బిహార్‌లో లాలూ ఎన్నో ఏళ్లు రాజ్యం చేశాడు. అతనికి అనుచరుడుగా వున్న నితీశ్ విడివడి వచ్చేశాక లాలూ బలం క్షీణించింది. 2009 పార్లమెంటు ఎన్నికలలో నితీశ్ బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. 40 సీట్లలో 15 బిజెపికి యివ్వగా 12 గెలుచుకుంది. నితీశ్ జెడియుకి 20 రాగా, కాంగ్రెసుకు 2, లాలూకి 4 వచ్చాయి. 2010 అసెంబ్లీ ఎన్నికలలో జెడియు, బిజెపి కలిసి పోటీ చేసి 115, 91 తెచ్చుకున్నాయి. మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. బిజెపి మోదీని తలకెత్తుకున్నాక నితీశ్ దూరమయ్యాడు.
బిహార్‌లో ముస్లిముల జనాభా ఎక్కువ. వాళ్లూ, యాదవులూ కలిసి లాలూకి ఓటుబ్యాంకుగా నిలిచారు. తను మోదీతో కలిసి ఊరేగితే ముస్లిములు లాలూ వైపు మరలిపోతారని నితీశ్ భయం. బిజెపి నితీశ్ ప్రభుత్వం నుండి తప్పుకుంది. ఇప్పుడు నితీశ్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అతను తన అభివృద్ధి పథకాలతో మహాదళితులను, యాదవులు కాక తక్కిన బిసిలను ఆకట్టుకుని నాయకుడిగా ఎదుగుతూ వస్తున్నాడు. మోదీని వ్యతిరేకించిన నితీశ్‌కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని బిజెపి సంకల్పించింది.
తను 30 సీట్లలో పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా బిహార్‌లో యింకో రాజకీయశక్తి అయిన దళిత నాయకుడు పాశ్వాన్‌కు 7, నితీశ్‌నుండి విడిపోయి వచ్చిన కుశావహా కులనాయకుడు ఉపేంద్రకు 3 సీట్లు యిచ్చింది. దేశంలో వేరే చోట హిందూత్వ గురించి ప్రచారం చేసే బిజెపి యిక్కడ బిసిల గురించే మాట్లాడుతోంది. మోదీ బిసి అనే విషయాన్ని నొక్కి చెపుతోంది. లాలూ, నితీశ్‌ల నుండి బిసిల ఓట్లు గుంజుకుంటే, తమకు ఎప్పుడూ ఓట్లేసే భూమిహార్, రాజపుత్, బ్రాహ్మణ ఓట్లు ఎలాగూ పడతాయని వారి అంచనా.
ప్రచారంలో శ్రమకు ఖర్చుకు బిజెపి వెనకాడటం లేదు. 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు 243 వీడియో వ్యాన్‌లు రెడీ చేశారు. అవి రోజులో ఏడు చోట్ల ఆగి ప్రతీ చోట 25 ని||ల మోదీ ప్రసంగాన్ని ఎల్‌ఇడి స్క్రీన్‌లపై ప్రదర్శిస్తాయి. 70 రోజుల్లో 70 వేల ప్రచార సభలు నిర్వహించి కోటి మందికి మోదీ సందేశం చేరేట్లు చేస్తున్నాయి. ఇప్పటికే యీ వ్యాన్‌ల ద్వారా 25 లక్షల మోదీ మాస్క్‌లు జనాలకు చేరాయి. 2009లో 33 లక్షల మంది బిజెపికి ఓటు వేశారు.
వారి సెల్‌ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో బాటు కొత్తగా 15 లక్షలమంది నెంబర్లు పోగేశారు. ఈ 48 లక్షల మందికి సెల్‌ఫోన్ ద్వారా ప్రచారం చేస్తారు. వీడియో వ్యాన్‌ల ద్వారా ప్రదర్శన చూసినవారి స్పందనలు సేకరించడానికి 100 మంది ఎగ్జిక్యూటివ్స్‌ను నియమించారు. వీరందరినీ మానిటార్ చేయడానికి రాజ్యసభ ఎంపీ ఆర్ కె సిన్హా, అతని కొడుకు ఋతురాజ్ వున్నారు. అతను లీడ్స్ యూనివర్శిటీలో తర్ఫీదు పొందాడు. ఈ విధంగా ఒక కార్పోరేట్ మార్కెటింగ్ కాంపెయిన్ స్టయిల్లో బిహార్‌ను అదరగొడుతోంది బిజెపి.
లాలూ కాంగ్రెసుతో జతకట్టాడు. 2010 ఎన్నికలలో లాలూకి 19% ఓట్లు, కాంగ్రెసుకు 8% ఓట్లు వచ్చాయి. అవి కలిస్తే ఒక గట్టి శక్తిగా మారవచ్చు. అందువలన పత్రికలు చేస్తున్న సర్వేలలో బిజెపి కూటమికి కనీసం 20 వస్తాయని, లాలూ కూటమికి కనీసం 8 వస్తాయని, నితీశ్‌కు మహా అయితే 5 వస్తాయని అంచనా.
-ఎమ్బీయస్ ప్రసాద్