ఉత్తరాంధ్ర జిల్లాలు తుపాను దెబ్బకు చిగురుటాకులా వణుకుతున్నాయి. శ్రీకాకుం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితి అత్యంత భయానకంగా తయారైంది. పెనుగాలులు, దానికి తోడు భారీ వర్షం కారణంగా మూడు జిల్లాల్లోనూ తీవ్రమైన నష్టం వాటిల్లుతోంది. ఇప్పటిదాకా తుపాను దెబ్బకు నలుగురు మృత్యువాతపడ్డట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నా, పెనుగాలులు సహాయక చర్యలకూ తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.
గత ఏడాది ఫైలీన్ తుపాను దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా మరోమారు ఆ స్థాయి నష్టాన్ని చవిచూస్తోందిప్పుడు. విజయనగరం ` విశాఖపట్నం జిల్లాలకు సరిగ్గా మధ్యలో, విశాఖ నగరానికి ఆనుకుని తుపాను తీరం దాటడంతో విజయనగరం, విశాఖ జిల్లాల్లో తుపాను నష్టం భారీస్థాయిలో వుండబోతోందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భారీ వృక్షాలు నేలకొరిగాయి. ఇంకా బీభత్సం కొనసాగుతోంది. సాయంత్రం ఆరు గంటలవరకూ తుపాను బీభత్సం తగ్గే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు.
మరోపక్క, తూర్పుగోదావరి జిల్లాలోనూ పలు ప్రాంతాలు తుపాను ధాటికి విలవిల్లాడుతున్నాయి. తీరప్రాంతాల్లో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తీర ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణ నష్టం తక్కువగా వుంటున్నప్పటికీ, ఆస్తి నష్టం మాత్రం భారీ స్థాయిలో సంభవిస్తోంది.