అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించబోతోందని, మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం ఎంతో లాభించిందని అనుకుంటున్నారు. మోదీలో ఎన్నయినా సుగుణాలుండవచ్చు కానీ శత్రువులను సహించలేని దుర్గుణం మాత్రం చాలా బలంగా వుందని ప్రదీప్ శర్మ ఉదంతం చెబుతోంది. 2001లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలోని భుజ్‌లో భూకంపం వచ్చి సర్వనాశనం అయినపుడు పరిస్థితిని చక్కదిద్దడంలో ఆ జిల్లా కలక్టరుగా ప్రదీప్ శర్మ చేసిన కృషి అమోఘం. రాష్ట్రంలో చెప్పుకోదగ్గ కలక్టర్లలో ఒకడు అని స్వయంగా మోదీ ప్రదీప్‌ను మెచ్చుకున్నాడు. 2009 కల్లా పరిస్థితి మారిపోయింది. అతన్ని ఎలాగైనా కేసుల్లో యిరికించాలని మోదీ, అతని కుడిభుజం అమిత్ షా తెగ ప్రయత్నించారు. ఎందుకు అనేదే ఆసక్తికరమైన కథ.
ఆ కథకు నాయకి మాధురి అనే అమ్మాయి (అసలు పేరు బయటకు చెప్పకుండా మీడియా యీ పేరుని ఉపయోగిస్తోంది). ఆమె ఒక ఆర్కిటెక్ట్. వాళ్ల కుటుంబం భుజ్‌కు చెందినది. 2004లో 27 ఏళ్ల వయసున్న మాధురి ప్రదీప్ వద్దకు వచ్చి ఒక పబ్లిక్ పార్క్‌ను లాండ్‌స్కేపింగ్ చేస్తానంటూ ఒక ప్రణాళిక ముందు పెట్టింది. ప్రదీప్‌కు ఆమె ఐడియా నచ్చింది. సరేనని ఆ పని అప్పగించాడు. 2005లో ఆ పార్కును ఆవిష్కరించడానికి వచ్చిన మోదీకి యీమెను పరిచయం చేశాడు కూడా. ఆమెను చూసి మోదీ ముచ్చటపడ్డాడు. వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. ఆమె ముఖ్యమంత్రి అఫీషియల్ ఐడీకి యీమెయిల్ పంపితే జవాబు వచ్చేది. అప్పుడప్పుడు ఆమె సెల్‌కు మోదీ సొంత సెల్ నుండి ఎస్సెమ్మెస్‌లు కూడా వచ్చేవి. మాధురి కుటుంబానికి 'ఎకోలిబ్రియమ్' అనే కంపెనీ వుంది. మోదీతో సాన్నిహిత్యం కారణంగా ఆ కంపెనీకి కొన్ని కాంట్రాక్టులు కూడా దక్కాయి. ప్రదీప్‌తో కూడా మాధురి, ఆమె కుటుంబం స్నేహంగానే వుండేది. మాధురి ఒక బెంగుళూరు అబ్బాయిని యిష్టపడి పెళ్లి చేసుకుందామనుకున్నపుడు 'వద్దని మీరైనా నచ్చచెప్పండి' అని ప్రదీప్‌ను మాధురి తలిదండ్రులు కోరారు కూడా.
2008లో ప్రదీప్ భావనగర్‌కు మునిసిపల్ కమిషనర్‌గా పని చేసే రోజుల్లో మాధురి వచ్చి కలిసింది. 'భావనగర్‌కు దగ్గర్లో వున్న అలంగ్‌లో ఉన్న ఒక ప్రాజెక్టుకోసం మోదీ మిమ్మల్ని కలవమన్నారు' అంటూ చెప్పింది. కొన్ని ఎస్సెమ్మెస్‌లు కూడా చూపించింది. మోదీ వ్యక్తిగత సెల్ నెంబరు యిదిగో అంటూ ఒక నెంబరు యిచ్చింది కూడా. దాన్ని యితను సేవ్ చేసుకున్నాడు. ఒక రోజు పొరబాటున దానికి కాల్ చేశాడు. చేయగానే 'అరే యిది ముఖ్యమంత్రిది కదా' అనుకుని కట్ చేశాడు. మోదీ దాన్ని ఆన్సర్ చేయలేదు కానీ, ఎవరు కాల్ చేశారో కనుక్కోమని తన స్టాఫ్‌ను ఆదేశించాడు. వాళ్లు యీ నెంబరు ఫలానా ప్రదీప్ శర్మది అని చెప్పారు. అతనికి తన నెంబరు ఎలా వెళ్లింది? అౖని ఆలోచించి బహుశా మాధురి యిచ్చి వుంటుంది అని గ్రహించి, వాళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందేమో, లేకపోతే నా నెంబరు ఎందుకు యిస్తుంది? అని అనుమానించాడు మోదీ. ప్రదీప్‌ను యిరికించాలంటే మాధురితో వ్యవహారం పనికి వస్తుంది అని కూడా అనుకున్నాడు.
ఇరికించడం దేనికి? అప్పటికే అంటే 2009 నాటికి మోదీ ప్రదీప్‌పై మండిపడుతున్నాడు. ఎందుకంటే ప్రదీప్ సోదరుడు కులదీప్ శర్మ ఐపియస్ అధికారి. ఎడిషనల్ డిజిపిగా వున్నాడు. సొహ్రాబుద్దీన్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో కోర్టుకి మధ్యంతర నివేదిక సమర్పించడానికి చాలా చొరవ తీసుకున్నాడు. (అదే దరిమిలా 2010 అక్టోబరులో అమిత్ షా అరెస్టు కావడానికి దారి తీసింది) 'కులదీప్‌పై కసి తీర్చుకోవాలంటే ప్రదీప్‌ను అప్రతిష్టపాలు చేయాలి. అతనికి మాధురికి మధ్య ఏదో నడుస్తూన్నట్లు వుంది. అది కూపీ లాగి, దాన్ని బయటపెట్టి అల్లరి పెట్టాలి' అని హోం మంత్రిగా పని చేస్తున్న అమిత్ షాకు మోదీ ఆదేశాలిచ్చాడు. ఇక అమిత్ షా అతి వుత్సాహంగా ఆ పనిని ముగ్గురు ఉన్నత పోలీసాధికారులకు అప్పగించాడు. ఒకరు యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌లో ఎస్.పి.(ఆపరేషన్స్)గా వున్న జి.ఎల్. సింఘాల్, క్రైమ్ బ్రాంచ్, ఇంటెలిజెన్సు శాఖలకు చెందిన మరో యిద్దరు. వీళ్ల పని ఏమిటంటే మాధురి ఏ క్షణంలో ఎక్కడ వుందో, ఏం చేస్తోందో కనిపెట్టి అమిత్ షాకు ఫోన్‌లో చెప్పడం ! తనను పోలీసులు వెంటాడుతున్న సంగతి మాధురి కూడా గ్రహించి వీళ్లను తప్పించుకోవడానికి అనేక ట్రిక్కులు వేసేది. అవి వీళ్లు అమిత్‌కు చెప్పేవారు. 'ఎలాగైనా వెంటాడండి, వదలకండి, మనకు ఏదో ఒక సాక్ష్యం దొరకాలి' అని అమిత్ యీ అధికారులను ఉత్సాహపరిచేవాడు.
ఇలా నెల్లాళ్లపాటు సాగినా ఫైనల్‌గా ఏమీ దొరకలేదనుకోవాలి. ఇక మాధురి కోణం వదిలిపెట్టి ప్రదీప్‌ను ఏదో ఒక కారణం చెప్పి అరెస్టు చేయడానికి నిశ్చయించుకున్నాడు మోదీ. 2010 జనవరిలో క్రిమినల్ కాన్‌స్పిరసీ (నేరపూరితమైన కుట్ర), బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ (నమ్మకద్రోహం) అనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నోటీసు లేదు, సమన్లు లేవు. సిటీ ఎస్‌పి ప్రదీప్ యింటికి వెళ్లి జస్ట్ అరెస్టు చేసేశాడు. జైల్లో పెట్టాక 'కలక్టరు హోదాలో అక్రమ భూ కేటాయింపులు చేశారటూ యింకో రెండు కేసుల్లో బుక్ చేశారు. ప్రదీప్‌ను పోలీసు కస్టడీలోకి తీసుకోగానే అందరికంటె ముందుగా అతన్ని చూడడానికి వచ్చినది – మాధురి తలిదండ్రులు. ఆ విషయం ప్రస్తావించి 'నాకు ఆ అమ్మాయితో అక్రమసంబంధం వుండి వుంటే వాళ్లు వచ్చి పరామర్శించేవారా?' అని బెయిల్లో బయటకు వచ్చిన ప్రదీప్ అడుగుతున్నాడు. తనపై పెట్టిన కేసుల అన్యాయమంటూ అతను సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ప్రశాంత్ భూషణ్ అతని తరఫు న్యాయవాది.
మాధురి విషయంలో అతన్ని యిరికించడానికి చూశారన్న సంగతి మామూలుగా అయితే ఎప్పటికీ బయటకు వచ్చేది కాదు. కానీ అప్పట్లో అమిత్ షాకు సహకరించిన సింఘాల్ దరిమిలా ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో సస్పెండ్ కావడంతో అతను ఎదురు తిరిగి యీ విషయాన్ని బయటపెట్టడంతో అందరికీ తెలిసింది. అతను చాలా తెలివిగా అప్పట్లో అమిత్ షా తనతో మాట్లాడిన సంభాషణలను టేప్ చేసి పెట్టి 267 సంభాషణలను 2013 ఏప్రిల్‌లో సిబిఐకు అప్పగించాడు. వాటిల్లో ఒక దానిలో అమిత్ చెప్పినది అతి ముఖ్యమైనది. మాధురి, ప్రదీప్ కలిసి ఒక ఐస్‌క్రీమ్ పార్లర్‌లో కబుర్లు చెప్పుకుంటున్నారని వినగానే అమిత్ మండిపడ్డాడు – 'ఆ ప్రదీప్‌ను జైలుకి పంపించాలి. వంజారా ఎంతకాలం జైల్లో వున్నాడో, యితను అంతకంటె ఎక్కువకాలం వుండాలి' అని. బూటకపు ఎన్‌కౌంటర్ కేసుల్లో అప్పట్లో డిఐజిగా వున్న వంజారా జైల్లో కూర్చోవలసి వచ్చింది. 'ఆ అమ్మాయి చాలా తెలివైనది. మనం గమనిస్తున్నామని తెలుసుకుని వేర్వేరు వాహనాల్లో తిరుగుతోంది.' అని సింఘాల్ విన్నవించాడు. 'సాహెబ్ ఆదేశాల ప్రకారం యిది చేస్తున్నాం. ఆయన అన్నీ తెలుసుకోదలచారు' అని అమిత్ షా చెప్పడం కూడా టేపుల్లో వినవచ్చు. ఆ సాహెబ్ ఎవరు అన్నదాని గురించి ఎవరికీ సందేహాలు లేవు కానీ మోదీయే కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఈ టేపులను కోబ్రాపోస్ట్, గులైల్ అనే వెబ్‌సైట్లు బయటపెట్టడంతో అమిత్ షా, తద్వారా మోదీ యిరకాటంలో పడ్డారు. అమిత్ షా యిప్పుడు బిజెపి జనరల్ సెక్రటరీ. యుపిలో పార్టీ వ్యవహారాల యిన్‌చార్జ్. అమిత్ యిలా యిరుక్కోవడంతో యిక గుజరాత్ బిజెపి నష్టనివారణ చర్యలు మొదలు పెట్టింది. 'నేను మాధురి తండ్రిని. నా భార్య ఆసుపత్రిలో వుండేటప్పుడు, మా అమ్మాయి హోటల్లో వుండేది. అక్కడికి, యిక్కడికి వేళకానివేళల్లో తిరగాల్సి వస్తోంది కాబట్టి కాస్త కనిపెట్టి వుండమని 20 ఏళ్లగా మా కుటుంబస్నేహితుడైన మోదీగార్ని కోరాను. ఆయన దయతో అంగీకరించారు. మా అమ్మాయి కదలికలను పోలీసులను గమనించడంపై నాకెట్టి అభ్యంతరాలు లేవు కాబట్టి యీ వ్యవహారం యింతటితో ముగించాలని కోరుతున్నాను.' అనే లేఖ ఒకటి బిజెపి కార్యాలయం నుండి వెలువడింది.
'అతనెవరో బయటపడకుండా మధ్యలో బిజెపి పార్టీ రంగంలోకి దిగడం ఏమిటి? ఇది 32 ఏళ్ల మహిళ చిన్నాచితకా వయసుది కాదు. ఆమె యిష్టం వచ్చినవాళ్లతో ఆమె స్నేహంగా వుండవచ్చు. అందుకోసం యీ నిఘాలు ఏమిటి? ఇది మహిళల హక్కులకు సంబంధించిన విషయం. ఈ సంగతిపై విచారణ జరుపుతాం.' అని జాతీయ మహిళా కమిషన్‌వారు చొరవ తీసుకున్నారు. 'మాకు లేని అభ్యంతరం మీకెందుకు? మీ విచారణ ఆపేయండి' అంటూ ఆ కమిషన్ ఆఫీసుకి ఉత్తరం వచ్చింది. అది ఎవరూ పట్టుకుని వచ్చి యివ్వలేదు. నవంబరు 19 న ఆఫీసు మూసేసినపుడు వాచ్‌మన్ చేతికి యిచ్చేసి వెళ్లిపోయారు. దానిపై ఆ సదరు తండ్రి పేరు, అడ్రసు, ఫోన్ నెంబరు ఏమీ లేవు. అది నిజమో, బోగస్సో తెలియదు. కానీ దీనివలన ఒకటి మాత్రం నిర్ధారణ అయింది – అమిత్ చెప్పిన ఆ 'సాహెబ్' మోదీయే! అని.
తండ్రి అలా ఉత్తరం రాశాడు కాబట్టి, బాధితురాలైన (?) మహిళ ఫిర్యాదు చేయలేదు కాబట్టి దీనిపై యింకే చర్చా జరగకూడదని బిజెపి నాయకులు వాదిస్తున్నారు. తన కూతురికోసం ఒక తండ్రి పడిన ఆందోళన గమనించి దయార్ద్రహృదయంతో మోదీ పోనీ కదాని రక్షణ కల్పిస్తే దానికి పెడర్థాలు తీయడం తప్పని వాదిస్తున్నారు. 'తండ్రి రక్షణ కోరడం నిజమే అయితే మహా అయితే ఓ కానిస్టేబుల్‌ను వెంట వుండమని పంపిస్తారు కానీ మూడు ముఖ్యమైన శాఖల ఉన్నతాధికారులను యీ పనిపై నియోగించడం వింతగా లేదా? పైగా ఆమె ఏ జిమ్‌కి వెళ్లింది? ఎంతసేపు వుంది? ఆ జిమ్ పేరేమిటి? ఏ షాపింగ్ కాంప్లెక్సులో ఎంతసేపు గడిపింది? ఎవరితో గడిపింది? ఏం కొంది? యివన్నీ రాష్ట్ర హోం మంత్రి అడిగి తెలుసుకోవడమేమిటి? ఆయనకు వేరే పని లేదా? లేక గుజరాత్‌లో మహిళలకు ఆ పాటి రక్షణ కూడా లేదా? అయినా తండ్రి కోరికపై యీ గూఢచర్యం చేపట్టామని రాష్ట్ర పోలీసు అధికారి ఎవరైనా ఎందుకు కన్‌ఫమ్ చేయడం లేదు? ఏ లిఖిత అభ్యర్థన లేకుండా ప్రభుత్వాధికారుల సేవలను యిలా వినియోగించడం ఏ మేరకు సబబు?' అని ప్రశ్నలు గుప్పిస్తూ వుంటే బిజెపి సమాధానాలు చెప్పలేక తబ్బిబ్బవుతోంది. లోకంలో అనేక విషయాలపై మాట్లాడే మోదీ దీని గురించి ఏమీ మాట్లాడడం లేదు, అమిత్ షా కూడా మౌనాన్నే ఆశ్రయించాడు.
గుజరాతీ సమాజంలో మహిళలకు సాధారణంగానే భద్రత ఎక్కువ. రాత్రుళ్లు కూడా స్వేచ్ఛగా తిరగగలుగుతారు. ఈ మాధురి కూడా మరీ చిన్నపిల్లేమీ కాదు. అప్పటికే 32 ఏళ్లు. సొంతంగా ప్రాజెక్టులు చేపట్టి నిర్వహించే శక్తి గల ఎంటర్‌ప్రెనార్. ముఖ్యమంత్రితో డైరక్టుగా మాట్లాడేటంత చొరవ, సాన్నిహిత్యం కలది. ఆమెను రక్షించడానికే యింత హంగామా జరిగిందంటే ఎవరూ నమ్మరు. దీనిలో కసితో కాటేసే తక్షకత్వమే కనబడుతోంది. మాధురిని తన స్నేహితురాలిగా భావించి మెసేజ్‌లు పంపిన మోదీ ప్రదీప్ సెల్ నుండి తన సొంత సెల్‌కు కాల్ రావడంతో ఉలిక్కిపడ్డాడు. వారిద్దరి మధ్య తను అనుకున్నదాని కంటె ఎక్కువ స్నేహం వుందని అతనికి అర్థమైంది. ఆమె వద్ద తనకు సంబంధించిన విషయాలు మెసేజ్ రూపంలో వున్నాయి కాబట్టి ప్రదీప్ ఆమె వద్దనుండి అనునయంగా రాబట్టి, తన విషయాలు బయటపెడతాడని మోదీ భయపడి వుంటాడు. అందుకని ప్రదీప్‌ను ఎలాగోలా స్కాండల్‌లో యిరికిద్దామని చేసిన ప్రయత్నమే యిదంతా. తన రాజకీయ ప్రత్యర్థి సంజయ్ జోషిని అప్రతిష్టపాలు చేయడానికి సెక్స్ సిడిలు తయారు చేయించినవాడికి యిది ఒక పెద్ద విషయం కాదు. దీనిలో పాలు పంచుకున్న సింఘాల్ ఎదురు తిరిగి, టేపులు బయటపెట్టడంతో యిదంతా బహిరంగ రహస్యమైంది. ఇలాటివి యింకా ఎన్ని వున్నాయో ఎవరికి తెలుసు?
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2013)