ఎమ్బీయస్‌ : ఆప్‌ ‘అరాచకత్వం’

ఢిల్లీ వీధుల్లో ఆప్‌ నిరసనకు కూర్చోవడం ఆ పార్టీ సమర్థులకు కొందరికి నచ్చినట్టు లేదు. టీవీల్లో విమర్శిస్తున్నారు. 'నెగ్గేవరకూ, అధికారం దక్కేవరకూ ఎన్నయినా ఆందోళనలు చేయవచ్చు, కానీ అధికారం చేజిక్కాక, వ్యవస్థలో భాగమయ్యాక యిలా…

ఢిల్లీ వీధుల్లో ఆప్‌ నిరసనకు కూర్చోవడం ఆ పార్టీ సమర్థులకు కొందరికి నచ్చినట్టు లేదు. టీవీల్లో విమర్శిస్తున్నారు. 'నెగ్గేవరకూ, అధికారం దక్కేవరకూ ఎన్నయినా ఆందోళనలు చేయవచ్చు, కానీ అధికారం చేజిక్కాక, వ్యవస్థలో భాగమయ్యాక యిలా రోడ్డు మీద కూర్చోవడం తప్పు. కేంద్రంతో మాట్లాడుకోవాలి, తప్ప యిలా రోడ్డున పడి రిపబ్లిక్‌ డే పెరేడ్‌ను చెడగొట్టకూడదు' అని వాళ్ల థీమ్‌. ఎందుకంటే మనం యిన్నేళ్లగా చూస్తూ వచ్చిన రాజకీయాలు యిలాటివే. పెట్రోలు ధరలు పెరగ్గానే అప్పోజిషన్‌ లీడర్లు ఎడ్లబండిపై అసెంబ్లీకి వస్తారు. వాళ్ల సెక్యూరిటీవాళ్లు, పార్టీ కార్యకర్తలు మాత్రం కార్లలోనే వస్తారు. పేపర్లో బండెక్కిన ప్రతిపక్ష నాయకుడి ఫోటో వస్తుంది. బస్‌. మర్నాటినుంచి మామూలుగా పెద్దకార్లోనే వస్తారు. కొన్నాళ్లకు వాళ్లు పవర్‌లోకి వస్తారు. పెట్రోలు ధరలు పెంచుతారు. అదేమిటంటే అంతర్జాతీయ మార్కెట్‌ ప్రభావం అంటారు. ఒకప్పుడు అధికారంలో, యిప్పుడు ప్రతిపక్షంలో వున్న పార్టీ నాయకుడు సైకిలు ఎక్కి అసెంబ్లీకి వస్తాడు. ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోస్తాడు. ప్రభుత్వపు పనితీరును, ప్రభుత్వోద్యోగుల అలసత్వాన్ని, లంచగొండితనాన్ని తిడుతూ ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది. వచ్చాక అదే ప్రభుత్వాధికారులతో కలిసి ప్రభుత్వం నడుపుతుంది. మొదట్లో వారం, పదిరోజులు పత్రికల వాళ్లను వెంటపెట్టుకుని వచ్చి పొద్దున్నే ఆఫీసుకి వచ్చి హాజరుపట్టీ తనిఖీలు, అర్ధరాత్రిపూట ఆసుపత్రులపై ఆకస్మిక దాడులు చేసి డాక్టర్లు లేని వైనం కనుగొనడం – యిలాటి చేష్టలు చేస్తారు. అప్పటికప్పుడు సస్పెండ్‌ చేస్తారు. 

నెల్లాళ్లు గడిచి, కుర్చీల్లో కుదురుకున్నాక యివన్నీ మర్చిపోతారు. ఉద్యోగులు యథావిధిగా తమ కార్యకలాపాలు సాగిస్తారు. పాలకులు మారినంత మాత్రాన తామెందుకు మారాలి? అని వాళ్ల ప్రశ్న. వాళ్లను వెనకేసుకుని రావల్సిన బాధ్యత కొత్త పాలకులపై పడుతుంది. అసెంబ్లీలో ప్రతిపక్షంవారు ఫలానా చోట రేషను కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేదు అంటే 'అబ్బే మా ఉద్యోగులు బ్రహ్మాండంగా పని చేస్తున్నారు' అని అధికారపక్షం వాళ్లు వాదిస్తారు. అంతేకాదు, ప్రతిపక్షంలో వుండగా ఫలానా ఫలానా కుంభకోణాలపై విచారణ జరిపిస్తాం అని ప్రకటించినవారు అధికారంలోకి రాగానే వాటిని పట్టించుకోరు. మరీ పెద్దసైజు కుంభకోణాలపై ఫలానా జడ్జిగారి అధ్యక్షతన కమిషన్‌ వేశాం అంటారు. కానీ ఆయనకు స్టాఫ్‌ యివ్వరు, ఆఫీసు యివ్వరు, ఫైళ్లు యివ్వరు. ఎందుకంటే ఆ కుంభకోణంలో చిక్కుకున్న ఉద్యోగులు యిప్పుడు తమ ఉద్యోగులు. చాలా సందర్భాల్లో అది చేసిన నాయకులు పార్టీ ఫిరాయించి ప్రత్యక్షంగానో, బయటినుండో తమ ప్రభుత్వానికి మద్దతు యిస్తూ వుంటారు. లేదా వాళ్ల స్నేహితులు తమ ప్రభుత్వంలో మంత్రులుగా వుంటారు. అందువలన విచారణ నత్తనడక నడుస్తుంది. చివరకు రిపోర్టు వచ్చాక అటకమీద పడేస్తారు. ఇలాటివి చూసిచూసి, వినివిని మనం చలించడం మానేశాం. 1970ల వరకు యివన్నీ కాంగ్రెసు పార్టీ లక్షణాలు అనుకునేవాళ్లం. ఆ తర్వాత తెలిసింది ఏ పార్టీ అయినా కాంగ్రెసులాగే ప్రవర్తిస్తుంది అని. ఒలిచి చూస్తే లోన అందరూ ఒక్కటే. 

ఇప్పుడు ఆప్‌ యీ గేమ్‌ రూల్సు మార్చేస్తోంది. 'మర్యాద' తప్పి ప్రవర్తిస్తోంది. అధికార పక్షమై వుండి కూడా ప్రతిపక్షంలా ప్రవర్తిస్తోంది. అది మనకు మింగుడు పడటం లేదు. గొడవేమిటి? అతిథిగా వచ్చిన 51 ఏళ్ల విదేశీ యువతి రేప్‌కు గురైంది. మన దేశప్రతిష్టకు, టూరిజం వ్యాప్తికి ఎంత దెబ్బ! దానిపై విచారణ జరపమని ఢిల్లీ ప్రభుత్వం కోరింది. సరే, విచారణకు ఆదేశించాం అంది కేంద్రప్రభుత్వం. మరి విచారణ జరిగేటన్ని రోజులైనా సంబంధిత ఆఫీసర్లను సస్పెండ్‌ చేసి పక్కన పెట్టండి, లేకపోతే విచారణ సవ్యంగా జరగదు, కంటితుడుపుగానే వుంటుంది అంది ఢిల్లీ ప్రభుత్వం. ఏడిచావులే అంది కేంద్రం. ఇప్పుడేం చేయాలి? సరే, ఎప్పుడు ఎలా చేస్తే అలాగే చేయండి, మహబాగు అని వూరుకోవాలా? ఉద్యోగిపై మామూలు ఆరోపణలు రాగానే సస్పెండు చేసి విచారణ జరిపించి, తప్పు లేదని తేలితే మళ్లీ నియమిస్తారు. ఇక్కడ అలా ఎందుకు చేయడం లేదు? ఢిల్లీ పోలీసులు చాలా గొప్పవాళ్లు, తప్పులు చేయరు అని కేంద్రం నమ్మకమా? నిర్భయ కేసులో షీలా దీక్షిత్‌ ఏమన్నారు? 'నన్నెందుకు తిడతారు? శాంతిభద్రతలు కేంద్రం తన చేతిలో పెట్టుకుంది కదా వాళ్లనే అడగండి' అన్నారు. బాధ్యతారహితంగా మాట్లాడుతోంది అన్నాడు. వాస్తవాలు కఠోరంగానే వుంటాయి మరి. ఆవిడ కాంగ్రెసు పార్టీకి చెందినదే కాబట్టి కేంద్రంపై తిరగబడలేక పోయింది. ఇప్పుడు ఆప్‌ చేసే పనిని లోలోపల హర్షిస్తూండవచ్చు. ఇద్దరు, ముగ్గురు పోలీసు ఆఫీసర్లను సస్పెండ్‌ చేసి విచారణ త్వరగా జరిపిస్తే కేంద్రానికి పోయేది ఏముంది? 

ఈ ఉదంతాన్ని మన తెలుగువాళ్లం చాలా సీరియస్‌గా పట్టించుకోవాలి. ఎందుకంటే రాష్ట్రవిభజన తర్వాత మనకు జరగబోయేది యిలాటి సత్కారమే. తెలంగాణ తెస్తున్నాం అంటూ చెప్పి రాజధాని శాంతిభద్రతలు కేంద్రం చేతిలో పెట్టబోతున్నారు మన నాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినా కేంద్రం పోలీసులపై చర్య తీసుకోకుండా కూర్చోవచ్చు. ఇక ఏ పోలీసూ యిక్కడి నాయకుల మాట వినడు. వీళ్లది అరణ్యరోదనే. ఉగాండా వాళ్ల గొడవ వుంది. అక్కడ సెక్స్‌, డ్రగ్‌ రాకెట్‌ నడుస్తోందని స్థానికులు నెలల తరబడి లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. తమ దేశపు యువతిని వ్యభిచారంలోకి దింపారని ఫిర్యాదు చేస్తూ ఉగాండా దౌత్యాధికారి రాసిన లేఖ కూడా ఆప్‌ చూపిస్తోంది. వాళ్లు వచ్చి మంత్రికి చెపితే ఆయన ఆకస్మిక తనిఖీకి వచ్చాడు. చూసి అక్కడ నిజంగానే అలాటివి జరుగుతున్నాయని గమనించి, చర్య తీసుకోమని పోలీసులను ఆదేశించాడు. వాళ్లు పోవోస్‌ అన్నారు. ఒళ్లు మండిన మంత్రి దుర్భాషలాడాడు. 'మంత్రి తిట్టాడు, విదేశీయులను అవమానించాడు' అనే పాయింటుపై బిజెపి దగ్గర్నుంచి విమర్శిస్తున్నారు తప్ప పోలీసులు ఎందుకు యాక్షన్‌ తీసుకోలేదు అన్నదానిపై చర్చ లేదు.  తాము కేంద్రం అజమాయిషీలో వున్నాం కాబట్టి, వీడి మాట వినక్కరలేదు అని వాళ్ల భావన. నా మాట వినని పోలీసులపై చర్య తీసుకోండి అని మంత్రి కేంద్రాన్ని దేబిరించవలసి వస్తోంది. రేపు హైదరాబాదులో కూడా యిలాటివి జరగవచ్చు. ఇప్పటికే డ్రగ్స్‌ అమ్ముతున్న, దొంగ ఈమెయిల్స్‌తో డబ్బు కొట్టేస్తున్న నైజీరియన్లతో, విద్రోహ చర్యలు చేసే  ఐఎస్‌ఐ, ఐఎమ్‌ ఏజంట్లతో హైదరాబాదు కిటకిటలాడుతోంది. వారిపై చర్య తీసుకోవాలంటే కేంద్రం దయాధర్మంపై ఆధారపడాలంటే పరిస్థితి ఎలా వుంటుందో వూహించుకోండి. ఇక్కడ ఏర్పడే ప్రభుత్వం కేంద్రానికి నచ్చనిదైతే వాళ్లు ఎప్పటికీ అనుమతి యివ్వరు. మన బతుకులు దుర్భరమవుతాయి.

ఎంతైతే మాత్రం రోడ్డు మీద కూర్చోవాలా, కావాలంటే యింకో విజ్ఞప్తి పంపుకోవచ్చు, కోర్టుకి వెళ్లవచ్చు అంటారు మర్యాదస్తులు. తెలంగాణ బిల్లు విషయంలోనే చూడండి, కేంద్రం ఎన్ని అడ్డదారులు తొక్కిందో. శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు పార్లమెంటులో యివ్వక పోవడం దగ్గర్నుంచి, బిల్లును టేబుల్‌ ఐటెమ్‌గా పెట్టడం దగ్గర్నుంచి, సమాచారం లేకుండా, స్పష్టత యివ్వకుండా బిల్లు రూపొందించడం దగ్గర్నుంచి – అన్నీ అడ్డగోలుగా చేస్తోంది. ఇది తప్పు అంటూ కోర్టుకి వెళ్లినా లాభం లేకపోతోంది. ఆగండి, తొందరేముంది, తెలంగాణ ఏర్పడ్డాక కేసులు విచారిస్తాం అంటున్నాయి కోర్టులు. బాబ్లీ గేట్లు ఏర్పాటు చేసినప్పుడూ యిలాగే చెప్పారు. చివరకి పెట్టేశారుగా ఏం పీకుతారు, అడ్జస్టయిపోండి అన్నారు. మర్యాదగా పోతే దక్కేది యిదే అన్నపుడు ఔట్‌ ఆఫ్‌ బాక్స్‌ వెళ్లక తప్పటం లేదు. అరవింద్‌ కేజ్రీవాల్‌ అదే చెప్తున్నాడు. 

వ్యవస్థను అన్యాయంగా, అవకతవకగా తయారుచేస్తే వ్యవస్థ సంప్రదాయాలను పాటించకుండా వేరే మార్గాలు వెతికే అగత్యం ఏర్పడుతోంది. ఆప్‌ పార్లమెంటు ఎన్నికలలో ఢిల్లీలో గెలవాలంటే పోలీసు వ్యవస్థను తన కిందకు తెచ్చుకోవాలి. వాళ్లు వస్తూనే 800 మంది జలమండలి ఉద్యోగులను బదిలీ చేయడంతో ఎన్నికలలో ఆ పార్టీకి ఓట్లేసిన ఉద్యోగివర్గాలన్నీ మండిపడి వుంటాయి. ఎన్టీయార్‌ మన రాష్ట్రంలో రిటైర్‌మెంట్‌ వయసు 58 నుండి 55కి తగ్గిస్తే దేశవ్యాప్తంగా వున్న ఉద్యోగి వర్గాలన్నీ ఎన్టీయార్‌ పేరు చెప్పగానే కోపగించుకోసాగాయి – తమ రాష్ట్రంలో కూడా యిలాగే జరుగుతుందేమోనన్న భయంతో! పోలింగు టైములో ఉద్యోగులు, పోలీసులు ఎదురు తిరిగితే అధికారపక్షానికి చాలా కష్టం. పైగా పోలీసులు యింకోరి అధీనంలో వున్నపుడు మరీనూ..! అందుకని యిదే అదనుగా ఢిల్లీ శాంతిభద్రతలను తమ చేతిలోకి తెచ్చుకోవాలని ఆప్‌ ఉద్యమించింది. అది చేతిలో పెట్టుకుని ఆప్‌ పీచమణచాలని కాంగ్రెసు ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి వీధుల్లో ధర్నాలు చేయడం మనకు కొత్తకాదు. ఎన్టీయార్‌, కరుణానిధి, జయలలిత – అందరూ చేశారు. అరవింద్‌ చేస్తున్నది రిపబ్లిక్‌ డే పెరేడ్‌ జరిగే చోట. ప్రజలు యిబ్బంది పడిపోతున్నారని మీడియా మహా జాలి కురిపిస్తోంది. నిర్భయ లాటి సంఘటన యింకోటి జరిగితే అప్పుడు వీళ్లే ఢిల్లీ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ మొదలెడతారు. 

మన రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల వాళ్లు ఎన్నో ఏళ్లగా అక్రమంగా, భద్రత లేకుండా బస్సులు నడుపుతున్నారు. ప్రభుత్వం కళ్లు మూసుకుంది. ప్రజలు గత్యంతరం లేక సహించారు. పాలెం బస్సు ఘటన ఒకటి జరిగింది. ఏ కళనుందో లేక ఏ రాజకీయ అవసరమో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలెట్టింది. ఎన్ని అక్రమాలు బయటపడ్డాయో చూడండి, ఆర్‌టిసికి ఎంత లాభం వచ్చిందో చూడండి. ప్రైవేటు బస్సుల వాళ్ల ఆగడాలు ఎంత పెచ్చు మీరాయంటే మొన్న ఒక బస్సును పట్టుకోబోయిన యిన్‌స్పెక్టరును బస్సు పెట్టి గుద్దేశారు. చెక్‌పోస్టు తప్పించుకోవాలని అడ్డదారులు పడుతున్నారు. (నెల్లూరు బస్సు ఘటనతో యీ విషయం తేటతెల్లమైంది). ఈ తనిఖీలు, యీ క్రమశిక్షణ చర్యలు ఎప్పుడో జరగాల్సింది. ఒక పాలెం ప్రమాదం జరిగి కొందరి ప్రాణాలు పోతే తప్ప ప్రభుత్వం మేలుకోలేదు. ఏం చేసినా వారి ప్రాణాలు తిరిగిరావు కదా. ఒక నిర్భయ అత్యాచారానికి గురయితే తప్ప ఢిల్లీ పోలీసు వ్యవస్థ గురించి మనం దృష్టి సారించలేదు. ఇప్పుడు విదేశీవనితపై అత్యాచారం తర్వాతైనా యీ వివాదాన్ని ఒక కొసకు తీసుకురావాలి. దానికోసం ప్రభుత్వాల మధ్య ఘర్షణ జరిగినా జరగనీయండి. పద్ధతులు, మర్యాదలు తప్పితే తప్పనీయండి. ప్రతీ విషయంలోను పెత్తనం చలాయించే కేంద్రానికి ముకుతాడు పడితే అంతే చాలు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2014)

[email protected]