38 అమెరికా రాష్ట్రాలలో 130 క్యాంపస్‌లు, 45 వేల మంది విద్యార్థులు వున్న ఐటిటి టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్ చెయిన్ ఆఫ్ కాలేజెస్ సెప్టెంబరు 6 న తమ క్యాంపస్‌లన్నీ మూసివేస్తున్నామని ప్రకటించి, సెప్టెంబరు 16 న దివాలాకు దరఖాస్తు చేయడం అమెరికన్ విద్యారంగంలోని అస్తవ్యస్త పరిస్థితిని ఎత్తిచూపుతోంది. 2008లో లేమాన్ బ్రదర్స్ పతనం క్రమేపీ ఆర్థికసంక్షోభానికి దారి తీసినట్లే, యీ మూసివేత విద్యారంగం కూలిపోవడానికి దారి తీయవచ్చని పరిశీలకులు భయపడుతున్నారు. ఈ గొలుసు కాలేజీలు లాభాపేక్షతో (ఫర్-ప్రాఫిట్) నడిచే కాలేజీల కాటగిరీకి చెందుతాయి.
అమెరికాలో రకరకాల కాలేజీలున్నాయి. కమ్యూనిటీ కాలేజీలు (సాధారణంగా వీటిని జూనియర్ కాలేజీలంటారు) సెకండరీ ఎడ్యుకేషన్ తర్వాత రెండు సంవత్సరాల (కొన్ని 4 సం||ల కోర్సులు కూడా వుంటాయి) సాంకేతిక లేదా ఉన్నతవిద్య గరపడానికి ప్రభుత్వం నెలకొల్పిన స్టేట్ కాలేజీలు, స్టేట్ యూనివర్శిటీలు ఉన్నత విద్య గరపి డిగ్రీ లిస్తాయి కానీ యివి అసోసియేట్ డిగ్రీలిస్తాయి. ఒకలా చెప్పాలంటే మనం జూనియర్ కాలేజీల్లో యింటర్మీడియట్ చదివినట్లు, అమెరికాలో కమ్యూనిటీ కాలేజీల్లో ప్రి-డిగ్రీ కోర్సు చేస్తారన్నమాట. ఇవన్నీ ప్రభుత్వరంగానికి చెందినవి. ప్రయివేటు రంగంలో వ్యాపారస్తుల చేత నడపబడేవి ఫర్ ప్రాఫిట్ (లాభాపేక్ష) కాలేజీలు. ప్రభుత్వరంగంలోని కాలేజీలు చాలా సబ్జక్ట్‌లలో డిగ్రీలిస్తాయి. సైజులో కూడా పెద్దవి. ప్రయివేటు కాలేజీలు చిన్నవి, అవి కొన్ని అంశాలలోనే డిగ్రీలిస్తాయి. 2003 వరకు పబ్లిక్ కాలేజీలు రాష్ట్రప్రభుతాలిచ్చే నిధులతో కొంత, విద్యార్థుల చేత కట్టించుకునే ట్యూషన్ ఫీజుల చేత కొంత నడుస్తూ వచ్చాయి. అయితే 2003 తర్వాత నుంచి ప్రభుత్వ నిధులు తగ్గడంతో ట్యూషన్ ఫీజు పెంచుకుంటూ పోయారు. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం కాలేజీ నిర్వహణకు ప్రభుత్వాని కంటె విద్యార్థులిచ్చేదే ఎక్కువగా వుంది. ప్రభుత్వ కళాశాలలే యింతలేసి ఫీజులు పుచ్చుకుంటూ వుంటే యిక ప్రయివేటు వాటి మాట చెప్పేదేముంది!
ప్రయివేటు కాలేజీలు గత కొన్ని దశాబ్దాలుగా వర్ధిల్లుతూ వచ్చాయి. ఇవి లాభాపేక్షతో పని చేస్తాయి కాబట్టి సమర్థవంతంగా నిర్వహించబడతాయని వూహిస్తారు కానీ ఆచరణలో మన దగ్గర నడిచే కార్పోరేట్ కాలేజీల్లాగే అవి మార్కెటింగుకై ఎక్కువ ఖర్చుపెడుతున్నాయి. 2009లో యీ కాలేజీలు తమ బజెట్లలో 17% చదువులపై ఖఱ్చుపెట్టగా 42% మార్కెటింగుకు, పెట్టుబడిదారులకు చెల్లింపులకు ఖర్చుపెట్టారు. ఫీనిక్స్ యూనివర్శిటీ నెలకొల్పిన అపోలో ఎడ్యుకేషన్ గ్రూపు యీ ఏడాది ఏపిల్ కంపెనీ కంటె ఎక్కువగా పబ్లిసిటీపై ఖర్చు పెట్టింది. ఇలా వాటి నిర్వహణ ఖర్చు పెరుగుతూ పోతోంది. దాన్ని విద్యార్థుల నుంచి అధిక ఫీజుల రూపేణా భర్తీ చేసుకుంటున్నారు. మన దగ్గర ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం పెట్టిన తర్వాత పుట్టగొడుగుల్లా కాలేజీలు పుట్టుకుని వచ్చి చదువుపై ఆసక్తి లేనివారిని కూడా చేర్చుకుని వాళ్ల పేర ప్రభుత్వం నుంచి డబ్బులు లాగినట్లుగా, అక్కడా జరిగిందన్నమాట. ఇంతా చేసి విద్యలో నాణ్యతా లేదు. ఒకరితో మరొకరు పోటీ పడే క్రమంలో అక్రమాలకు పాల్పడడం, వాటి వలన క్రిమినల్ కేసులు, ఆంక్షలు ఎదుర్కోవడం జరిగాయి.
2010 నుంచి యీ లాభాపేక్ష కాలేజీలపై ప్రభుత్వ నిఘా పెరిగింది. స్కాలర్లు, అటార్నీ జనరల్, మీడియా వాటి గురించి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. 2016లో ట్రెజరీ డిపార్టుమెంటుకి చెందిన ఎకనమిస్టు నికొలస్ టర్నర్, జార్జి వాషింగ్టన్ యూనివర్శిటీలోని ఎకనమిస్టు స్టీఫెన్ సెలిని కలిసి చేసిన పరిశోధనలో యీ లాభాపేక్ష కాలేజీల్లో చదివిన కుర్రాళ్లు అసలు కాలేజీలకు వెళ్లకపోయినా, కమ్యూనిటీ కాలేజీల్లో చదివి అంతటితో ఆపేసినా బాగుండేదని తేల్చారు. వెటరన్ ఎఫయిర్స్ శాఖ వారు కూడా లాభాపేక్షతో నడిచే కాలేజీలపై వెటరన్స్ చాలా ఫిర్యాదులు చేశారని చెప్పింది. ముఖ్యంగా ఫీనిక్స్ యూనివర్శిటీ, ఐటిటి టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్, డెవ్రీ యూనివర్శిటీ, కొలరాడో టెక్నికల్ యూనివర్శిటీ విద్యాసంస్థలపై చాలా ఫిర్యాదులు వచ్చాయి.
ఇది నాణ్యత గురించిన అంశమైతే యీ కాలేజీల్లో చదివే విద్యార్థుల ఋణగ్రస్తత మరో అంశం. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు ఋణాలిచ్చి వారిని అప్పులపాలు చేస్తున్నాయి యీ కాలేజీలు. 2020 నాటికి అమెరికాలోని ఉద్యోగాల్లో 35% వాటికి డిగ్రీ కనీసావసరం అవుతుంది. 30% వాటికి అసోసియేట్ డిగ్రీ (మన ఇంటర్ లాటిది) అవసరం వుంటుంది. కానీ వాటిని సంపాదించాలంటే విద్యార్థులు తలమునిగేలా అప్పులు చేయవలసి వస్తోంది. ఉద్యోగం దొరికినా అప్పు తీర్చడానికి దశాబ్దాలు పట్టేట్టుందని వారు వాపోతున్నారు. 2000 సం||రం నుంచి చదువుల నాణ్యత తగ్గుతూ, విద్యార్థుల అప్పులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ స్టడీ లోన్స్ పెరుగుదలలో ప్రయివేటు కాలేజీల వాటా 75%! విద్యాఋణాలు యిప్పుడు 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరాయి.
ఈ కాలేజీలు తమను తాము కాపాడుకునేందుకు రాజకీయనాయకుల అండ కోరి వారికి ఏదో ఒక పేర డబ్బులు ముట్టచెపుతున్నాయి. లారియట్ ఇంటర్నేషనల్ గ్రూపువారు తమ యూనివర్శిటీలకు గౌరవ ఛాన్సలర్‌గా, కన్సల్టెంట్‌గా వున్నందుకు బిల్ క్లింటన్‌కు 17.6 మిలియన్ డాలర్లు ముట్టచెప్పాయని పత్రికల్లో వచ్చింది. ఇక ట్రంప్ యూనివర్శిటీ గురించి చెప్పనే అక్కరలేదు. దానిపై విచారణ చేయాలని ఫ్లారిడా ఆదేశిస్తే ఎన్నికల ఖర్చు రూపేణా దాని అటార్నీ జనరల్‌కే లంచం యిచ్చాడట ట్రంప్. ప్రయివేటు కాలేజీల ఆగడాలు పెచ్చుమీరడంతో ఒబామా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసి వచ్చింది.విద్యార్థులను మోసగించినందుకు ఐటిటిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్, కన్స్యూమర్ ఫైనాన్స్ ప్రొటెక్షన్ బ్యూరో కేసులు పెట్టాయి. అమెరికా విద్యారంగంలో ప్రైవేటు కాలేజీల పాత్ర పరిమితమైనదే. కానీ 2010-12 మధ్య ప్రభుత్వ ఎయిడ్, సబ్సిడీలలో 25% యివే తినేశాయి. విద్యాఋణాల బకాయిలలో 50% వాటికి యివే కారణం.
ఋణాలు యీ స్థాయికి చేరినా, విద్యాప్రమాణాలు ఎంత ఘోరంగా పడిపోయాయంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్ వారు చేసిన సర్వే ప్రకారం అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నతవిద్య (హైస్కూలు తర్వాతది) వలన ప్రయోజనం పొందే దేశాలలో అమెరికాది కింద నుంచి మూడో స్థానం. ఖఱ్చు భరించలేక యువకులు పెద్దగా చదవలేకపోతున్నారు. నైపుణ్యం పెరగటం లేదు. నైపుణ్యం కావలసిన ఉద్యోగాలను విదేశాల నుంచి వచ్చినవారు ఎగరేసుకుని పోతున్నారు. ఫలితంగా వీరు నిరుద్యోగులుగా, చిరుద్యోగులుగా మిగులుతున్నారు. ఏదైనా సంస్థ తన సిబ్బందిని తగ్గించుకోవాలనుకుంటే మొదట తీసేసేది వీరినే. ఉద్యోగాలు లేనప్పుడు చదువు కోసం చేసిన అప్పులు తీర్చలేరు కదా, అందువలన ఆ విద్యాఋణాలు కొండల్లా పెరిగిపోతున్నాయి. ఈ కాలేజీలు ప్రభుత్వానికి పడిన బకాయిలూ ఆ స్థాయిలో పెరిగిపోయాయి.
ఈ పరిస్థితుల్లో ఐటిటిపై ప్రభుత్వం చర్య తీసుకుంది. ఆగస్టు నెలలో ప్రభుత్వ సహాయం కోరే విద్యార్థులను చేర్చుకోవద్దని ఐటిటిని ఆదేశించింది. అది కొత్తగా ఎవర్నీ చేర్చుకోవడం మానేసి, నెల తిరిగేసరికి యీ నెలలో మూతబడింది. బాన్‌క్రప్టసీ పిటిషన్ దాఖలు చేసింది. పిటి2010 నుంచి అది ప్రభుత్వం నుంచి పొందిన సాయం 5 బిలియన్ డాలర్లు. ప్రభుత్వ చర్యను కొన్ని పత్రికలు ఖండించాయి. ప్రయివేటు పెట్టుబడిదారులను సతాయిస్తోందని, వారి స్వేచ్ఛలను హరిస్తోందని ప్రచారం మొదలుపెట్టాయి. జరిగిందేమిటంటే – ఐటిటి అసోసియేట్ డిగ్రీలకు 45 నుంచి 53 వేల డాలర్లు వసూలు చేస్తోంది. అదే కనక ప్రభుత్వ కాలేజీలో అయితే హాస్టల్, మెస్, ట్యూషన్, ఫీజు కలిపి 10 వేలకు లోపే వుంటుంది. డిగ్రీ కైతే ఐటిటి 76 నుంచి 89 వేల డాలర్లు వసూలు చేస్తుంది. ప్రభుత్వ కాలేజీలైతే సరాసరిన 45 వేలకు లోపే! ఐటిటిలో చదివిన విద్యార్థులు తమకు ఋణాలిచ్చి వడ్డీ (16.25% వరకు వుంటోందిట) పేర పీల్చి పిప్పి చేస్తోందని కాలేజీపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఉన్నత విద్య విషయంలో ఎక్రెడిటేషన్ (విద్యాలయాలకు గుర్తింపు) యిచ్చే అతి పెద్ద సంస్థ ఎక్రెడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ (ఎసిఐసిఎస్), 20 మంది ఎటార్నీ జనరల్స్ కలిసి ఆ ఫిర్యాదులపై లోతుగా విచారణ జరిపారు. దానిలో తేలిందేమింటే – ట్యూషన్ ఫీజులు విపరీతంగా వున్నాయి. ఆ ఫీజులు చెల్లించడానికి ప్రైవేటు పార్టీల నుంచి ఏర్పాటు చేసిన ఋణాలను తీసుకోమని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. ఋణపత్రాలపై సంతకాలు చేసినప్పుడు షరతుల గురించి పూర్తి అవగాహన కల్పించటం లేదు. చివరకు బయటకు వచ్చిన తర్వాత యీ కాలేజీలకున్న చెడ్డపేరు కారణంగా ఆ డిగ్రీలకు ఎవరూ విలువ నివ్వటం లేదు, వీళ్లకు ఉద్యోగాలు రావడం కష్టమవుతోంది. పోనీ మధ్యలో ప్రభుత్వ కాలేజీలకు మారదామన్నా వీళ్లకు స్టాండర్ట్ తక్కువంటూ వాళ్లు తీసుకోవడం లేదు.
ఐటిటిలో డీన్‌గా పనిచేసిన ఒకామె విజిల్‌బ్లోయర్‌గా మారి అనేక విషయాలు బయటపెట్టింది. ఒక్క వాక్యం కూడా పూర్తిగా తప్పులు లేకుండా రాయలేని వాళ్లను కూడా ఐటిటి చేర్చుకుని ప్రభుత్వంనుంచి ఎయిడ్ పొందిందిట. సగటు విద్యార్థులను వెతికి పట్టుకుని తప్పుడు సమాచారంతో, అబద్ధపు హామీలతో ఒప్పించి, తమ కాలేజీలో చేర్చిన ఏజంట్లకు కమిషన్లు యిచ్చిందట. ఒకసారి చేరాక విద్యార్థులకు సరైన విభాగాల్లో తర్ఫీదు యివ్వకపోవడంతో వాళ్లు అర్ధాంతరంగా చదువులు ముగించుకున్నారట. మీకు లాప్‌టాప్‌లు వుచితంగా యిస్తామని చెప్పారట కానీ అసలు విషయమేమిటంటే టెక్స్‌ట్ బుక్స్‌కై 800 డాలర్లు వసూలు చేసి పుస్తకాలకు బదులు లాప్‌టాప్ చేతిలో పెట్టారట. విద్యార్థులనే కాదు, తమ కాలేజీలో పెట్టుబడి పెట్టినవారికి కూడా కాలేజీ యాజమాన్యం తప్పుడు సమాచారం యిచ్చిందట. ఆదాయం తగ్గుతోందని వారికి చెప్పనేలేదట.
ఇలాటి అక్రమాలు బయటపడడంతో వీటికి ఎక్రెడిటేషన్ ఆపేస్తారని రెండేళ్లగా అనుకుంటున్నారు. 2014-16 మధ్య లాభాపేక్ష కాలేజీల సంఖ్య 5% తగ్గింది. విద్యార్థుల సంఖ్య 11% తగ్గింది. ఫీనిక్స్ యూనివర్శిటీలో చేరేవారి సంఖ్య 2010 – 15 మధ్య సగానికి పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొని తీవ్రచర్యలు చేపట్టి కాలేజీలు తమ ఆర్థిక వనరులు పెంచుకోవాలని సూచించింది. తక్కిన లాభాపేక్ష కళాశాలలు కూడా ఐటిటి బాట పడితే విద్యారంగంలో సంక్షోభం తప్పదు. విద్యాఋణాలు ఆర్థికరంగంపై ప్రభావం చూపకమానవు. గతంలో గృహఋణాల విషయంలో యిలాటి పొరపాట్లే జరిగి, డొమినో ఎఫెక్టు (గొలుసుకట్టు ప్రభావం)తో మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయితే అప్పుడు గృహఋణాలను కట్టకట్టి, మళ్లీ వాటిని ముక్కలుముక్కలుగా చేసి (ఫ్యాక్టరైజేషన్) యితరులకు అమ్మేస్తూ వచ్చారు. చేతులు మారిన కొద్దీ ఋణం పరిణామం పెరుగుతూ వచ్చింది. ఈనాటి విద్యాఋణాల విషయంలో అలాటిది జరగలేదు కాబట్టి, ఆ ప్రమాదం లేదని పరిశీలకులు అంటున్నారు. కానీ విద్యాఋణాలు ఆందోళనకర స్థాయికి వచ్చాయన్నది మాత్రం వాస్తవం. అందుకే అధ్యక్ష ఎన్నికలలో 'కాలేజీ వరకు ఉచిత విద్య' అనేది ఒక నినాదమైంది. ఆ అంశంపై రాబోయే అధ్యక్షుడి దృక్పథం ఎలా వుంటుందో మరి!
-ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2016)