ఆంధ్రలో స్థానిక ఎన్నికల ధర్మమాని అన్ని వ్యవస్థల విలువల వలువలు జారిపడ్డాయి. స్థాయి పతనమై ప్రజలు ముక్కున వేలు వేసుకునే పరిస్థితి దాపురించింది. ఎన్నికలంటేనే ప్రజాస్వామ్యానికి గుర్తు. స్థానిక ఎన్నికలంటే ఆ సందర్భంగా గ్రామస్థాయిలో కూడా ప్రజాస్వామ్యం నెలకొందని చెప్పుకోవాలి. అలాటిది యీ ఎన్నికలు రచ్చో, రచ్చస్య, రచ్చభ్యహలా మారిపోయాయి. ఈ రొచ్చుభాగోతంలో ఎవరెవరు ఏ చీదర పాత్ర వహించారో చూద్దాం. ముందుగా – అధికారపక్షం
ఇలాటప్పుడే అధికార పార్టీ కార్యకర్తల విజృంభణ కనబడుతుంది. సాధారణంగా కొన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి అవమానాలు పడ్డాక, కష్టనష్టాలు భరించాక అధికారం దక్కగానే చూసుకో మా తడాఖా అన్నట్లు ప్రవర్తిస్తారు. 2004లో పదేళ్ల తర్వాత అధికారం వచ్చేసరికి కాంగ్రెసు పార్టీ నాయకులు, కార్యకర్తలు ముఖ్యంగా రాయలసీమలో, హింసాకాండకు దిగారు. దానిని అదుపు చేయడానికి ముఖ్యమంత్రి వైయస్సార్ తంటాలు పడవలసి వచ్చింది. హింస వదలండి, పగలు మర్చిపోండి అని అంటే ‘నువ్వు మొన్నటిదాకా మరోలా చెప్పి, యిప్పుడు నువ్వు గద్దె కెక్కావు కాబట్టి శాంతిమంత్రాలు వల్లిస్తున్నావా‘ అంటూ కార్యకర్తలు మండిపడ్డారు. పాదయాత్రలో నా కోపం నరం తెగిపోయింది అంటూ ఆయన జవాబు చెప్పుకున్నాడనుకోండి.
ఆనాటి సంయమనం ఆవిరై పోయిందేం? – 2014-19 మధ్య టిడిపి వైసిపిని అన్ని విధాలా అణచివేసి, దాని నాయకులను కాజేసి, రౌడీ ముద్ర కొట్టి అవమానపరిచింది కాబట్టి 2019 మే ఎన్నికలు కాగానే ఆంధ్ర రాష్ట్రమంతా వైసిపి క్యాడర్ చెలరేగి పోతుందనుకున్నాను. కానీ అలా జరగలేదు. అంతా సంయమనం పాటించారు. అయినా టిడిపి అల్లరి చేయాలని చూసింది. వ్యక్తిగతమైన, కుటుంబపరమైన కొట్లాటలకు కూడా పార్టీ రంగు పులిమి, అనుకూల మీడియాలో వైసిపి దౌర్జన్యకాండ కారణంగా శాంతిభద్రతలు కరువయ్యాయని రాయించుకుంది కానీ ఎవరూ నమ్మలేదు. కొన్నాళ్లకు టిడిపికే ఇంట్రస్టు పోయింది. కేసులు పెట్టి, కోర్టుకు లాగే పని పెట్టుకోకుండా ఇసుక పాలసీ మీదకు వెళ్లిపోయింది.
అయితే స్థానిక ఎన్నికలకు వచ్చేసరికి వైసిపి లోకల్ క్యాడర్‌కు ధైర్యం వచ్చింది. రాజకీయ హింస జరగడం ప్రారంభించింది. జగన్ చెప్పినది నిజమే, గతంలో కూడా ఎన్నికల వేళ హింస జరగకుండా పోలేదు. ఇంతకంటె ఎక్కువే జరిగిందంటాడాయన. ఇప్పుడే ఎక్కువ జరిగింది, పోలీసు వాళ్లు కేసు నమోదు చేసుకోవటం లేదంతే అని టిడిపి వాళ్లు అంటారు. మీడియా నిష్పక్షపాతంగా ఉండి వుంటే మధ్యవర్తులుగా వాళ్ల మాట నమ్మేవాళ్లం. కర్మ కొద్దీ ఆ పరిస్థితి లేదు. ఏది ఏమైనా యీ పాటి హింస కూడా జరగకుండా అధికార పార్టీ చూడాల్సి వుంది.
మీ ప్రాంతంలో నెగ్గకపోతే పదవులు పోతాయని, కెసియార్ తరహాలో జగన్ కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేశారని, దానితో వీళ్లు ఎలాగైనా గెలవాలని హింసకు పాల్పడ్డారని టిడిపి అంటోంది. ఏ పార్టీ ఐనా తన నాయకులకు యీ మాదిరిగానే చెపుతూ వుంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు సాధారణంగా తమ వర్గాలకు ప్రాధాన్యత యిచ్చి, తమ ప్రాంతంలోని యితర వర్గాలను పక్కన పెడుతూంటారు. వాళ్ల విభేదాల వలన ఎన్నికలో పార్టీ దెబ్బ తింటుంది.
అందువలన మీరు ఏదో ఒకటి చేసి మీ ప్రాంతంలో అన్ని వర్గాల వారినీ కలుపుకుని పోయి 100% స్థానాలు మనకే వచ్చేట్లు చేయండి, ఏమైనా ఫిర్యాదులు వస్తే ఊరుకోను అని ప్రతి పార్టీ అధ్యక్షుడు చెప్తాడు. వినేవాళ్లు వింటారు, లేనివాళ్లు ధీమాగా తాము చేద్దామనుకున్నది చేస్తారు. ఎన్ని ఏకగ్రీవాలు తెప్పిస్తే అంత గొప్ప అనే ఫీలింగు ఏ ఎన్నికలోనైనా ఉంటుంది. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల విస్తీర్ణం ఎక్కువ కాబట్టి అది సాధ్యపడదు. స్థానిక ఎన్నికలలో సాధ్యమౌతుంది.
ఏకగ్రీవాల కోసం ఎక్‌స్ట్రా లెందుకు? – వైసిపికి అసెంబ్లీ స్థానాల్లో 86% వచ్చాయి కాబట్టి, స్థానిక ఎన్నికలలో 24% ఏకగ్రీవం కావడం పెద్ద విశేషమేమీ కాదు. ముఖ్యంగా టిడిపి పరిస్థితి ఏ మాత్రం ఆశావహంగా లేదు. వైసిపి ప్రభ తగ్గడానికి యింకా టైము పట్టేట్లు ఉంది. మొన్న ఎన్నికలలో డబ్బు బాగా ఖఱ్చు పెట్టి, ఫలితం దక్కక కుదేలై వున్నపుడు మళ్లీ ఎందుకు ఖర్చు పెట్టడం అనే జెసి దివాకరరెడ్డి వంటి మోతుబరి నాయకుడే బహిరంగంగా అంటున్నపుడు సామాన్య గ్రామస్థాయి నాయకుడు ఏమనుకుంటాడో ఊహించవచ్చు. ఊరికే పోటీ చేసి డబ్బు పోగొట్టుకోవడం, నెగ్గే కాండిడేటుతో వైరం కొని తెచ్చుకోవడం బదులు మెదలకుండా ఊరుకోవడం మంచిది కదా అనుకోవడంలో అసహజం ఏముంది?
2013 స్థానిక ఎన్నికల సమయంలో ఈనాడు ఏం రాసిందో జగన్ తన ప్రెస్‌మీట్‌లో చెప్పారు- 269 ఏకగ్రీవాలు అయితే వాటిలో 105 సీట్లతో టిడిపి సత్తా చాటిందని, వైసిపి కి 70 మాత్రమే దక్కాయని, కాంగ్రెసు 6తో సరిపెట్టుకుందని రాశారట. ఏడాది తర్వాత వచ్చిన అసెంబ్లీలో ఎన్నికలో ఫలితాలు యించుమించు అదే నిష్పత్తిలో వచ్చాయి. కాంగ్రెసుకు సున్నా వచ్చాయనుకోండి. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వచ్చాయంతే. ఆ సీట్ల నిష్పత్తి స్థానిక ఎన్నికలలో ప్రతిఫలించడం పెద్ద విశేషమా?
ఎన్నికల కమీషనర్ పేర వెలువడిన బోగస్ లేఖలో 2014లో 2% ఏకగ్రీవాలు మాత్రమే వచ్చాయని యిప్పుడు 12 రెట్లు రావడం అసహజమనే వాదన వినిపించారు. 2014లో అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిగా ముందు స్థానిక జరిగాయి. టిడిపి, వైసిపి టగ్ ఆఫ్ వార్‌గా ఉన్నపుడు ఏకగ్రీవాలు తక్కువ వుండడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత, టిడిపి కాడి పారేసిన తర్వాత స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏకగ్రీవాలు పెరగడంలో వింతేముంది?
అసలెంత? అతిశయోక్తి ఎంత? – కానీ ఏకగ్రీవం సాధించి అధినేత వద్ద మెప్పు కొట్టేద్దామనే ఉద్దేశంతో, చాలా చోట్ల అభ్యర్థుల నామినేషన్లు చింపివేశారని, ఆఫీసుకి రాకుండా కిడ్నాప్ చేశారని, నామినేషన్ వేశాక ఒత్తిడి చేసి, బెదిరించి, విత్‌డ్రా చేయించారని ఆంధ్రజ్యోతి రాస్తోంది. కానీ మొత్తం మీద చూస్తే ఎంపిటిసిలో కానీ, మునిసిపల్ వార్డు విషయంలో కానీ ఒక్కో స్థానానికి సగటున 5 నామినేషన్లు పడ్డాయి. ఇది రాష్ట్రం మొత్తం మీద పరిస్థితి కాబట్టి, జ్యోతి రాసిన ఉదంతాలు కొన్ని చోట్ల మాత్రమే జరిగి వుండవచ్చు అనుకోవాలి. ఆ వార్తల్లో అతిశయోక్తులకు మార్జిన్ వదిలేసి చూసినా కొన్నయినా జరిగి వుండవచ్చు.
వాటిని కూడా జరగకుండా వైసిపి చూసుకోవలసింది. ఎందుకంటే వైసిపికి అందరూ వేసిన పెద్ద స్టాంపు – అశాంతి, అవినీతి. రెండో దానిలో వైసిపి తన ముద్ర చెరుపుకుంటోంది. మొదటిదాన్ని చెరుపుకోవడానికి విశేష కృషి చేయాలి. పొద్దున్న లేస్తే బాబు నోట్లో పులివెందల పంచాయితీ, రాయలసీమ రౌడీయిజం, బిహార్‌లా చేస్తున్నారు.. పదాలే వుంటాయి. తన పాలనలో ప్రభుత్వాధికారులను జుట్టు పట్టుకుని ఇసుకలో యీడ్చిన సంఘటనలు ఆయన చులాగ్గా మర్చిపోతారు. మీడియా రోజంతా అదే వల్లిస్తోంది.
అందువలన వైసిపి యిలాటివి జరగకుండా చూడాల్సింది. ముఖ్యంగా మాచెర్ల విషయంలో చూడండి. కారుని వెంటాడి, ఓ దుంగతో అద్దాలు పగలకొట్టి, లోపులున్న అడ్వకేట్‌ను రక్తం వచ్చేట్లు గాయపరచిన సంగతి వీడియో రూపంలో బయటకు వచ్చేసింది. వైసిపి వాళ్లు కాదనలేరు కాబట్టి, ‘వాళ్లు ఏదో యాక్సిడెంటు చేసి పారిపోతున్నారు కాబట్టి…’ అంటూ ఏదో చెప్పారు. యాక్సిడెంటు చేసి పారిపోదామనుకున్న వారందరినీ అలాగే చేస్తారా? అంతకు ముందు వైసిపి ఎంపీపై టిడిపి వాళ్లు దాడి చేసినప్పుడు వాళ్లూ యిలాటి కథే చెప్పారు. ఆ సదరు యాక్సిడెంటు బాధితుణ్ని పిలిచి చెప్పించారా? మహా అయితే డబ్బివ్వమని డిమాండ్ చేస్తారు తప్ప, వాళ్లను చంపబోతే బాధితుడికి పరిహారం వస్తుందా?
పలనాటి పౌరుషం అంటే యిదా!?– న్యాయంగా అయితే జరిగిన సంఘటనపై పార్టీ పరంగా ఖండించాలి, ఆ వ్యక్తిపై చర్య తీసుకోవాలి. దిల్లీలో షహీన్‌బాగ్‌లో తుపాకీతో కాల్చిన వ్యక్తి ఆప్ పార్టీవాడు అని బిజెపి వాళ్లు అన్నపుడు అరవింద్ ‘నిజంగా ఆప్ వాడే అయితే రెట్టింపు శిక్ష వేయండి’ అన్నాడు. అలా వుండాలి నాయకత్వం. పార్టీ పరంగా క్షమాపణ కోరితే పరువు పోతుందనుకుంటే కనీసం స్థానిక వైసిపి నాయకులైనా మా ప్రాంతానికి చెడ్డపేరు వస్తోందంటూ విచారం వ్యక్తం చేయాలి. అలాటిది లేకపోగా ‘మా పలనాడు పౌరుషాల గడ్డ’ అంటూ టీవీల్లో చెప్పారు. ఇదా పౌరుషం? దీన్ని వేరే చోట్ల గూండాయిజం అంటారు లెండి.
ఇక కొందరు విజయవాడ నుంచి నాయకులు యిక్కడకు రావడమెందుకు? అంటున్నారు. ఏం రాకూడదా? అదేమైనా విజయవాడ వారికి నిషిద్ధ ప్రాంతమా? అయినా ఎవరు రావచ్చో, ఎవరు రాకూడదో చెప్పడానికి వీళ్లెవరు? అధికారం శాశ్వతం కాదు. ఈ పోలీసులను నమ్మడానికి లేదు. రేపు ప్రతిపక్షంలోకి వెళితే కేసులు పెట్టి వేధించగరు. స్థానబలిమి కానీ తన బలిమి కాదయా అని సామెత. అధికార బలిమి చూసుకుని విర్రవీగితే, ఏదైనా కారణం చేత పార్టీ బహిష్కరించిందంటే, యీ కేసులన్నీ రిజిస్టరై ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. వ్యక్తిగతంగా చేసిన చర్యలైనా పార్టీ పరంగా చేస్తే యావత్తు పార్టీకి చెడ్డపేరు వస్తుందనే స్పృహ వుండాలి. టిడిపి వారికి ఆ యింగితం లోపించింది కాబట్టే, 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడారు. చూసైనా నేర్చుకోకపోతే ఎలా? .
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2020)