టుబాటు కానంతగా కంపెనీలు ఆఫర్లు యిచ్చేవి. అలా 25 కంపెనీలు మూతపడ్డాయి. ఇవన్నీ దేశ బీమా రంగాన్ని కృంగదీశాయి.
పాలసీదారుల సొమ్ముకు రక్షణ కల్పించాలన్నా, ఉద్యోగులకు, ఏజంట్లకు భద్రత ఉండాలన్నా జాతీయకరణ ఒకటే మార్గం అనుకుని నెహ్రూ ప్రభుత్వం 1956 జనవరిలో ఆర్డినెన్సు జారీ చేసింది. సెప్టెంబరు 1న 245 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను కలుపుకుని ఎల్‌ఐసి ఆవిర్భవించింది. మా నాన్న ఎంపైర్ ఆఫ్ ఇండియా అనే బీమా కంపెనీకి ఏజంటుగా ఉండేవారు. ఎల్‌ఐసిలో విలీనమయ్యాక ఎల్‌ఐసి ఏజంటయ్యారు. నేను కూడా బ్యాంకు ఉద్యోగంలో చేరేముందు మూడేళ్ల పాటు ఎల్‌ఐసి ఏజంటుగా ఉన్నాను. మూడో ఏడాది టార్గెట్ రీచ్ కాలేక ఏజన్సీ వదిలేశాను.
ఎల్‌ఐసిని ఒక ట్రస్టుగా రూపొందించారు. అప్పుడు ప్రభుత్వం మూలధనానికై యిచ్చింది కేవలం రూ. 5 కోట్లు. దాని మీద ఎల్‌ఐసి ఏటేటా డివిడెండ్ యిస్తూనే వచ్చింది. ఇప్పటిదాకా ప్రభుత్వానికి ఆ రూపేణా వచ్చింది రూ. 26 వేల కోట్లు! అది చాలనట్లుగా ఎల్‌ఐసి నిధులను చిత్తం వచ్చినట్లు వాడుకుంది. ఎక్కడ ఏ అవసరం పడినా ఎల్‌ఐసిని ‘నువ్వు వాడికి డబ్బియ్యి, వీడికియ్యి, లాభసాటి కాకపోయినా ఇక్కడ పెట్టుబడి పెట్టు, అక్కడ పెట్టు’ అంటూ ఆదేశాలిచ్చింది. ఎల్‌ఐసి అవన్నీ చేస్తూ పోయింది. ఎవరి డబ్బుతో? పాలసీదారుల డబ్బుతో! అలా చేసినా నిలదొక్కుకుంటూ, విస్తరిస్తూ, సమర్థవంతంగా నిర్వహించుకుంటూ వస్తోంది. గతంలో అయితే మోనోపలీ ఉండేది. కానీ రెండు దశాబ్దాలుగా ప్రయివేటు ఇన్సూరెన్సు కంపెనీలతో పోటీపడుతూ వస్తోంది. 23 ప్రయివేటు బీమా కంపెనీలున్నా, యిప్పటికీ మార్కెట్లో 73% వాటా ఎల్‌ఐసిదే.
ఆలాటి ఎల్‌ఐసిని యిప్పుడు కోసుకుని తినేద్దామని ప్రభుత్వం చూస్తోంది. ఏ అధికారంతో? అప్పుడెప్పుడో రూ. 5 కోట్లు యిచ్చినందుకట! మరి అలా అయితే యీ నాడు రూ. 31 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్న, ఎల్‌ఐసిని నిర్మించిన తరతరాల పాలసీదారులకు ఎంత హక్కు ఉండాలి? ప్రస్తుత పాలసీదారులే 40 కోట్ల మంది ఉన్నారు. 12 లక్షల మంది ఏజంట్లున్నారు. ప్రభుత్వం తన నిర్ణయంతో వీళ్లందరినీ గందరగోళంలో పడేసింది.
ఈ బంగారుబాతుపై కన్నుపడడం యిపుడే కాదు, ప్రభుత్వవాటాను 50% అమ్మేసి డబ్బు చేసుకోండి అని మల్హోత్రా కమిటీ 1994లో సిఫార్సు చేసింది. కానీ అప్పటి ప్రభుత్వాలకు ధైర్యం చాలేదు. ప్రజలు తిరగబడతారనుకుని జంకారు. ఇప్పుడు మోదీ సర్కారుకి అలాటి జంకులు లేవు. 70 ఏళ్లగా పూర్వపాలకులు ఏం చేశారు? ఏం ఒరగబెట్టారు? అని అడుగుతూనే వాళ్లు కూడబెట్టిన, నిలబెట్టిన సంస్థలను అమ్ముకుని తినేస్తున్నారు. పూర్వీకులు వారసత్వంగా యిచ్చిన ఆస్తులను వ్యసనపరులు కరిగించేసినట్లుగా ఉంది వ్యవహారం. ఇలా అమ్మగా వచ్చిన డబ్బుతో బిఎస్‌ఎన్‌ఎల్ వంటి సంస్థను నిలబెడతారా అంటే అదీ లేదు.
అసలు బిఎస్‌ఎన్‌ఎల్‌ని తన ఆస్తులు అమ్ముకోనిచ్చినా నష్టాల్లోంచి బయటపడుతుంది. కానీ ప్రభుత్వసంస్థలను కూల్చడం, అమ్మివేయడం చాలాకాలమే ప్రారంభమై యుపిఏ హయాంలో ఊపందుకుని ఎన్‌డిఏ హయాంలో శిఖరాలకు చేరుతోంది. మోదీ గద్దె దిగేనాటికి ప్రభుత్వరంగ సంస్థ ఏదీ మిగిలేట్లు లేదు. ప్రయివేటు రంగంలో కూడా తమ ఫేవరేట్స్‌కు మేలు చేయడానికి యితరులను ముంచుతున్నారు. ఒక్క జియో జీవించడానికి ఎన్ని ప్రయివేటు టెలికాం సంస్థలు మునిగాయో చూడండి. వాటికి అప్పులిచ్చి నష్టపోయిన బ్యాంకుల్లో మీ డబ్బు, నా డబ్బు వుందని మర్చిపోకూడదు.
అనేక ప్రభుత్వసంస్థల కంటె ఎల్‌ఐసి చాలా మెరుగ్గా పనిచేస్తోంది. క్లెయిమ్ పరిష్కారంలో 98.3% అనేది ప్రపంచంలోనే మొదటి స్థానమట. ప్రైవేటు బీమా సంస్థల్లో క్లెయిమ్ తిరస్కరణ రేటు ఎల్‌ఐసి కంటె 5 రెట్లు ఎక్కువగా ఉంది. నిర్వహణ ఖర్చు కూడా ఎల్‌ఐసితో పోలిస్తే ప్రైవేటు బీమా కంపెనీల ఖర్చు 5 రెట్లు ఎక్కువ. ఎల్‌ఐసి ఎన్‌పిఏలు, ఆస్తులతో పోలిస్తే 0.8% మాత్రమే ఉన్నాయి.
ఎల్‌ఐసి పాలసీదారుకు మాత్రమే కాదు, జాతికి ఎంతో చేసింది. గత ఏడాది మార్చి 31 నాటికి అది ప్రజా సంక్షేమానికి యిచ్చిన నిధులు దాదాపు 30 లక్షల కోట్ల రూ. లు. కేంద్ర, రాష్ట్ర సెక్యూరిటీల్లో, హౌసింగ్‌లో, ఇరిగేషన్‌లో పెట్టినదే రూ.21.50 లక్షల కోట్లు. 2018-19లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు 65 పైసల వడ్డీపై యిచ్చినది రూ.2.23 లక్షల కోట్లు. రైల్వేకు యిచ్చింది రూ. 1.50 లక్ష కోట్లు. నేషనల్ హైవేస్‌కు యిచ్చినది రూ. 1.25 లక్ష కోట్లు!
నిజానికి యివన్నీ ఎల్‌ఐసి చేయాల్సిన పనులు కావు. మంచి రిటర్న్‌స్ వచ్చే చోట్ల పెట్టుబడి పెట్టి, తద్వారా వచ్చిన వడ్డీ ద్వారా వచ్చిన లాభాలను బుద్ధిగా పాలసీహోల్డర్లకు పంచేయాలి, మంచి బోనస్‌లు యివ్వాలి. కానీ మధ్యలో ప్రభుత్వం అడ్డుపడి, తక్కువ వడ్డీకి ఋణాలిప్పించి, పాలసీదారులకు లాభం రాకుండా చేస్తోంది. పోనీలే దేశానికి యీ విధంగా సాయపడుతున్నాం అని ఓదార్చుకుంటున్నాం. ఇప్పుడు అసలుకే ఎసరు పెడుతున్నారు.
బ్యాంకుల్లో అయితే వడ్డీ రేటు వాళ్ల యిష్టం. వాళ్లకు లాభాలు బాగా వచ్చినా మనకేమీ పంచరు. ఎల్‌ఐసిలో అలా కాదు, 5% డివిడెండ్ ప్రభుత్వానికి యిచ్చేసి, తక్కినదంతా పాలసీ హోల్డర్లకు పంచేస్తారు. పాలసీల్లో ‘విత్ ప్రాఫిట్స్’ (ప్రీమియం ఎక్కువ), ‘వితౌట్ ప్రాఫిట్స్’ (ప్రీమియం తక్కువ) అని రెండు రకాలుంటాయి. బోనస్ ఎటూ వుంటుంది. ఇలా యిచ్చినా ఏటా రూ. 3-4 లక్షల కోట్లను యిన్వెస్ట్ చేసే కెపాసిటీ ఎల్‌ఐసికి వుందంటే దాని నిర్వహణ బాగున్నట్లే కదా!
ఎల్‌ఐసి పాలసీలకు ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది నిజమే, కానీ ఆ గ్యారంటీని ఇన్వోక్ చేసే సందర్భం యీ 64 ఏళ్లలో ఒక్కసారి కూడా రాలేదు. పైగా ఒక్కోసారి స్టాక్ మార్కెట్‌ను నిలబెట్టడానికో, ఏదైనా ప్రభుత్వ సంస్థ పబ్లిక్ ఇస్యూకి వెళ్లినపుడు ధర పడిపోకుండా చూడడానికో ఎల్‌ఐసిని వాడుకున్నారు. ఇప్పుడు దీన్ని అమ్మాలంటే మొదట దాన్ని ప్రభుత్వసంస్థగా మార్చాలిట. దానికి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలి. మేజర్ వాటా అంటే 51% ఉంటేనే యాజమాన్యం ప్రభుత్వం దగ్గర ఉంటుంది. కానీ గత సంవత్సరం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి ఒక ప్రతిపాదన తెచ్చారు – ప్రభుత్వానికి 51% కంటె తక్కువ షేర్లు ఉన్నా యాజమాన్యం ప్రభుత్వానికే ఉండాలని! ఇప్పుడు 5% వాటాతోనే ఎల్‌ఐసిని అమ్మడానికి సిద్ధపడుతోంది. ఎందుకు?
సంపన్నులపై విధించే ఆస్తిపన్ను 1957 నుంచి అమల్లో ఉంది. మోదీ ప్రభుత్వం 2016లో దాన్ని రద్దు చేసింది. శతాధిక కోటీశ్వరుల వద్ద ఉన్న ఆస్తిపై 1% పన్ను వేసినా ఏటా రూ. 5.60 లక్షల కోట్లు వస్తుందట. కానీ అలా చేయలేదు. బ్యాంకులలో నియంత్రణ కొరవడి, ఆడిటింగ్ సరిగ్గా జరగక గత 20 ఏళ్లగా ఎన్‌పిఏలు, బ్యాంకు మోసాలు పెరుగుతూ పోయాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక కూడా పరిస్థితి మెరుగు పడలేదు. బ్యాంకులు నష్టాల్లో మునిగాయంటూ ఆర్‌బిఐను కొల్లగొట్టి వాటికి డబ్బులిచ్చారు.
దేశంలో నిరుద్యోగిత పెరిగింది కాబట్టి చిన్నా చితకా జనాలకు స్వయం ఉపాధి కల్పించే పథకాలను ప్రవేశపెట్టి, సామాన్య జనాల్లో ధనాన్ని ప్రవహింప చేస్తే వస్తూత్పత్తి, అమ్మకాలు పెరిగి ఉత్పాదక రంగం నిలబడేది. దానికి బదులు ఉద్యోగాలు కల్పిస్తాయంటూ కార్పోరేట్లకు నిధులు సమకూర్చారు. వాటికి పన్ను రాయితీలు యిచ్చారు. ఆ నష్టాలను పూడ్చుకోవడానికి యీ ఏడాది ప్రభుత్వ సంస్థల వాటాలను అమ్మేసి రూ. 2.10 లక్షల కోట్లను సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
ఎల్‌ఐసి వాటా అమ్మకం ద్వారా రూ. 0.80-1.00 లక్ష కోట్లు వస్తాయని ఆశిస్తున్నారు. కానీ ఎల్‌ఐసి వంటి ధనిక సంస్థలో వాటాలు కొనాలంటే ప్రయివేటు సెక్టార్ శక్తి చాదు. అందువలన షేరు ధర అన్యాయంగా తగ్గించేసి, ఏ అదానీకో, అంబానీకో కట్టబెట్టేస్తారనే భయాలు కలుగుతున్నాయి. 3%, 4% వాటాతోనే వాళ్లు ఎల్‌ఐసి విధానాలు మార్చిపారేయవచ్చనే శంక, జాతీయకరణకు ముందు ప్రయివేటు ఆపరేటర్లు చేసినట్లే చేస్తారేమోనన్న ఆందోళన కలగడం సహజం. అందుకే పాసీదారులు, ఏజంట్లు, సిబ్బంది యీ అమ్మకాన్ని వ్యతిరేకిస్తున్నారు.
చాలామంది నిరుద్యోగులు, గృహిణులు, యువత, ఉద్యోగాల జోలికి వెళ్లకుండా ఏజంట్లగా పనిచేస్తూ తమకంటూ కొంత ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఎల్‌ఐసిపై పొదుపర్ల నమ్మకం సన్నగిల్లితే తమ గతేమిటని వారికి బెంగ. మోదీ ప్రభుత్వం ధర్మమాని యిప్పటికే బ్యాంకులపై విశ్వాసం సడలింది. ఇప్పుడు బీమా సంస్థలపై నీడలు పడడంతో పొదుపు మొత్తాలు దాచుకునే మార్గాలు మూసుకుపోతున్నాయి. భవిష్యత్తు ఎలా వుంటుందోనన్న ఆందోళన కలుగుతోంది. మోదీకి చేతనైతే తన హయాంలో ఎల్‌ఐసి వంటి సంస్థను సృష్టించి భావితరాలు గుర్తు పెట్టుకునేట్లు ప్రవర్తించాలి. అనునిత్యం తను తిట్టే నెహ్రూ హయాంలో వెలసిన ఎల్‌ఐసి వంటి సంస్థను అమ్ముకు తినడంలో ఏం ఘనత ఉంది?
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)