చలం రాసిన ‘‘మైదానం’’ నవల వెబ్ సినిమాగా రాబోతోందని విని ఆశ్చర్యపడ్డాను. దానిలో చెప్పడానికి ఏముందా అని ఒక సందేహం. చెపుదామని తలపెట్టినా హీరోయిన్ ప్రవర్తనను కన్విన్సింగ్‌గా ఎలా చెప్తారా అనేది మరో సందేహం. దాని కథ చెపితే కానీ నా సందేహాలను మీరు అర్థం చేసుకోలేరు. ఆ పుస్తకం 1927 నుంచి మార్కెట్లో వుంది కాబట్టి కొంతమందికి కథ ఎలాగూ తెలిసి వుంటుంది కాబట్టి స్పాయిలర్ ఎలెర్ట్ యివ్వనక్కరలేదేమో.
దీని ప్రధాన కథాంశం – ఒక బ్రాహ్మణ యిల్లాలు ఒక ముస్లిం మోజులో పడి యిల్లు వదిలి బయటకు వచ్చేసి, నిర్జన ప్రదేశంలో స్వేచ్ఛాజీవుల్లా బతుకుతారు. అప్పట్లో అలా రాస్తే చెల్లింది కానీ యిప్పుడైతే ‘లవ్ జిహాద్’ అని హిందూత్వవాదులు గొడవ పెట్టి, సినిమా ఆపించినా ఆపించవచ్చు. అందుకని ఆ ముస్లింను హిందువుగా మార్చినా నేను ఆశ్చర్యపడను.
ముందే చెపుతున్నాను, నాకు ‘‘మైదానం’’ నవల నచ్చదు. అందువలన నా విమర్శలు నెగటివ్‌గానే వుంటాయి. చలం అంటే నాకు ఆరాధనా లేదు, అసహ్యమూ లేదు. నా దృష్టిలో ఆయన రచనల్లో కొన్ని బాగుంటాయి, కొన్ని బాగోవు. ‘‘మ్యూజింగ్స్’’ మంచి రచన. కానీ అది నాన్ ఫిక్షన్. 80, 90 ఏళ్ల క్రితం స్త్రీ మనసును ఎవరూ పెద్దగా పట్టించుకోని రోజుల్లో ఆయన వాళ్ల వెతల గురించి రాశాడని కొందరికి ఆయనంటే ఆరాధన.
స్త్రీవాదులు ఆయన్ను నెత్తిమీద పెట్టుకుంటారు. తిరువణ్ణామలై వెళ్లానని చెపితే ‘మరి చలం సమాధి చూశారా?’ అని కొందరడిగారు. నా కంత వెర్రి లేదన్నాను. ఆదిశంకరుడి ఊరు, వీరేశలింగంగారిల్లు, షేక్‌స్పియర్ యిల్లు, సిపి బ్రౌన్ సమాధి పని గట్టుకుని చూశాను కానీ యిది చూడాలనిపించలేదు.
స్త్రీహృదయం గురించి శరత్‌బాబు చాలా చక్కగా ఆవిష్కరించాడు. ఆయన నవలలు యిప్పటికీ చదవబుద్ధవుతాయి. కానీ చలం వెగటు పుట్టించే రచనలు చేశాడని నా ఫిర్యాదు. అప్పట్లో అవి సమాజాన్ని కుదిపేసి వుండవచ్చు. కానీ ఎంతమందిని సంస్కరించాయో నాకు తెలియదు. ఇలాటివాటిల్లో ఎవరూ ఏ గణాంకాలూ యివ్వలేరు.
చలం రాసిన ‘‘దోషగుణం’’పై ఆధారపడి తీసిన ‘‘గ్రహణం’’ (2005) సినిమా నాకు బాగా నచ్చింది. మెచ్చుకుంటూ స్వాతి వీక్లీలో ఆర్టికల్ కూడా రాశాను. ఒక మూఢనమ్మకంపై, కాకతాళీయమైన ఒక సంఘటనపై ఆధారపడి, ఒక పచ్చని కాపురం ఎలా కూలిపోయిందో చెప్పే ఆర్ద్రమైన కథ అది. అలాటి పిచ్చినమ్మకాలు యిప్పటికీ వున్నాయి. మరి ‘‘మైదానం’’ కథ ఏ సందేశం యిస్తోందని దర్శకుడు దీన్ని ఎంచుకున్నాడో సినిమా చూసేదాకా తెలియదు. దూరదర్శన్ వాళ్లు గతంలో టీవీ ఫిల్మ్‌గా తీశారట. అది నేను చూడలేదు.
ఇక కథ విషయానికి వస్తే, రాజేశ్వరి అనే ఆమె స్వగతంలో చెప్తుంది. ఆమె ఆచారవంతులైన బ్రాహ్మణ కుటుంబానికి చెందినది. భర్త లాయరు. పిల్లలు లేరు. భర్త క్లయింటుగా అమీర్ అనే అతను వస్తూంటే అతన్ని చూసి మనసు పారేసుకుంటుంది. సాధారణంగా యిద్దరి మధ్య ప్రేమ పుట్టాలంటే వాళ్లిద్దరి మధ్య కొంత యింటరాక్షన్ వుండాలి.
ఏవో కొన్ని మాటలో, చేష్టలో, ఏదో రకంగా సాయపడడాలో, కలహించుకుని సమాధాన పడడాలో యిలాటివి. ఇలాటివి ఏవీ జరగవు వీళ్ల మధ్య. అతను యీమె కేసి కాంక్షగా చూస్తాడు. ఈమె అతని కేసి మరింత కాంక్షగా చూస్తుంది. ఒక మధ్యాహ్నం వేళ యింట్లోకి దర్జాగా వచ్చి యీమెను కౌగలించుకుంటాడు.
ఈమె అతనికి లొంగిపోతుంది. ఓ మాటా, పలుకూ లేదు. తడబాటూ, ఊగిసలాటా లేదు. పురాణగాథల్లో రాజులు, ఋషులు కూడా ఎవరో అప్సరసను చూసి క్షణంలో మోహించి, ఆమె వెంట పడతారు చూడండి, ఆ ఫక్కీలో ఒట్టి రూపం చూసి యీమెకు పట్టరాని వలపు (ఆమె ప్రేమ అనదు, కామం అన్నా ఒప్పుకోదు, ఆ ఫీలింగుకు మనమే నిర్వచనం యిచ్చుకోవాలి) కలిగింది. అలా అయిదారు మధ్యాహ్నాలు అయ్యాక, ఓ రోజు ‘నాతో వచ్చేయ్, నైజాం వెళ్లిపోదాం, అక్కడ మనల్నెవరూ పట్టించుకోరు’ అంటాడతను.
ఆ అమీర్ చేసే పనేమిటో, ఆదాయం ఎక్కణ్నుంచి వస్తుందో, ఆస్తి ఏమైనా వుండి కోర్టులో యిరుక్కోవడం వలన లాయరు దగ్గరకు వచ్చాడేమో, నవల పూర్తిగా చదివినా మనకు తెలియదు. అతనికి పెళ్లయిందో, పిల్లలున్నారో లేదో కూడా తెలియదు. ఈమె కూడా అడిగినట్లు రాయలేదు. ఆమె భర్త ఊళ్లోలో లేని రాత్రి వీళ్లిద్దరూ వేరే వూరు వచ్చేసి, ఒక నదీతీరంలో ఊరికి దూరంగా కాపురం పెట్టేశారు. అక్కడకి వచ్చాక కూడా అమీర్ ఏ పని చేస్తున్నట్లూ, డబ్బు సంపాదించినట్లూ, రచయిత రాయలేదు. ఎంతసేపూ యిద్దరూ కామసుఖాల్లో మునిగి తేలుతూంటారు.
చుట్టూ మనుష్యులు ఎవరూ లేకపోవడం చేత, విచ్చలవిడిగా, విశృంఖలంగా ‘‘బ్లూ లగూన్’’ లో యువజంటలా జీవిస్తూంటారు. ఈమె రవిక వేసుకోవడం మానేసింది కూడా. వాళ్లుండేది గుడిసెలో, వండుకునేది కుండలో, అది కూడా పెద్దగా ఏమీ వుండదు. అయినా ఆమె చాలా హాయిగా వుంటుంది. ఆమె భర్తను వదిలేయడానికి కారణమేమీ రచయిత చెప్పలేదు.
అతను మామూలు భర్త, అనుమానించే మనిషి కాడు, చాదస్తుడు కాడు, వేపుకుతినేవాడు కాడు, సంపాదనపరుడే. పురుషుడే. పెళ్లయిన కొత్తల్లో అందరిలాగా ఆమెను రతిసుఖాల్లో ముంచి తేల్చినవాడే. అయినా యీమె అమీర్‌ను చూసి మురిసి పోతూ వుంటుంది. పరవశమై పోతూ వుంటుంది. అతను యీమె పట్ల అతి పొజెసివ్‌నెస్ కనబరుస్తూ వుంటాడు. వీళ్లు వచ్చేసిన మూణ్నెళ్లకు ఆమె మావయ్య వచ్చి తిరిగి వచ్చేయమని బతిమాలితే యిద్దరూ ఛీత్కరించి పంపుతారు.
ఇక్కడివరకు రొటీన్ లైఫ్ గడిపే ఓ యిల్లాలి ఫాంటసీని సంతృప్తి పరిచే వ్యవహారం అనుకుని సరిపెట్టుకోవచ్చు. ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది. అమీర్‌కు ఊళ్లో వున్న ఓ తోళ్ల సాయిబు కూతురి మీద మోజు పుడుతుంది. ఆమె బంధువైన మీరా అనే 16 ఏళ్ల కుర్రవాడి ద్వారా రాయబారం నడుపుతున్నాడు కానీ ఫలించటం లేదు. అమీర్ దిగులుపడడం చూసి బెంగ పెట్టుకున్న రాజేశ్వరి, మీరాను పట్టుకుని సంగతి తెలుసుకుని, ఆ పిల్ల వద్దకు వెళ్లి, అమీర్‌తో పడుక్కో అని కన్విన్స్ చేసి తీసుకుని వస్తుంది. ఇది నాకు అస్సలు మింగుడు పడలేదు.
‘‘పడవ ప్రయాణం’’ కథలో పాలగుమ్మి పద్మరాజు గారు భర్త మీద పిచ్చి ప్రేమతో తెలివితక్కువ పనులు చేసిన ఒక స్త్రీ కథ రాసి మెప్పించారు. కానీ యిలా యింకో ఆడదాన్ని తెచ్చి భర్తకు తార్చడం ‘‘సతీ సుమతి’’ కంటె ఓ మెట్టు పైకి వెళ్లినట్లే! సుమతి కుష్టురోగి ఐన భర్త వేశ్య దగ్గరకు వెళతానంటే, ఆమెను బతిమాలి, ఒప్పించి, తను భర్తను నెత్తి మీద బుట్టలో పెట్టుకుని తీసుకెళ్లింది.
ఇక్కడ అమీర్ అడక్కపోయినా, రాజేశ్వరి తనంతట తానే అతని విరహాన్ని తెలుసుకుని, అతని ప్రియురాలిని బతిమాలి, వెంటపెట్టుకుని వచ్చింది. ఎందుకంటే అమీర్ బాధను చూడలేక పోయిందట. ఇది మగవాడైన రచయిత ఫాంటసీ అనిపిస్తుంది నాకు. పురాణాలను నిరసించే స్త్రీవాదులకు యీ కథ ఎందుకు నచ్చిందో, నాకు ఎప్పటికీ అర్థం కాదు.
తోళ్ల సాయిబు కూతురితో ఓ పదిరోజులు ప్రణయం సాగించాక, అతనికి ఆమెపై మోజు పోయిందట. ఎందుకంటే ఆమెది భారీ పర్శనాలిటీట. శృంగారంలో చొరవ ఎక్కువగా తీసుకుంటుందట. ఇంతలో రాజేశ్వరికి కడుపు వచ్చింది. అమీర్ వాడు దెయ్యం బిడ్డ, చంపేయ్ అన్నాడు. ఈమె వినలేదు. దాంతో అతను యీమెను తిట్టాడు, డొక్కలో తన్నాడు, కర్ర తీసుకుని కొట్టాడు.
ఇదంతా హీరోయిజం అనిపిస్తుంది రాజేశ్వరికి. ‘మన మొగుళ్లయితే పెళ్లం రంకు సాగించినా గుట్టు బయటపడకుండా కడుపులో పెట్టుకుని దాచుకుంటారు. అదే అమీర్ అయితేనా? నాకేసి ఎవడైనా కన్నెత్తి చూసినా నరికి పోగులు పెట్టడూ?’ అని మురిసిపోతుంది. ఏది ఏమైతేనేం, గర్భస్రావానికి ఒప్పుకోదు. దాంతో అమీర్ ఆర్నెల్లదాకా రానని, బియ్యం అదీ తెచ్చి యిచ్చే ఏర్పాటు మీరా ద్వారా చేస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
అతను వెళ్లిపోయాక మీరా ఆమెకు చేరువయ్యాడు. అతను తనను ఆరాధించే విధానం చూసి ఆమె మురిసిపోయింది. అతన్ని తమ్ముడిగా భావిస్తున్నానంటూనే కౌగలించుకునేది. ముద్దులు పెట్టుకునేది. అతను కూడా ‘దీదీ’ అని పిలుస్తూనే వాటేసుకుంటున్నాడు. అంతలోనే యిద్దరూ గిల్టీగా ఫీలవుతున్నారు.
అతనికి కూడా వేరే వ్యాపకం, ఆదాయమార్గం ఏదీ వున్నట్లు చెప్పలేదు. సవతి పిన్ని, అక్క వున్నారు. ఈమె దగ్గరకు వచ్చి కూర్చుంటున్నాడని వాళ్లకు తెలుసు. అయినా ఆపే ప్రయత్నం చేసినట్లు కనబడదు. ఓ రోజు రాత్రి యీమె ఒక్కత్తీ పడుకుని వుండగా ఎవడో వచ్చి బలాత్కారం చేయబోయాడు. ముందు జాగ్రత్తగా మీరా యిచ్చిన బాకు చూపించి కాపాడుకుంది.
అమీర్ యీమెను ఎందుకు వదిలిపోయాడో మీరాకు తెలియదు. ఓ రోజు అడిగితే చెప్పింది. అప్పుడు మీరా తన అక్కతో చెప్పి ఒకావిణ్ని పంపించాడు. ఆమె వచ్చి నెలలు నిండలేదు కాబట్టి, కావాలంటే గర్భం తీసేస్తానంది. తీయించేసుకుంటే మళ్లీ అమీర్‌తో గతంలోలా స్వేచ్చగా పిల్లా, పీచూ గొడవ లేకుండా బతకవచ్చు కదానిపించింది యీమెకు.
ఇదే మాట అమీర్ చెపితే అప్పుడు వినలేదు, యిప్పుడు తోచి, సరేనంది. అప్పటికే చాలా నెలలు కావడంతో భారీగా రక్తస్రావం అయింది. మీరా సేవ చేశాడు. పుట్టిన పిల్లను మీరా ఎక్కడో పారేసి వచ్చాడు. సజీవంగా వుందో, లేదో రాయలేదు, శవం అని రాయలేదు, ‘నా చిన్ని పాపని బట్టలో లుంగ చుట్టి పట్టుకెళ్లిపోయాడు, అడిగితే నీకు కనబడదులే అన్నాడు. ఆ పిల్లను దిక్కులేకుండా పారెయ్యడమంటేనే నాకు కష్టంగా వుంది.’ అని రాశారు. దీని తర్వాత కథలో పిల్ల ప్రస్తావన మళ్లీ రాలేదు. మళ్లీ శృంగారంలోకే కథ మళ్లింది.
మీరాను చిన్నపిల్లాడిలా లాలిస్తూనే వుంటుంది. అమీర్ తిరిగి వస్తాడేమోనని భయపడుతూనే, అతనితో పడుక్కోవడానికి సిద్ధపడుతుంది. ‘అమీర్ వచ్చి నీ మీద చెయ్యి వేస్తే చంపేస్తా వాణ్ని’ అంటాడు మీరా. చివరకు వెళ్లిన నాలుగు నెలలకు అమీర్ తిరిగి వచ్చాడు. వచ్చి ఎంత అందంగా తయారయ్యావ్ అంటాడు తప్ప, యిన్నాళ్లూ ఎలా బతికావు అని అడగడు. నా కోసం గర్భపాతం చేయించుకున్నావా అని మెచ్చుకోడు. వస్తూనే మళ్లీ వీళ్ల రాసక్రీడ సాగుతుంది. మీరా అమీర్ కళ్లెదుర పడకుండా వీళ్లనంతా గమనిస్తూ వున్నాడు.
ఓ రోజు రహస్యంగా రాజేశ్వరిని కలిసి, ‘మీరిలా సన్నిహితంగా వుండడం నాకు భరించశక్యంగా లేదు, అందుకే నేను రావటం లేదు’ అన్నాడు. ‘నువ్వు రాకపోతే నాకు బాగుండదు, వస్తూండు’ అందీమె. చెప్పింది కదాని అతను వస్తే అమీర్ అతనితో అతి తక్కువగా మాట్లాడాడు. అతనికి సందేహం కలిగినట్లుగా వుందని గ్రహించి మీరా రావడం మానేశాడు.
మళ్లీసారి కలిసినప్పుడు, ‘అమీర్ వుండగా నువ్వు రావలసినదే’ అని రాజేశ్వరి పట్టుబట్టింది. ఆమె మాట మీరలేక అతను వచ్చాడు, ఏవేవో కబుర్లు చెపుతూ కూర్చున్నాడు. అమీర్ మౌనంగా కత్తి నూరుతూ కూర్చున్నాడు. ఈమె మీరా చేత దీదీ అని పిలిపించుకుంటూనే, వాటేసుకుని కూర్చుంది.
భోజనానికి పిలిస్తే అమీర్ రాకపోతే, రాజేశ్వరి, మీరా యిద్దరూ తిన్నారు. ఈ ఆక్వర్డ్‌నెస్ భరించలేక మీరా బయలుదేరినప్పుడల్లా యీమె ఆపింది. సాయంత్రానికి మీరా వెళ్లిపోయాడు. ఆ రాత్రి అమీర్, రాజేశ్వరి కొండల్లో విహారానికి బయలుదేరినప్పుడు వారిని అనుసరించి వెళ్లిన మీరా చీకట్లో ప్రమాదవశాత్తూ అగాధంలో పడిపోయి, ఒక చెట్టుకొమ్మను పట్టుకుని వేళ్లాడాడు. అతని గొంతు గుర్తుపట్టి, రాజేశ్వరి ఆందోళన పడింది. ఆమె కోసం అమీర్ ప్రాణాలకు తెగించి మీరాను కాపాడాడు.
మర్నాడు మీరా రాగానే యీమెకు అతని మీద ప్రేమ పొంగి పొరలిపోయింది. కౌగలించుకుని అతని తలను ఛాతీకి అదుముకుంది. అంతా చూస్తూ అమీర్ భగ్గుమన్నాడు. బయటకు వెళ్లి, రెండు రవికలు తెచ్చి ‘ఇవాళ్టినుంచి యివి వేసుకో’ అన్నాడు. ఆ రాత్రి అమీర్, రాజేశ్వరి రమించి, నిద్రపోయిన తర్వాత మీరా వచ్చి ఆమెను లేపాడు. బయటకు నది ఒడ్డుకు తీసుకెళ్లాడు. ‘నిన్ను వదులుకోను, మనం ఎక్కడికో అక్కడికి పారిపోదాం. ఇక్కడే వుంటే అమీర్ నిన్ను చంపుతాడు.’ అన్నాడు. ‘దీదీ, దీదీ, నువ్వు నా దానివి’ అంటూ ఆక్రమించుకున్నాడు. ఇద్దరూ రతికేళిలో పాల్గొని, నిద్రలోకి జారుకున్నారు.
కాస్సేపటికి ఆమెకు మెలకువ వచ్చింది. చూస్తే చేతిలో కత్తితో అమీర్! మీరా జుట్టు పట్టుకుని లేపాడు. కత్తి ఎత్తాడు. ఈమె ఆ కత్తికి అడ్డుపడింది. ‘వాణ్ని ఒదులు’ అన్నాడు అమీర్. ‘నన్ను చంపాకనే..’ అంటూ యీమె మీరాని తన శరీరంతో కప్పేసి, వీపులో దిగే కత్తిపోటుకై ఎదురు చూసింది.
పది నిమిషాలు గడిచాక కళ్లు తెరిచి చూస్తే చుట్టూ రక్తం, అమీర్ పడి వున్నాడు. ‘మీరా, పరిగెట్టుకెళ్లి డాక్టర్ని తీసుకురా’ అంది రాజేశ్వరి. అతను వెళ్లగానే ‘అమీరూ, ఎందుకిలా చేశావ్’ అంది. ‘నిన్ను మీరాతో పంచుకోలేను. నిన్నయితే చంపదలచుకోలేదు. నేనో, మీరాయో ఒకరే బతకాలి. నీకు మీరా కావాలని నాకు అర్థమైంది.’ అన్నాడు అమీర్. ‘నీ మీద నాకు ప్రేమ తగ్గలేదు. మీరా విచారం చూడలేక అతన్ని నిరాకరించలేదంతే’ అంటూ యీమె ఏడ్చింది.
తెల్లవారింది. అమీర్ రొమ్ముమీద లోతైన గాయం కనబడుతోంది. మీరా, డాక్టరూ, పోలీసులు వచ్చారు. డాక్టరుతో చెప్పగానే అతను పోలీసులకు కబురు పెట్టాడు. వాళ్లు కత్తి, గాయం అనగానే ఎవరు పొడిచారని అడిగారు. ఈమె చంపి వుంటుందని అనుకుని, మీరా ఆ నేరం తనమీద వేసుకున్నాడు. పోలీసులు వెంట వచ్చారు. సంగతి తెలిశాక అతనే పొడుచుకున్నాడు అని రాజేశ్వరి చెపితే పోలీసులు నమ్మలేదు. అప్పుడు మీరాను రక్షించాలని, ఆమె ‘నేనే పొడిచాను’ అంది. జైల్లో పడేశారు. జైల్లో కూర్చునే యీ కథంతా ఆమె స్వగతంగా చెప్పింది.
ఇదీ కథ. ‘దీన్ని సినిమాగా తీస్తే తప్పేముంది? ఇలాటి మనుష్యులు నిజజీవితంలో వుండరని మీరనగలరా?’ అని అనకండి. ఉంటారు మహాప్రభో, వుంటారు. లోకంలో అన్ని రకాలూ, ఏ రచయితా వూహించలేనంత చిత్రమైన మనుషులు రక్తమాంసాలతో వుంటారు.
ఉపకారం చేసినవాడికి అపకారం చేసేవాళ్లు, ఉత్తిపుణ్యాన మరో మనిషి ఎదుగుదల చూసి ఏడ్చేవాళ్లు, పావలా కోసం ప్రాణాలు తీసేవాళ్లు. ఇలా ఎందరెందరో! మనుషులే కాదు, దేవుళ్లు కూడా ఇర్రేషనల్‌గా ప్రవర్తిస్తారు. తమ కోసం దేవాలయం కట్టించిన పాపానికి లేదా పుణ్యానికి జైల్లో పడిన రామదాసుకి దర్శనం యివ్వకుండా, రామలక్ష్మణులు తానాషాకు యివ్వడమేమిటి? లోకంలో పుణ్యాత్ములకు కష్టాలు కలగడం, పాపాత్ములు సుఖంగా కులకడం చూస్తూ వుంటాం.
అయితే యీ జీవితాలను కథలుగా, నాటకాలుగా, సినిమాలుగా మలిచినపుడు ప్రతీదానికీ జస్టిఫికేషన్ చూపించాల్సి వస్తుంది. తానాషా గతజన్మలో రామభక్తుడని చెప్పవలసి వస్తుంది. పాపిష్టివాళ్లకు సంచితకర్మఫలంగా సుఖాలబ్బాయని చెప్పాల్సి వస్తుంది. రాజేశ్వరి వంటి వ్యక్తి ప్రవర్తనకు కారణం ఏమిటంటే ఏం చెప్పగలడు రచయిత? ఈ మధ్య ఓ కేసు చదివాను.
ఒక వితంతువుకు తన కంటె తక్కువ వయసున్న బ్రహ్మచారితో అక్రమసంబంధం ఏర్పడింది. అతను వేరేవాళ్లను పెళ్లి చేసుకుంటే అందుబాటులో వుండడని, కూతుర్నే యిచ్చి పెళ్లి చేసింది. పెళ్లయ్యాక యీ సంబంధం గురించి తెలిసి కూతురు ఆత్మహత్య చేసుకుంది. దీన్నే నాటకంగా రాసినపుడు, యీ సంఘటనతో విచలితురాలై పోయిన తల్లి తన ప్రవర్తనకు తనపై అసహ్యం పుట్టి, సెక్స్‌పై విరక్తి కలిగి సన్యాసం తీసుకుందని ముగింపు యిస్తాడు నాటకకర్త.
కానీ నిజజీవితంలో జరిగినది వేరు. కూతురు చనిపోయిన రెండు, మూడు నెలలాగి యీమె అతనితో మళ్లీ కాపురం పెట్టేసింది. కూతురు ఆత్మహత్యకు కారణాలు వెతుకుతున్న పోలీసులు వీళ్లని పిలిచి విచారిస్తున్నారు. వెళ్లి, మన సంబంధం గురించి చెప్పేద్దామని ప్రియుడు కమ్ అల్లుడు అనసాగాడు.
దాంతో విసిగిపోయిన ఆమె అతన్ని చంపేసి, పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. ‘లొంగిపోయే కాడికి యితన్ని చంపడం దేనికి? తనే ఆత్మహత్య చేసుకోవచ్చుగా!’ అంటారు పాఠకులు, దీన్ని నవలగా రాస్తే! జీవితాల్లో ఏ లాజిక్కూ లేకుండా బతికేసే మనుషులు పాఠకులుగా, ప్రేక్షకులుగా మారేటప్పటికి లక్ష లాజిక్కులు లాగుతారు. కన్విన్సింగ్‌గా లేదు అంటారు.
రాజేశ్వరి వంటి కారెక్టరు ప్రవర్తనను అర్థం చేసుకోవాలన్నా, చూసి జాలి పడాలన్నా, ఎంపతైజ్ చేయాలన్నా చాలా కష్టం. ప్రొటగానిస్టుతో ప్రేక్షకుడు మమేకం కాకపోతే, రససిద్ధి సాధించలేము. ‘‘మనుషులు మారాలి’’ సినిమాలో హీరోయిన్ పిల్లలకు విషం పెట్టి చంపేసిందని సినిమా మొదట్లోనే చెప్పారు.
ఎంత ఘోరం? అంటూ సినిమా చూశాక, చివర్లో ఆమె పరిస్థితి అర్థమయ్యాక ప్రేక్షకులు కంటతడి పెట్టారు, సినిమాను హిట్ చేశారు. ఇప్పుడీ సినిమాలో కూడా రాజేశ్వరి ప్రవర్తనకు కారణాలు వెతుకుతూ సంఘటనలు సృష్టించాలి. ఆమె భర్తను శాడిస్టో, మరోటో చేయాలి. అమీర్ కోసం యింకో అమ్మాయిని తీసుకురావడానికి మరో కారణం సృష్టించాలి.
ఇవన్నీ చేయడానికి మూలరచయిత మరణించారు. పురాణాలైతే యిష్టం వచ్చినట్లు మార్చేయవచ్చు. కానీ సాంఘిక రచనలను రచయిత పోయిన తర్వాత మార్చగలరా? ‘‘కన్యాశుల్కం’’ నాటకాన్ని సినిమాగా తీసినపుడు సుఖాంతం చేయడానికి చివర్లో మార్చారు, అర్థవంతంగానే మార్చినా, దానికే క్షమాపణ చెప్పారు.
మరి చలం కథ మారిస్తే వీరాభిమానులు ఊరుకుంటారా? చూడాలి, ఏం జరుగుతుందో! ఈ వ్యాసంపై కామెంట్స్ చేసేవారు చలం వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడకపోవడం సబబు. ఇది ఆయన కాల్పనిక రచన, దీనిపైనే చర్చ జరగాలి తప్ప ఆయన అలాటివాడు, యిలాటివాడు అనడం అనవసరం.
ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2020)
[email protected]