మహారాష్ట్రలో అయోమయస్థితి

మహారాష్ట్రలో రెండు కూటములూ విచ్ఛిన్నమై వాటిలోని నాలుగు ప్రధాన పార్టీలు (ఎంఎన్‌ఎస్‌ను కలిపితే ఐదు) ఈసారి విడివిడిగా పోటీ చేయడంతో అధికారం ఎవరికి దక్కుతుందో తెలియకుండా పోయింది. సీనియర్ రాజకీయ నాయకులు సైతం గందరగోళంలో…

మహారాష్ట్రలో రెండు కూటములూ విచ్ఛిన్నమై వాటిలోని నాలుగు ప్రధాన పార్టీలు (ఎంఎన్‌ఎస్‌ను కలిపితే ఐదు) ఈసారి విడివిడిగా పోటీ చేయడంతో అధికారం ఎవరికి దక్కుతుందో తెలియకుండా పోయింది. సీనియర్ రాజకీయ నాయకులు సైతం గందరగోళంలో పడి ఎదుటి పార్టీల్లోకి ఫిరాయిస్తున్నారు. ఇది చూసి ఇలా విడిపోవడం తమ మంచికే వచ్చిందని అన్ని పార్టీలు మురిసిపోవడం విశేషం. ‘‘మొన్న పార్లమెంటు ఎన్నికలలో మా కూటమి అభ్యర్థులు ఓటమి పాలు కావడానికి ముఖ్యకారణం – ఎన్‌సిపి మంత్రులపై వున్న అవినీతి ఆరోపణలే. మీడియా వాళ్లు రోజూ ఎన్‌సిపి నాయకుల అవినీతిపై వార్తలు వేస్తూ ప్రజల్లో మా కూటమి పరువు తీశారు. తరచి చూస్తే పృథ్వీరాజ్ చవాన్ ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కాంగ్రెసు మంత్రిపై కూడా ఆరోపణలు రాలేదు. ఎన్‌సిపిని వదుల్చుకోవడం మాకు రాజకీయంగా లాభిస్తుంది.’’ అన్నాడు కాంగ్రెసు సీనియర్ నాయకుడు అనంత్ గాడ్గీళ్. ‘దేశం మొత్తం మీద కాంగ్రెసు పరువు గంగలో కలిసింది. మన్‌మోహన్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనే అభిప్రాయంతోనే ప్రజలు మోడీకి పట్టం కట్టారు. వారితో కలిసి వుంటే మేం కూడా సర్వనాశనమయ్యే వాళ్లం’ అంటున్నారు ఎన్‌సిపి నేత అజిత్ పవార్. 

ఓటమికి ఎవరు కారణమని ఈ కూటమిలోని రెండు పార్టీలు వాదించుకుంటే, పార్లమెంటు ఎన్నికలలో 2 అసెంబ్లీ సెగ్మెంట్లలో 230 గెలవడానికి ఎవరు కారణమని బిజెపి-సేన కూటమిలోని భాగస్వామ్య పార్టీలు తేల్చుకోలేక పోయాయి. అందుకే సీట్ల పంపిణీపై కాట్లాడుకున్నాయి. బిజెపి చేయించుకున్న సర్వేలో తమకు 100-110 సీట్లు కచ్చితంగా వస్తాయని తెలిసిందట.  ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే మరిన్ని గెలిచి, ఈతర మిత్రపక్షాలతో కలిసి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చని బిజెపి అంచనా వేసింది. చర్చల్లో శివసేనకు 151, బిజెపికి 119, ఇతర మిత్రపక్షాలకు 1 అని ఉద్ధవ్ ప్రతిపాదిస్తే బిజెపి ఒప్పుకోలేదు. అప్పుడు ఉద్ధవ్ తను 3 తగ్గించుకుని, ఆ మూడు మిత్రపక్షాల అభ్యర్థులకు ఇస్తానని, అయితే వాళ్లుశివసేన గుర్తుపై పోటీ చేయాలని షరతు పెట్టాడు. బిజెపి వాళ్ల ఫార్ములా ప్రకారం శివసేన 140 తీసుకుని, 130 తమకు ఇచ్చి మిత్రులకు 1 ఇవ్వాలి. 

దీనిపై తర్జనభర్జనలు జరుగుతూండగానే నితన్ గడ్కరీ వంటి మహారాష్ట్ర బిజెపి నాయకులు పొత్తు కుదరకుండా చేయాలనుకున్నారు.  కూటమి నడుస్తున్న రోజుల్లోనే ఆ మధ్య నాగపూర్‌లో ఓ సభలో మాట్లాడుతూ నితిన్ గడ్కరీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఉద్దేశించి ‘‘రాష్ట్రం బిజెపి ప్రభుత్వాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా వుంది.’’ అన్నాడు. అమిత్ షా ఆత్మవిశ్వాసమో, అతివిశ్వాసమో అదెలాగూ వుంది. చర్చలు చాలనుకున్నారు. అటు ఉద్ధవ్ కుమారుడు ఆదిత్య ఠాకరే ‘మిషన్ 150’ (ఈ ఎన్నికలో శివసేన 150 సీట్లు గెలవాలి) అనే లక్ష్యం పెట్టుకున్నాడు. అది సాధించాలంటే కనీసం 200 సీట్లయినా పోటీ చేయాలి. అంటే బిజెపితో తెగతెంపులు చేసుకోవాలి. మొత్తం మీద బిజెపి నాయకులు ఉద్ధవ్‌కు ఫోన్ చేసి పొత్తు తెగింది అని చెప్పేశారు. గోపీనాథ ముండే బతికి వుంటే ఇలా జరిగేది కాదని అంటారు కొందరు శివసేన నాయకులు. ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలంటే ఈ కూటమి ఇలాగే వుండాలని అతని అంటూండేవాడు. అతని కూతురు పంకజా ముండేకు కూడా అదే అభిప్రాయమట. తమాషా ఏమిటంటే ఇప్పుడు ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి చూపిస్తోందని వార్తలు వస్తున్నాయి. గుజరాత్ ఎన్నికలలో మోడీ ఎప్పుడు తన కులాన్ని ప్రస్తావించలేదు. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి మోడీని బిసి కులాన్ని బిజెపి హైలైట్ చేసింది. ఇప్పుడు ప్రధాన పార్టీల్లో మరాఠాలు నాయకులుగా వున్న మహారాష్ట్రలో  బిసి ఓట్ల కోసం పంకజ్‌ను బిసి నాయకురాలిగా చూపుతున్నారట. ఆమె తండ్రి బిసియే కానీ, తల్లి బ్రాహ్మణ మహిళ. ఏ క్యాటగిరీలోకి వస్తుందో రాజకీయనాయకులే తేల్చాలి మరి. 

నితన్ గడ్కరీకి పట్టున్న ప్రాంతం విదర్భ. అక్కడో చిక్కు వుంది. ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడుతున్న ప్రాంతాలలో విదర్భ ఒకటి. తెలంగాణ ఏర్పాటు సమర్థించిన బిజెపి తమ డిమాండును ఎందుకు సమర్థించడం లేదని అక్కడి ప్రజల ప్రశ్న. విదర్భ ఏర్పాటుకు మద్దతిస్తే తక్కిన మహారాష్ట్రలో దెబ్బ తింటామని బిజెపి భయం. శివసేన మహారాష్ట్ర కలిసి వుండాలని వాదిస్తుంది కాబట్టి, వారితో పొత్తు వున్నందువలన ఏమీ చేయలేకపోతున్నామని (తెలంగాణ విషయంలో టిడిపిని దోషిగా చూపినట్లు) ఇన్నాళ్లూ చెపుతూ వచ్చింది. ఇప్పుడు పొత్తు తెగిపోయింది కాబట్టి ఆ వాదన చెల్లదు. విదర్భ ఇస్తామని చెపితే తక్కిన ప్రాంతాల్లో శివసేన తమను దోషిగా చూపిస్తుందన్న బెదురు. బిజెపి-శివసేన పొత్తు చెడిపోయిన కొన్ని గంటలేక కాంగ్రెస్-ఎన్‌సిపి పొత్తు చెడిపోయిందని వార్త వచ్చింది. కాంగ్రెస్ ఎన్‌సిపికి 124 సీట్లు ఇస్తానంది, వాళ్లు 144 అడిగారు. ‘ఇలా అడిగి పొత్తు కావాలని చెడగొట్టారు. దానికి కారణం వాళ్లు బిజెపితో రహస్య ఒప్పందం కుదుర్చుకోవడమే’ అంటున్నారు కాంగ్రెసు నాయకులు. శివసేన కూడా ఇదే ఆరోపణ చేసింది. 

రెండు కూటములూ చెదిరిపోయిన తర్వాత ఇక ఫిరాయింపుల పర్వం ప్రారంభమైంది. దీనిలో సిద్ధాంత రాద్ధాంతాలు లేవు. గెలుస్తామన్న ఆశ ఒక్కటే వారిని పార్టీ మారేట్లా చేస్తోంది. ఎన్‌సిపి మంత్రి ఉదయ్ సామంత్ శివసేనలో చేరిపోయి రత్నగిరి టిక్కెట్టు తెచ్చుకున్నాడు. కాంగ్రెసు మంత్రి సంజయ్ దేవతాలే తనకు టిక్కెట్టు ఇవ్వని సొంతపార్టీని వదిలి బిజెపిలో చేరాడు. మంత్రి, ఎన్‌సిపికి రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసిన  బాబన్‌రావ్ పచ్‌పూటే తన పార్టీకి చెందిన మంత్రి మధుకర్ పిచాడ్ తనను అవమానించాడని ఆరోపిస్తూ ఆ పార్టీ వదిలి బిజెపిలో చేరాడు. గావిట్ అనే మరో  ఎన్‌సిపి నాయకుడి కూతురు ఇప్పటికే బిజెపిలో చేరి ఎంపీ అయింది. ఇప్పుడు ఆయనా చేరాడు. పశ్చిమ మహారాష్ట్రలో ఇప్పటిదాకా ఎన్‌సిపి, కాంగ్రెసులలో వున్న మరాఠా నాయకులు ఇప్పుడు శివసేన, బిజెపిలలో చేరుతున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అజిత్ ఘోర్‌పాడే బిజెపిలో చేరాడు. ఎన్‌సిపి మంత్రి జయంత్ పాటిల్ బంధువైన విలాస్ కాకా జగతప్ బిజెపిలో చేరాడు. శివసేన నుండి కాంగ్రెసులోకి మారిన నారాయణ్ రాణె అనుచరుడైన మాణిక్‌రావ్ కోకటే అనే కాంగ్రెసు ఎమ్మెల్యే బిజెపిలో చేరాడు. రాణె మరో అనుచరుడు రాజన్ తేలి కూడా మొదట ఎన్‌సిపిలోకి మారి, వాళ్లూ తనకు టిక్కెట్టు ఇవ్వకపోవడంతో బిజెపిలో చేరాడు. 225 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న రాజ్ ఠాకరే మహారాష్ట్ర నవనిర్మాణ సేన కూడా ఈ ఫిరాయింపులకు అతీతం కాదు. ఆ పార్టీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ జాదవ్ శివసేన ద్వారా, రామ్ కదమ్ బిజెపి ద్వారా పోటీ చేస్తున్నారు. ముంబయి మేయరుగా చేసిన డా॥ శుభా రావుల్ శివసేన వదిలి ఎంఎన్‌ఎస్‌లో చేరారు. షోలాపూర్ జిల్లాకు కాంగ్రెసు అధ్యక్షుడిగా చేసిన బాలాసాహెబ్ షెల్కె ఆ పార్టీ వదిలి ఎన్‌సిపి టిక్కెట్టుపై షోలాపూర్ సౌత్ నుండి నిలబడ్డాడు. 

ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పోటీ చేస్తున్న దక్షిణ కరాడ్ నియోజకవర్గంలో అతని ప్రధాన ప్రత్యర్థులందరూ ఫిరాయింపుదారులే. మొన్నటిదాకా కాంగ్రెస్ ఎమ్మేల్యేగా వున్న విలాస్ కాకా ఉండల్కర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తూండగా, చవాన్‌కు సన్నిహితుడైన మంత్రి సతేజ్ పాటిల్ సోదరుడు అజీన్‌క్యా పాటిల్  శివసేనలో చేరి తనూ ఓ అభ్యర్థిగా నిలబడ్డాడు. అతుల్ భోసాలే అనే ఎన్‌సిపి నాయకుడు బిజెపిలోకి మారి అతనూ పోటీ చేస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏ పార్టీ అభ్యర్థి బలంగా వుంటాడో ఎవరూ చెప్పలేకుండా తయారైంది. ‘బిజెపితో పొత్తు చెడిపోయిన తర్వాత మేం చేయించిన సర్వేలో మా పట్ల సానుభూతి వ్యక్తమైంది. మాకు 107 సీట్లు, వాళ్లకు 77 సీట్లు వస్తాయని తేలింది’ అంటున్నాడు ఓ శివసేన నాయకుడు. ‘మోడీ ఏకంగా 25 ర్యాలీలు నిర్వహించబోతున్నారు. విజయం మాదే’ అంటున్నారు బిజెపి నాయకులు. ‘ఈ ఇద్దరూ విడిపోవడం వలన ముంబయి, ఠాణే, పుణె, నాసిక్ వంటి నగరప్రాంత ఓటర్లలో చీలిక వచ్చి ఎంఎన్‌ఎస్ గెలవవచ్చు’ అంటున్నారు కొందరు. కాంగ్రెస్-ఎన్‌సిపి చాలాకాలమే పాలించాయి కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమా వారికి ఎలాగూ లేదు. శివసేన బిజెపితో పొత్తు కొనసాగాలని కోరుకుంటూనే తన అభ్యర్థే ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడింది. అందరి కంటె ఎక్కువ రిస్కు తీసుకున్నది బిజెపి. రిస్కు ఫలిస్తే సొంతంగా అధికారంలోకి వస్తుంది. ఫలించకపోతే వున్న అవకాశం జారవిడుచుకున్నట్టవుతుంది. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]