ఎమ్బీయస్‌ : అంతా వాస్తు చాదస్తమేనా? – 1

తెలుగు రాష్ట్రాలలో వాస్తు గురించిన చర్చ హోరెత్తిపోతోంది. ఆంధ్ర రాజధాని అక్కడ నిర్మించడానికి కారణం వాస్తే అని బాబు బాహాటంగా చెప్పలేదని మొన్ననే రాశాను. జనవరి 26 న యిద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయినపుడు…

తెలుగు రాష్ట్రాలలో వాస్తు గురించిన చర్చ హోరెత్తిపోతోంది. ఆంధ్ర రాజధాని అక్కడ నిర్మించడానికి కారణం వాస్తే అని బాబు బాహాటంగా చెప్పలేదని మొన్ననే రాశాను. జనవరి 26 న యిద్దరు ముఖ్యమంత్రులు భేటీ అయినపుడు వాస్తు ప్రకారమే రాజధాని కడుతున్నామని బాబు అన్నారని టివి స్క్రోలింగ్స్‌ వచ్చాయి. స్క్రోలింగ్స్‌ నమ్మకుండా మర్నాటి పేపరుకోసం చూశా. కృష్ణానది పక్కన రాజధాని కట్టడం వాస్తుప్రకారం మంచిదని కెసియార్‌ మెచ్చుకుంటే దానికి జవాబుగా బాబు 'అన్ని కోణాల్లో ఆలోచించే మరీ ఎంపిక చేశామని చెప్పారు' అని రాశారు. వాస్తు కోసమే అనకపోయినా, వాస్తు కోణం కూడా చూశామన్న అర్థం ధ్వనించింది. కాదంటే బాబు మర్నాడే ఖండించేవారు. కెసియార్‌కు యిలాటి సంకోచాలేమీ లేవు. సెక్రటేరియట్‌ను మార్చడానికి కారణం దానికి వాస్తుదోషాలుండడమే అని ఓపెన్‌గా చెప్పారు. దీనిపై తెలంగాణ మొత్తం అల్లుకుపోయిన వామపక్షవాదులు, మేధావులు, హేతువాదులు ఎందుకు విరుచుకు పడలేదో నాకు అర్థం కావటం లేదు. అందరికీ పదవులో, కమిటీ సభ్యత్వాలో దక్కినందుకా? ప్రతిపక్షంలో వున్న రాజకీయనాయకులు మాత్రమే విమర్శలు చేస్తున్నారు. జనవిజ్ఞాన వేదిక వారు చేపలమందు సమయంలోనే మేల్కొని హడావుడి చేస్తారు. ఇప్పుడేం చేస్తున్నారో మరి. 

సెక్రటేరియట్‌కు వాస్తు దోషమా!? ఎందుకు? కుట్రలు జరిగాయనా? కుట్ర జరిగి  సీటు దిగిపోయినవాడు దోషం అనుకోవచ్చు, సీటు ఎక్కినవాడికి వాస్తు కలిసి వచ్చినట్లేగా! అదే సెక్రటేరియట్‌లో పదేళ్లు ముఖ్యమంత్రి చేసినవాళ్లూ వున్నారు, పది నెలలు కూడా చేయనివాళ్లు వున్నారు. నెల రోజులకే పదవి పోగొట్టుకున్న ముఖ్యమంత్రి వున్నారు. వారం రోజులకే సీటు వూడిన మంత్రులూ వున్నారు. దేశమంతటికి బెస్ట్‌ సిఎం అనిపించుకున్నవారూ వున్నారు, నవ్వులపాలైన సిఎంలూ వున్నారు. బాంబులేసినా బతికి వచ్చిన అదృష్టవంతులున్నారు, ప్రత్యేక విమానమెక్కి మబ్బుల్లో కలిసిపోయిన దురదృష్టవంతులున్నారు, అంతా వ్యక్తులను బట్టి వుంటుంది. వ్యక్తి గుణగణాల బట్టి, ప్రతిభాపాటవాల బట్టి వారి ఉత్థానపతనాలు వుంటాయని గట్టిగా చెప్పలేం. అదృష్టదురదృష్టాలు కూడా పాత్ర వహిస్తాయి. జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మినవారికి అది జాతకఫలం. అది వ్యక్తికే పరిమితం. భవనానికి కాదు. ఒక యింట్లో వాస్తు బాగా లేదంటే, యింట్లో అందరూ జబ్బు పడాలిగా. అలా పడరండి, హెడ్‌ ఆఫ్‌ ద ఫ్యామిలీ మీదే దాని ప్రభావం అంటారు కొందరు. హెడ్‌ ఆఫ్‌ ద ఫ్యామిలీ అనేది ఎవరు? నలుగురు అన్నదమ్ములు కలిసి ఒకే యింట్లో వుంటున్నారు. ఎవరు హెడ్‌? ఎవరు టెయిల్‌? ఎక్కువ వయసున్నవాడా? ఎక్కువ డబ్బున్నవాడా? ఇంటిని నడిపేవాడా? మహిళలు కూడా సంపాదించే యీ రోజుల్లో భర్త కంటె భార్య ఎక్కువ సంపాదిస్తే ఆమె హెడ్‌ అవుతుందా? ఆమె డబ్బుతోనే యిల్లు కొంటే వాస్తు ప్రభావం ఆమె మీదా? ఆమె భర్త మీదా? డబ్బు అతనిదే అయినా పెత్తనం ఆమెదే అయితే.. అప్పుడు?

ప్రాంతాల బట్టి, వాతావరణాన్ని బట్టి వాస్తు మారుతుంది. ఆర్కిటెక్చర్‌ అని యిప్పుడు అంటున్నాం, గాలి వెలుతురు కోసం కొన్ని రూల్సు వున్నాయి అప్పట్లో గ్రామపాలక వ్యవస్థ వాస్తు పేరుతో గృహనిర్మాణాన్ని క్రమబద్ధీకరించి వుండవచ్చు. తమిళనాడులో యింటికి దక్షిణం వైపు ఎంట్రన్స్‌ వుంటే చాలా మంచిది అంటారు. మరి తెలుగునాట అది పనికి రాదు అంటారు. వారికి అమావాస్య మంచిది, మనకు కాదు. వాహనాల నెంబరు కలిపితే 9 అంకె వస్తే యాక్సిడెంటు అవుతుందన్న నమ్మకంతో అలాటి వాహనాల రీసేల్‌ కష్టం. మరి మన దగ్గర 9 అంకె మంచిదని చాలామందికి సెంటిమెంటు. ప్రాంతం బట్టి వాస్తు మారుతుంది కదాని మనం తమిళనాడుకి వెళితే అక్కడి సంప్రదాయాలు పాటిస్తున్నామా? లేదే! అమెరికా వున్నా అరవ్వాడు అమావాస్య మహబాగు అంటాడు. ఒకే ప్రాంతంలో వున్న పండితులందరూ ఒకే మాట మీద వుంటున్నారా? గతంలో ముస్లిం పండగలకు చంద్రుడు కనబడ్డాడో లేదో అనుకునేవాళ్లం. ఇప్పుడు హిందూ పండగలకు కూడా వివాదాలు ప్రారంభమయ్యాయి. కొంతమంది ఏకాదశి యివాళ అంటారు, మరి కొంతమంది రేపంటారు, యింకొంతమంది నిన్న అంటారు. పుష్కరాలు ఎప్పణ్నుంచి ప్రారంభం అన్నదాని గురించి కూడా ఏదో ఫిటింగు వస్తుంది చూడండి. 

వాస్తు విషయమైతే ప్రతీ మేస్త్రీ కూడా వాస్తు పండితుడే. ఒక పండితుడు కట్టిస్తాడు, మరో ఆయన వచ్చి కూలగొట్టిస్తాడు. ఎవర్ని నమ్మాలి? ఎన్ని పూజలు, శాంతులు, దోషపరిహారాలు చేయించినా బతుకు బాగుపడటం లేదని మొత్తుకునేవాళ్లు చాలామంది కనబడతారు. అయినా కొత్త స్వాములారు కనబడితే పరిగెడతారు. ఇలాటి వాళ్లు వ్యక్తిగతంగా ఎంత ధనాన్ని, టైముని తగలేసుకున్నా మనం ఏమీ అనలేం. అనకూడదు కూడా. వాళ్ల డబ్బు, వాళ్ల యిష్టం. ఎవరి నమ్మకం వాళ్లది. నిలువుగా బొట్టు పెట్టుకున్నా, అడ్డంగా పెట్టుకున్నా, ఒళ్లంతా కాల్చి ముద్రలు వేయించుకున్నా, మెడలో రుద్రాక్ష వేసుకున్నా, శిలువ వేసుకున్నా, గడ్డం పెంచినా, గుండు కొట్టించినా, మొక్కులు పెట్టుకుని పొర్లు దణ్ణాలు పెట్టినా, పరకులస్తుణ్ని యింట్లోకి రానీయకపోయినా, పరమతస్తుడిన పలకరించకపోయినా అంతా వాళ్ల యిష్టం. మన రాజ్యాంగం మనకా స్వేచ్ఛ యిచ్చింది. కానీ ప్రభుత్వం సొమ్ముతో యివన్నీ పాటిస్తానంటేనే యిబ్బంది వస్తుంది. ఇప్పటికే శంకుస్థాపనలనీ, భూమిపూజలనీ, వరుణహోమాలనీ ప్రభుత్వ ఖర్చుతో హిందూ సంబంధిత పూజా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎవరైనా మంత్రి కాగానే తమ జాతకాలకు అనుగుణంగా ఛాంబర్‌లో వాస్తు మార్పులు చేయిస్తున్నారు, పూజలు చేయిస్తున్నారు, ముఖ్యమంత్రులైతే భారీ స్థాయిలో చేస్తున్నారు. వాళ్ల అధికార నివాసాల్లో కోట్లాది రూపాయలతో మార్పులు జరుగుతున్నాయి. సొంత డబ్బుతో చేయించుకుంటే వాళ్ల యిష్టం కానీ ప్రభుత్వ ఖర్చుతో చేయించడం సమంజసం కాదు, కానీ నడిచిపోతోంది. గట్టిగా ఎవరైనా అడిగితే 'హజ్‌ యాత్రికులకు డబ్బులివ్వడం లేదా, ప్రభుత్వం ఖర్చుతో ఇఫ్తార్‌ విందులు యివ్వటం లేదా?' అని అడుగుతారన్న భయం కావచ్చు. 

ఇప్పుడు వాస్తు పేరుతో సెక్రటేరియట్‌ మార్చడం మాత్రం సభ్యసమాజం నివ్వెరపోయే ఘట్టం. కొత్త సెక్రటేరియట్‌లో రాజకీయ కుట్రలే జరగవా? జరిగితే యీ నాడు సలహా యిచ్చిన వాస్తు పండితుడి తలను సచివాలయ గుమ్మానికి వేలాడదీస్తారా? ప్రస్తుత సెక్రటేరియట్‌ హిస్టరీ అంతా గలీజు అంటున్నారు కెసియార్‌. గలీజు మనుష్యులు రాజకీయాల్లోకి వచ్చినపుడు హిస్టరీ కూడా గలీజుగానే వుంటుంది. పార్టీలు మార్చేవాళ్లు, తనకు రాజకీయభిక్ష పెట్టినవారికి ద్రోహం చేసేవాళ్లు, చాడీలు చెప్పేవారు, పుకార్లు పుట్టించేవారు వున్నపుడు చరిత్ర వేరేలా ఎలా వుంటుంది? కొత్త సెక్రటేరియట్‌లో వీరెవరూ రాకుండా చేస్తేనే దోషం తప్పుతుంది. చేయగలరా? కెసియార్‌ పార్టీలో ప్రస్తుతం వున్నవారందరూ ఫిరాయింపుదారులే. జండా మోసినవారు కంటికి ఆనకుండా పోయారు. ఇదే సెక్రటేరియట్‌ కెసియార్‌ను మంత్రిని చేసింది, ముఖ్యమంత్రిని చేసింది. కొడుకుని, అల్లుణ్ని మంత్రులుగా చేసింది. అదంతా దోషఫలం అనుకుంటున్నారా ఆయన? ఆయన తలపెట్టిన ఫాస్ట్‌ పథకానికి కోర్టులు మొట్టికాయ వేసింది. అది వాస్తుదోషమా? సలహాదారుల లోపమా? ఆయన క్రమబద్ధీకరణ పథకానికి స్పందన కరువైంది. వాస్తుదోషమా? అవునంటే – తన పదవి వూడడం వాస్తుదోషం వల్లనే, తప్ప అవినీతి వలననో, అసమర్థత వలననో కాదు అని రాజయ్య వాదించవచ్చు. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2015)

[email protected]