ఇదే కాకుండా విజయవాడ మీడియా కాపిటల్ కూడా. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన చాలా ఏళ్లదాకా దినపత్రికలు కూడా మద్రాసు నుండే వచ్చేవి. కొంతకాలానికి ఆంధ్ర నడిబొడ్డున వుండాలని విజయవాడకు మారాయి. విజయవాడలోనే పత్రికాఫీసులు, పుస్తక ప్రచురణ సంస్థలు, సినిమా పోస్టర్ల ముద్రణాలయాలు, పబ్లిసిటీ సంస్థలు, సినిమా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు.. అన్నీ వుండేవి. ఆంధ్రభూమి తెలంగాణ పాఠకులకు క్యాటర్ చేసేది. దాదాపు 40 ఏళ్ల క్రితం ఈనాడు పెడదామనుకున్నపుడు విజయవాడలో అయితే పోటీ తట్టుకోవడం కష్టమని, వైజాగ్‌లో పెట్టారు. ఎందుకంటే విజయవాడ ప్రెస్ ఉత్తరాంధ్రను పెద్దగా కవర్ చేసేది కాదు. ఆ లోటు తీర్చడానికి ఈనాడు అక్కడ పెట్టి అక్కడ మార్కెట్ కాప్చర్ చేశారు. ఏడాది తర్వాత దాన్ని హైదరాబాదుకి తీసుకుని వచ్చేసి తెలంగాణకు మార్కెట్ కూడా కాప్చర్ చేశారు. అది చూసి యిక తక్కిన పత్రికలన్నీ హైదరాబాదుకి వచ్చాయి. నాకు తెలిసి 1994 వరకు కూడా ఆంధ్రజ్యోతికి విజయవాడే మెయిన్ ఆఫీసు. పోనుపోను అన్నీ హైదరాబాదులోనే వచ్చాయి. టీవీ ఛానెల్స్‌తో సహా! ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. విజయవాడకు పూర్వప్రాధాన్యం తిరిగి వస్తుంది. టీవీ ఛానెళ్లు ఆంధ్ర ఎడిషన్లు పెడతాయి. ఈనాడు అప్పుడే విడగొట్టింది. కానీ ఆంధ్ర ఛానెల్‌ను యిక్కడ నుండే వ్యవహరించడం కష్టం. ఎందుకంటే ఆ ఛానెల్‌లో ఎవరో తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారంటూ దాని ఆఫీసుపై స్థానికులు దాడి చేసే ప్రమాదం వుంది. టీవీ ఛానెళ్ల స్టూడియోలన్నీ హైదరాబాదులో వుండడం చేతనే సమైక్యవాదం దెబ్బ తింది. చర్చావేదికల్లో ఎప్పుడూ హైదరాబాదు వాసులనే పిల్చేవారు. గట్టిగా సమైక్యవాదం వినిపిస్తే యింటికి వచ్చి బెదిరిస్తారన్న భయంతో వారు నోరు విప్పేవారు కారు. అవాస్తవాలను ఖండించేవారు కారు. పత్రికల్లో రాసినా యిదే భయం. అందువలన ఏ ప్రాంతపు మీడియా ఆ ప్రాంతంలో వుంటేనే నిర్భయంగా వ్యవహరించగలదు.
విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో యిప్పటికే హాస్పటల్స్ చాలా వున్నాయి. మొదటినుండీ అక్కడ నర్సింగ్‌హోంలకు ప్రసిద్ధి. ఇప్పుడు అత్యాధునికమైన సౌకర్యాలు సమకూర్చుకుంటున్నారు. పేషంట్లలో 'హైదరాబాదుకు వెళ్లి వాళ్లకు ఆదాయం ఎందుకు పెంచాలి? మన దగ్గరే చేయించుకుందాం' లాటి ఫీలింగ్స్ యిప్పటికే వచ్చేశాయని వింటున్నాను. డాక్టర్లకేముంది, ఎక్కడ ఆదాయం వుంటే అక్కడికే వెళతారు. మంచి డాక్టర్లను తెప్పించుకుని, మంచి ఎక్విప్‌మెంట్ ఏర్పాటు చేస్తే అదే హెల్త్ టూరిజం సెంటర్‌గా మారుతుంది. దీనికి తోడు గుంటూరు మొదటినుండీ విద్యాకేంద్రంగా ప్రసిద్ధి. అప్పట్లోనే ధన్‌గారి యిన్‌స్టిట్యూట్ అని వుండేది. కోచింగ్ బాగా యిచ్చేవారని ప్రసిద్ధి. ఆ తర్వాత అనేక కార్పోరేట్ కాలేజీలు వెలిశాయి. తెలంగాణవారు సైతం తమ పిల్లల్ని అక్కడికి పంపించి చదివించుకుంటున్నారు. ఇలా చూసినపుడు యిప్పటికే విద్య, వైద్య, మీడియా, ట్రేడింగ్ సెంటర్‌గా వున్న విజయవాడ-గుంటూరు బెల్టు ఇంకా ఎదుగుతుందని తెలుస్తోంది. పైగా కోస్టల్ కారిడార్ సౌకర్యం కూడా దానికే వుంటుంది. ఇప్పుడు రాష్ట్ర రాజధానికూడా అక్కడ పెట్టాలా? అన్నదే ప్రశ్న. ఇప్పటికే డెవలప్ అయిన చోట రాజధాని పెడితే అది మరో హైదరాబాదుగా తయారవుతుంది. అవసరమా? హైదరాబాదే కదా, తెలుగువాళ్ల మధ్య చిచ్చు పెట్టింది. పార్లమెంటు సాక్షిగా కొట్టుకునేట్లా చేసింది. 'ఒకచోటే అన్నీ పెట్టడం జరగదు, గతంలో చేసిన పొరబాటు మళ్లీ జరగనివ్వం, వికేంద్రీకరణ చేస్తాం' అని బాబు ఓ పక్క చెపుతూనే మరో పక్క విజిఎంటిలో రాజధానికి ఏర్పాట్లు చేస్తూన్నట్లు కనబడడం వింతగా వుంది.
గుంటూరులో గతంలో హైకోర్టు వుండేది. ఆ తర్వాత అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టాలని గట్టిగా ఆందోళన జరిగింది. అక్కడ హైకోర్టు పెట్టి, మరోచోట రాజధాని పెడితే మంచిదని నా ఉద్దేశం. ఎక్కడ పెట్టాలి అనగానే అనేక క్లెయిమ్స్ వస్తాయి. హైదరాబాదు అనుభవంతో రాజధాని వున్నచోటే అన్నీ వస్తాయని అందరూ అభిప్రాయపడడంతో యీ చిక్కు వస్తోంది. లేకపోతే ఓ పది బిల్డింగులు ఎక్కడ వుంటే ఏం పోయింది? అసలు రాజధానితో సామాన్యుడికి ఎన్నిసార్లు పని పడుతుంది? ఇన్నేళ్ల నా జీవితంలో సెక్రటేరియట్‌లో ఎప్పుడూ అడుగు పెట్టలేదు. (ఒకే ఒక్కసారి వెళ్లాను లెండి, కానీ అది చీఫ్ సెక్రటరీగారిని మా ఫంక్షన్‌కు ఆహ్వానించడానికి వెళ్లా! ఏ సెక్షన్ ఎక్కడో తలతిప్పి కూడా చూడలేదు) ఇప్పుడు ఇ-గవర్నెన్స్ వచ్చాక వెళ్లే అవసరాలు యింకా తగ్గిపోతాయి. బాబు ఎలాగూ డిజిటల్ మనిషే కాబట్టి, రాజధానికి రానవసరం లేకుండా ఏర్పాట్లు చేయగలరు. రాజధాని రాష్ట్రానికి మధ్యన వుండాల్సిన అవసరమూ లేదు. అనేక దేశాలకు, రాష్ట్రాలకూ రాజధానులు మూలల్లోనే వున్నాయట. మోదీగారి గాంధీనగర్ కూడా సింపుల్‌గానే వుంటుంది. ఆయన 'ఢిల్లీని తలదన్నే..' అంటూ అనవసరంగా వూరించాడు మనల్ని. కొత్త భువనేశ్వరూ అంతే. ఏవో పది, పదిహేను బిల్డింగులు వరసగా వున్నట్టు వుంటుంది. రాజధానిని సెలక్టు చేసినపుడు ప్రజల మనోభావాలను కాస్త మనసులో పెట్టుకోవాలంటాను నేను. దీనిలో నా స్వార్థం ఏమీ లేదు. ఆ రాష్ట్రంలో నాకు సెంటు భూమి కూడా లేదు.
రాయలసీమకు, కోస్తాకు మధ్యలో వున్న ఒంగోలులో రాజధాని వస్తుందని గతంలో ప్రచారం జరిగింది. అదే మంచిదని అనుకుంటాను. ఎందుకంటే ప్రకాశం జిల్లా పక్క జిల్లాల తాలూకాలతో ఏర్పడింది. దానిలో కోస్తా, నెల్లూరు, రాయలసీమ పోకడలు అన్నీ కనబడతాయి. రాజధాని పూర్తిగా రాయలసీమలోనే పెట్టడంలో గల సాధ్యాసాధ్యాలపై చాలా చర్చలు జరిగాయి. ప్రతీ జిల్లాకు ఏదో ఒక అడ్డంకి వుంది. అవన్నీ యిప్పుడు ఏకరువు పెట్టడం అనవసరం.
ప్రకాశం జిల్లా ఎవరికీ పరాయిదానిగా తోచదు. అలా కాకుండా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెడితే స్థానికులు డామినేట్ చేస్తారనే భయం తక్కిన జిల్లాల వారికీ, ముఖ్యంగా రాయలసీమవాసులకు కలుగుతుందని నా అంచనా. దానివలన రాజకీయ నిరుద్యోగులు ప్రత్యేక రాయలసీమ నినాదాన్ని ఎత్తుకుంటారన్న భయం. వారికి విజయవాడ పరాయి ప్రదేశంగా తోచి బెంగుళూరు, మద్రాసులలో పెట్టుబడులు పెడతారేమో, ఆ మేరకు రాష్ట్రం నష్టపోతుందేమోనన్న శంక. ప్రకాశం జిల్లా వెనకబడిన ప్రాంతమే. ప్రభుత్వ భూమి కూడా వుంది. అటవీభూమిని డీ-నోటిఫై చేసి వాడుకోవచ్చుట. ఆ మేరకు వేరే చోట చెట్లు నాటి యిక్కడ కట్టుకోవచ్చు. ఒక్కో చోట ఒక్కో యిండస్ట్రీ వచ్చేట్లుగా చేస్తామని అంటున్నారు. ఆచరణలో ఏం చేస్తారో చూడాలి. వినడానికి అన్నీ బాగానే వున్నాయి – గోదావరి జిల్లాలలో ఫుడ్ ప్రాసెసింగ్ అనీ, సీమలో మైనింగ్ అనీ.. ఉత్తరాంధ్రలో సీ ఫుడ్ అనీ… ఇన్నాళ్లూ యివన్నీ చేయకుండా ఎందుకు కూర్చున్నారా అని ఆశ్చర్యం వేస్తోంది కదా. ఉమ్మడిగా వున్నపుడు చేయకూడదని ఎవరైనా నియమం పెట్టారా? ఇవన్నీ ఎప్పుడో పెట్టి అభివృద్ధి చేసి వుంటే అంతమంది ఆంధ్రవాసులు తెలంగాణకు ఉద్యోగాలకై వచ్చిపడేవారు కాదు.
స్థలసేకరణ తెలంగాణ అంత యీజీ కాదు. 'మా వూరిలో పరిశ్రమ రావాలి, మాకు ఉద్యోగాలు రావాలి, స్థలం మాత్రం మా పక్కింటివాడిది తీసుకోండి, నా జోలికి రావద్దు, విస్తరణలో నాది గజం పోయినా కోర్టు కెళతాను' అని చెప్పే లిటిగెంట్లు చాలామంది వున్నారక్కడ. అందుకే అక్కడ సెజ్‌లు రావడం కష్టమవుతోంది. పంటపొలాలు యివ్వడానికి ఎవరూ ఒప్పుకోరు. నందిగ్రామ్ వంటి సంఘటనలు జరిగే బెంగాల్‌లో పరిశ్రమలు రావటం లేదు. ఆంధ్రలో కూడా అలాటి సమస్యే రావచ్చు. ఇక ఎడ్యుకేషన్ హబ్‌గా పెట్టబోయే ప్రాంతం గురించి ఒక సూచన (వినేవారుంటే) – దయచేసి అది రాజధానిలో కానీ, ఏదైనా నగరంలోగాని పెట్టవద్దు. అన్ని ప్రాంతాలకు బస్సు ద్వారా, రైలు ద్వారా అందుబాటులో వుండే ఏదైనా మెట్టప్రాంతంలో వున్న చిన్న పట్టణంలో పెడితే బాగుంటుంది. ముఖ్యంగా కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా వుంటేనే విద్యార్థులకు చదువు అందుబాటులో వుంటుంది. హాస్టల్లో వుండకపోయినా బయట వుండి చదువుకోవచ్చు. సెలవులకు యింటికి వచ్చేందుకు వీలుగా కనెక్టివిటీ బాగా వుండాలి. ఇప్పుడు హైదరాబాదులోనే ఉద్యోగాలు, చదువులు, పరిశ్రమలు అన్నీ వుండడంతో సెలవుల్లో బస్సుల, రైళ్ల రద్దీ పెరిగిపోతోంది. ఇవన్నీ విడగొట్టేస్తే యీ సమస్య రాదు.
మనకు నగరాలు అక్కరలేదు. పంజాబ్, హరియాణా, కేరళ తరహాలో ప్రతి పల్లెటూరిలో, సెమి అర్బన్ ప్రాంతంలో ఒక్కో యిండస్ట్రీ చొప్పున పెట్టుకుంటూ వస్తే అన్ని ప్రాంతాలూ బాగుపడతాయి. ఎవరూ ఊరు విడిచి వెళ్లనక్కరలేదు. ప్రస్తుతం పల్లెలు పాడుపడి వున్నాయి. పట్టణాలు కళ తప్పాయి. నగరంపై యావ పెరిగితే అక్కడ పౌరసౌకర్యాలు కుంటుపడతాయి. ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఇప్పటికే ఆంధ్రలో రియల్ ఎస్టేటు రేట్లు విపరీతంగా పెరిగాయి. తెలంగాణ ధనికులు అక్కడ కూడా యిన్వెస్ట్ చేస్తున్నారు. ఆ రేట్లలో కొన్న బిల్డర్లు అక్కడ యిళ్లు ఎలా కట్టి అమ్మగలరో దేవుడికి తెలియాలి. సామాన్యుడి జీవనం దుర్భరమై పోతుంది. ఎట్టి పరిస్థితిలోనూ నగరంలో రాజధాని పెట్టకూడదని ప్రజలు పట్టుబడితే తప్ప లాభం లేదు. వీటి దృష్ట్యా విజయవాడ-గుంటూరుకి యిప్పటికే నగరస్థాయి వుంది కాబట్టి అక్కడ రాజధాని పెట్టకపోవడమే శ్రేయస్కరం. (సమాప్తం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2014)