అయిపోయింది. విభజించేశారు. 2009 డిసెంబరు 9 నాడు సోనియా పుట్టినరోజు నాడు విభజన ప్రకటన రాగానే 'రాష్ట్రమంటే బర్త్ డే కేక్ అనుకున్నారా, యింత అడావుడిగా కోసిపారేయడానికి..?' అని ఆశ్చర్యపడ్డాం, ఆగ్రహించాం. ఇప్పుడర్థమైంది, మన రాష్ట్రపరిస్థితి అంతకంటె ఘోరమని. బర్త్ డే కేక్ కట్ చేసినవారు ముందో ముక్క కట్ చేసి పక్కనున్నవాళ్ల నోట్లో పెడతారు, వాళ్లు యింకో ముక్క చేతిలోకి తీసుకుని వీళ్ల నోట్లో పెడతారు. ఆ తర్వాత తక్కిన ముక్కలు సమానంగా కట్ చేసి వచ్చినవాళ్లందరికీ పంచుతారు. పుట్టినరోజు చేసుకునేవారే పెద్ద ముక్క వుంచేసుకోరు. ఇక్కడ తెలంగాణ అమ్మ సోనియా కట్ చేసి సుష్మ నోట్లో పెట్టింది, చిన్నమ్మ సుష్మ సోనియా నోట్లో పెట్టింది. ఇక తెలంగాణ మనదే అనుకుంటూ యిద్దరూ ఖుష్. మిగిలిన ముక్కలైనా చుట్టూ చొంగ కార్చుకుంటున్న తెలుగువాళ్లకు సమానంగా పంచాలి కదా. అది జరగలేదు. పెద్దముక్క వాళ్లే వుంచేసుకున్నారు – అంటే పెద్దమ్మో, చిన్నమ్మో – కేంద్రంలోకి ఎవరు వస్తే వాళ్లన్నమాట! హైదరాబాదుపై పదేళ్ల ఆధిపత్యం, నదీజలాలపై ఆధిపత్యం, ఉద్యోగుల వివాదాలపై ఆధిపత్యం, రెండు రాష్ట్రాలనూ కేంద్రం పంపించే ఒక్క గవర్నరు చేత పాలించే సౌలభ్యం – అన్నీ కేంద్రానివే!
రాజధాని కానీయండి, నదుల బోర్డు కానీయండి – ఉమ్మడి జాబితాలో పెట్టిన ప్రతీదాని విషయంలో పేచీలు రాకతప్పవు. వాటి పరిష్కారానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ కేంద్రానికి పరుగులు పెట్టాల్సిందే. సీమాంధ్ర ప్యాకేజీలో గొప్పగా చూపిస్తున్న పోలవరం ఎప్పణ్నుంచో వున్నదే. ఈ రోజు విభజన ప్యాకేజీలో దాన్ని చూపించి మాయ చేయడమే కాదు, అదంతా కేంద్రం తన చేతిలోకి తీసేసుకుంది. చిన్న చిన్న కాంట్రాక్టుల దగ్గర్నుంచి ఢిల్లీలోనే తేలతాయి. రాష్ట్రంలో అవినీతి జరుగుతుంది, కేంద్రంలో అయితే జరగదని ఏమీ లేదు. సంబంధిత మంత్రి బట్టి, పాలకుల బట్టి అంతా వుంటుంది. స్థానికులకైతే కాస్త అక్కర వుంటుందని ఆశించవచ్చు. బయటివాడి నుండి అలాటి ఆశలు పెట్టుకోలేం. చివరకి ఏది ఎలా పరిణమిస్తుందో వేచి చూడాలి. హైదరాబాదులో ముఖ్యమైన విషయానికి క్లియరెన్సు రావాలంటే ఢిల్లీకి వెళ్లే పరిస్థితి వస్తుందని నా అనుమానం. సీమాంధ్ర రాష్ట్రం గతి యింకా ఘోరం. రాజధాని ఎక్కడ అనే విషయం తేల్చుకునే క్రమంలో ఆర్నెల్లపాటు జుట్టూజుట్టూ పట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతాయి. ఆర్నెల్లు ఏడాది అయినా, ఆరేళ్లయినా ఆశ్చర్యం లేదు. రాయలసీమ, కోస్తా, తీరాంధ్ర నాయకులు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటారు. రాజధాని మా దగ్గర కావాలంటే మా దగ్గర కావాలని ఢిల్లీలో లాబీయింగులు చేసి వాళ్ల కాళ్లమీద పడతారు.
ఐఐటి, ఐఐఎమ్ పెడతాం అన్నారో, పెట్టాలా వద్దా అని పరిశీలిస్తాం అన్నారో స్పష్టంగా తెలియటం లేదు. గట్టిగా పరిశీలించి ఎక్కడో అక్కడ పెట్టండి మహాప్రభో అని కొన్నాళ్లూ, శాంక్షన్ చేశారు కదా అది మా జిల్లాలో పెట్టండి అని ఇంకొన్నాళ్లూ తిరుగుతారు. ఆ తర్వాత మా జిల్లాలో పెట్టకపోతే పోయారు కానీ, నా రాజకీయప్రత్యర్థి జిల్లాలో మాత్రం పెట్టకండి, లేకపోతే వాడికి అనవసరంగా పేరు వచ్చేసి పదవికి నాతో పోటీకి వచ్చేస్తాడు అని మరి కొన్నాళ్లూ తిరుగుతారు. చూడబోతే ఢిల్లీ-హైదరాబాదు ట్రావెల్ ఏజన్సీ, ఢిల్లీలో గుంటూరు మెస్ పెట్టుకున్నవాళ్లకి మంచి భవిష్యత్తు వున్నట్టు తోస్తోంది. గుంటూరు మెస్ ఎందుకంటే ఎపి భవన్ తెలంగాణకు రావాలని కెసియార్ పట్టుబడుతున్నారు. కాదు మాకే అని సీమాంధ్రులు ఎవరూ అనకపోయినా ఆయన పదేపదే చెప్పారు. ఇప్పుడు పోగొట్టుకున్నవాటితో పోలిస్తే ఎపి భవన్ ఓ లెక్కా అనుకుని సీమాంధ్రులు దాని గురించి పట్టించుకోరు. ఢిల్లీలో అలాటి భవనం కట్టుకునే స్తోమత సీమాంధ్రకు యీ థాబ్దంలో రాదు, పై థాబ్దం మాట చెప్పలేం. అప్పటిదాకా గుంటూరు మెస్సులే గతి.
పదేళ్లపాటు రాష్ట్రం పాలిస్తే ఏం, కేంద్రం పాలిస్తే ఏం అనుకోవచ్చు కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ సుస్థిరప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు తక్కువ. తెలంగాణలో తెరాస-కాంగ్రెసు సంకీర్ణ ప్రభుత్వం కొంతవరకు సుస్థిరత తేవచ్చేమో కానీ సీమాంధ్రలో ఎవరికి రాజ్యం దక్కుతుందో యిప్పటికి చెప్పలేం. ఇక కేంద్రంలో కొద్దిపాటి మొగ్గుతో ఎన్‌డిఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు కానీ ఎన్నాళ్లు నిలబడుతుందో తెలియదు. ప్రాంతీయపార్టీల డిమాండ్లు, మోదీ వ్యవహారశైలి .. యిలా అనేక అంశాలపై దాని మనుగడ ఆధారపడి వుంటుంది. అస్థిర కేంద్రప్రభుత్వం చేతిలో మన భవిష్యత్తు వుండబోతోంది. బిజెపి ఏర్పరచిన మూడు రాష్ట్రాల రాజధానులు యిప్పటిదాకా సవ్యంగా ఏర్పడలేదు. వారికి నిధుల గురించి హామీలు దక్కాయి తప్ప నిధులు దక్కలేదు. రాయపూరులో కాంట్రాక్టులు చేపట్టిన ముగ్గురు తెలుగువాళ్లు నాకు తెలుసు. పని పూర్తయ్యాక ప్రభుత్వం డబ్బు లేదని చేతులెత్తేసింది. వీళ్లకు కోట్లలో నష్టం వచ్చింది. ఇప్పుడు సీమాంధ్రలో కాంట్రాక్టులంటే వాళ్లు సాహసించరు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకే డబ్బు లేక కాస్త కాస్త విదిలిస్తారు. మూడేళ్ల క్రితం రైల్వే బజెట్‌లో ఆమోదించిన కొత్త లైన్లకు మోక్షం వుండదు. అలాటప్పుడు కొత్త రాష్ట్రానికి కొత్త రాజధానికి వేల కోట్లు గుమ్మరించడానికి ఎవరికి కుదురుతుంది? ఎవరికి మనసు వస్తుంది? రాజకీయంగా ప్రయోజనం లేని పక్షంలో విదల్చడం మరీ సందేహాస్పదం.
బాధ్యత లేకపోయినా హక్కులు మాత్రం కేంద్రం గుంజేసుకుంది. అది కూడా ఘోరమైన క్రీడలో! తలుపులు మూసేసి, కెమెరాలు ఆర్పేసి, గొంతులు నొక్కేసి, సంబంధిత వ్యక్తులను తరిమేసి, రెండు ప్రధానపక్షాలు కూడబలుక్కుని ప్రజస్వామ్యంపై చేసిన జంటరాక్షసరతి కారణంగా కొత్త రాష్ట్రం ఏర్పడుతోంది. వార్ బేబీ (శత్రుసైన్యం చేతిలో బలాత్కారానికి గురైన మహిళలకు పుట్టినవారు)ల ప్రవర్తన అసహజంగా వుంటుంది. కొంతకాలం పోతే దీని దుష్ప్రభావం తేటతెల్లమౌతుంది. విభజన గురించి అనేక చర్చలు జరిగాయని షిండే వంటి అబద్ధాలకోరులు లోకాన్ని బుకాయిస్తున్నారు. ఒకే పార్టీకి చెందిన యిరుప్రాంతాల మధ్య కూడా చర్చలు జరగలేదు. అందరూ ఎవరికి తోచినది వాళ్లు చెప్పుకుని రావడమే జరిగింది తప్ప యిరువురు భాగస్వాములకు మధ్య జరిగే పాటి సంభాషణ కూడా జరగలేదు. కాంగ్రెసుతో సహా ఏ పార్టీ దానికి ఉద్యమించలేదు. ఈ రోజు ఏకపక్షంగా, అన్యాయంగా, అడ్డగోలు రీతిలో రాష్ట్రాన్ని విభజించి పారేశారు. ఇక మన చావు మనం చావాలి. ఎలా ఛస్తామో, ఎలా బతుకుతామో దేవుడి కెరుక.
ఇకపై వ్యాసాల్లో 'మన రాష్ట్రం' అని రాయడానికి వీలుండదు. ఎందుకంటే యివి రెండు రాష్ట్రాల తెలుగువాళ్లు చదువుతారు. 'మన' అంటే ఏ రాష్ట్రం? సీమాంధ్రానా? తెలంగాణాయా? అని అడుగుతారు. చివరగా – సీమాంధ్రులకు కూడా మేలు చేశాం అని చెప్పుకుంటున్న ఢిల్లీ నాయకులు అదెలాగో చెప్పుకోలేక పోతున్నారు. ఈ మొత్తం ప్రాసెస్‌లో సీమాంధ్రులకు ఒనగూడిన లాభం ఏమిటో నాకు తోచింది – తెలంగాణలో వున్నవాళ్లందరూ వాళ్ల వాహనాల రిజిస్ట్రేషన్ – 'టిజి' ట్యాగ్‌తో మార్పించుకోవాలి. కానీ సీమాంధ్ర పేరు 'ఆంధ్రప్రదేశ్' గానే వుండబోతోంది కాబట్టి వాళ్లు మార్పించుకోనక్కరలేదు! ఆ మేరకు వాళ్లకు డబ్బులు మిగిలినట్లే!
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2014)