ఉత్తర కేరళలోని కన్నూరుది రక్తచరిత్ర. ప్రాణాలర్పించడానికి వెఱువని అక్కడి ప్రజల గాథలను మలయాళ జానపద గీతాల్లో 'వడ్కన్ పాట్టు'గా పాడుకుంటారు. ఆంగ్లేయులకు ఎదురొడ్డి పోరాడిన సామంతరాజు పాళాసి రాజా కూడా అక్కడివాడే. నిత్యజీవితంలో సీదాసాదాగా వుండే కన్నూరు ప్రజలు పట్టుదలలు వస్తే మాత్రం ప్రాణాలు యివ్వడానికైనా, తీయడానికైనా జంకరు. తిరగబడడం తమ రక్తంలోనే వుందని, పౌరుషానికి తాము పెట్టింది పేరని వారు విశ్వసిస్తారు. స్థానిక పాలకుల దుష్టపాలన కారణంగా అక్కడ బీదరికం విపరీతంగా వుండేది. ఆధునిక కాలంలో వ్యాపారస్తుల దోపిడీ కూడా నిరాఘంటంగా సాగింది. దాంతో మన దేశంలో కమ్యూనిజం ప్రవేశించినప్పుడు అక్కడ సులభంగా వేళ్లూనుకుంది. కార్మికోద్యమం అనేకమందిని ఆకర్షించింది. 1960లలో ఒక బీడీ ఫ్యాక్టరీలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలోని కార్మికసంఘం సమ్మె నిర్వహించింది. దాన్ని ఎదుర్కోవడానికి యాజమాన్యం కమ్యూనిజానికి బద్ధ వ్యతిరేకి ఐన ఆరెస్సెస్ సాయం కోరింది. వాళ్లు యీ అవకాశాన్ని వినియోగించుకుని సమ్మె విఫలం చేశారు. యాజమాన్యం అనేకమంది కార్మికులను తీసేసింది. అప్పుడు కమ్యూనిస్టుల మార్గదర్శకత్వంలో కార్మికులు సహకారపద్ధతిలో పోటీగా బీడీ ఫ్యాక్టరీ పెట్టి విజయం సాధించారు. ఇది పెట్టుబడిదారులను మండించింది.
కన్నూరులో ముస్లిములు కూడా గణనీయమైన సంఖ్యలో వున్నారు. ఫర్నిచర్ వ్యాపారం, చేపల వ్యాపారం వాళ్ల చేతిలోనే వుండేది. కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు వీళ్లకు పొరుగునే వుంటుంది. అక్కడ వున్న హిందూ వ్యాపారస్తులు యీ వ్యాపారాలపై కన్నేశారు. ముస్లిం ప్రాబల్యం తగ్గించడానికి వారు ఆరెస్సెస్‌ను ప్రోత్సహించారు. కమ్యూనిస్టులు స్థానిక ముస్లిము వ్యాపారస్తులకు మద్దతుగా నిలిచారు. ఇక యిరువర్గాల మధ్య కలహాలు పెరిగాయి. ఇది 1971 నాటి తలస్సేరీ మతకలహాలకు దారి తీసింది. కమ్యూనిస్టులు, ముస్లిములు ఒకవైపు, ఆరెస్సెస్ వారు మరోవైపు చేరిన యీ కలహాలు రాజకీయాలతో ఆగలేదు. హింసకు, హత్యలకు దారి తీశాయి. ప్రస్తుతం 25 లక్షలున్న కన్నూరు జిల్లాలో గత నాలుగు దశాబ్దాలలో 230 రాజకీయ హత్యలు జరిగాయి. గ్రామాలకు గ్రామాలు పార్టీల పరంగా విడిపోయాయి. కొట్లాటలకు పెద్ద కారణాలు అవసరం లేదు. పార్టీ జండా చింపారనో, తమ పార్టీకై కేటాయించుకున్న గోడపై ఏదో రాశారనో, తమ పార్టీ నాయకుణ్ని ఏదో అన్నారనో, బస్సు ఎక్కుతూంటే తోశారనో – ఏదో ఒక కారణంతో ప్రారంభమై హత్యల దాకా వెళ్లిపోతున్నాయి.
ప్రతి గ్రామంలోను యీ కలహాల్లో మరణించిన వారికి నివాళిగా 'అమరవీరుల' స్మారకచిహ్నాలు వెలుస్తున్నాయి. ఆరెస్సెస్ తరఫున చనిపోయినవారిని 'బలిదానీ'లుగా వ్యవహరిస్తే కమ్యూనిస్టుల తరఫున చనిపోయినవారిని 'రక్తసాక్షులు'గా వ్యవహరిస్తున్నారు. వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తూన్నారు. ఆ సభల్లో ప్రతీకారం తీర్చుకోవాలంటూ నాయకులు కార్యకర్తలను ఉద్బోధిస్తున్నారు. ప్రస్తుతం బీడీ పరిశ్రమ, చేనేత పరిశ్రమ దెబ్బ తినడంతో ఆ ప్రాంతంలో అభివృద్ధి పెద్దగా లేదు. అది కూడా సామాజిక అశాంతికి దోహదపడుతోంది. యుడిఎఫ్ పాలనలో 2011-16 మధ్య 10 రాజకీయ హత్యలు జరిగితే సిపిఎం నేతృత్వంలో ఎల్‌డిఎఫ్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 6 రాజకీయ హత్యలు జరిగాయి – ముగ్గురు సిపిఎంవారు, ఇద్దరు ఆరెస్సెస్‌వారు, ఒకరు ఎస్‌డిపిఐ కార్యకర్త.
తాజాగా ముఖ్యమంత్రి విజయన్ నియోజకవర్గంలోని పతిరియాడ్ గ్రామంలో అక్టోబరు 10 న మోహనన్ అనే 52 ఏళ్ల సిపిఎం లీడరును ఆరుగురు వ్యక్తులు కత్తులతో 14 సార్లు పొడిచి చంపేశారు. రెండు రోజులు తిరక్కుండా రమిత్ ఉత్తమన్ అనే 27 ఏళ్ల ఆరెస్సెస్ కార్యకర్తను అతని తల్లి, గర్భిణి ఐన సోదరి కళ్లముందు కత్తితో నరికేశారు. ఇది ముఖ్యమంత్రి సొంత గ్రామమైన పినరాయ్‌లోనే జరిగింది. రమిత్ తండ్రి ఉత్తమన్ కూడా 14 ఏళ్ల క్రితం యిటువంటి కలహాల్లోనే ప్రాణాలు వదిలాడు. అతను బస్సు డ్రైవరు. నడిబజారులో సిపిఎం వర్కర్లు అతన్ని బస్సులోంచి కిందకు లాగి, జనమందరూ చూస్తూండగా కత్తితో పొడిచి చంపేశారు. అతని అంత్యక్రియలకు హాజరై తిరిగి వస్తున్న బంధుమిత్రుల జీపులపై కూడా బాంబులు వేశారు. అప్పుడు 70 ఏళ్ల వయసున్న ఉత్తమన్ అత్త, డ్రైవరు చనిపోయారు. రమిత్ హత్య జరిగిన మర్నాడు ఫరూక్ నీర్చల్ అనే 45 ఏళ్ల ఎస్‌డిపిఐ (సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా) కార్యకర్తను కన్నూరు పట్టణంలో చంపివేశారు. రాడికల్ ముస్లిము సంస్థ ఐన పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా యొక్క రాజకీయ విభాగమే ఎస్‌డిపిఐ. అందరూ ఐయుఎంఎల్ (ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్)ను అనుమానిస్తున్నారు.
ఇవన్నీ ఎల్‌డిఎఫ్ ప్రభుత్వానికి మచ్చ తెచ్చాయి. గవర్నరు పి. సదాశివం హోం సెక్రటరీని, డిజిపిని పిలిచి కన్నూరులో శాంతిభద్రతల గురించి వాబు చేయడంతో ముఖ్యమంత్రి విజయన్‌కు భయం వేసింది. శాంతిభద్రతల పేరు చెప్పి తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారేమోనని. హత్యలపై విచారణకు ఆదేశించాడు. హత్యలకు ఎదుటివారే కారణమని యిరువర్గాలూ అంటున్నాయి. ''కేరళ కమ్యూనిస్టు ఉద్యమానికి కన్నూరు గుండెకాయ. ఇక్కడ మమ్మల్ని ఫినిష్ చేయాలని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, మోదీ ఆరెస్సెస్ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిజెపి ఓట్ల శాతం పెరిగింది. ఆరెస్సెస్ శాఖల సంఖ్య కూడా పెరిగింది, గమనించండి. 2015లో కన్నూరులో చింతన్ బైఠక్ అని ఏర్పాటు చేసి యీ హత్యారాజకీయాలకు ప్రణాళిక రచించారు.'' అంటాడు కన్నూరు జిల్లా సిపిఎం నాయకుడు జయరాజన్. అతనిపై 1999లో భార్యాబిడ్డల కళ్లముందే దాడి జరిగింది. కుడిచెయ్యి చచ్చుబడింది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాజశేఖరన్ ''దాడులకు గురవుతున్నది మేము. అధికారంలో వున్న సిపిఎం తలచుకుంటే నిమిషాల్లో శాంతి నెలకొల్పగలదు. కానీ వారికా ఉద్దేశం లేదు.'' అంటాడు.
తాజావార్త ఏమిటంటే నవంబరు మూడవ వారంలో సిపిఎం నాయకుడు మోహనన్ హత్యకేసులో అరెస్టయిన ఆరెస్సెస్ కార్యకర్త సుభీష్ గతంలో అంటే 2006 అక్టోబరులో తలస్సెరీలో హత్య చేయబడిన ఎన్‌డిఎఫ్ కార్యకర్త మొహమ్మద్ ఫజల్‌ను, 2014లో చిత్తిరపరంబుకు చెందిన సిపిఎం నాయకుడు పవిత్రన్‌ను కూడా తనే హత్య చేశానని రాష్ట్ర పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. ఫజల్ హత్య జరిగినప్పుడు దాన్ని సిబిఐకు అప్పగించారు. ఫజల్ సిపిఎం నుంచి విడిపోయి ఎన్‌డిఎఫ్‌లో చేరాడు కాబట్టి అతనికి బుద్ధి చెప్పడానికి సిపిఎం నాయకులు కరాయి చంద్రశేఖరన్, కరాయి రాజన్‌లు పథకం వేసి ఆరుగురి చేత హత్యను అమలు చేయించారని అభిప్రాయపడిన సిబిఐ వారిపై కేసులు మోపి అరెస్టు చేయించింది. ఇప్పుడు కేరళ పోలీసు అధికారులు సుభీష్ ఒప్పుకోలు పత్రాలను సిబిఐకు అప్పగించారు. కొత్త కేసుల మాట ఎలా వున్నా పాత కేసులు పరిష్కరించబడేట్టున్నాయి.
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2016)