ట్రాయ్ చైర్మన్‌గా చేసిన నృపేన్ మిశ్రాను మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకుందామనుకున్నపుడు రూల్సు అడ్డు వచ్చాయి. ట్రాయ్ చైర్మన్‌గా పని చేసిన వారు పదవీ విరమణ తర్వాత వేరే ఉద్యోగం ఏదీ చేపట్టకూడదని! ఉద్యోగంలో వుండగా ప్రయివేటు కంపెనీలకు అనుమతులు, సౌకర్యాలు యిచ్చే అవకాశం వున్న ఉద్యోగుల విషయంలో యిలాటి జాగ్రత్త తీసుకుంటారు. రిటైరయ్యాక ఉద్యోగం చేద్దామనుకున్న కంపెనీకి రిటైర్ కావడానికి కొద్దిగా ముందుగా ఎడాపెడా లైసెన్సులు యిచ్చేయవచ్చు. ట్రాయ్ విషయంలోనైతే అది వేల కోట్లలో వుంటుంది. మోదీ మిశ్రాను కోరుకున్నారు కాబట్టి ఆయనకోసం రూల్సు మార్చేశారు. అది రేపు ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో ఆలోచించాలి కదా. పార్లమెంటులో యిదే ప్రశ్న ప్రతిపక్షాలు అడిగితే 'ట్రాయ్ వంటి తక్కిన సంస్థల్లో యిలాటి రూల్సు లేవు, అందుకే దీన్ని తీసేశాం' అంది మోదీ సర్కారు. ఇలాటి నియమం అక్కడ లేకపోతే అక్కడా పెట్టాలి తప్ప యిక్కడ తీసేస్తే ఎలా?
సిబిఐకు జాయింట్ డైరక్టర్‌గా వున్న జావీద్ అహ్మద్‌కు పదవీకాలాన్ని పొడిగించాలని సిబిఐ డైరక్టరు రంజిత్ సిన్హా సిఫార్సు చేశారు. హోం శాఖ అతనికి క్యాడర్ క్లియరెన్సు యిచ్చింది కూడా. అయితే అమిత్ షాపై వున్న కేసుల్లో జడ్జిగా వున్న మాజీ సుప్రీం కోర్టు జడ్జి అఫ్తాబ్ ఆలమ్‌కి యితను కజిన్ అని తెలియడంతో తన క్లియరెన్సును ఉపసంహరించుకుంది కూడా. అంతేకాదు, అతనికి ఢిల్లీలో మరే పదవి యివ్వకుండా ఉత్తర్ ప్రదేశ్‌కు క్యాడర్ వాడు కాబట్టి ఆ రాష్ట్రానికే తిప్పి పంపేయాలంది. సిబిఐకు మరింత స్వేచ్ఛ నివ్వాలని ప్రతిపక్షంలో వుండగా ఉద్యమించిన బిజెపి అధికారం దక్కగానే కాంగ్రెసు పోకడలే పోతోంది.
అమిత్ షాను నచ్చనివారెవరూ బిజెపి పాలనలో బాగుపడరని గోపాల్ సుబ్రమణియం కథ కూడా నిరూపించింది. సిబిఐ లాగే సుప్రీం కోర్టు స్వేచ్ఛ కూడా హరించకూడదని అంటూ వచ్చిన బిజెపి యీ రోజు సుప్రీం కోర్టు జడ్డిల నియమించవచ్చంటూ కోర్టు కొలిజియం పంపిన నాలుగు పేర్లలో గోపాల్ పేరును పక్కన పెట్టేసింది. తిరస్కరిస్తే మొత్తం జాబితాను తిరస్కరించాలి. ఇలా ఒక్కరిని విడగొట్టి చూపి, తన అభిమతం ఏమిటో చాటి చెప్పింది. సీనియర్ అడ్వకేట్‌గా, నిష్పక్షపాతంగా వ్యవహరించే వ్యక్తిగా (పద్మనాభస్వామి కోవెల ఆస్తుల విషయంలో కూడా ఆయన అమికస్ క్యూరీగా వ్యవహరించారు – స్వంత ఖర్చులతో) గోపాల్‌కు పేరుంది. సొహ్రాబుద్దీన్ ఎన్‌కౌంటర్ కేసులో ఎమికస్ క్యూరీగా అప్పటి హోం మంత్రి అమిత్ షాను తప్పుపట్టడమే ఆయన చేసిన తప్పుపని, మోదీ దృష్టిలో! కేసును సిబిఐకు అప్పగించవద్దని గుజరాత్ ప్రభుత్వం ఎంత వాదించినా గోపాల్ వాదనలను పరిగణించి సుప్రీం కోర్టు సిబిఐకు అప్పగించింది. అందుకే మోదీకి, అమిత్ షాకు అంత కక్ష.
తన పేరు తప్పించారని తెలియగానే గోపాల్ ఆభిజాత్యం వున్న మనిషి కాబట్టి తనంతట తానే తప్పుకున్నాడు. తను చేసిన పనికి సంజాయిషీ చెప్పుకోవాల్సి వస్తుందని తెలిసిన మోదీ సర్కారు 'గోపాల్‌పై సిబిఐ, ఇంటెలిజెన్సు బ్యూరో ఆరోపణలు చేశాయట' అనే పుకారును మీడియాకు లీక్ చేసింది. 2 జి స్కాము నిందితుడు ఎ.రాజా లాయరుకు, సిబిఐకు గోపాల్ తన సమక్షంలో సమావేశం ఏర్పాటు చేశాడని మొదటి ఆరోపణ. అలాటిది ఏదీ జరగలేదని, జరిగినట్లుగా నిరూపించాలని గోపాల్ చీఫ్ జస్టిస్‌కు రాతపూర్వకంగా తెలియపరిచారు. దానికి సిబిఐ వద్ద సమాధానం లేదు. ఇంకో ఆరోపణ ఏమిటంటే – నీరా రాడియా టేపుల్లో ఆమెకు, రతన్ టాటాకు జరిగిన సంభాషణలో గోపాల్ పేరు దొర్లిందని! దొర్లిన మాట నిజమే కానీ అది గోపాల్ నిజాయితీని చూపిస్తోంది. నీరా ''వాళ్లు చెప్పినట్లు గోపాల్ వింటాడని నేననుకోను. అతను ముక్కుసూటి మనిషి. రాజా అతన్ని ఎలాగైనా టార్గెట్ చేద్దామని చూస్తున్నాడు…'' అంది. ఇలాటి మనిషి మోదీకి అక్కరలేదు. అది గ్రహించిన గోపాల్ తనే తప్పుకున్నారు. హమ్మయ్య అనుకున్న మోదీ సర్కారు 'ఆయనంతట ఆయనే తప్పుకున్నాడు కాబట్టి యిక దానిపై సమీక్ష అక్కరలేదు' అని ప్రకటించేసింది.
గోపాల్ విషయంలో యింత 'జాగ్రత్త' తీసుకున్న మోదీ ఎటార్నీ జనరల్ నియామకంలో తీసుకోలేదు. ఆ పదవిలో నియమించబడిన ముకుల్ రోహతగి 2 జి స్కాము కేసులో కొందరు నిందితుల తరఫున వాదించారు. భారతీయ జాలర్లను చంపిన ఇటాలియన్ నావికుల కేసులో ఇటాలియన్ ఎంబసీకి ప్రాతినిథ్యం వహించారు. గాస్ ధర కేసులో ప్రభుత్వంతో తలపడిన అనిల్ అంబానీకి న్యాయవాదిగా వున్నారు. అయితే మోదీకి అతనంటే ఎందుకు మక్కువ అంటే నకిలీ ఎన్‌కౌంటర్ కేసుల్లో అతను గుజరాత్ ప్రభుత్వం తరఫున వాదించాడు. పైగా అతను అరుణ్ జైట్లీకి మిత్రుడు! దీని అర్థం గుజరాత్ ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి శత్రువు… సమర్థిస్తే మిత్రుడు. డా|| పెన్నీ వెరా సాన్‌సో అనే లండన్ యూనివర్శిటీ ఆంత్రపాలజీ ప్రొఫెసర్ 'ఏజింగ్ అండ్ పావర్టీ' (వయోధిక్యత – పేదరికం) అనే అంశంపై రిసెర్చి చేస్తోంది. 1990 నుండి భారతదేశం సందర్శిస్తూ అనేక వివరాలు సేకరించింది. మార్చిలో అహ్మదాబాదులో అక్కడి వృద్ధులపై, పేదలపై ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. అంతే సర్కారు వారు కన్నెఱ్ఱ చేశారు. ఒక అంతర్జాతీయ సమావేశంలో పాల్గొనడానికి జూన్ 8 న ఆమె హైదరాబాదు వస్తే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను వెనక్కి తిప్పి పంపేశారు.
గవర్నర్లను తొలగించడంలో బిజెపి కాంగ్రెసును కాపీ కొట్టిందని అందరికీ తెలిసిపోయింది. 2004లో కాంగ్రెసు చేసినది తప్పని సుప్రీం కోర్టుకి వెళ్లిన బిజెపి తనకు అధికారం దక్కగానే చేసిన మొదటి పని – అదే! అదేమంటే, 'అలనాడు కాంగ్రెసు చేయలేదా' అంటూ వాదిస్తోంది. అలాటి పనులు చేయడం బట్టే కదా కాంగ్రెసుకు ప్రజలు యిలాటి సత్కారం చేశారు, మరి మీకూ వాళ్లకూ తేడా లేకపోతే ఎలా?' అలా అని అడిగినా ఏమీ పట్టించుకోలేదు. కాంగ్రెసు నియమించిన గవర్నర్లు గొప్పవారు కారు కానీ వారిని తొలగించడానికి కూడా ఓ పద్ధతి పాటించాలి. కానీ బిజెపి అలాటి మర్యాదలు పాటించలేదు. సుప్రీం కోర్టు సలహాలను బేఖాతరు చేసి, గవర్నర్లను అవమానకరంగా తీసేసింది. పోనీ వారి స్థానాల్లో మేధావులను తెచ్చిందా అంటే అదీ లేదు, తన పార్టీ నాయకులను తెచ్చింది. ఇది కాంగ్రెసు విధానమే.
కాంగ్రెసుకు, తనకు తేడా లేదని పోలవరం బిల్లు విషయంలో కూడా నిరూపించుకుంది బిజెపి. పోలవరం ఆర్డినెన్సును బిల్లుగా మార్చడం సమంజసమే అని మన తెలుగువాళ్లకు తెలిసినంతగా తక్కిన దేశప్రజలకు తెలియదు. లోకసభలో చర్చ జరిపి, అందరినీ ఒప్పించవలసిన బాధ్యత పాలకపక్షానికి వుంది. రాజ్యసభలో జరిగిన చర్చలాటిది లోకసభలో కూడా జరగనిచ్చి వుంటే బాగుండేది. మెజారిటీ వుంది కదాని బుల్‌డోజ్ చేసి పడేస్తే ఎలా? ఆనాడు విభజన బిల్లు ఎలా పాసయిందో, యీనాడు విభజన సవరణ బిల్లు అంతే అందంగా పాసయింది.
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2014)