ఎమ్బీయస్‌: ఆంధ్రమూలాల వారి ఓట్లు ఎటు..? – 2

తెరాస అంటే మహామహా నాయకులకే భయం పట్టుకుంది. తమ పార్టీ ప్రతిపక్షంలో వున్నా ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకుని వున్న పలు రాజకీయపక్షాలకు చెందిన అనేకమంది సీనియర్‌ నాయకులు కూడా యీ రోజు తెరాసలోకి దూకుతున్నారు.…

తెరాస అంటే మహామహా నాయకులకే భయం పట్టుకుంది. తమ పార్టీ ప్రతిపక్షంలో వున్నా ఎన్నో ఏళ్లుగా అంటిపెట్టుకుని వున్న పలు రాజకీయపక్షాలకు చెందిన అనేకమంది సీనియర్‌ నాయకులు కూడా యీ రోజు తెరాసలోకి దూకుతున్నారు. వేరే పార్టీ టిక్కెట్టుపై గెలిచి కూడా తెరాసకు మారిపోతున్నారు. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదు. ఎందుకిలా? అంటే – ప్రలోభం, భయం అని జవాబు వస్తోంది. ప్రలోభాలు చూపడం అనాదిగా వస్తూనే వుంది, కానీ ఫిరాయింపులు యీ స్థాయిలో జరగలేదే! అందువలన ప్రలోభం కంటె భయం పాలే ఎక్కువ అని అనుకోవాలి. మా పార్టీలోకి చేరితే వదిలేస్తాం, లేకపోతే కేసులు పెట్టి సతాయిస్తాం, మీ నియోజకవర్గానికి నిధులివ్వం, నిన్ను నీ ప్రజలు చీత్కరించుకునేట్లు చేస్తాం అని హెచ్చరికలు వెళుతున్నాయట. తెలంగాణలో కాబినెట్‌ వున్నది నామమాత్రానికే. కెసియార్‌ కుటుంబసభ్యులకు తప్ప వేరెవరికీ నోరు పెగలదు. కేంద్రీకృత అధికారంతో తన చిత్తం వచ్చినట్లు పాలన సాగిస్తున్నారు కెసియార్‌. ప్రత్యేక ఉద్యమంలో గొంతులు, చొక్కాలు చించుకున్న మేధావులు గట్టిగా నిరసన తెలపడానికి కూడా జంకుతున్నారు. మీడియా అంతా నిశ్శబ్దమై పోయింది. అందరి ఆస్తులూ హైదరాబాదులోనే వున్నాయి. ఏమంటే ఏం జరుగుతుందోనని భయం. 

ఈ భయానక వాతావరణంలో ఆంధ్రమూలాల వారు కూడా బెదురుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఓట్ల లిస్టులోనే ఆంధ్రమూలాల వారి ఓట్లు ఏరిపారేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయని అనేక ఆరోపణలు రావడం, వాటిని మళ్లీ సరిదిద్దుతున్నామని అధికారులు అనడం విన్నాం, కన్నాం. ఇప్పుడు ఎన్నికలలో ఏ వార్డులోనైనా ఆంధ్రమూలాల వారి ఓట్ల కారణంగా తెరాస అభ్యర్థి ఓడిపోతే వారిని ఓ చూపు చూస్తారని చెప్పుకుంటున్నారు. చూపు చూడడమంటే అయ్యప్ప సొసైటీలా యిళ్లు కూలగొట్టనవసరం లేదు, నీటి ఎద్దడి పెరగబోతున్న రాబోయే రోజుల్లో నీటి సరఫరా నిలిపేస్తే చాలు. ఇక పేద వర్గాలలో తెరాసకు ఓటేస్తే తమనూ అచ్చ తెలంగాణ వారిగా గుర్తించి యిళ్లు కట్టిస్తారనే ఆశ కొంతమందికట. అంటే తమను తిట్టినా, కొట్టినా, కోసినా తెరాసకు ఓటేయడం తప్ప ఆంధ్రమూలాల వారికి వేరే గతి లేదు అని మీడియా రాస్తోంది. 

రెండు రోజుల్లో పోలింగు వుందనగా జనవరి 31 న ''ఆంధ్రజ్యోతి''లో ఒక వ్యాసం వచ్చింది. 'తెరాసకు ఓటేయడమే సీమాంధ్రుల కర్తవ్యం. మరో మార్గం లేదు. ఓడితే ఆ ఓటమికి తమను బాధ్యులను చేస్తారు కాబట్టి, గెలుపోటముల భారం సీమాంధ్రులే తలకెత్తుకుని తెరాసను గెలిపించాలి.' అని వ్యాససారాంశం. తక్కిన పార్టీలన్నిటికీ ఉతికి ఆరేసి, చివర్లో యీ ముక్క చెప్పడంతో యిదేదో 'పెయిడ్‌ ఆర్టికల్‌' కేటగిరీలోకి వస్తుందాని అనుమానం వచ్చింది. తమాషా ఏమిటంటే యిది తెరాసచే 'ఆంధ్రమీడియా' అని ముద్ర వేయించుకుని, నిషేధానికి గురైన పత్రికలో వచ్చింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయించుకోవడానికి యాజమాన్యానికి కోర్టులు చుట్టూ తిరిగినా ఏడాదికి పైనే పట్టింది. కెసియార్‌కు కోపం వస్తుందేమోనని భయపడి లొంగిపోయి వుంటే ఏ అవస్థా లేకపోయేది. అలాటి పత్రికకు 'బెదిరింపులకు లొంగిపొండి, భయపడండి, నోరుమూసుకుని తెరాసకు ఓటేయండి' అనే వ్యాసాన్ని పంపిన వ్యాసకర్త సాహసానికి ఆశ్చర్యపడాలో, దాన్ని ప్రచురించిన ఆంధ్రజ్యోతి సంపాదకవర్గం తీరుకు విస్తుపోవాలో అర్థం కావటం లేదు. 

తమను అనుక్షణం అవమానిస్తున్న తెరాసకు ఓటేయాల్సిన అగత్యం ఆంధ్రమూలాల వారికి లేదు. అలా అని వేరే ఎవరికి వేస్తారు? టిడిపి-బిజెపి కూటమికా? టిడిపి నాయకులు మాత్రం తక్కువ మాట్లాడారా? ఈనాడు తెరాసను తప్పుపడుతున్న రేవంత్‌ ఆంధ్రుల 'దోపిడీ' గురించి తక్కువ మాట్లాడారా? ఎర్రబెల్లి..? అందరూ ఒక్కటే! 'పదేళ్లపాటు యిక్కడే వుంటా, మీకు రక్షణగా నిలుస్తా' అన్న చంద్రబాబు ఓటు-నోటు కేసులో యిరుక్కోవడంతో తట్టా, బుట్టా సర్దుకున్నారు. ఆయన మీద చాలా భారం వుంది. కొత్త రాష్ట్రం, ప్రత్యేక హోదా లేదు, నిధులు రావు, పరిశ్రమలు లేవు, ఆదాయం సరిపోదు, అలవికాని వాగ్దానాలు, పైగా ప్రకృతి వైపరీత్యాలు.. యివన్నీ చాలనట్లు కొత్త రాజధానిని ''బాహుబలి'' లెవెల్లో ప్లాను చేశారు. అక్కడైతే గ్రాఫిక్స్‌, యిక్కడ నేల మీద కట్టాలంటే చుక్కలు కనబడుతున్నాయి. కెసియార్‌కైతే కొడుకు, అల్లుడు, కూతురు అండగా నిలిచారు. ఒకరు పల్లెల్లో, మరొకరు నగరాల్లో, యింకొకరు ఢిల్లీలో పనులు చూసుకుంటూ పార్టీని పటిష్టం చేసుకుంటూ, ప్రభుత్వానికి దోహదపడుతూ వున్నారు. ముగ్గురూ మంచి వాగ్ధాటి కలవారే. బాబుకి పాపం అలాటి సాయం ఏమీ లేదు, అన్నిటా తానై చూసుకోవాలి. ఏమీ చేయకుండానే ఏడాదిన్నర గడిచిపోయింది. ఇంకో మూడేళ్లలో ఏదైనా కాంక్రీట్‌గా చేసి చూపించకపోతే ఆబోరు దక్కేట్లు లేదు. మధ్యలో హైదరాబాదులో ఆంధ్రమూలాల వారి బాగోగులు చూసుకోవడమంటే ఆయన కెలా కుదురుతుంది? 

ఇక్కడ అస్థిరత వుంటేనే యిక్కణ్నుంచి పరిశ్రమలు తమ వద్దకు తరలి వస్తాయి. ఇక్కడ వారిని సుఖశాంతులతో వుంచడమంటె తన రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలిగించుకున్నట్లే కదా! పైగా నగరానికి సంబంధించి టిడిపి తరఫున పెద్ద నాయకుడెవరూ మిగలలేదు. అందర్నీ కెసియార్‌ ఎగరేసుకుని పోయారు. బాధితులెవరైనా మొఱపెట్టుకోవాలంటే ఎవరి దగ్గరకు వెళ్లాలి? ఇక బిజెపి –  టి-టిడిపి నాయకులు గతంలో తమకు తెలంగాణలో పట్టుంది కదా, ప్రత్యేక ఉద్యమానికి దన్నిస్తే తమకే పట్టం కడతారనే ఆశతో  ఆంధ్రులను నిందిస్తూ మాట్లాడారు కానీ బిజెపి నాయకులు మరీ అంత దారుణంగా మాట్లాడలేదు. అదే సమయంలో ఆంధ్రమూలాల వారిని సమర్థిస్తూ కూడా మాట్లాడలేదు. చేతల్లో చేసినదీ లేదు. వారెంతసేపూ ముస్లిముల నుంచి రక్షిస్తామంటారు కానీ తెరాస నుంచి రక్షిస్తామని చెప్పరు. బలమైన ప్రతిపక్షంగా ఎదుగుతుందేమోననే ఆశ మొదట్లో కల్పించి, తర్వాత చప్పబడిపోయారు. కేంద్రంలో తెరాస-బిజెపి బేరసారాలు సాగుతున్నాయనే వార్తలు వస్తూండడంతో వారి గొంతు బలహీనమై పోయింది. 

కాంగ్రెసు పార్టీ యిప్పుడు చాలానే మాట్లాడుతోంది కానీ ఆంధ్రులను, ఆంధ్రమూలాల వారినీ తిడుతూ కెసియార్‌ మాట్లాడినప్పుడు అప్పుడు అధికారంలో వున్న కాంగ్రెసు నోరెత్తకపోగా, అనేకమంది కాంగ్రెసు నాయకులు, కెసియార్‌ను మించి మాట్లాడారు. విభజించినప్పుడు హైదరాబాదును తెలంగాణకు మొత్తంగా కట్టబెట్టినపుడు ఆంధ్రమూలాల వారి రక్షణ గురించి శ్రీకృష్ణకమిటీ చేసిన హెచ్చరికలను గుర్తు పెట్టుకుని విభజన చట్టంలో తగిన సేఫ్‌గార్డ్‌స్‌ పెట్టని పాపం కాంగ్రెసుదే. ఆ చట్టాన్ని మొత్తం ఆమోదించిన బిజెపికీ ఆ పాపంలో పాలుంది. ఇప్పుడు ఆ పార్టీ నాయకులే ఒకరి నొకరు అనుమానంగా చూసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారు మరొకరికి కాపలాగా వుంటామంటే ఎవరు నమ్ముతారు? మజ్లిస్‌ – ఆంధ్రమూలాల వారికి భయాందోళనలు వుంటాయని ముందుగా గుర్తించినది మజ్లిసే. సెటిలర్లు అనే పదం యథేచ్ఛగా వాడేస్తున్నపుడు ఆ పదప్రయోగంపై అభ్యంతరం తెలిపినది ఒవైసీయే. వారికి తాము అండగా వుంటామని అందరి కంటె ముందు ప్రకటించినది వారే. వారిని దోపిడీదారులుగా అభివర్ణించని పార్టీ ఏదైనా వుందంటే అది మజ్లిసే. అయితే వారి ధిక్కార ధోరణిని, ప్రతిదాన్నీ మతానికి ముడిపెట్టే భావజాలం మెచ్చడం కష్టం. వాళ్లయినా బీఫ్‌ నిషేధించేవాళ్లనుండి రక్షిస్తామంటున్నారు కానీ తెరాస నుండి రక్షిస్తామని అనడం లేదు. వారితో పొత్తు పెట్టుకున్నారు మరి! 

ఏతావతా ఆంధ్రమూలాల వారికి ఓటేయడానికి ఎవరూ లేరు. అందువలన యీ సారి ఎవరికో ఒకరికి ఓటేసి, చెల్లాచెదురవుతారని అనుకోవచ్చు. వాళ్లు గంపగుత్తగా ఓట్లేసినపుడే ఓటు బ్యాంకుగా తయారయి తమకు కావలసినవి సాధించుకోగలరు. వాళ్లను ఏకీకృతం చేసినవాళ్లకే ఆ ఓటుబ్యాంకు ఉపయోగపడుతుంది. కానీ అలా చేసే ధీమంతుడు ఎవరూ లేరు. అందరూ ఆంధ్రుల్ని తిట్టి, తెలంగాణ ప్రజలను బుజ్జగించడానికి చూసేవారే! సంస్థల విభజనలో, ఆంధ్రుల పట్ల వివక్షత చూపడంలో తెరాస చేస్తున్నది న్యాయబద్ధం కాదు, ధర్మం కాదు అని ఎలుగెత్తి చెప్పగలిగిన తెలంగాణ నాయకుడెవరైనా వుంటే అతడికి ఒక్కడికే వారి విశ్వాసాన్ని చూరగొనగలడు. – (సమాప్తం)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2016)

[email protected]

Click Here For Part-1