కథలన్నీ సెంటిమెంటల్‌గా, ప్రబోధాత్మకంగా వుంటాయనుకోకండి. చక్కటి హాస్యకథలూ వున్నాయి. వాటిల్లో వ్యంగ్యమూ వుంది. గుడిని ఆశ్రయించుకుని వున్నవాళ్లకు క్రమంగా అలసత్వం వస్తుంది. పూజారులైనా అంతే, కళాకారులైనా అంతే! వంశపారపర్యంగా జాబ్ వచ్చేసి జాబ్ సెక్యూరిటీ పెరిగిపోవడంతో ఇదే ప్రాబ్లెమ్! దాన్నే చెబుతారు 'ఎవరు పాడినా ఆ ఏడక్షరాలే!' అనే కథలో.
ఆరోజు నందివాహనం ఊరేగింపు. అర్చకులు 'వాయించడోయ్! భజంత్రీలు' అన్నారు. కానీ వచ్చిన సన్నాయి వాద్యగాళ్లు వాయిస్తేగా, వాదించుకుంటూ కూచున్నారు. 'ఏంటోయ్, నువ్వాయించేది' – 'నువ్వేందోయ్, వాయించేది' – 'నీకు సన్నాయి కర్రకి బొక్కలెన్నో తెలుసా?' – 'నీకు పీక నోట్లో పెట్టుకోవటం తెలుసంట్రా?' – ఇద్దరూ వాద్యగాళ్లూ తొడలు కొట్టుకున్నారు. సన్నాయి కర్రల్తో మోదుకున్నారు. అర్చకులు తిట్టారు 'మీరు పడిచావ! ఊరేగింపు బయలుదేరాలి. వాయించండ్రా' అన్నారు. 'ఉండండి, వాడు వాయించేది నేను వాయించలేనట. ఎవడు వాయించినా ఆ ఏడచ్చరాలే కదండీ' అన్నాడు పానకాలు. 'ఏడచ్చరాలు కాదురా, మూడచ్చరాలు వాయించు చూస్తాను' అన్నాడు పరమేశు. 'ఏడో మూడో వాయించి ఏడవండ్రా' అని అర్చకుల ఏడుపు.
ఎట్టకేలకు పానకాలు, పరమేశు సన్నాయి కర్రలు చేతబట్టారండీ. ఇహ చూడండి వాళ్లు వాయించడం! పానకాలు 'తనక తనకం తత్తనక తనకం' అని వీరంగం వాయిస్తే పరమేశు నైవేద్యాలు జరిగే టప్పుడు వాయించే వరస వాయించాడు. ఉన్న ఒకే ఒక డోలు వాద్యగాడు ఎవరికి వాయించాలో తెలియక కుడి పానకాలకి, ఎడమ పరమేశుకి బాదటం మొదలెట్టాడు. తాళం వాడు వాడిష్టం వచ్చినట్టు ఇంకెవడికో తాళం వేస్తున్నాడు. మీ వాద్యాల సంగతి నాకనవసరం అని శంభులింగం బయ్మని శంఖం పూరించాడు. ఈ ధ్వనులన్నింటినీ ముంచేట్టుగా దూదేకుల సాయిబు 'ఖయ్ ఖయ్'మని బాకా వూదాడు.
ఇలా పరమబీభత్సమైన వాద్యఘోష విని పెద్దదొరగారు 'ముత్యాలమ్మ జాతర జరుగుతోందా?' అని అడిగారు. అప్పుడు గుమాస్తాగారు చెప్పారు – 'అయ్యా తమ పూర్వీకులు అందరికీ మాన్యాలిచ్చారు. సన్నాయివాళ్లకి పన్నెండు ఎకరాలు, డోలుకి పన్నెండు, తాళానికి పన్నెండు..యిలా.. వచ్చిన భూముల్ని అనుభవిస్తూ కూచున్నారు కానీ సంగీతం నేర్చుకోలేదయ్యా' అని. దొరగారు సంగతి గ్రహించి వాద్యగాళ్ల కుటుంబం నుంచి 'వీరాస్వామి' అనేవాణ్ని ఎన్నికచేసి పదివేలు ఖర్చుపెట్టి ఐదేళ్లపాటు తంజావూరు పంపించి సంగీతం నేర్చుకోమన్నారు. వాడు తిరిగొచ్చాక కచేరీ ఏర్పాటు చేస్తారు. పక్కవాడు ఆలాపన చేస్తూంటే ఇతను సన్నాయి పీక నోట్లో పెట్టుకుని 'పీపీ' అనడమే తప్ప మరేమీ అనడు. అవతలివాడు కీర్తన అందుకున్నా మనవాడు 'పిప్పీ పీ' యే.
ఈ కథలో ఎన్ని రకాల సందేశాలున్నాయో చెప్పలేను. కళాకారుడిని మరీ పేంపర్ చేయకూడదని, కళాకారుల కుటుంబంలో పుట్టినంత మాత్రాన ప్రతిభ రాదనీ, కళ గానీ మరో ప్రతిభగానీ వారసత్వంగా రాదనీ – యిలా ఎన్నయినా వున్నాయి.
అలాగే 'త,థి,తో,న' అనే కథ వుంది. గిరీశం అనే అతనికి మద్దెల నేర్చుకోవాలని మహా వ్యామోహం. ఎన్ని అగచాట్లు పడినా ఆ విద్య అతనికి అబ్బదు. ఆ అగచాట్లు చదువుతూంటే ఓ పక్క నవ్వు, ఓ పక్క జాలి. చివరికి ఓ ముసలాయన అడుగుతాడు ''ఒరే ఇంతమంది గురువుల్ని ఆశ్రయించినా నీకు విద్య అబ్బలేదేరా?'' అని. ''గురువులు మర్మం విడిచి విద్య చెప్పటం లేదు తాతయ్యా లేకపోతే ఈపాటికి మహా విద్వాంసుణ్ని కాకపోయానా'' అంటాడు గిరీశం.
ఓ థర్డ్‌రేట్ హరిదాసుగారి కథ 'ఏక కథా పితామహ'. ఏదైనా ఊరెళ్లి భారతం లాటిది చెప్పుకుంటే ఏ నెల్లాళ్లపాటు భుక్తి గడిచిపోతుంది కదాని అతని ఆశ. వాద్యగాళ్లను ఒప్పించి అమరావతికి వచ్చాడు. రాత్రికి కథ చెప్దామని ఏర్పాట్లు మొదలెట్టగానే ఊళ్లోవాళ్లు వచ్చారు. 'నువ్వు ఇదివరకు వచ్చావుగా. వెళ్లిపోమని చెప్పాం. అయినా వచ్చావు. వెంటనే పొలిమేర దాటిపో' అన్నారు. ఇతను భయపడి వెళ్లిపోదామనుకున్నాడు కానీ మద్దెలతనికి కడుపునొప్పి రావడంతో రాత్రి చెట్టుకిందే కూలబడ్డారు. ఓ ముసలాయన పోనీ కదాని ఇంటికి తీసుకెళ్లి అన్నం పెడితే ఋణం తీర్చుకోవడానికి ఓ కథ చెప్తానని పట్టుబడతాడితను. అర్థరాత్రిపూట హరికథేమిటయ్యా అన్నా వినడు. ఉన్నది ఒక్క ప్రేక్షకుడైనా 'మహాజనులారా!' అని కేకపెట్టి హరికథ అందుకున్నాడు. వాద్యగాళ్లు నిద్రమత్తులో యిష్టం వచ్చినట్టు వాయించారు. నిద్రపట్టని ముసలమ్మలు యిద్దరొచ్చి కూచోడంతో దాసుగారికి పూనకం పూని భారతయుద్ధం మొదలెట్టాడు. ఇలా గంట గడిచేసరికి యాభైమంది బాణాకర్రలు పట్టుకొచ్చారు. కథ చెప్పుకుంటూనే ఊరు దాటు, లేకపోతే బుర్ర రామకీర్తన పాడిస్తాం అని బెదిరించి, 'మేం పిలిచేదాకా రాకు' అని ఒట్టేయించుకుని ఊరు దాటిస్తారు.
'భోజన చక్రవర్తి' అనే కథ. అందులో అతని తిండి వర్ణిస్తాడు రచయిత. ఏడాది వూరగాయలు ఒక్కపూట భోజనంలో తుడిచి పెట్టేస్తాడు అప్పంభొట్లు. ఓ సారి పందెం కాసి రెండొందల ఆవడలు తింటాడు. పెళ్లి భోజనాల్లో మూడు విస్తళ్లు కలిపి కుట్టుకుని తెచ్చి వేసుకునేవాట్ట. గోకర్ణంతో పప్పు తెచ్చి గరిటెతో వడ్డిస్తూంటే 'వెధవ గరిటలు తీసెయ్' అని గోకర్ణం ఒంపించేవాట్ట. నేతి ఝారీతో నెయ్యి వడిస్తూంటే వేళ్ల సందున ఎన్ని లోయలుండేవో తెలిసేది కాదుట. లడ్డూల బుట్ట వస్తే గాలికోసం 'ఉస్' అన్నట్టు ఎంగిలి చెయ్యి జాడించి ఆ చెయ్యి బుట్టకు తగులగా 'అంటయింది ఇంకెందుకు పనికొస్తాయి' అని బుట్టెడు లడ్లు విస్తట్లో వొంపించుకునేవాట్ట. చదువుతుంటూంటే ఆశ్చర్యం, నవ్వు కలిసి వస్తాయి.
'ఎవరా పోయేది?' అనే కథలో గొప్ప జీవితసత్యం వుంది. సూరయ్య అనే అతను అన్ని విధాలా మునిగిపోతాడు. పొలం పోయింది. కొడుకు జులాయి అయిపోయాడు. పైగా మనుమలు. కాణీ అప్పు పుట్టడంలేదు. ఇక సన్యాసం పుచ్చుకుంటాడు. ఉత్తుత్తినే ! వేషం అంతే. దారిన పోయే ప్రతివాడిని 'ఎవరా పోయేది?' అంటూ పలకరింపు. ఆ తర్వాత 'ఎవరా పోయేది సుబ్బరామయ్యేనా?' 'నేనే స్వామీ పిల్చారా?' 'కుశలమేనా? సుబ్బరామయ్యా, స్వామివార్ని భిక్షకు పిలిచి మూణ్ణెల్లు దాటినట్లయిందే' 'తమ సెలవయితే..'
స్వామివారు అంటే తనే అన్నమాట. ఇక ఆ మీద 'పెద్దగా ఏర్పాట్లు చేయకు' అంటూ వంటకాల లిస్టు బారెడంత చదువుతాడు. భిక్ష యివ్వాలంటూ యింటికి సంభారాలు పట్టుకుపోయి యింట్లోవాళ్లను మేపుతూంటాడు. ఓ సారి భిక్ష ఆఫర్ చేసినవాళ్లింట్లో అశుచి వచ్చి లంచ్ కాన్సిలయిపోతుంది. ఆకలితో నకనకలాడుతూ యింటికి వస్తాడు. అన్నం పెట్టమంటే యింట్లో అందరూ బద్ధకిస్తారు. నిర్లక్ష్యం చేస్తారు. దెబ్బకి ఈయనకి నిజమైన వైరాగ్యం కలుగుతుంది. సరాసరి కాశీ వెళ్లి అసలైన సన్యాసం స్వీకరిస్తాడు.
'అప్పడాల అసెంబ్లీ' అనే ఓ కథలో ఇద్దరు ఇల్లాళ్లు మరోళ్ల యింటికి అప్పడాలు వత్తడానికి వెళ్లి చచ్చేట్లా తిట్టుకుంటారు. ఓ ముసలావిడ రాజీ కుదురుస్తుంది. ఇంటికెళ్లాక అందులో ఒకావిడ మొగుడితో అంటుంది. 'మనమ్మాయిని వాళ్లబ్బాయికి యిస్తే ఎలాగుంటుంది?' అని. అదీ మనుష్యుల తీరు. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్