ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధాని విశాఖపట్నం అతలాకుతలమైపోయింది. హుద్‌హుద్ తుపాను దాటికి విశాఖ నగరంలో ఎటు చూసినా కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలే దర్శనమిస్తున్నాయి. హోర్డింగులు ఎగిరిపోతున్నాయి.. ఇళ్ళ పైకప్పులూ లేచిపోతుండడంతో, రోడ్లపై ఎవరూ తిరగకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విశాఖ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని విధ్వంసం సృష్టిస్తోంది హుద్‌హుద్.
విశాఖ నగరానికి ఆనుకుని వున్న సముద్ర తీరం.. ఏ క్షణాన అయినా నగరంపై విరుచుకుపడ్తుందా? అన్న స్థాయిలో ప్రమాదకరంగా సముద్రం ఉప్పొంగుతోంది. కైలాసగిరి ప్రాంతం వద్ద తుపాను తీరాన్ని తాకిన దరిమిలా.. మొత్తం విశాఖ నగరంలో పెనుగాలులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. భారీ చెట్లు నేలకొరుగుతున్నాయి. అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నవారు సైతం తుపాను దెబ్బకు బెంబేలెత్తిపోతున్నారు.
రోడ్లమీద ముందస్తుగా వాహనాల్ని నిషేధించారు. గత రాత్రి నుంచి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్ళు కూడా ముందుగానే రద్దు చేశారు. విమానాశ్రయమూ దాదాపు మూతపడిన పరిస్థితే. అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తోంది. అవసరమైన మేర బాధితులకు సహాయం అందిస్తున్నారు అధికారులు. అయితే తుపాను తీరం దాటాకనే పూర్తిస్థాయిలో బాధితుల్ని ఆదుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని అధఙకారులు చెబుతున్నారు.
11 గంటల సమయంలో తుపాను తీరాన్ని తాకగా, నాలుగు గంటల సమయానికి తుపాను కేంద్రం తీరాన్ని దాటే అవకాశం వుంది. సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకూ తుపాను బీభత్సంలో ఎలాంటి మార్పులూ వుండకపోవచ్చు. సాయంత్రం ఏడు తర్వాతే పరిస్థితి క్రమక్రమంగా అదుపులోకి రానుందని వాతావరణ శాఖ చెబుతోంది.