కరుణానిధి కొడుకులు అళగిరికి, స్టాలిన్‌కు పడదు. అళగిరి ఎవరు చెప్పినా వినేరకం కాదని 1980లలోనే తెలిసిపోయింది. ఇద్దర్నీ ఒకచోట వుంచితే ప్రమాదమని కరుణానిధి ''దక్షిణ తమిళనాడులో మన పార్టీ బలహీనంగా వుంది. నువ్వు మధురైలో కాపురం పెట్టి, అక్కడి మన పార్టీ పత్రిక 'మురసొలి' సర్క్యులేషన్ పెంచి, పార్టీ క్యాడర్ విస్తరింపచేయి.'' అని అళగిరిని మధురైకి తోలేశాడు. అళగిరి అప్పణ్నుంచి అక్కడే వుండి, దక్షిణ తమిళనాడులో డిఎంకెను దృఢపరిచాడు. అదంతా అతని సామ్రాజ్యంగా పేరుపడింది. ఇటీవలి గొడవల్లో కరుణానిధి అళగిరిని పార్టీలోంచి తరిమేశాడు. అయినా అళగిరి ''నేను వేరే పార్టీ పెట్టను.'' అని ప్రకటించి తండ్రికి విధేయత చాటుకున్నాడు. తండ్రి మరణం తర్వాత పార్టీని చీల్చి సగం పట్టుకుపోదామని అతని ఆలోచన. అతనికి వుందని చెప్తున్న బలమంతా మీడియా సృష్టే తప్ప మరేమీ కాదని నిరూపించడానికి స్టాలిన్ తన అనుచరులను దక్షిణ తమిళనాడులోని నియోజకవర్గాలలో అభ్యర్థులుగా పెట్టాడు. దాంతో అళగిరి ఆ 10 నియోజకవర్గాలలోని డిఎంకె అభ్యర్థులను ఓడించమని తన అనుచరులకు పిలుపు నిచ్చాడు. ఇది వినగానే బిజెపితో పొత్తు పెట్టుకున్న వైకో పార్టీ అభ్యర్థులు అళగిరి వద్దకు వచ్చి తమకు సపోర్టు యివ్వమని అడిగారు. తక్కిన వూళ్లలో మాట ఎలా వున్నా మధురైలో మాత్రం డిఎంకె అభ్యర్థి వేలుసామి ఓడిపోవడం ఖాయం. అతని పేరు ఎవరికీ తెలియదు. పైగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదింటిలో ఎడిఎంకె ఎమ్మెల్యేలున్నారు. ఎడిఎంకె అభ్యర్థి డిప్యూటీ మేయర్ గోపాలకృష్ణన్ నగరంలో అందరికీ పరిచితుడు. జయలలిత మూడేళ్ల పాలనపై అసంతృప్తి వుంది. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సమస్యలతో జనం బాధపడుతున్నారు. ఎన్నికల అనంతరం మోదీతో చేయి కలుపుతుందేమోనన్న భయం ముస్లిము ఓటర్లలో వుంది. అయినా మధురైలో ఎడిఎంకె అభ్యర్థి విజయం ఖాయం అంటున్నారు. మొత్తం మీద ఎడిఎంకె విజయం సాధిస్తే అళగిరి ఎటు చేరతాడో వేచి చూడాలి.
అళగిరి తమాషా యిలా వుండగా 2జి స్కాము ఫేమ్ రాజా కథ వేరేలా వుంది. కెంతాలాలో డిఎంకె టిక్కెట్టుపై అతను నిలబడ్డాడు. అతనికి ప్రత్యర్థిగా 2009 ఎన్నికల్లో నిలబడి ఓడిపోయిన యువకుడు ఎస్.గురుమూర్తిని బిజెపి తన అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే అతను ఎన్నికల అధికారికి ఎ, బి ఫార్మ్‌లు యివ్వడం మర్చిపోయాడు. వెంటనే అతన్ని అనర్హుడిగా ప్రకటించారు. అందువలన రాజా గెలుపు సులభమవుతోంది. అంత ముఖ్యమైన పేపర్లు యితనెలా మర్చిపోయాడు, అధికారి మాత్రం ఎత్తి చూపలేదా? అని అడుగుతుంటే యిదంతా రాజాయో, ఎడిఎంకెయో వెనక్కాల నుండి ఆడించిన డ్రామా అంటున్నారు. ఎందుకంటే పొత్తులో భాగంగా బిజెపి తీసుకున్న సీట్లు 7. వాటిలో యిది యిలా చీదేయడంతో 6టిలో పోటీ చేస్తోంది. మరి బిజెపి పొత్తుదారులైన వైకో, పిఎంకె యిత్యాది పార్టీలు తమ ఓటును ఏం చేయాలి? డిఎంకెకు వ్యతిరేకంగా వేయాలంటే ఎడిఎంకెకు వేసి తీరాలి. అది జరగడానికి గాను గురుమూర్తిని ముందే కొనేశారని పుకారు. లేకపోతే 2009 ఎన్నికలలో నిలబడిన వ్యక్తికి ఎ, బి ఫారాలు యివ్వాలని తెలియదంటే ఎవరు నమ్ముతారు?
-ఎమ్బీయస్ ప్రసాద్