సవరణ – ''మమతా'' తమిళ వెర్షన్ పేరు ''కావ్యతలైవి'', ''రంగరాత్తినం'' కాదు. క్షంతవ్యుణ్ని. తప్పు ఎత్తిచూపిన శ్రీనివాసరెడ్డిగారికి కృతజ్ఞతలు.
''ఆంధీ'' సినిమా కథ ఎలా వుంటుందంటే – హీరోయిన్ మేయర్‌గారి కూతురు. హాయిగా తిరిగే రకం. ఒక రోజు పార్టీలో తాగి ఓ హోటల్‌కి వచ్చిపడితే, హోటల్ మేనేజర్ ఆమె మర్యాద కాపాడి మర్నాడు పంపుతాడు. ఆమెకు అతనిపై యిష్టం పెరుగుతుంది. అతను సామాన్యుడు, రాజకీయాలకు విముఖుడు. కొన్నాళ్లకు యీమెతో పెళ్లికి సిద్ధపడతాడు. హీరోయిన్ తండ్రి కూతురిపై మండిపడతాడు – ''రాజకీయాల్లోకి నా వారసురాలిగా తీసుకువద్దామనుకున్నాను. నీ అంత టాలెంటున్న అమ్మాయి మామూలు గృహిణిలా బతకడమేమిటి, నాన్సెన్స్'' అని. అయినా ఆమెకు ప్రేమే మిన్నగా తోస్తుంది. పెళ్లాడి కూతుర్ని కంటుంది. కొన్నాళ్లకు భర్తతో పొరపొచ్చాలు వస్తాయి. తండ్రి బలవంతం మేరకు ఎన్నికలలో నిలబడుతుంది. భర్త కూతుర్ని తీసుకుని వెళ్లిపోతాడు. ఈమె పూర్తిగా రాజకీయాల్లో మునిగిపోతుంది. ఉన్నత పదవిని అందుకుంటుంది. చాలా ఏళ్లు గడిచాక ఆమె తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికై వస్తుంది. పార్టీ నాయకులు ఆమెను ఒక హోటల్లో బస చేయిస్తారు. తీరా చూస్తే ఆ హోటల్ యజమాని ఆమె భర్తే. తక్కినవాళ్లకు యీ విషయం తెలియదు. కూతురు హిల్ స్టేషన్లో స్కూల్లో చదువుతోందని భర్త చెప్తాడు. పాత రోజులు గుర్తుకు రావడంతో యిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఇంకో పక్క రాజకీయంగా ఆమెపై విమర్శలు చెలరేగుతుంటాయి. అప్పోజిషన్ పార్టీ వాళ్లు ఆమెను ఓడించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. హోటల్ యజమానితో తిరుగుతోందంటూ వాల్‌పోస్టర్లు వెలుస్తాయి. ఈ గోల భరించలేక హీరోయిన్ మర్నాడు ఎన్నికలనగా సభలో ''ఈయన నా భర్త. రాజకీయాల కోసం నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. దయచేసి నన్ను ఓడించండి. నా భర్తా, కూతురుతో కలిసి వుంటాను.'' అని రోదిస్తుంది. అప్పటిదాకా ఆమెకు వ్యతిరేకంగా వున్న ఓటర్లు చిత్రంగా ఆమెకు భారీగా ఓట్లు వేసి గెలిపిస్తారు. ఆమె మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లిపోతుంది. గతంలోలా కాకుండా యికపై భర్తను, కూతుర్ని తరచుగా కలుస్తానని మాట యిస్తుంది.
ఇందిరా గాంధీ జీవితం అందరికీ తెలుసు. దానికీ, దీనికీ పోలిక ఏమిటో పాఠకులే చెప్పాలి. కూతుర్ని రాజకీయాల్లో పైకి తీసుకురావాలన్న కాంక్ష వున్న తండ్రి మాత్రమే కామన్ ఫ్యాక్టర్. ఇందిర భర్త రాజకీయాలకు విముఖుడు కాడు. ఆమె కంటే ముందే రాజకీయాల్లో వున్నవాడు. భార్యతో ఒకసారి విడిపోయిన తర్వాత మళ్లీ కలవలేదు. ఈ సినిమా తీసే కాలానికి (1975) ఇందిర అప్రతిహతంగా సాగిపోతోంది. ఓటమి ఎదురయ్యే అవకాశమే లేదు. సుచిత్రను ఇందిరా గాంధీ మోడల్లో మధ్యవయస్కురాలిగా తీర్చిదిద్దడంతో పోలిక కనబడింది. సినిమా తీసేకాలంలో ఇందిరకు వ్యతిరేకంగా ప్రజాందోళనలు నడుస్తున్నాయి. రిలీజయ్యే నాటికి ఎమర్జన్సీ నడుస్తోంది. ప్రజలు ఇందిరపై కోపంగా వున్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి ఇందిరా గాంధీ కథ అనే పుకారు నిర్మాతలే పుట్టించి వుంటారు. అయినా సినిమా రిలీజును ప్రభుత్వం అడ్డుకోలేదు. కొన్నాళ్లు బాగానే నడిచింది. తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వం కేంద్రానికి ఎదురు తిరిగింది. ప్రతిపక్ష నాయకులకు ఆశ్రయం కల్పించింది. మిగతా చోట్ల ఎక్కడా థియేటర్ల దగ్గర ఏమీ రాయలేదు కానీ మద్రాసులో మాత్రం 'ఇందిరా గాంధీ ఆన్ స్క్రీన్' అని పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. ఇందిరకు ఒళ్లు మండింది. సినిమాను నిషేధించింది. అప్పటికే చాలా రోజులు అడింది కాబట్టి నిర్మాతలు నష్టపోలేదు. ఎమర్జన్సీ ఎత్తేశాక నిషేధం తీసేశారు. 1980లో ఇందిర మళ్లీ అధికారంలోకి వచ్చినా తిరిగి నిషేధించాలని అనుకోలేదు.
ఈ సినిమా తర్వాత కూడా సుచిత్ర హిందీ సినిమాల గురించి పట్టించుకోలేదు. 1978 నాటికి బెంగాలీ సినిమాల నుండే రిటైరయిపోయింది. ఆఖరి సినిమా ఫ్లాపయింది. అసలు ఆమె నటి అవుదామనుకోలేదు. గాయనిగా సినిమాల్లోకి వద్దామనుకుంది. పదహారేళ్ల వయసులోనే పెళ్లయింది. భర్త, మావగారు పెద్ద బిజినెస్మెన్. వాళ్ల ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వెళ్లింది. మొదటి సినిమా ''శేష్ కొథాయ్'' (అంతం ఎక్కడ?) రిలీజ్ కాలేదు. నిజానికి ఆమె కొరియర్‌కు అంతం ఎక్కడో ఆమెయే నిర్ణయించుకుంది. గ్లామర్ ప్రపంచం నుండి తప్పుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆమె గురించి ఏమీ తెలియకపోవడంతో ఆల్జీమర్స్ వంటి ఏదో వ్యాధితో బాధపడుతోందని అనుకున్నాం. కాదని యిటీవల మమతా బెనర్జీ నుండి ఎవార్డు తీసుకున్నపుడు తెలిసింది. అప్పుడు వేదిక ఎక్కిన మనిషి మరి దాదా సాహెబ్ ఫాల్కే ఎవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లలేదు. వాళ్లు అవార్డు యివ్వం అన్నారు. పోనీలే అనుకుంది. కూతురు మూన్‌మూన్ సేన్ (మన తెలుగు సినిమాల్లో కూడా వేసింది) సినిమా తార అయినా తల్లి గురించి పెదవి విప్పలేదు. ఆమె ఏకాంతం ఒక మిస్టరీగానే వుండిపోయింది.
''సప్తపది'' సినిమాతో ప్రారంభమై ఆమె ఉత్తమ్ కుమార్‌తో నటించిన సినిమాల్లో చాలాభాగం హిట్సే. బెంగాల్ ప్రజలను ఒక వూపు వూపారు యిద్దరూ కలిసి. ''ఆరాధన'', ''మాంగల్యబలం'', ''వివాహబంధం'' – యిత్యాది సినిమాల మూలరూపాల్లో వాళ్లే నటించారు. 'ఆరాధన'' సినిమాలో కథానాయిక తనతో డాక్టరు చదివే స్టూడెంటు తనకు ప్రేమలేఖ రాశాడని పొరబడి ఫిర్యాదు చేసి అతను విదేశాలు వెళ్లే అవకాశాలను దెబ్బ తీస్తుంది. ఆమె బంధువు ఒకతను చదువురాని తన కూతుర్ని పెళ్లాడాలనే షరతుపై అతని విదేశీప్రయాణానికి పెట్టుబడి పెడతాడు. అతను విదేశంలో జరిగిన ప్రమాదం వలన కళ్లు పోగొట్టుకుని తిరిగి వస్తాడు. పెళ్లి చేసుకోవాల్సిన హీరోయిన్ బంధువు యీ గుడ్డివాడికి సేవ చేయను పొమ్మంటుంది. పశ్చాత్తాపంతో కుమిలిపోతూన్న హీరోయిన్ ఆమె పేరుతో అతనికి సేవ చేస్తుంది. త్యాగానికి పరాకాష్ట అన్నమాట. సేవ చేస్తోంది కానీ ఆ క్రెడిట్ యింకోరికి పోతోంది. ''మాంగల్యబలం'' సినిమాలో చిన్నప్పుడే పెళ్లయిపోతుంది. కానీ ఆ వివాహాన్ని మర్చిపోతుంది. పెరిగి పెద్దయి యింకోరితో ప్రేమలో పడ్డాక ఆ వివాహం గుర్తుకు వస్తుంది. ప్రియుడా? ఎప్పుడో మర్చిపోయిన మొగుడా? ఎవర్ని ఎంచుకోవాలన్న సంఘర్షణ. ''వివాహబంధం'' సినిమాకు మూలమైన ''సాత్ పాకే బాంధా'' సినిమాలో నటనకు ఆమెకు అంతర్జాతీయ అవార్డు లభించింది. ఆత్మాభిమానం గల భర్త, డామినేటింగ్ నేచర్‌తో కూతురు కాపురంలోని ప్రతి విషయంలో కలగజేసే తల్లి – యీ యిద్దరి మధ్య నలిగిపోతుంది కథానాయిక. పెళ్లి విడాకులకు దారి తీస్తుంది. తెలుగులో ఆ పాత్ర భానుమతి వేశారు. చాలా ఏళ్ల తర్వాత ''కోరా కాగజ్'' పేరుతో హిందీలో తీస్తే జయా బాధుడి వేశారు.
అలాగే సుచిత్ర వేసిన గొప్ప పాత్రల్లో మరొకటి – ''దీప్ జలీ జాయ్''లో కథానాయిక. ఆమె పిచ్చాసుపత్రిలో నర్సు. ప్రేమ విఫలమై, పిచ్చెక్కి ఆసుపత్రిలో చేరే పేషంట్లకు చికిత్స చేయడానికి సూపర్నెంట్ ఒక ఉపాయం కనిపెడతాడు. ఈ నర్సు వాళ్లని ప్రేమించినట్టు నటిస్తే మళ్లీ వాళ్లు బాగవుతారని. అలా ఒక పేషంటుతో ప్రయోగం చేస్తే అతను బాగవుతాడు. కానీ ఆ క్రమంలో నర్సు అతనితో ప్రేమలో పడుతుంది. అతను పిచ్చి కుదరగానే యీమెను పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. ఇంతలో యింకో భగ్నప్రేమికుడు వచ్చాడు. అతనితో కూడా అలాటి నాటకమే ఆడమని సూపర్నెంట్ చెపితే యీమె ఒప్పుకోదు. మధ్యలో నేను నలిగిపోతున్నాను అంటుంది. కానీ యీ పేషంటు పరిస్థితి మరీ విషమంగా మారడంతో ఒప్పుకుని ప్రేమ నటిస్తుంది. కానీ ఇతను ఆమెను నిజంగా ప్రేమిస్తాడు. కానీ ఆమె పాతతన్ని మరవలేకపోతుంది. ఈ మానసిక ఘర్షణలో పేషంటు బాగుపడి యీమెను పెళ్లి చేసుకుందామని ముందుకొస్తాడు కానీ యీమెకే పిచ్చెక్కుతుంది. దీన్ని తెలుగులో ''చివరకు మిగిలేది'' అనే పేరుతో తీస్తే సావిత్రి వేశారు. కొన్ని ట్యూన్లు కూడా దింపేశారు. తెలుగులో ఆడలేదు. చాలా ఏళ్లకు బెంగాలీ సినిమాకు సంగీతం అందించిన హేమంత్ కుమార్ హిందీలో ''ఖామోషీ'' పేరుతో నిర్మిస్తే ఆ పాత్రలో వహీదా రెహమాన్ నటించారు.
ఇలా ఆమె వేసిన పాత్రలు యితర నటీమణులకు ఆదర్శప్రాయంగా నిలిచాయి. అన్నీ విషాదపాత్రలు కాదు సుమా, మంచి రొమాంటిక్ పాత్రల్లో, హుషారుగా కూడా వేసిందామె. గమనించవలసిన అంశం ఏమిటంటే – సినిమా కథలు ఎంత మెలోడ్రమటిక్‌గా వున్నా ఆమెది చాలా సటిల్ యాక్షన్. 1950ల నాటి తెలుగు సినిమాలు చూస్తే నాటకీయంగా నటించినట్లు వుంటుంది. తమిళం అయితే మరీనూ. తెలుగు దర్శకులు వుంటే ఫరవాలేదు కానీ తమిళ దర్శకులైతే నాటకప్రభావం విపరీతంగా కనబడుతుంది. విపరీతమైన హావభావాలు. తెలుగులో పోనుపోను హిస్ట్రియానిక్స్ తగ్గాయి. కానీ 1950లలో ఎక్కువగానే వుండేది. ఆనాటి బెంగాలీ సినిమాల్లో ఉత్తమ్ కానీ, సుచిత్ర కానీ అండర్‌ప్లే చేసేవారు. బెంగాలీలకు బలమైన నాటకరంగం వుంది. అయినా నాటకాన్ని నాటకంగా, సినిమాను సినిమాగా చూశారు. తమిళుల్లా రెండూ కలిపేయలేదు. సుచిత్రలో యింకో విశేషమేమిటంటే – ఆమె కెరియర్ చివరిదాకా మోతాదు మించకుండా నటించారు. చాలామంది తారల విషయంలో చూశాను. కెరియర్ తొలి రోజుల్లో ధైర్యంగా అండర్‌ప్లే చేసినా, వయసు మీద పడుతున్నకొద్దీ ఆత్మవిశ్వాసం తగ్గి ఓవరాక్షన్‌కు పాల్పడతారు. గొంతు చించుకుని మాట్లాడడం, ముఖకవళికలు మరీ ఎక్కువగా మార్చడం.. యిలా. కానీ సుచిత్ర చివరి వరకు సబ్డ్యూడ్గానే నటించింది. ఆమె రంగానికి వచ్చిన తర్వాత 22 ఏళ్లకు ''ఆంధీ'' సినిమా వచ్చింది. వీలైతే చూడండి – ఎంత గ్రేస్‌ఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా నటించిందో!
ఆ మహానటికి నా నివాళులు. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2014)